history
-
దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు
ఆంధప్రదేశ్‌లోని తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరిమితమైన తపన తీవ్ర విషాదానికి దారితీసింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దేశంలో ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకుని, తీవ్ర విషాదాన్ని మిగాల్చాయి.మంధర్‌దేవి ఆలయం2005, జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధర్‌దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 350 మందికి పైగా భక్తులు మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. కొబ్బరికాయలు పగులగొడుతుండగా, కొంతమంది మెట్లపై నుంచి పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.కుంభమేళా2003 ఆగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన కుంభమేళాలో పవిత్ర స్నానాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతిచెందారు. 140 మంది గాయపడ్డారు.చాముండా దేవి ఆలయంరాజస్థాన్లోని చాముండా దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృతి చెందారు. బాంబు ఉందంటూ వదంతులు తలెత్తిన నేపధ్యంలో తొక్కిసలాటలో జరిగింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా జనం గాయపడ్డారు.నైనా దేవి ఆలయంహిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో 2008లో జరిగిన మతపరమైన వేడుకలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో162 మంది ప్రాణాలు కోల్పోయారు.రతన్‌గఢ్ ఆలయం2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలోని రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు. యాత్రికులు దాటుతున్న నది వంతెన కూలిపోబోతున్నదనే వదంతితో తొక్కిసలాట జరిగింది.ఇండోర్2023, మార్చి 31 న ఇండోర్‌లోని ఒక ఆలయంలో పూజలు జరుగుతుండగా ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతిచెందారు.శబరిమల2011, జనవరి 14న కేరళలోని శబరిమల పరిధిలోని పుల్లమేడు వద్ద యాత్రికులను జీపు ప్రమాదానికి గురైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 104 మంది భక్తులు మరణించారు. 40 మందికి పైగా జనం గాయపడ్డారు.గాంధీ మైదానంబీహార్లోని పాట్నాలో గల గాంధీ మైదానంలో 2014 అక్టోబర్ 3న దసరా వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.పట్నా2012 నవంబర్ 19న పట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న అదాలత్ ఘాట్ వద్ద ఛఠ్ పూజ సందర్భంగా ఒక తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.వైష్ణోదేవి ఆలయం2022, జనవరి 1న, జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందారు.రాజమండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 2015, జూలై 14న పుష్కరాల ప్రారంభం రోజున గోదావరి నది ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు.హరిద్వార్ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్‌లో 2011 నవంబర్ 8న గంగానది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతిచెందారు.రామ్ జానకి ఆలయం2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 63 మంది మృతి చెందారు.హత్రాస్2024లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట 121 మంది మృతిచెందారు. 300కుపైగా జనం గాయపడ్డారు. జూలై 2న సూరజ్‌పాల్ అలియాస్ భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరి సత్సంగ్‌లో ఈ తొక్కిసలాట జరిగింది.రాజ్‌కోట్2024, మే 23న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందారు.గుంపులో చిక్కుకున్నప్పుడు..ఎప్పుడైనా మనం రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లి, గుంపులో చిక్కుకుపోయినప్పడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించాలి. కింద తెలిపిన పది ఉపాయాలు మనం గుంపునుంచి సురక్షితంగా బయటపడేందుకు సాయపడతాయి.1. మీరు ఎప్పుడైన రద్దీగా ఉండే ప్రదేశానికి వెళితే ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను గుర్తుంచుకోవాలి.2. మీరు వెళ్లిన ప్రదేశం గురించిన పూర్తి సమాచారం మీ వద్ద ఉండాలి. మీరు జనసమూహంలో చిక్కుకుపోయినప్పుడు, ఆ ప్రాంతం మీకు పూర్తిగా తెలిస్తే అప్పడు మీరు సులభంగా బయటపడగలుగుతారు.3. రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్ళే ముందు, ఏదైనా అవాంఛనీయ సంఘటనను ఎదుర్కోవడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. నిష్క్రమణ ద్వారం సమీపంలో ఉండటం ఉత్తమం.4. మీరు ఎప్పుడైనా జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, వ్యతిరేక దిశలో ముందుకు వెళ్లకూడదు. ఇలా చేస్తే ఆపద మరింత పెద్దదవుతుంది.5. మీరు గుంపులో చిక్కుకుంటే వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. ఆందోళన చెందే బదులు, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ముందుకు నడవాలి.6. జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, ఆ జనసమూహం దిశగానే ముందుకు కదలాలి. అప్పుడు ఆపద నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కొంచెం స్థలం కనిపించినా, దానిని సద్వినియోగం చేసుకోవాలి.7. జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, మీరు మీ చేతులను బాక్సర్ మాదిరిగా మీ ఛాతీ ముందు ఉంచుకోవాలి. తద్వారా మీ ఛాతీ సురక్షితంగా ఉంటుంది.8. మీరు ఎప్పుడైనా జనసమూహంలో చిక్కుకుని కిందపడిపోతే త్వరగా లేవడానికి ప్రయత్నించండి.9. మీరు జనసమూహంలో పడిపోయి లేవలేకపోతే, వెంటనే ఒక పక్కకు తిరిగి పడుకోండి. అలాగే మీ రెండు కాళ్ళను మీ ఛాతీకి తగిలించి, మీ చేతులను మీ తలపై ఉంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుతారు.10 మీరు రద్దీగా ఉండే ప్రదేశంలో చిక్కుకుంటే గోడలకు దూరంగా ఉండండి. బారికేడింగ్‌కు కూడా దూరంగా ఉండాలి. వెంటనే బయటకు వెళ్లడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు.. -
తరతరాల చరిత్రకు ఆలవాలం
టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ తరతరాల చరిత్రకు ఆలవాలం. కేవలం ఇది టాటా కుటుంబ వ్యాపార చరిత్రకు మాత్రమే కాదు, దేశ స్వాతంత్య్రపూర్వ ఆర్థిక, రాజకీయ చరిత్రకు, స్వాతంత్య్రానంతర అభివృద్ధి చరిత్రకు కూడా ఆలవాలం. చారిత్రక ఆనవాళ్లను భద్రపరచి, తర్వాతి తరాలకు అందించడంలో మన భారతీయులకు శ్రద్ధ కొంత తక్కువ. మన దేశంలోని పెద్దపెద్ద వ్యాపార సంస్థలు ఇందుకు మినహాయింపు కాదు. దేశంలోని తొలి వ్యాపార ఆర్కైవ్స్‌ను టాటా సంస్థ ప్రారంభించింది. టాటా గ్రూప్ సంస్థలకు దాదాపు ఒకటిన్నర శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి, డెబ్బయి ఏడేళ్లు గడిచాయి. టాటా గ్రూప్ చరిత్ర స్వాతంత్య్ర భారత చరిత్రకు దాదాపు రెట్టింపు. ఆనాటి బ్రిటిష్ కాలంలో జెమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా తొలుత తండ్రి చేసే వ్యాపారానికి సçహాయంగా ఉంటూ వచ్చారు. తర్వాత 1868లో ఈ వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేశారు. అప్పట్లో ఆయన రూ.21 వేల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత ఒక కాటన్ మిల్లును ప్రారంభించి, వ్యాపారాలను క్రమంగా విస్తరించుకుంటూ, 1874లో నాగపూర్‌లో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీని నెలకొల్పారు. బ్రిటిష్ రాజ్యంలో స్థానిక భారతీయుడు ఒకరు ప్రారంభించిన తొలి జాయింట్ స్టాక్ కంపెనీ ఇది. ఆనాటి నుంచి టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. టాటా కుటుంబ వారసుల్లో మూడో తరానికి చెందిన జె.ఆర్.డి. టాటా ఈ చరిత్రను ఒక తరం నుంచి మరో తరానికి అందించడానికి, దేశ పౌరులకు అందుబాటులో ఉంచడానికి వీలుగా టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తొలుత 1991 జనవరిలో బాంబేలో దీనిని ఏర్పాటు చేశారు. తర్వాత 2001లో పుణేలోని సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన భవనంలోకి దీనిని తరలించారు. ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకుటాటా గ్రూప్ ప్రస్థానం ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకు రకరకాల రంగాల్లో కొనసాగింది. టాటా గ్రూప్ ప్రారంభించిన కొన్ని వ్యాపారాలు కారణాంతరాల వల్ల నిలిచిపోయాయి. ఇంకొన్ని చేతులు మారాయి. అయినా, టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం దేశ పారిశ్రామిక రంగంలో తన ఉనికిని నేటికీ నిలుపుకుంటూ వస్తోంది. టాటా గ్రూప్ వ్యాపారాలకు సంబంధించి టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో భద్రపరచిన ఎన్నో అరుదైన విశేషాలు నేటి తరానికి తెలియవు. స్వాతంత్య్రోద్యమ కాలంలో టాటాలు పోషించిన పాత్ర, స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థికాభివృద్ధిలో పోషించిన పాత్ర నిరుపమానమైనవి. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జెమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా నాగపూర్‌లో 1874లో ప్రారంభించిన సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో విక్టోరియా మిల్లును నెలకొల్పారు. బ్రిటిష్ రాణిగా విక్టోరియా 1877 జనవరి 1న భారత సామ్రాజ్ఞిగా పట్టాభిషిక్తురాలు కావడంతో ఈ మిల్లు పేరును ఎంప్రెస్ మిల్స్‌గా మార్చారు. కాలక్రమంలో ఈ కంపెనీ పరిధిలోకి మరో మూడు మిల్లులు చేరాయి. అవన్నీ కలిపి టాటా టెక్స్టైల్ మిల్స్‌గా పేరుపొందాయి. టాటా టెక్స్టైల్ మిల్స్ వ్యాపారం 1997లో నిలిచిపోయింది. జె.ఆర్.డి.టాటా హయాంలో టాటా గ్రూప్ 1932లో విమానయాన రంగంలోకి ‘టాటా ఎయిర్‌లైన్స్’ పేరుతో అడుగుపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1953లో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసి, దీని పేరును ‘ఎయిర్ ఇండియా’గా మార్చింది. ప్రభుత్వం 2000–01 కాలంలో ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. చివరకు 2022లో ఈ కంపెనీని తిరిగి టాటా గ్రూప్ కైవసం చేసుకోగలిగింది. ఈ చరిత్రకు సంబంధించిన ఆధారాలన్నీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో భద్రంగా అందుబాటులో ఉంచడం విశేషం.మహాత్మాగాంధీకి తొలి విరాళంటాటా గ్రూప్ వారసులు నేరుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకపోయినా, భారత స్వాతంత్య్రోద్యమానికి బాసటగా నిలిచారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా కొనసాగుతూ, భారత స్వాత్రంత్య్రోమానికి సన్నాహాలు చేస్తున్న కాలంలోనే 1909లో జెమ్షెడ్జీ టాటా చిన్న కొడుకు సర్ రతన్జీ టాటా ఆయనకు తొలి విరాళంగా రూ.25 వేలు పంపారు. అప్పట్లో అది చాలా పెద్దమొత్తం. టాటాల తొలి కంపెనీ పెట్టుబడి కంటే కూడా నాలుగువేల రూపాయలు ఎక్కువ. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమానికి సర్ రతన్జీ టాటా బాసటగా ఉండేవారు. గాంధీజీకి ఆయన 1910లో మరో రూ.25 వేలు, 1912లో మూడో విరాళం పంపారు. ఈ సంగతిని గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమ ప్రచార పత్రిక అయిన ‘ఇండియన్ ఒపీనియన్’లో రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించారు. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చి, స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం చేపట్టారు. అనతికాలంలోనే దేశ ప్రజలు ఆయనను ‘మహాత్మా’ అని పిలువసాగారు. గాంధీజీ 1925లో జెమ్షెడ్పూర్ వచ్చారు. అక్కడి టాటా ఉక్కు కర్మాగారం కార్మికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశం పట్ల, దేశ ప్రజల పట్ల టాటాలు కనబరుస్తున్న నిబద్ధతపై ఆయన ప్రశంసలు కురిపించారు. గాంధీజీ చేపట్టిన స్వదేశీ ఉద్యమానికి జెమ్షెడ్జీ టాటా పెద్ద కొడుకు సర్ దొరాబ్జీ టాటా భార్య లేడీ మెహర్‌బాయి టాటా కూడా మద్దతు తెలిపారు. ఇందుకోసం 1919లో ఆమె స్వయంగా రాట్నంపై నూలు వడకడం నేర్చుకున్నారు. జె.ఆర్.డి.టాటా తండ్రి ఆర్.డి.