ప్రపంచవ్యాప్తంగా నాటక ప్రియులు పెద్ద ఎత్తున సభలూ, సమావేశలు జరుపుకునే రోజు మార్చి 27. ఈ రోజు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. దాదాపు ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలైంది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటక రూపం మారుతుందే కానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళ ప్రజాదరణ పొంది రంగస్థల ప్రక్రియగా విరాజిల్లుతుంది.
ప్రస్తుతం ఉన్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటూ విశ్వజనీనమైంది. 1961లో వియన్నాలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు అరవికివియో ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతిపాదన చేశారు. సభ్యులందరూ అంగీకరించాక తదుపరి ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్య పూర్తి స్థాయిలో మొదలైంది.
రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించింది. ఐక్యరాజ్యసమితి, యునెస్కోలచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాల ప్రదర్శనలు, ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షలు జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని ప్రముఖుల మాటగా వారి మనోగతసారాన్ని ఆ సంవత్సరం సందేశంగా ప్రపంచ రంగస్థలానికి అందిస్తారు. 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే ఫ్రాన్స్ దేశస్తుడు అందించాడు. అప్పటినుంచి ప్రతీ ఏటా ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు.
(నేడు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం)
– గాదిరాజు రంగరాజు, రంగస్థల నటుడు, చెరుకువాడ
మొబైల్ : 87901 22275
Comments
Please login to add a commentAdd a comment