టాటా కూడా గాంధీజీ నేతృత్వంలోని స్వాతంత్య్రోద్యమానికి మద్దతు పలికారు. స్వదేశీ ఉద్యమం కోసం ఆయన టాటా సంస్థ తరఫున లక్ష రాట్నం కుదురులను, ఇతర చేనేత సామగ్రిని పంపారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా తదితర జాతీయ నేతలు బాంబేలో టాటాలకు చెందిన తాజ్‌మహల్ పాలెస్ హోటల్లో తరచుగా సమావేశాలు జరుపుకొనేవారు.నెహ్రూ కోరికపై లాక్మే ప్రారంభంమన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో సౌందర్య సాధనాలను తయారు చేసే కంపెనీలు లేవు. సబ్బులు, పౌడర్లు తప్ప మిగిలిన సౌందర్య సాధనాలు కావాలంటే విదేశీ ఉత్పత్తులపై ఆధారపడే పరిస్థితులు ఉండేవి. ఫలితంగా భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం వీటి కోసం ఇతర దేశాలకు తరలిపోయే పరిస్థితి ఉండేది. విదేశీ మారకద్రవ్యం సౌందర్య ఉత్పత్తుల కోసం విదేశాలకు తరలిపోకుండా ఉండాలంటే, దేశంలో సౌందర్య సా«ధనాల తయారీ సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో జె.ఆర్.డి.టాటాను కోరారు. నెహ్రూ కోరిక మేరకు జె.ఆర్.డి.టాటా 1952లో తొలి స్వదేశీ సౌందర్య సాధనాల సంస్థగా ‘లాక్మే’ను ప్రారంభించారు. అప్పట్లో ‘లాక్మే’ అనే ఫ్రెంచ్ ఒపేరా ప్రపంచ ప్రసిద్ధి పొందడంతో జె.ఆర్.డి.టాటా తమ సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌కు ఆ పేరు పెట్టారు. లక్ష్మీదేవిని ఫ్రెంచ్‌లో ‘లాక్మే’ అంటారు. చాలాకాలం టాటా గ్రూప్‌లో ఉన్న ఈ బ్రాండ్ 1998లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ చేతుల్లోకి చేరింది.విద్యా పరిశోధన సేవా రంగాల్లోనూ ముద్రజె.ఆర్.డి.టాటా దాదాపు అర్ధశతాబ్ద కాలం టాటా గ్రూప్ సంస్థలకు నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ వ్యాపారాలకు వెలుపలి సేవలకు కూడా విస్తరించాయి. జె.ఆర్.డి.టాటా హయాంలోనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫర్మింగ్ ఆర్ట్స్ వంటి సంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యా పరిశోధన రంగాల్లో ఇవి నేటికీ ప్రతిష్ఠాత్మక సంస్థలుగా తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. ఈ సంస్థల ఏర్పాటు కోసం జె.ఆర్.డి.టాటా చేసిన కృషికి సంబంధించిన వివరాలన్నింటినీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో భావితరాల కోసం భద్రపరచారు. వీటిని పరిశీలిస్తే, ఒక్కో సంస్థ వెనుక ఉన్న సంకల్పం, వాటి ఏర్పాటు కోసం పడిన తపన అర్థమవుతాయి. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ పేరుతో ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీపై ఎలాంటి నిర్బంధం, నిబంధనలు లేనికాలంలోనే టాటాలు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించారు. స్వాతంత్య్రానికి మూడేళ్ల ముందే, 1944లో సేవా కార్యక్రమాల కోసం జె.ఆర్.డి.టాటా తన సొంత డబ్బుతో జె.ఆర్.డి.టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. తర్వాత కొంతకాలానికి కంపెనీలోని తన షేర్లు కొన్నింటిని, బాంబేలోని ఒక అపార్ట్‌మెంట్‌ను అమ్మేసి, ఆ డబ్బుతో పేద మహిళల స్వావలంబన కోసం తన పేరిట, తన భార్య పేరిట జె.ఆర్.డి.టాటా అండ్ థెల్మా టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. టాటా సంస్థల సుదీర్ఘ చరిత్రను నిక్షిప్తం చేసుకున్న టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లోని అరుదైన విశేషాలను ఎవరైనా సందర్శించవచ్చు. ఇది ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌ను సందర్శించడమంటే, దేశ ఆర్థిక స్వావలంబన చరిత్రను సింహావలోకనం చేయడమే! -
భీమా కోరేగావ్ చరితను మరుగు పరిచే కుట్రలు!
చరిత్రను మట్టితో కప్పేస్తే అది పుడమిని చీల్చుకుంటూ ఏదో ఒక రోజు బహిర్గతమవుతుంది. అందుకు మంచి ఉదాహరణ భీమా కోరేగావ్ యుద్ధ చరిత్ర. మహారాష్ట్రలోని ప్రస్తుత పుణే జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం భీమా కోరేగావ్ (Bhima Koregaon). 1818 జనవరి1న అక్కడ ఓ యుద్ధం జరిగింది. మరాఠా (Maratha) సమాఖ్యలోని పీష్వా వర్గానికీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకీ మధ్య జరిగిన యుద్ధాన్ని స్వాతంత్ర పోరాటంగా చిత్రీకరిస్తూ అసలైన చరితను మరుగున పరిచే కుట్రలు జరిగాయి.అసలేం జరిగిందంటే...బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నాయకత్వంలో 500 మంది మహర్ సైనికులు, 250 మంది అశ్వికదళం, 24 గన్నర్లతో బెటాలియన్ తరలి వెళ్తున్న సమయంలో ‘కోరేగావ్’ గ్రామంలో (పుణేకు 30 కిమీ) 20,000 పదాతి దళం, 8,000 మంది అశ్విక దళంతో కూడిన పీష్వాల సైన్యం అనుకోకుండా ఎదురైంది. దాదాపు 50 రెట్లు అథికంగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసినా భయపడకుండా, ముందుకు దూకింది మహర్ సైన్యం. మధ్యాహ్నానికి తమ వెంట వచ్చిన అశ్విక దళం, గన్నర్లతో పాటు ఆహారం మోసుకొచ్చేవారూ పారిపోయినా మహర్లు (Mahars) వెనకడుగు వేయకుండా పోరాడసాగారు. ఒకానొక దశలో ఇక ఓటమి తప్పదని భయపడిపోయిన కెప్టెన్ స్టాటన్ యుద్ధం ముగిసిందని ప్రకటించి తన సేనను లొంగి పొమ్మని ఆజ్ఞాపించాడు.అప్పుడు మహర్ సైన్యం నాయకుడు శికనాగ్ యుద్ధాన్ని విరమించడానికి నిరాకరించాడు. వందల సంవత్సరాలుగా తమని బానిసలుగా మార్చి పశువులకన్నా హీనంగా చూస్తున్న బ్రాహ్మణ ఆధిపత్యంపై బదులు తీర్చుకోవడానికి ఇదే అవకాశం అని వాదించాడని అంటారు. మొత్తానికి కెప్టెన్ స్టాటన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఆహారం, నీరు కూడా లేకుండా ఒక పగలు, ఒక రాత్రి జరిగిన భీకర యుద్ధంలో 500 మంది మహర్ సైనికులు 28,000 మంది పీష్వా సైన్యాన్ని ఊపిరి సలపనీయకుండా ఎదుర్కొన్నారు. మహర్ల ప్రతాపానికి, భీమా నది పీష్వా సైనికుల రక్తంతో ఎర్రగా మారిపోయింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకు గోవింద్ బాబా తలను మొండెం నుండి వేరు చేసి బాపు గోఖలేకు పంపాడు శికనాగ్. దీంతో పీష్వా సైన్యం, ఫూల్గావ్ లోని బాజీరావు శిబిరం వైపు పరుగులు తీయసాగారు. వారిని భీమా నది దాటేదాకా తరిమింది మహర్ సైన్యం.చరిత్రలో ఈ ఘటనకు బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని సంపూర్ణం చేసిన ఆంగ్లో–మరాఠా యుద్ధంగా, అందులో పోరాడిన పీష్వాను స్వాతంత్య్ర సమరయోధునిగా చెబుతారు సంప్రదాయ చరిత్రకారులు. కానీ నిజానికి సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం మహర్ సైనికులు చేసిన ఒక వీరోచిత యుద్ధం ఇది. ఈ చరిత్రకు సాక్ష్యంగా 1821లో కోరేగావ్ గ్రామంలో యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో ‘విజయస్తూపం’ ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 22 మంది మహర్ సైనికుల పేర్లను ఆ విజయ స్తూపంపై చెక్కించి ప్రతి సంవత్సరం వారికి నివాళి అర్పించేది.చదవండి: ఆ పేరును ఎందుకు స్మరించాలంటే...‘ఇది మహర్ పోరాట యోధుల చరిత్ర. యావత్ సమాజానికి స్ఫూర్తినిచ్చే పోరాట’మని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1927 నుండీ చనిపోయేదాకా కూడా ప్రతి సంవత్సరం జనవరి 1న తప్పకుండా ఈ విజయ స్తూపాన్ని సందర్శించి నివాళులు అర్పించేవారు. బాబాసాహెబ్ తదనంతరం ఆయన ఆలోచనా విధానాన్ని కొనసాగించే బాధ్యత తీసుకున్న ‘సమతా సైనిక్ దళ్’వారు ఇప్పటికీ ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన వేల సంఖ్యలో హాజరై నివాళులు అర్పిస్తూ చరిత్రను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ అసలైన చరిత్రను భావితరాలకు అందజేద్దాం. అసమానతలు లేని సమ సమాజం వైపు పయనిద్దాం.– ములక సురేష్, ఉపాధ్యాయుడు -
హిస్టరీ రిపీట్స్ : 2025 ఫ్యా‘షైన్’
ఆధునికత మనకు ఎన్నింటినో పరిచయం చేస్తుంది.కానీ, ఫ్యాషన్‌లో మాత్రం రాబోయే రోజుల్లో హిస్టరీ రిపీట్ కాబోతోంది. వింటేజ్ హుందాగా విచ్చేస్తోందిముదురు రంగులు విదిల్చికొని లేత రంగులు కొత్త భాష్యం చెబుతున్నాయి. పవర్‌లూమ్స్ ఎంత పెరిగినా హ్యాండ్లూమ్స్ అందించే సౌకర్యానికి నవతరం పెద్ద పీట వేస్తోంది. 2025 ఫ్యాషన్ రంగంలో ప్రధానంగా కనిపించే పాత– కొత్తల కలయిక. ఫ్యాబ్రిక్ అనేది మన మనస్తత్వాన్ని ఎదుటివారికి పరిచయం చేస్తుంది. డిగ్నిఫైడ్ లుక్‌తో ΄ాటు మేనికి సౌకర్యాన్నిచ్చే సస్టెయినబుల్ ఫ్యాబ్రిక్‌ని నిన్నటి తరమే కాదు నేటి తరమూ ఆసక్తి చూపుతుంది. సస్టెయినబిలిటీ ఫ్యాబ్రిక్, పేస్టల్ కలర్స్, హెరిటేజ్ డిజైన్స్ ముందు వరసలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్త ఫ్యాషన్ షోలలోనూ వీటి హవానే కనిపిస్తోంది. హైదరాబాద్ వాసి, ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి ఈ విషయం గురించి మరిన్ని వివరాలు ఇలా మన ముందుంచారు.నాణ్యమైన ఫ్యాబ్రిక్ మెటీరియల్ నాణ్యత పెరిగేకొద్దీ ధర కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అయినా మేనికి హాయినిచ్చే ఫ్యాబ్రిక్‌నే ప్రపంచమంతా ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు.. కలంకారీ డిజైన్స్ తీసుకుందాం. ఈ డిజైన్స్‌లో చాలా రెప్లికాస్ వచ్చాయి. ఔట్‌లైన్ కలంకారీ అయినా, డిజైన్ మొత్తం కెమికల్ ప్రింట్ ఇస్తున్నారు. ఇలాంటప్పుడు ఖర్చు తగ్గవచ్చు. కానీ, ఒరిజనల కలంకారీ ఫాబ్రిక్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక .. కంచి, గద్వాల్, పైథానీ వంటి హ్యాండ్లూమ్స్లోనూ ఇమిటేషన్ పవర్‌లూమ్స్ వచ్చి, ఖర్చు తగ్గవచ్చు. కానీ, ఒరిజనల్ హ్యాండ్లూమ్ వైభవం ఎప్పటికీ తగ్గదు. పైగా, అలాంటి వాటిని తమ వార్డ్‌రోబ్‌లోకి తెచ్చుకోవడానికి మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ కలర్స్ ఇష్టపడుతున్నారు. మన దేశీయ ఉత్పత్తుల తయారీని ప్రొత్సహించడం, పెంచడం వంటి వాటి వల్ల ధరల్లోనూ మార్పులు వస్తాయి. డిమాండ్ పెరుగుతుంటే ఉత్పత్తి కూడా పెరుగుతుంది.లేలేత రంగులుఫ్యాబ్రిక్పై వాడే రసాయనాల ముదురు రంగులు తగ్గిపోనున్నాయి. ఇప్పటికే చాలా పెళ్ళిళ్లలోనూ చూస్తుంటాం. లేత రంగులు, నేచురల్ కలర్స్‌కి వచ్చేశారు. పేస్టల్ కలర్స్‌లో ఉండే గొప్పతనం ‘రిచ్’గా, ప్రత్యేకంగా చూపుతుంది. అందుకే నవతరం పేస్టెల్ కలర్స్వైపు మొగ్గుచూపుతుంది. ఈ ఆలోచనలు నిన్నటితరాన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో లేత రంగులు గొప్పగా వెలిగి΄ోనున్నాయి.హ్యాండ్ ఎంబ్రాయిడరీబామ్మలనాటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ వర్క్స్ మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. అంతేకాదు హ్యాండ్ పెయింట్, గాడీగా లేని ఎంబ్రాయిడరీని ఇష్టపడుతున్నారు. కొన్ని రకాల ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌ను కూడా తమ డ్రెస్ డిజైన్స్లలో చూపుతున్నారు. తేలికగా ఉండేలా..ఏ డ్రెస్ అయినా సరే కంఫర్టబుల్‌గా, సులువుగా ధరించే వీలు ఉండే డ్రెస్‌ల మీద ఫోకస్ పెరుగుతోంది. పెళ్లి వంటి గ్రాండ్ అకేషన్స్ అయినా లైట్వెయిట్ను ఇష్టపడతున్నారు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకున్నా సపై్టయినబుల్ ఫ్యాబ్రిక్‌ని ఇష్టపడుతున్నారు. వింటేజ్ స్టైల్రిసెప్షన్, ఫ్యాషన్ షో వంటి వేడుకలలో హైలైట్ కావడానికి డ్రెస్సుల ‘కట్స్’ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దీని వల్ల జ్యువెలరీ తక్కువ వాడుతున్నారు. ఇందులో భాగంగా హెరిటేజ్ కాన్పెప్ట్, రెట్రో స్టైయిల్ ముందుకు వస్తోంది. మెరుస్తున్న ఐవరీ చందేరీపై అప్లిక్ పూల వర్క్‌తో ప్రిన్సెస్ డయానా డ్రెస్‌లో నాటి రోజులను ముందుకు తీసుకువస్తుంది. ఆర్గానిక్ ముల్ చందేరి ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్ రొమాంటిక్ ఫినిషింగ్ టచ్‌ను జోడిస్తుంది. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన మందార పువ్వులు, మిర్రర్ వర్క్‌లతో నిండిన ముల్ చందేరీ డ్రెస్, ఫెదర్‌లైట్ వైట్ కేప్ మొత్తం రూపాన్ని అందంగా మార్చేస్తుంది. కాలం పరుగులు తీస్తూనే ఉంది.చేతితో ఎంబ్రాయిడరీ చేసిన మందార పువ్వులు, మిర్రర్ వర్క్‌లతో నిండిన ముల్ చందేరీ డ్రెస్, ఫెదర్‌లైట్ వైట్ కేప్ మొత్తం రూపాన్ని అందంగా మార్చేస్తుంది. -
మన అడుగులు ఎటువైపు?!
భారత రాజ్యాంగానికి శతాబ్దాల ముందు.. ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, యూదులను భారతదేశపు మట్టిలో చట్టబద్ధమైన భాగస్వాములుగా మన దేశ మూలవాసులు అంగీకరించారు. మన పూర్వీకులు మానవత్వాన్ని ఒకే కుటుంబంగా అర్థం చేసుకున్నారు. ప్రాచీన సంస్కృత పదబంధమైన ‘వసుధైక కుటుంబం’, ప్రాచీన తమిళ పద్యమైన ‘యాదుం ఊరే యావరం కేళిర్’ అర్థం కూడా ఇదే! కానీ ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సహజీవనంతో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం కంటే నిన్నటి రోజుని పునర్నిర్మించడానికే ప్రయత్నాలు జరుగుతున్నట్లనిపిస్తోంది. గతాన్ని మార్చలేము. గతం నుంచి కేవలం నేర్చుకోగలం. గతాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రచారాలు వర్తమానాన్ని గాయపరుస్తాయనేది చరిత్ర నేర్పిన పాఠం.భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్ లు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడిన పిటిషన్ లను తిరిగి విచారించినప్పుడు, మీడియా మరోసారి పిటిషన ర్లను ‘హిందూ’ లేదా ‘ముస్లిం’ అనే రెండు పక్షాలుగా పేర్కొంటుంది. సీజేఐ, ఆయన తోటి న్యాయమూర్తులు తమ తీర్పును ఇచ్చిన తర్వాత, మీడియా ‘విజయం సాధించిన పక్షం’ అనే శీర్షికను పెడు తుంది. నిజానికి, ఆ తీర్పు విజయాన్ని మించి మరింత ప్రాముఖ్యం కలిగినది. ఇది రెండు సంఘర్షణాత్మక దృక్పథాల మధ్య ప్రభావం చూపుతుంది, ఒకటి భారతదేశంలో సమానత్వంతో కూడిన ప్రజాస్వా మ్యాన్ని కోరుకుంటుంది, మరొకటి మెజారిటీ ఆధిపత్యాన్ని వాగ్దానం చేస్తుంది. ఆ తీర్పు హిందూ మతంపై ప్రపంచ అవగాహనను కూడా ప్రభావితం చేస్తుంది.చికాగోలో 1893లో జరిగిన ప్రపంచ సర్వ మత మహాసభముందు స్వామి వివేకానంద పేర్కొన్న ప్రఖ్యాతిగాంచిన మాటలు హిందూ మతానికి ప్రపంచవ్యాప్త ప్రతిష్ఠ తేవడంలో సాయపడ్డాయి: ‘‘సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ ప్రపంచానికి బోధించిన మతానికి చెందినందుకు నేను గర్విస్తున్నాను. మేము విశ్వవ్యాప్తసహనాన్ని మాత్రమే నమ్ముతాము, మేము అన్ని మతాలూ నిజమని అంగీకరిస్తాం’’ అన్నారు. తిరిగి 1896లో లండన్‌లో... ‘‘భారతీయులు ప్రజాస్వామ్యాన్ని హత్తుకుంటారు. ఐక్యతను, సమానత్వాన్ని ప్రతిష్ఠి స్తారు’’ అని పునరుద్ఘాటించారు. భారతదేశం ఆలింగనం చేసుకోవాలని వివేకానంద ఆశించిన ప్రజాస్వామ్యం, భారత గడ్డపై ప్రతిష్ఠించాలని ఆయన కోరుకున్న ఐక్యత, నాటాలనుకున్న సమానత్వపు మొక్కలు.. భారత రాజ్యాంగం అమోదం పొందిన 1949 నాటి నుండి కనిపించాయి. దాని పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచన, వ్యక్తీకరణ,నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ; హోదా, అవకాశాల సమా నత్వం; అలాగే... సోదరత్వం, వ్యక్తి గౌరవం, దేశ ఐక్యత, సమగ్ర తలకు హామీ ఇస్తోంది. తదుపరి 75 సంవత్సరాలలో, కొన్ని తీవ్రమైన మినహాయింపులను పక్కన పెడితే, భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను ఉల్లంఘించకుండా చాలా వరకు దూరంగా ఉన్నాయి. అయితే, ఆగ్రహం పెద్ద సంఖ్యలో ప్రజలను ఉత్తేజపరిచినప్పుడు, హింసను నియంత్రించడానికి అధికారులు నిరాకరించినప్పుడు రాజ్యాంగ వాగ్దానాలు మృతప్రాయంగా మారటం తెలిసిందే. సుప్రీంకోర్టు తన 2019 నాటి అయోధ్య తీర్పులో పేర్కొన్నట్లుగా, 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఇదే జరిగింది. 2019 నాటి ఆ తీర్పులో, మసీదు ఉన్న మైదానంలో రామమందిరాన్ని నిర్మించడానికి సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది. ఆ మసీదును ప్రార్థనా స్థలాల చట్టం–1991 నుండి జాగ్రత్తగా మినహాయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇతర మసీదుల పునాదులపైన కూడా మును పటి హిందూ పుణ్యక్షేత్రాల చిహ్నాల కోసం శోధించడాన్ని అనుమతిస్తే, ఆ చట్టానికి అర్థమే లేకుండా పోతుంది. పైగా, అటువంటి తీర్పు... హిందూ మతం అసహనంతో, ఆగ్రహంతో కూడుకున్నదనీ; వివేకా నంద, ఆయనతో ఏకీభవించిన నాలుగు తరాల హిందూ ఆలోచనా పరులు ఆనాడు వాస్తవాన్ని గ్రహించలేకపోయారనీ ప్రపంచానికి చాటి చెబుతుంది.అతని లేదా ఆమె పూర్వీకుడు నా పూర్వీకుడికి హాని కలిగించినందున నేను ఎవరినైనా గాయపరచడం చట్టబద్ధం కాదని ఆధునిక ప్రపంచం అంగీకరిస్తుంది. మూలవాస ఆఫ్రికన్లు, అమెరికన్లు, కెనడి యన్లు, ఇంకా ఆస్ట్రేలియన్లు స్వదేశీ అనుమతి లేకుండా తమ భూమిలో స్థిరపడిన బయటివారి (భారతదేశం నుండి వచ్చిన వ్యక్తులు సహా) వారసులను బహిష్కరించాలని డిమాండ్ చేయరు. ఈ ‘అంగీకారాన్ని’ మనం మానవత్వం, ఇంగితజ్ఞానం, వ్యావహారిక సత్తా వాదం లేదా మరొకదాని ఘనతగా పేర్కొన్నప్పటికీ, అది మనప్రపంచ పురోగతి గాథను గుర్తించింది.భారత రాజ్యాంగానికి శతాబ్దాల ముందు.. ముస్లింలు, క్రైస్త వులు, పార్సీలు, యూదులను భారతదేశపు మట్టిలో చట్టబద్ధమైన భాగస్వాములుగా మన దేశ మూలవాసులు అంగీకరించారు. మన పూర్వీకులు మానవత్వాన్ని ఒకే కుటుంబంగా అర్థం చేసుకున్నారు. ప్రాచీన సంస్కృత పదబంధమైన ‘వసుధైక కుటుంబం’, ప్రాచీన తమిళ పద్యమైన ‘యాదుం ఊరే యావరం కేళిర్’ అర్థం కూడా ఇదే.నేను 1999లో రాసిన పుస్తకం, ‘రివెంజ్ అండ్ రీకన్సిలియేషన్: అండర్స్టాండింగ్ సౌత్ ఏషియన్ హిస్టరీ’లో పేర్కొన్నట్లుగా, బుద్ధుడు ప్రబోధించిన సోదరభావానికీ, మహా భారత కథలో ఆధిపత్యం వహించిన ప్రతీకారానికీ మధ్య ఏదో ఒక దానిని మన ఉపఖండంలోని ప్రజలు ఎంచుకోవాల్సి వచ్చింది.ప్రతీకారం సూత్రంగా, సర్వత్రా సంహారమే పరాకాష్ఠగా కనిపించే మహాభారతంలో కూడా, సయోధ్య స్ఫూర్తి, పాఠకుల హృద యాన్ని సాంత్వనపరిచే శక్తిమంతమైన మినహాయింపులు ఉండటం కనిపిస్తుంది. భారత ఇతిహాసంలోని అత్యంత నాటకీయ సన్నివేశా లలో, యుద్ధం ముగిసిన తర్వాత, దాదాపు ప్రతి కథానాయకుడు మరణానికి గురైన తరువాత, దుఃఖంలో ఉన్న స్త్రీలను, జీవించి ఉన్న కొంతమంది యువరాజులను పురాణకర్త వ్యాసుడు ఓదార్చాడు. వ్యాసుడు అప్పుడప్పుడు కథా సన్నివేశాలలోకి ప్రవేశిస్తాడు. ‘నేను మీ దుఃఖాన్ని పోగొడతాను’ అని దుఃఖిస్తున్న వారితో చెబుతూ, వ్యాసుడు చనిపోయిన వారిని భాగీరథీ నదీ జలాల నుండి బయటకు వచ్చేలా చేశాడు: ద్వేషం అసూయ నుండి ప్రక్షాళన కాబడినది / తండ్రిని తల్లిని కొడుకు కలిసాడు / భార్య భర్తను కలుసుకున్నది / స్నేహితుడు స్నేహితుడిని పలకరించాడు/ పాండవులు కర్ణుడిని కలి శారు/ అతడిని కౌగిలించుకున్నారు/ అని రాశాడు. అది సయోధ్యకు సంబంధించిన దృశ్యం. అక్కడ దుఃఖం లేదు, భయం లేదు, అను మానం లేదు, నిందలు లేవు. అది ప్రేమించే మనసుల కలయిక తప్ప మరేమీ కాదు. (పి లాల్ వ్యాఖ్యానం). అయితే తెల్లవారుజాము నాటికి, ఆ కలయిక కల ముగిసింది. జీవం పోసుకున్న వారు భాగీరథీ నదీ జలాల లోతుల్లోకి తిరిగి వెళ్లి పోయారు. పాండవుల ఆధిపత్యాన్ని ప్రకటించడానికి అర్జునుడు సాగించిన యుద్ధానంతర ఉపఖండ దండయాత్ర సమయంలో మరొక సయోధ్య దృశ్యం మనకు కనిపిస్తుంది. సైంధవ భూభాగంలో (సింధ్‌లో) ఓడిపోయిన కౌరవుల సోదరి దుశ్శల, ఒక బిడ్డతో కలిసి అర్జునుడిని కలుస్తుంది. అర్జునుడు అన్యాయంగా చంపిన కౌరవ పక్ష యోధుడైన జయద్రథుడిని దుశ్శల వివాహం చేసుకుంది. అర్జునుడు ఆమె కొడుకు సురథుడి గురించి దుశ్శలను అడుగుతాడు. ‘అతను చనిపోయాడు,’ అని ఆమె చెబుతుంది, ‘అతను విరిగిన హృదయంతో మరణించాడు, ఎందుకంటే నీవు అతని తండ్రిని చంపావని సురధు నికి తెలుసు. నేను ఇప్పుడు సురథుడి కొడుకును నీ వద్దకు తీసుకు వస్తాను. నేను నీ రక్షణను కోరుతున్నాను’’ అంటుంది. అర్జునుడు దుశ్శలని అక్కున చేర్చుకుని తన రాజభవనానికి రావాలని ఆమెను కోరాడు. తర్వాత అర్జునుడు సైంధవులతో సంధి చేసుకున్నాడు.మనం ఇప్పుడు ఒకటే ప్రశ్నించాలి. ఈరోజు భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం కంటే నిన్నటి రోజుని పునర్నిర్మించడానికి ప్రయత్నించడం ముఖ్యమా? అని. గతం ముగిసిపోయింది. మనం దానిని మార్చలేం. జరిగిపోయిన దాన్ని పునరుద్ధరించలేము. అవును, మనం చరిత్ర నుండి కేవలం నేర్చుకోగలం. గతాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రచా రాలు వర్తమానాన్ని గాయపరుస్తాయనేది చరిత్ర నేర్పే పాఠాలలో ఒకటి.- వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత- రాజ్‌మోహన్ గాంధీ -
Veer Bal Diwas: మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా..
భారతదేశవ్యాప్తంగా ఈరోజు(డిసెంబర్ 26)న వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నారు. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌ల ధైర్యసాహసాలు, త్యాగానికి గుర్తుగా ప్రతీయేటా డిసెంబర్ 6న వీర్ బాల్దివస్ నిర్వహిస్తుంటారు.మతం, మానవత్వాలను రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన సమయంలో సాహిబ్జాదా జోరావర్ సింగ్ వయసు తొమ్మిదేళ్లు, సాహిబ్జాదా ఫతే సింగ్ వయసు ఆరేళ్లు కావడం విశేషం. 2022లో జనవరి 9న గురుగోవింద్ సింగ్(Guru Gobind Singh) ప్రకాష్ పర్వ్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ బాలవీరుల త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా వీర్‌బాల్ దివస్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.మొఘలుల పాలనలో..సిక్కుల పదవ గురువు గోవింద్ సింగ్‌కు అజిత్ సింగ్, జుజార్ సింగ్, జోరావర్ సింగ్, ఫతే సింగ్ అనే నలుగురు కుమారులున్నారు. 1699లో గోవింద్ సింగ్ ఖాల్సా పంత్‌ను స్థాపించారు. 1705లో పంజాబ్ మొఘలుల పాలనలో ఉంది. ఆ సమయంలో గురుగోవింద్ సింగ్‌ను పట్టుకునేందుకు మొఘలులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. అయితే గురు గోవింద్ వారికి చిక్కలేదు. అతని భార్య మాతా గుజ్రీతో పాటు వారి కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లో ఒక రహస్య ప్రదేశం(Secret place)లో దాక్కున్నారు. అయితే వారింటిలోని వంటవాడు గంగు వారి గురించి సిర్హింద్ నవాబ్ వజీర్ ఖాన్‌కు తెలియజేశాడు. అప్పటికే గురుగోవింద్ సింగ్ కుమారులు బాబా అజిత్ సింగ్, బాబా జుజార్ సింగ్ మొఘలులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు.చిన్నారుల బలిదానంనవాబ్ వజీర్ ఖాన్ గురుగోవింద్ సింగ్ భార్య గుజ్రీని, కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌లను హింసించాడు. మతం మారాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. తరువాత వజీర్ ఖాన్ సాహిబ్జాదాస్ చిన్నారులిద్దరినీ గోడలో పూడ్చిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లి గుజ్రీ ప్రాణత్యాగం చేశారు. ఆ చిన్నారుల బలిదానాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 2022లో ప్రతీయేటా డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్(Veer Bal Diwas)గా జరుపుకుంటున్నట్లు ప్రకటించింది. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లు 1705, డిసెంబర్ 26న అమరులయ్యారు. వీర్ బాల్ దివస్ భారతదేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుందని, రాబోయే తరాలకు సత్యధర్మాలకున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుందని ప్రదాని మోదీ గతంలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్.. -
కాలగర్భంలోకి చివరి ఐరన్ బ్రిడ్జి.. తొలగింపు ప్రక్రియ షురూ
కాలం... ఎవరి ప్రమేయం లేకుండా ముందుకు సాగిపోతుంటుంది. ఈ ప్రకియలో అన్నింటినీ తన గర్భం(కాలగర్భం)లో కలిపేసుకుంటుంది. ఈ విషయంలో గొప్ప కట్టడాలు, నిర్మాణాలకు మినహాయింపేమీ ఉండదు. మనదేశాన్ని బ్రిటీషర్లు పాలించిన కాలంలో వారు అనేక వంతెనలు, రైలు బ్రిడ్జిలను నిర్మించారు. స్వాతంత్య్రానంతరం రైల్వే బ్రిడ్జీలను నూతన టెక్నాలజీతో పునర్నిర్మిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లకు దన్నుగా నిలిచి..ముంబైలోని బాంద్రాలోని మిథి నదిపై నిర్మించిన బ్రిటీష్ కాలంనాటి రైల్వే వంతెనను ఇప్పుడు పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వంతెనపై ఏర్పాటు చేసిన చివరి ఐరన్ స్క్రూ పైల్స్‌లో ఒకటి త్వరలో చరిత్రలో కలసిపోనుంది. దీని స్థానంలో సిమెంట్ కాంక్రీట్ గిర్డర్‌ను నిర్మించనున్నారు. ఈ వంతెన 1888 నుండి రైల్వే ట్రాక్‌లకు దన్నుగా నిలిచింది. సరిగ్గా ఇదే సమయంలో బాంద్రా రైల్వే స్టేషన్‌ను నిర్మించారు.ఇనుప స్తంభాల తొలగింపుఈ వంతెన ట్రాక్‌ల కింద ఎనిమిది స్తంభాలు ఉన్నాయి. వీటిని ఇనుముతో తయారు చేశారు. ఇవి 8 నుంచి 10 టన్నుల బరువును కలిగి ఉన్నాయి. అలాగే 15 నుంచి 20 మీటర్ల లోతున పునాదుల్లోకి ఉన్నాయి. ఈ స్తంభాల వ్యాసం సుమారు రెండు అడుగులు. వాటి మందం 50 మి.మీ. ఇవి స్టీల్ గిర్డర్లను, వాటి పైన ఉన్న రైల్వే లైన్ల బరువును మోస్తుంటాయి. ఈ స్తంభాలు దాదర్ ఎండ్‌లోని రాతి గోడకు ఆనుకుని ఉన్నాయి. వీటిని ఇప్పుడు కూల్చివేయనున్నారు.ఇదే చివరి స్క్రూ పైల్భారతీయ రైల్వేలో కాస్ట్ ఐరన్‌కి సంబంధించిన చివరి స్క్రూ పైల్ ఇదేనని పశ్చిమ రైల్వే ఇంజనీర్ తెలిపారు. అది నీటిలో మునిగిపోయి, బలహీనంగా మారినందున దానిని తీసివేయవలసి ఉంటున్నదన్నారు. ఇది రైలు కార్యకలాపాల భద్రతా సమస్యగా మారే అవకాశం ఉన్నదని, అందుకే ఇప్పుడు దానిని పునర్నిర్మిస్తున్నామన్నారు. ఈ ఎనిమిది ఇనుప స్తంభాలు 9-10 మీటర్ల పొడవుతో నాలుగు రైల్వే లైన్ల భారానికి దన్నుగా నిలుస్తున్నాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఈ 10 అంశాలపైనే అంతటా చర్చవంతెనకు దన్నుగా ఏడు సిమెంట్ గర్డర్లు ఈ రైల్వే బ్రిడ్జి ఉత్తర-దక్షిణ దిశలో దాదాపు 50-60 మీటర్ల పొడవు కలిగివుంది. దీనికి ఏడు సిమెంట్ గర్డర్ల ద్వారా దన్ను దొరుకుతుంది. చర్చ్‌గేట్ చివరన నదిలో ఇనుప స్తంభాలు కూరుకుపోయాయి. మిగిలిన ఇనుప స్తంభాలు సిమెంటు కాంక్రీటు మధ్య ఉన్నాయి. స్క్రూ పైల్స్ చివరలు మాత్రమే పైన కనిపిస్తాయి. ప్రస్తుతం ఇంజనీర్లు నీటి ప్రవాహాన్ని ఆపడానికి మిథి నదికి తూర్పు, పడమర ఒడ్డున కాఫర్డ్యామ్లను ఏర్పాటు చేశారు. ఇనుప స్తంభాలను తొలగించేందుకు వీలుగా అక్కడ నిలిచిన నీటిని హైపవర్ పంపుల సాయంతో బయటకు తీస్తున్నారు.కాసేపు రైళ్ల నిలిపివేతజనవరిలో పశ్చిమ రైల్వే రెండు 9.5 గంటల రైలు బ్లాకులను (రైలు రాకపోకల నిలిపివేత) కొనసాగించనుంది. పశ్చిమ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బ్లాక్ జనవరి 24 నుంచి 26 వరకూ రాత్రివేళ 9.5 గంటల పాటు ఉండనుంది. ఈ బ్లాక్‌ల సమయంలో ఈ మార్గంలో నడిచే రైలు సర్వీసులను రద్దు చేయనున్నారు. ఈ రెండు బ్లాక్‌ల సమయంలో ఇంజనీర్లు ఇనుప స్తంభాల పైన ఉన్న స్టీల్ గిర్డర్లను తొలగించి, వాటి స్థానంలో 20 మీటర్ల పొడవైన కాంక్రీట్ గర్డర్లను ఏర్పాటు చేయనున్నారు. -
ఖో..ఖో : ఇంట్రస్టింగ్ స్టోరీ.. ఖో అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు కొన్ని స్కూళ్లలో దీనిని మర్చిపోయారుకాని ఒకప్పుడు ప్రతి స్కూల్లో ఆడించేవారు. పిల్లలు ఉత్సాహంగా ఆడేవారు. ఖొఖొ ఆట ఆడటం సులువు కాబట్టి పిల్లలు స్కూళ్లలో, ఇంటి వద్ద, మైదానాల్లో ఆడవచ్చు. ఇది ఆడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఖొఖొ చరిత్రేమిటో తెలుసా? ఖొఖొ దక్షిణాసియా సంప్రదాయ క్రీడ. క్రీ.పూ నాలుగో శతాబ్దం నుంచే ఈ ఆట ఆడి ఉంటారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మహాభారతంలో కూడా ఖొఖొ ప్రస్తావన ఉందని కొందరి మాట. అప్పట్లో దీన్ని ‘ఖొ ధ్వని క్రీడ’ అని పిలిచేవారు. అంటే ‘ఖొ’ అని శబ్దం చేస్తూ ఆడే ఆట అని అర్థం.రకరకాల నియమాలు, విధానాలతో ఆడే ఈ ఆట 1914 నుంచి ఒక స్థిరమైన రూపాన్ని పొందింది. పుణెలోని డక్కన్ జింఖాన్ క్లబ్ వారు ఈ ఆటకు సంబంధించి నిబంధనలు ఏర్పాటు చేసి తొలి రూల్ బుక్ తయారుచేశారు. అనంతరం అనేక పోటీల్లో ఖొఖొ భాగమైంది. దక్షిణాసియా క్రీడాపోటీలు, ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా వంటి వేదికలపై ఖొఖొ చోటు దక్కించుకుంది. ఆటలో ఒక జట్టుకు ఏడుగురు క్రీడాకారులు ఉంటారు. వారిలో ఒకరు పరిగెడుతూ ఉండగా మరో జట్టులోని వ్యక్తి అతణ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని వెళ్లే మార్గాన్ని బట్టి పరిగెత్తే వ్యక్తి మరో వ్యక్తిని తట్టి ‘ఖొ’ అంటాడు. వెంటనే అతను లేచి అవతలి జట్టు వ్యక్తి కోసం పరిగెడతాడు. అతని స్థానంలో అతనికి ‘ఖొ’ ఇచ్చిన వ్యక్తి కూర్చుంటాడు. ఇది ‘ఖొఖొ’ ఆడే విధానం. మొదట్లో మట్టి, ఇసుక వంటివి ఉన్నచోట ఖొఖొ ఆడేవారు. ప్రస్తుతం స్టేడియంలో ఏర్పాటు చేసిన కోర్టుల్లోనూ ఆడుతున్నారు. మనదేశంలో నస్రీన్ షేక్, సతీష్రాయ్, సారికా కాలె, పంకజ్ మల్హోత్రా, మందాకినీ మఝీ, ప్రవీణ్‌కుమార్ వంటివారు ఖొఖొ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. 2024 మార్చిలో జాతీయ ఖొఖొ ఛాంపియన్ షిప్‌పోటీలు నిర్వహించారు. అందులో మహారాష్ట్ర జట్లు స్త్రీ, పురుషుల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఖొఖొకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘అంతర్జాతీయ ఖొఖొ సమాఖ్య’ 2025లో ‘ఖొఖొ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించాలని అనుకుంటోంది. ఇందులో భారత ఖొఖొ సమాఖ్య కూడా భాగం కానుంది. దీంతోపాటు 2036లో జరిగే ఒలింపిక్స్‌లో ఖొఖొను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖొఖొ నేర్చుకోండి. ఈసారి మరింత ఉత్సాహంగా ఆడండి. -
సప్తగిరుల దేవరాద్రి
దేవరకొండ ఖిలాకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలో ఉన్న కోటలన్నింటిలో దేవరకొండ కోట తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 13వ శతాబ్దంలో నిర్మితమైన దేవరకొండ ఖిలాకు సురగిరి అనే పేరుంది. అంటే దేవతల కొండ అని దీని అర్థం. కోట చుట్టూ ఎనిమిది చోట్ల ఆంజనేయస్వామి రూపాన్ని చెక్కి కోటను అష్ట దిగ్బంధనం చేశారని ప్రతీతి. ఎంతో ప్రాచుర్యం పొందిన దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. అయినా పాలకులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో నిరాదరణకు గురవుతోంది. – దేవరకొండకోట చుట్టూ 360 బురుజులు.. కాలక్రమేణా కోట గోడలు బీటలు వారినా.. నిర్మాణ శైలి నేటికీ అబ్బురపరుస్తోంది. పది కిలోమీటర్ల పొడవు, 500 అడుగుల ఎత్తులో ఏడు కొండల మధ్య నిర్మితమైన దేవరకొండ కోట శత్రుదుర్బేధ్యంగా ఉండేది. మట్టి, రాళ్లతో కట్టిన గోడలు నేటికీ నాటి నిర్మాణ కౌశలాన్ని చాటుతున్నాయి.7 గుట్టలను చుట్టుకొని ఉన్న శిలా ప్రాకారంలో 360 బురుజులు, రాతితో కట్టిన 9 ప్రధాన ద్వారాలు, 32 ప్రాకార ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, కోనేర్లు, కొలనులు, సైనిక నివాసాలు, ధాన్యాగారాలు, సభావేదికలు, ఆలయాలు ఇలా.. ఎన్నో.. ఎన్నెన్నో. ప్రతీ నిర్మాణం వెనుక ఓ చారిత్రక గాథ పలకరిస్తుంటుంది.రాజదర్బార్ ఉన్న కోట ద్వారాలకు రెండు వైపులా పూర్ణకుంభాలు, సింహాలు, తాబేళ్లు, చేపలు, గుర్రాలు వంటి ఆకృతులు ఇక్కడ రాతిపై చెక్కబడి ఉన్నాయి. కోట సమీపంలో నరసింహ, ఓంకారేశ్వర, రామాలయం వంటి పురాతన దేవాలయాలు దర్శనమిస్తాయి. ఇక్కడి శిల్పకళా సంపద చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. పద్మనాయకుల రాజధానిగా.. 15వ శతాబ్దంనాటి ఈ కోటకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 700 ఏళ్ల కిందట 13వ శతాబ్దంలో కాకతీయులకు సామంతులుగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్రులైన పద్మనాయకుల రాజధానిగా దేవరకొండ కీర్తి గడించింది. అనపోతనాయుడు, రెండవ మాదానాయుడి కాలంలో కోట నిర్మాణం జరిగింది.మాదానాయుడి వారసులు దేవరకొండని, అనపోతనాయుడి వారసులు రాచకొండను రాజధానిగా చేసుకొని క్రీ.శ 1236 నుంచి 1486 వరకు పాలన కొనసాగించారు. తర్వాత ఈ కోటను బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు వశం చేసుకున్నారు. సందర్శకుల తాకిడి.. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఖిలా (Devarakonda Fort) సందర్శనకు హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, విదేశీయులు సైతం కోటను సందర్శించి ఇక్కడి శిల్పకళా సంపదను చూసి ముగ్దులవుతున్నారు. చదవండి: చెరువులకు చేరింది సగంలోపు చేప పిల్లలేఇక తొలి ఏకాదశి, మహా శివరాత్రి పర్వదినాల్లో దేవరకొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున కోటకు చేరుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ కోట సింహద్వారంపై చెక్కబడిన పూర్ణకుంభం చిహ్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ చిహ్నంగా తీసుకోవడం గమనార్హం.పర్యాటక ప్రాంతంగా మార్చితే.. ఖిలాను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రాంత ప్రజల చిరకాల కోరిక. దేవరకొండ ఖిలా గతమెంతో ఘనచరిత్ర కలిగి నాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచింది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే దేవరకొండతోపాటు చుట్టుపక్కల పట్టణాలు సైతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయి. ఈ ఖిలా విశిష్టత సైతం నలుమూలల వ్యాప్తి చెందుతుందని ఇక్కడి ప్రజల కోరిక. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖిలా ఆవరణలో పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం పార్క్ నిర్మాణ పనులు పూర్తయినట్టు అధికారులు పేర్కొంటున్నారు.దేవరకొండ ఖిలాకు చేరుకునేదిలా.. దేవరకొండ ఖిలా హైదరాబాద్‌కు 110 కిలోమీటర్లు, నాగార్జునసాగర్‌కు 45 కి.మీ, నల్లగొండ నుంచి సాగర్‌కు వెళ్లే దారిలో కొండమల్లేపల్లి పట్టణం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, నల్లగొండ, సాగర్ నుంచి దేవరకొండకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. -
దేశరాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారిన వేళ..
ఒకప్పుడు మన దేశ రాజధాని కలకత్తా..తనదంతర కాలంలో అది ఢిల్లీకి మారింది. చరిత్రలో నిలిచిపోయే ఈ ఘటన ఈరోజు (డిసెంబరు 12)న జరిగింది. నాటి బ్రిటీష్ పాలకులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దేశరాజధాని కలకత్తా కాదు.. ఢిల్లీ అంటూ ఎందుకు ప్రకటించారు?అది.. 1911 డిసెంబర్ 11.. బ్రిటీష్ పాలకులు ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఢిల్లీ దర్బార్‌లో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని జార్జ్ వీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు నాటి బ్రిటీష్ అధికారులంతా సమ్మతి తెలిపారు. ఈ నేపధ్యంలో 1911, డిసెంబరు 12న ఉదయం 80 వేల మందికి పైగా ప్రజల సమక్షంలో బ్రిటన్ రాజు జార్జ్ వీ ఇకపై ఢిల్లీ భారతదేశానికి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు.రాజధాని మార్పు వెనుక రెండు కారణాలుఅయితే దీనిని అధికారికంగా అమలు చేయడం ఆంగ్లేయులకు అంత సులభం కాలేదు. ఎట్టకేలకు 1931 మార్చి నాటికి, బ్రిటీష్ హైకమాండ్ పూర్తిస్థాయిలో ఢిల్లీని రాజధానిగా అంగీకరించింది. ఈ విషయాన్ని బ్రిటీషర్లు యావత్ ప్రపంచానికి తెలియజేశారు. ఆంగ్లేయులు కలకత్తాను పక్కనపెట్టి, ఢిల్లీని రాజధానిగా చేయడం వెనుక రెండు ప్రత్యేక కారణాలున్నాయి. మొదటిది బ్రిటిష్ ప్రభుత్వ పాలనకు ముందు పలు సామ్రాజ్యాలు ఢిల్లీ నుంచి పాలన సాగించాయి. రెండవది భారతదేశంలోని ఢిల్లీ భౌగోళిక స్వరూపం. ఈ రెండు కారణాలను పరిగణలోకి తీసుకున్న ఆంగ్లేయులు ఢిల్లీ నుంచి దేశాన్ని పాలించడం సులభమని భావించారు.ఈస్ట్ ఇండియా కంపెనీ బలహీనపడటంతో..కాగా బెంగాల్ విభజన తర్వాత కలకత్తాలో పెరిగిన హింస, అల్లర్లతో పాటు బెంగాల్లో స్వరాజ్యం కోసం పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా బ్రిటీషర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నిపుణులు చెబుతుంటారు. బ్రిటీష్ వారు మొదట ఆశ్రయం పొందిన భూమి బెంగాల్ అని, ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది అక్కడేనని, అయితే కంపెనీ బలహీనపడటంతో వారు దేశరాజధానిని ఢిల్లీ మార్చారనే వాదన కూడా వినిపిస్తుంటుంది. రాజధానిని మార్చేందుకు వ్యూహాత్మకంగా భారీ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, రాజధాని మార్పు నిర్ణయం భారత్‌లోని అందరికీ అనుకూలమేనని బ్రిటీషర్లు ప్రకటించారు.1911 ఆగస్టులో అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ లండన్‌కు పంపిన లేఖలో భారత్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలంటూ పేర్కొన్నారు. 1931లో నాటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఢిల్లీని అధికారికంగా రాజధానిగా ప్రకటించారు. తరువాత వారు బ్రిటీష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్లకు ఢిల్లీ రూపకల్పన బాధ్యతను అప్పగించారు.తరగని వైభవందేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఢిల్లీని 1956లో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అయితే 1991లో 69వ సవరణ ద్వారా ఢిల్లీకి జాతీయ రాజధాని ప్రాంతం హోదాను కల్పించారు. ఢిల్లీ చరిత్ర కథ మహాభారత కాలంలో ఇంద్రప్రస్థ ప్రస్తావనతో ముడిపడివుంది. 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల పాలనలో ఉంది. తదనంతరకాలంలో సామ్రాజ్యాలు మారాయి. పాలకులు మారారు. చివరికి ప్రభుత్వాలు కూడా మారాయి. అయితే దేశ చరిత్రలో ఢిల్లీకి ఘనమైన స్థానం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: దేశగతిని మార్చిన 10 సుప్రీం తీర్పులు -
పాక్ పరువు తీసిన ‘మార్షల్ లా’కు అంత పవర్ ఉందా?
రాజకీయాలపై ఆసక్తి కలిగినవారికి ప్రపంచ రాజకీయ చిత్రం ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తుంది. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ ఉన్నట్టుండి ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలకలం చెలరేగింది. అయితే ఇంతలోనే అక్కడి పార్లమెంట్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో దానిని రద్దు చేయాల్సి వచ్చింది.చర్చనీయాంశంగా మారి..1980 తర్వాత దక్షిణ కొరియాలో మార్షల్ లా(సైనిక పాలన) విధించడం ఇదే తొలిసారి. ఈ నేపధ్యంలో మరోసారి మార్షల్ లా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఈ మార్షల్ లా చట్టాన్ని తరచూ అమలు చేసి, అపఖ్యాతి పాలయ్యింది. ఇంతకీ మార్షల్ లా అంటే ఏమిటి? అ చట్టాన్ని అమలు చేసినప్పుడు దేశంలోని పరిస్థితులు ఎలా ఉంటాయి?శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు..నిజానికి మార్షల్ లా అంటే దేశ అధికారమంతా సైన్యం చేతుల్లోకి వెళ్లడం. దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు దీనిని అమలు చేస్తారు. ఇది దేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా దేశమంతటికీ వర్తించవచ్చు. ఇది అమలైనప్పుడు పౌర పరిపాలన ముగుస్తుంది. శాంతి భద్రతల నుండి న్యాయ వ్యవస్థ వరకు సర్వం సైన్యం నియంత్రణలోకి వస్తుంది. అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న సైన్యం అవసరమని భావించిన పక్షంలో ప్రధానిని ఉరితీసే దిశగా కూడా యోచించేందుకు ఈ చట్టంలో అవకాశాలున్నాయి. ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ పర్యవేక్షణలో..ప్రజలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో మార్షల్ లా వర్తిస్తుంది. ఇది యుద్ధం, తిరుగుబాటు లేదా పెద్ద ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సంభవించవచ్చు. మార్షల్ లా అమలైనప్పుడు సైన్యం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది న్యాయపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. పాకిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మార్షల్ లా ప్రయోగించడం ఆనవాయితీగా మారింది.పాక్‌లో నాలుగు సార్లు మార్షల్ లా పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు సార్లు మార్షల్ లా విధించారు. 1958లో మొదటిసారిగా, దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పటినప్పుడు నాటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా మార్షల్ లా విధించారు. అనంతరం మిలటరీ జనరల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తదనంతర కాలంలో దేశంలో సైనిక, రాజకీయ శక్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.అడుగంటిన సామాన్యుల స్వేచ్ఛ1977, జూలై 5 న జనరల్ జియా-ఉల్-హక్ పాకిస్తాన్లో మార్షల్ లా విధించి, అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టాడు. జియా దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, తనను తాను అత్యున్నత పాలకునిగా ప్రకటించుకున్నాడు. రాజకీయ అస్థిరతతో పాటు సామాన్యుల స్వేచ్ఛ కూడా అడుగంటిపోవడంతో నాడు పాకిస్తాన్ గడ్డు రోజులను ఎదుర్కొంది. 1999లో పాకిస్తాన్లో మరోమారు మార్షల్ లా విధించారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తొలగించి, జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈసారి కూడా రాజకీయ అస్థిరతను నెపంగా చూపారు. ఇతని పాలనలో సైనిక నియంతృత్వ పోకడ చాలా కాలం పాటు దేశంపై కొనసాగింది.జర్మన్, జపాన్లలో..మరికొన్ని దేశాలలోనూ మార్షల్ లా అమలయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, జర్మన్, జపాన్లలో సైన్యం పాలనను చేపట్టింది. ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో శ్రీలంకలో, యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో మార్షల్ లా విధించారు. అయితే పదే పదే మార్షల్ లా అమలు చేస్తూ పాకిస్తాన్ అపఖ్యాతి పాలైంది. ఈ చట్టం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతగా నిర్వీర్యం చేస్తుందో పదే పదే మార్షల్ లా విధించడం చూస్తే అర్థమవుతుంది. మార్షల్ లా అమలు చేసేముందు పర్యవసానంగా వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల దక్షిణ కొరియా నిర్ణయం ద్వారా స్పష్టమైంది.ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
క్యారమ్స్ కథ గురించి తెలుసా? ఎక్కడ? ఎపుడు పుట్టింది?
ఏమీ తోచనప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆడుకునే ఆటల్లో ముఖ్యమైనది క్యారమ్స్. ఇద్దరు, నలుగురు కలిసి ఆడే ఈ ఆటంటే అందరికీ ఇష్టం. ఎవరికి ఎక్కువ కాయిన్స్ దక్కుతాయో ఎవరు రెడ్ కాయిన్స్‌ని చేజిక్కించుకుంటారో వారే ఈ ఆటలో విజేతలవుతారు. ఈ క్యారమ్స్ కథేమిటో తెలుసా?క్యారమ్స్ భారతదేశంలోనే పుట్టింది. ఎప్పుడు పుట్టిందనే సరైన లెక్కలు లేకపోయినా వందేళ్ల క్రితమే మన దేశంలోని సంపన్నుల ఇళ్లల్లో కొందరు క్యారమ్స్ ఆడేవారని అంచనా. 1935 నాటికి శ్రీలంక దేశంలో ఈ ఆటకు సంబంధించి పోటీలు ప్రారంభమయ్యాయి. 1958లో శ్రీలంక, భారత్ దేశాలు క్యారమ్స్ ఆటకు అధికారిక ఫెడరేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేశాయి. దీన్నిబట్టి అప్పటికే దేశంలో క్యారమ్స్ పాపులర్ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు. 1988లో చెన్నైలో తొలిసారి ‘అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య’ (ఐసీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ క్యారమ్స్కి సంబంధించి విధివిధానాలు రూపొందించారు. అనంతరం పలు దేశాల్లో ఫెడరేషన్లు ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలో జాతీయ ఛాంపియన్ షిప్స్ నిర్వహించడం మొదలు పెట్టారు. (పుట్టింది కెనడాలో... అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!) క్యారమ్స్ ఆడేందుకు శారీరకంగా ఇబ్బందిపడనక్కర్లేదు. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా కలిసి ఆడుకోవచ్చు. దీంతో ఈ క్యారమ్స్ చాలా ప్రసిద్ధి చెందింది. 2000వ సంవత్సరం నాటికి అనేకమంది ఇళ్లల్లోకి క్యారమ్ బోర్డులు రావడం ఇందుకు ఉదాహరణ. 73.5 సెం.మీల ఎత్తు, 74 సెం.మీల వైశాల్యం కలిగిన ఈ బోర్డు ఆడేందుకు కాకుండా చూసేందుకూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పరిమాణాన్ని అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య నిర్దేశించింది. క్యారమ్స్ ఆడేందుకు 19 కాయిన్స్, స్టైకర్ ఉండాలి. ఈ కాయిన్స్ తెలుపు, నలుపు, ఒకే ఒక్కటి మాత్రం ఎరుపురంగులో ఉంటాయి. బోర్డుపై ఆట సౌకర్యవంతంగా ఉండేందుకు బోరిక్ పౌడర్ వాడతారు. చెన్నైకి చెందిన ‘ఆంథోనీ మరియ ఇరుదయం’ అనే వ్యక్తి మన దేశంలో క్యారమ్స్ ఆటకు ప్రసిద్ధి చెందారు. రెండుసార్లు ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్ షిప్, తొమ్మిదిసార్లు నేషనల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా 1996లో ఆయనకు ‘అర్జున’ పురస్కారం ఇచ్చారు. క్యారమ్స్ కథ విన్నారుగా! ఖాళీ సమయాల్లో ఎంచక్కా ఆడుకోండి మరి! -
Sambhal Controversy: ‘అది మసీదు కాదు.. హరిహరుల ఆలయం’
మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో నలుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. అయితే ఇంతకుముందు ఈ మసీదు ప్రాంతంలో ఒక దేవాలయం ఉండేదని, దానిని కూల్చివేసి మసీదు నిర్మించారనే వాదన వినిపిస్తోంది.సీనియర్ చరిత్రకారుడు డా. అజయ్ అనుపమ్‌తో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని హరిహర దేవాలయం గురించి పలు మత గ్రంథాలలో ప్రస్తావన ఉంది. సంభాల్ పౌరాణిక చరిత కలిగిన ప్రదేశమని అన్నారు. పురాణాల్లో పేర్కొన్న విషయాలను మనం కాదనలేమని, మత్స్య పురాణం, శ్రీమద్ భగవతం, స్కంద పురాణాలలో సంభాల్ ప్రస్తావన ఉందన్నారు.పురాణాలలోని వివరాల ప్రకారం రాజు నహుష కుమారుడు యయాతి ఈ సంభల్ నగరాన్ని స్థాపించాడు. అలాగే ఇక్కడ హరిహర ఆలయాన్ని నిర్మించాడు. హరి అంటే విష్ణువు. హరుడు అంటే శంకరుడు. యయాతి తన పూజల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోందన్నారు.ఇది కూడా చదవండి: అట్టుడుకుతున్న పాక్.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి -
ఈ రాజుల విచిత్రమైన నమ్మకాలు, క్రేజీ ఆలోచనలు వింటే విస్తుపోతారు..!
మన చరిత్రలో ఘనకీర్తీ పొందిన ఎందరో గొప్ప గొప్ప రాజులను చూశాం. కొందరూ రాజుల ధైర్య సాహసాలు విన్నా..తలుచుకున్న ఒళ్లు పులకరించిపోతుంది. మనం కూడా అలానే ఉండాలనే ఫీల్ కలుగుతుంది. అంతటి మహమహా రాజుల తోపాటు కొందరూ విచిత్రమైన నియంత రాజులను కూడా ప్రజలు భరించారు. అయితే కొందరు రాజుల విచిత్ర నమ్మకాలు, భయాలు చూస్తే..వీళ్లేం కింగ్స్ రా బాబు అనుకుంటారు. ఆ విలక్షణమైన రాజులెవరంటే..?ఇంగ్లాండ్ రాజు జార్జ్ IIIఇతన్ని పాలనకు అనర్హుడిగా చరిత్రకారులు పేర్కొంటారు. అత్యంత వేగవంతంగా మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి ఒక విధమైన నురుగ వస్తుంటుంది. దీంతో అతడి చెప్పే మాటలో స్పష్టత కానరాక సేవకులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండేవారు. అతడు ప్రతిదానికి నిరుత్సాహమే చూపిస్తాడు. అప్పుడప్పుడూ మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తుంటాడు. అలాగే అతనికి కొన్ని విచిత్రమైన బ్రాంతులు కూడా ఉన్నాయి. ఒక రోజు ఓక్ చెట్టుతో కరచాలనం చేసేందుకు యత్నించి నవ్వులు పాలయ్యాడు కూడా. చివరి అతడి వింత ప్రవర్తనతో విసిగిపోయిన ప్రజలు, మంత్రులు ఆ రాజు స్థానంలో అతడి కుమారుడు జార్జ్ IVకి రాజ్యధికారాన్ని అప్పగించారు. ఫ్రాన్స్ చార్లెస్ VIఈ రాజు మరింత విచిత్రంగా ఉంటాడు. తన శరీరం గాజుతో తయారయ్యిందని అందుకే పెళుసుగా ఉందని భావిస్తుంటాడు. పైగా ఇది ఏ క్షణమైన అద్దం విరిగినట్లుగా విరిగిపోతుందేమోనని భయపడుతూ ఉంటాడు. ఈ భయంతోనే ప్రజలు తనని కనీసం తాకకుండా ఉండేలా జాగ్రత్తపడుతుంటాడు. ఆయనకు కోపం కూడా ఎక్కువే. రోజూ ఎవరోఒకరు ఆ కోపానికి బలైపోతుండేవారు. ఈ కోపంతో నిద్రలేని రాత్రుళ్లు గడిపేవాడట.నీరోరోమన్ చక్రవర్తి నీరోని కొందరూ మంచి పాలకుడని భావించగా, మరికొందరూ ఇతడు స్వప్రయోజనాలనే చూసుకునే స్వయంకుతాపరాధిగా ఆరోపణలు చేస్తున్నారు. అతని రెండో భార్య పొప్పాయా మరణించాకే.. అతడి వికృతి ప్రవర్తన పూర్తిగా బహిర్గతమైందంటారు చరిత్రకారులు. ఆయన ఒక మగవాడికి స్త్రీ వేషం వేసి, ఆమెనే తన దివగంత భార్య పొప్పియాగా చెబతుండేవాడట.ఎలాగబలస్ అకా ఆంటోనినస్ఈయన కూడా రోమన్ చక్రవర్తే. ఇతడిని నైతిక విలువలు లేని వ్యక్తిగా పరిగణిస్తారు. ప్రాణమున్న ప్రతిదానితో వివాహేతర సంబంధాలు నెరిపేవాడట. అతనికి వయసు, లింగం అనే వ్యత్యాసం లేని విచ్చలవిడితనానికి అలవాటుపడ్డ వ్యక్తి అట. అందువల్లే కేవలం 18 ఏళ్ల ప్రాయానికి హత్యకు గురయ్యి కానరాని లోకాలకు వెళ్లిపోయాడని చరిత్రకారులు చెబుతున్నారు.బవేరియా యువరాణి అలెగ్జాండ్రాఈ యువరాణి మేధావి, నవలా రచయిత్రి, వ్యాసకర్త, అనువాదకురాలు. పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే ఆమె జెర్మాఫోబియాతో బాధపడుతోంది. ఈ ఫోభియా కారణంగానే తెలుపు తప్ప తక్కిన ఏ రంగు దుస్తులను ధరించేది కాదట. ఆఖరికి వస్తువులను, వ్యక్తులను తాకడానికి అస్సలు ఇష్పడేది కాదట. అలాగే తాను చిన్నతనంలో పియానో మొత్తాన్ని మింగేసిట్లు నమ్మకంగా చెబుతుంటుంది. ఇంత మేధావి అయినా ఆమెకున్న భయాలు కారణంగా రాజ్యంలోని ప్రజలు ఆమె తీరుని చూసి నవ్వుకోవడమే గాక విచిత్రమైన యువరాణి అని కథలు కథలుగా చెప్పుకునే వారట.(చదవండి: మంత్రదండంలాంటి ఉంగరం..!) -
వీడియో గేమ్స్ చరిత్ర తెలుసా?
పిల్లలూ! వీడియో గేమ్స్ ఆడటమంటే మీకు చాలా ఇష్టమా? సెలవుల్లో ఇంట్లో కూర్చుని గంటల తరబడి ఆడుతుంటారా? మరి వాటి చరిత్రేమిటో తెలుసుకుందామా?వీడియో గేమ్స్ పుట్టి దాదాపు 66 ఏళ్లు దాటుతోంది. 1958లో విలియం ఆల్ఫ్రెడ్ హిగిన్ బోతమ్ అనే అమెరిన్ భౌతిక శాస్త్రవేత ‘టెన్నిస్ ఫర్ టూ’ అనే వీడియోగేమ్ తయారు చేశారు. 1960 తర్వాత కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న సమయంలో కంప్యూటర్ శాస్త్రవేత్తలు గ్రాఫిక్స్ ఆధారంగా గేమ్స్ తయారు చేశారు. అనంతరం 1962లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ‘స్టార్‌వార్’ అనే వీడియో గేమ్ తయారు చేశారు. ఆ తర్వాత 1970లో ఇళ్లల్లో వీడియో గేమ్స్ ఆడుకునేందుకు గేమ్ కన్సోల్‌ని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ వీడియో గేమ్స్ అమెరికా అంతటా ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలు సైతం కొత్తగా వీడియోగేమ్స్ తయారు చేశాయి.వీడియో గేమ్స్ ప్రధానంగా పిల్లల కోసమే తయారు చేసినా పెద్దలు కూడా వీటిని ఇష్టపడుతున్నారని కంపెనీలు గుర్తించాయి. మరిన్ని కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఒకానొక దశలో చాలా గేమ్స్‌కి కాపీలు, పైరసీ వెర్షన్లు వచ్చేశాయి. దీంతో జనానికి నాణ్యమైన గేమ్స్ అందుబాటులో లేకుండా ΄ోయాయి. 1983 నుంచి 1985 మధ్యలో అమెరికాలోని వీడియో గేమ్స్ తయారీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఆ తర్వాత వీడియో గేమ్స్ మార్కెట్లోకి జ΄ాన్ దూసుకొచ్చింది. కొత్త కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెస్తూ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడేలా చేసింది. దీంతో సంస్థలు కొత్త టెక్నాలజీ ఉపయోగించి మరిన్ని నాణ్యమైన, క్రియేటివ్ గేమ్స్ తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇంటర్నెట్ వాడకం మొదలయ్యాక వీడియోగేమ్స్ మరింతగా అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్ వచ్చాక అందరూ సులభంగా వీడియో గేమ్స్ ఆడేస్తున్నారు. వీటికోసం ప్రత్యేకమైన యాప్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్స్ మార్కెట్ రూ.1.5 లక్షల కోట్లతో నడుస్తోంది. వేల మంది ఈ రంగంలో పని చేస్తున్నారు. వీడియో గేమ్స్ తయారు చేసేందుకు ప్రత్యేకంగా గేమ్ డిజైనర్లు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రెండు వేల వీడియో గేమింగ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో వీడియో గేమింగ్ తయారీ గురించి నేర్పిస్తారు. వీడియో గేమ్స్‌లో ఎక్కువమంది యాక్షన్, స్పోర్ట్స్, సాహసయాత్రలు వంటివి ఇష్టపడుతుంటారుఅయితే చదువు పక్కన పెట్టి వీడియో గేమ్స్ ఆడటం ఏమాత్రం మంచిది కాదు. గంటల తరబడి ఆడటం కూడా చాలా ప్రమాదకరం. అదొక వ్యసనం అవుతుంది. రాత్రి పగలూ ఆడాలనిపిస్తుంది. భవిష్యత్తుకే ప్రమాదం. కాబట్టి సెలవు రోజుల్లో కొద్దిసేపు మాత్రమే వీడియో గేమ్స్ ఆడండి. సరేనా? -
రాజసం... గద్వాల సంస్థానం
గద్వాల: కవులు.. కట్టడాలకు పేరుగాంచిన గద్వాల సంస్థానం వైభవం నేటికీ చెక్కుచెదరలేదు. రాజసానికి నిలువెత్తు నిదర్శనమైన గద్వాల సంస్థానం ఏర్పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరం. నిజాం సంస్థానంతోపాటు 1948లో భారత యూనియన్‌లో విలీనమైన గద్వాల సంస్థానంపై సవివర కథనమిది. నల సోమనాద్రి ఆధ్వర్యంలో ఆవిర్భావం నల సోమనాద్రి (పెద సోమభూపాలుడు) క్రీస్తుశకం 1663లో గద్వాల మండలం పూడూరు కేంద్రంగా గద్వాల సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. నాటినుంచి 1948 వరకు ఆయన వారసులు పాలన కొనసాగించారు. నలసోమనాద్రి 1663–1712 వరకు, తర్వాత కల్లా వెంకటన్న క్రీ.శ. 1712– 1716 వరకు, రమణయ్య క్రీ.శ. 1716– 1723 వరకు, తిమ్మక్క క్రీ.శ. 1723– 1725 వరకు, లింగమ్మ క్రీ.శ. 1725– 1740 వరకు, తిరుమలరావు క్రీ.శ. 1740– 1742 వరకు, మంగమ్మ క్రీ.శ. 1742– 1745 వరకు, చొక్కమ్మ క్రీ.శ. 1745– 1747 వరకు, రామరాయలు క్రీ.శ. 1747– 1761 వరకు, చినసోమభూపాలుడు– 2 క్రీ.శ. 1761– 1794 వరకు, రామభూపాలుడు–1 క్రీ.శ. 1794– 1807 వరకు, సీతారామభూపాలుడు–1 క్రీ.శ. 1807– 1810 వరకు, వెంకటలక్ష్మమ్మ క్రీ.శ. 1840– 1840 (4 నెలలు), సోమభూపాలుడు– 3 క్రీ.శ. 1840– 1844, వెంకటలక్ష్మమ్మ (మరల) క్రీ.శ. 1844–1845, రామభూపాలుడు–2 క్రీ.శ. 1845– 1901 వరకు, సీతారామభూపాలుడు– 2 క్రీ.శ. 1901–1924 వరకు, ఆ తర్వాత చివరి తరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ క్రీ.శ. 1924–1948 వరకు పాలన కొనసాగించారు. విద్వత్కవులకు పేరు.. గద్వాల సంస్థానం కవులకు పేరుగాంచింది. నలసోమనాద్రి, చినసోమభూపాలుడు, రామభూపాలుడు–2, సీతారామభూపాలుడు–2, మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ తదితరులు కవులకు పెద్దపీట వేసినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరి పాలనలోనే గద్వాల సంస్థానం విద్వత్కవుల ప్రాంతంగా వరి్ధల్లింది. వీరి పాలనలో సంస్థాన కవులు, సంస్థాన ప్రాంత నివాస కవులు, సంస్థానేతర ఆశ్రిత కవులకు ఆశ్రయమిచ్చి గద్వాల సంస్థాన ప్రాశస్త్యాన్ని నలుమూలలా చాటినట్లు చెబుతారు. ఈ కవులు రచించిన పద్యాలలో చాటు పద్యాలు ప్రత్యేకంగా గుర్తింపు సాధించాయి.చెక్కుచెదరని నాటి కట్టడాలు నలసోమనాద్రి కాలం పాలన మొదలుకొని చివరితరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ కాలం వరకు నిర్మించిన వివిధ కట్టడాలు, భవనాలు, బావులు నేటికీ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నాటి భవనాలు రాజుల అభిరుచికి, నాటి వైభవాన్ని గుర్తు చేస్తూ.. చెక్కు చెదరకపోవడం విశేషం.గద్వాల కోటలో డిగ్రీ కళాశాల, ఆలయం.. రాజులు పాలన సాగించిన ప్రధాన గద్వాల కోటలో ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చెన్నకేశవస్వామి ఆలయాలున్నాయి. కోట లోపలి భాగం చాలా వరకు శిథిలావస్థకు చేరి కూలిపోగా.. ముఖద్వారం, కోట చుట్టూ భాగాలు నేటికీ పర్యాటకులకు కనువిందు చేస్తాయి.చెక్కుచెదరని ఫిరంగిరాజులు యుద్ధ సమయంలో వినియోగించే ఫిరంగి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీనిని ప్రస్తుతం గద్వాల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో లింగమ్మ (1725– 1740), (1745– 1747) బావులు గత పాలన చిహ్నాలుగా ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రస్తుత పాలకులు ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఏటా జరిగే గద్వాల జాతర సందర్భంగా తెప్పోత్సవాలు ఈ బావుల్లోనే నిర్వహిస్తారు.మహారాజా మార్కెట్.. సంస్థానంలోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు మొదలుకొని.. మిగతా అన్ని రకాల వస్తువులు మహారాజా మార్కెట్లోనే లభించేవి. రైతులు పండించే పంట ఉత్పత్తులు కూడా ఇక్కడ విక్రయించేవారని చరిత్రకారులు చెబుతారు. మహారాజా మార్కెట్ చిహ్నం చాలా భాగం ధ్వంసమైనప్పటికీ.. దాని ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి.కృష్ణారెడ్డి బంగ్లా ప్రత్యేకం నలసోమనాద్రి నిర్మించిన (ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కాలేజీ) కోటలోనే రాజవంశీయులు కలిసి జీవించేవారు. అయితే 1924లో సీతారామభూపాలుడు–2 మృతి చెందడంతో.. ఆయన భార్య మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ పాలన పగ్గాలు చేపట్టారు. సీతారామభూపాలుని సోదరుడు వెంకటకృష్ణారెడ్డికి అప్పటి పాలకులతో మనస్పర్థలు ఏర్పడి.. మాట పట్టింపుతో గద్వాల కోటను దాటి కృష్ణారెడ్డి బంగ్లాను నిర్మించుకున్నారు. ఈయన రాజవంశీయుల చివరితరం పాలనలో రెవెన్యూ, భూ పరిపాలన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ భవనంలోనే చిరంజీవి హీరోగా నటించిన ‘కొండవీటిరాజా’ సినిమా షూటింగ్ చేశారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎస్ఈ కార్యాలయం, భూసేకరణ కార్యాలయం ఇక్కడే కొనసాగాయి. గద్వాల బ్లాక్ సమితి కార్యాలయం, అనంతరం ఏర్పడిన మండల రెవెన్యూ కార్యాలయం కూడా చాలాకాలం పాటు ఇక్కడే కొనసాగింది. రాజావారి బంధువులు నేటికీ ఈ భవనంలోనే జీవనం కొనసాగిస్తుండగా.. మరికొంత భాగంలో ఎంబీ హైసూ్కల్, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలున్నాయి. ఎండాకాలం, చలికాలం, వానాకాలంలో కూడా ఒకేరకమైన వాతావరణం ఉండేలా ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. -
నోరూరించే కేక్ వెనుక ఇంత హిస్టరీ ఉందా? ఇంట్రస్టింగ్ స్టోరీ
పుట్టిన రోజంటే కేక్ కోయాల్సిందే! ఏదైనా వేడుక జరిగినా కేక్ కోయడం తప్పనిసరి. లోపల బ్రెడ్‌తో, పైన క్రీమ్‌తో నోరూరించే కేక్ అంటే అందరికీ ఇష్టమే. అయితే ఈ కేక్ చరిత్రేమిటో తెలుసుకుందామా?కేక్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో ఈజిప్టులో కేక్ తయారు చేసినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ మనం చూసే కేక్‌కు భిన్నంగా తేనె, గోధుమపిండితో దాన్ని తయారు చేసేవారు. అప్పట్లో సంపన్నులు వారింటి వేడుకల్లో అతిథులకు కేక్‌ను ఇచ్చేవారని, కేక్ రుచికరంగా మారేందుకు తేనె, తృణధాన్యాలు వాడేవారని చరిత్రకారులు అంటున్నారు. రోమ్ సామ్రాజ్యంలో సైతం కేక్ తయారీ ఉందని చరిత్ర చెబుతోంది. అప్పట్లో కేక్‌లు తయారు చేసి పూలు, ఇతర ఆకులతో అలంకరించేవారు. అందువల్లే ఆ కాలంలో అవి ఆలివ్ కేక్, ప్లమ్ కేక్‌గా ప్రసిద్ధి పొందాయి. మొదట్లో కేక్ తయారీకి తేనె వాడేవారు. చక్కెర అందుబాటులోకి వచ్చిన తర్వాత చక్కేతో తయారుచేయడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో చక్కెర ఖరీదైన వస్తువు కావడం వల్ల కేక్‌లు కేవలం సంపన్నవర్గాల వారికే పరిమితమయ్యేవి. పుట్టినరోజులు, పెళ్లిరోజుల సమయంలో కేకు కోసి అందరికీ పంచడం అప్పట్లో ఆనవాయితీగా మారి నేటికీ కొనసాగుతోంది. 1764లో డాక్టర్ జేమ్స్ బేకర్, జాన్ హానోన్ కలిసి కోకో గింజలను పొడి చేసి పేస్ట్‌లా మార్చి తొలిసారి చాక్లెట్ కేక్ తయారు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న కేక్ రూపానికి వారు అంకురార్పణ చేశారు. దీంతో కేక్‌ను వివిధ పదార్థాలతో తయారు చేయొచ్చన్న ఆలోచన అందరికీ వచ్చింది. ఆ తర్వాత 1828లో డచ్‌కు చెందిన శాస్త్రవేత్త కోయెనెరాడ్ జోహన్నెస్ వాన్ హౌటెన్ కోకో గింజల్లో పలు రకాల పదార్థాలు కలిపి, అందులోని చేదును ΄ోగొట్టి కేక్‌ను మరింత రుచికరంగా తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వంటవాళ్లు మరిన్ని ప్రయోగాలు చేసి రకరకాల ఫ్లేవర్లలో కేక్‌లు తయారుచేయడం మొదలుపెట్టారు. అందులో గుడ్డు, చక్కెర, వైన్, బాదం, జీడిపప్పు వంటివి కలిపి సరికొత్త ప్రయోగాలు చేశారు. 1947 తర్వాత మైక్రోవేవ్ అవెన్స్ రావడంతో కేక్‌ను బేక్ చేసే ప్రక్రియ సులభంగా మారింది. ప్రస్తుతం వందలాది ఫ్లేవర్లలో కేక్‌లు దొరుకుతున్నాయి. గుడ్డు తినడం ఇష్టపడని వారికోసం ‘ఎగ్‌లెస్ కేక్’ తయారుచేస్తున్నారు. రోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేక్‌లు తయారై అమ్ముడు΄ోతున్నాయి. -
World Pneumonia Day: చిన్నారుల మరణాలకు కారణంగా నిలుస్తూ..
ఈరోజు (నవంబర్ 12) ప్రపంచ న్యుమోనియా దినోత్సవం. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు కారణంగా నిలుస్తూ, అన్ని వయసులవారినీ ప్రభావితం చేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య న్యుమోనియా. ఈ వ్యాధిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రపంచ న్యుమోనియా దినోత్సవం నిర్వహిస్తున్నారు.న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల ఇది సోకుతుంది. న్యుమోనియాను ప్లూరిసీ అని కూడా అంటారు. పిల్లలు లేదా వృద్ధులు ఎవరికైనా ఈ వ్యాధి సొకే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపిన వివరాల ప్రకారం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 7,40,000 మంది ఐదేళ్లలోపు చిన్నారులు న్యుమోనియాతో మృత్యువాత పడ్డారు.న్యుమోనియా వ్యాధి ముప్పును తగ్గించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చైల్డ్ న్యుమోనియాకు వ్యతిరేకంగా, ఈ వ్యాధిని నియంత్రించే దిశగా జరిగే ప్రచార కార్యక్రమంలో వందకుపైగా సంస్థలు పాల్గొంటున్నాయి. స్టాప్ న్యుమోనియా సంస్థ అంచనా ప్రకారం 2009లో 6,72,000 మంది పిల్లలు సహా దాదాపు 2.5 మిలియన్ల మంది న్యుమోనియా బారినపడి మరణించారు.ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని 2009, నవంబర్ 12న గ్లోబల్ కోయలిషన్ ప్రారంభించింది. 2030 నాటికి న్యుమోనియా మరణాల సంఖ్యను సున్నాకి తగ్గించడమే ఈ దినోత్సవ లక్ష్యం. న్యుమోనియా చికిత్స అందించగల వ్యాధి. అయితే ఈ వ్యాధి విషయంలో అధిక మరణాల రేటు నమోదవుతోంది. ఈ ప్రాణాంతక శ్వాసకోశ రుగ్మతపై పోరాడటం, పిల్లలు, పెద్దలలో మరణాల రేటును తగ్గించడం అత్యవసరమని వైద్య నిపుణులు గుర్తించారు. న్యుమోనియా కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంటుంది. అందుకే దీనిని తొలి దశలోనే గుర్తించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో న్యుమోనియాను తేలిగ్గా గుర్తించొచ్చు. చిన్నారుల్లో ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే పెద్దలు అప్రమత్తం కావాలి. ఊపిరితిత్తుల్లోని ఈ వైరస్ శరీరమంతటా వ్యాపించడానికి రోజుల నుంచి వారాల వరకు పట్టవచ్చు. బ్యాక్టీరియా కారణంగా సోకే న్యుమోనియాకు యాంటీబయోటిక్స్ ద్వారా చికిత్స అందించవచ్చు. న్యుమోనియా తీవ్రం అయినప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరాలి. అధికంగా విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం లాంటి ఉపశమన చర్యలతో న్యుమోనియా నుంచి త్వరగా కోలుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు... -
బుల్లి డిజైనర్ బ్రూక్...
స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఆ అమ్మాయి ఫ్యాషన్ షోగా భావించేది. పోటీదారులకు దుస్తుల డిజైనింగే కాదు స్టయిలింగ్ కూడా చేసేది! ఫ్యాషన్ మీద ఆమెకున్న ఇష్టాన్ని అమ్మ, అమ్మమ్మ కూడా గుర్తించి, ప్రోత్సహించడంతో అతి చిన్న వయసులోనే పలువురు మెచ్చే ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది! బ్రాండ్నీ క్రియేట్ చేసింది! ఆ లిటిల్ స్టయిలిస్టే బ్రూక్ లారెన్ సంప్టర్.బ్రూక్ లారెన్ సంప్టర్ చిన్నప్పటి నుంచి దుస్తులు, నగలు, పాదరక్షలు.. ఏవైబుల్లి డిజైనర్ బ్రూక్...నా సరే తనకిష్టమైనవే వేసుకునేది. బర్త్‌డేలు, పండుగలప్పుడే కాదు మామూలు రోజుల్లోనూ అదే తీరు! ఇంకా చెప్పాలంటే నైట్ గౌన్స్ పట్ల కూడా శ్రద్ధ చూపేది. ఈ తీరును మొదట్లో వాళ్లమ్మ ఎర్రిస్ ఆబ్రీ.. కూతురి మొండితనంగా భావించింది. కానీ రెండేళ్ల వయసు నుంచే బ్రూక్ తనకి స్టయిలింగ్‌లో సలహాలు ఇవ్వటం, ఫ్రెండ్స్ కోసం పిక్నిక్ టేబుల్, ఫ్లవర్ పాట్స్, గిఫ్ట్ బాక్స్‌ను డిజైన్ చేయడం వంటివి చూసి.. కూతురిలో ఈస్తటిక్ సెన్స్, క్రియేటివిటీ మెండు అని గ్రహించింది. బ్రూక్ చూపిస్తున్న ఆసక్తిని ఆమె అమ్మమ్మా గమనించి మనమరాలికి దుస్తులు కుట్టడం నేర్పించింది. దాంతో స్కూల్ నుంచి రాగానే ఫ్యాబ్రిక్‌ని ముందేసుకుని డిౖజñ న్ చేయడం మొదలుపెట్టేది. అలా కేవలం ఐదేళ్ల వయసులోనే బ్రూక్ తన మొదటి ఫ్యాషన్ షోను నిర్వహించింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో రెండు కుట్టుమిషన్లను కొనిపించుకుంది. అమ్మా, అమ్మమ్మను తన అసిస్టెంట్లుగా పెట్టుకుంది. వందకు పైగా డిజైన్స్‌ను క్రియేట్ చేసేసింది. అవి ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2022 చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఎమ్మీ అవార్డు వేడుక కోసం ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, నటి తబితా బ్రౌన్కి బ్రూక్ సంప్టర్ ఒక అందమైన గౌన్‌ను డిజైన్ చేసింది. దీంతో ఎమ్మీ వేడుకల కోసం దుస్తులను డిజైన్ చేసిన అతి పిన్న వయస్కురాలిగా బ్రూక్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు. బార్బీ సంస్థకు బేస్ బాల్ బార్బీ, ఫొటోగ్రాఫర్ బార్బీ అనే రెండు థీమ్ డిజైన్స్‌నూ అందించింది. ఈ మధ్యనే తన పేరు మీద ‘బ్రూక్ లారెన్’ అనే ఫ్యాషన్ బ్రాండ్‌నూ స్థాపించింది. ఇప్పుడు ఆ బ్రాండ్ టర్నోవర్ కోటి డాలర్లకు (రూ.84 కోట్లు) పైమాటే! చిన్నపిల్లల కోసం ఈ బ్రాండ్.. చక్కటి దుస్తులను డిజైన్ చేస్తోంది. ఇవి ఎంత ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయో అంతే కంఫర్ట్గానూ ఉంటాయి. అదే బ్రూక్ ‘బ్రాండ్’ వాల్యూ! కొన్ని నెలల కిందటన్ బ్రూక్ ‘టామ్రాన్ హాల్’ షోలోనూ కనిపించింది. అందులో తన డిజైన్స్, ఫ్యాషన్ పరిశ్రమలో తనకెదురైన అనుభవాలు, సాధించిన విజయాలను వివరించింది. కలను సాకారం చేసుకోవడానికి కావాలసింది పట్టుదల అని, లక్ష్య సాధనలో వయసు ఏ రకంగానూ అడ్డు కాదని నిరూపించింది బ్రూక్ లారెన్. స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో గెలవటం కంటే ఆడియన్స్ నా డిజైన్స్‌ను చూసి, కేరింతలతో ఇచ్చే ప్రశంసలే నాకు ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఆ పోటీల్లో నాతో పాటు నా ఫ్రెండ్స్‌కీ డ్రెసెస్ డిజైన్ చేసేదాన్ని.– బ్రూక్ లారెన్ సంప్టర్ -
నోరూరించే చాక్లెట్ల చరిత్ర తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
క్యాడ్బరీ డైరీమిల్క్, ఫైవ్‌స్టార్, కిట్‌కాట్, జెమ్స్... చెబుతుంటేనే నోరూరి΄ోతోంది కదా. అమ్మానాన్నలు ఏదైనా పని చె΄్పాలంటే ‘చేశావంటే చాక్లెట్ ఇస్తా’ అంటుంటారు. నోట్లో వేసుకోగానే కరిగి΄ోయే చాక్లెట్లంటే చిన్నపిల్లలకే కాదు, పెద్దలకూ ఇష్టమే. ఈ చాక్లెట్లకు దాదాపు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో అమెరికాలో చాకో చెట్లను తొలిసారి గుర్తించారు. ఆ చెట్టు పళ్లలోని గింజల నుంచి రసం తీసి తాగడం అలవాటు చేసుకున్నారు. రుచికరమైన ఆ రసం అందరికీ తెగ నచ్చింది. దీంతో కోకో చెట్టును దైవప్రసాదంగా భావించేవారు. ప్రధాన వేడుకల్లో ఈ చెట్లను కానుకలుగా ఇచ్చేవారు. డబ్బు చలామణీ లేని ఆ కాలంలో ఈ చెట్టునే విలువైన వస్తువుగా భావించేవారు. ఆ తర్వాత 1519లో స్పెయిన్ దేశస్థులు ఆ చాకో చెట్టు రసాన్ని తమ దేశానికి తెచ్చారు. అక్కడే మొదటిసారి ఆ రసానికి ‘చాకొలేట్’ అనే పేరు పెట్టారు. అక్కడి నుంచి అది యూరప్ ప్రాంతానికి పరిచయమై ప్రాధాన్యాన్ని పొందింది. వందల ఏళ్లపాటు రసంగానే ఉన్న ఆ ద్రవం 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ అనంతరం బిళ్లల రూపంోకి మారింది. ఆ రసంలో మరిన్ని కొత్త దినుసులు కలిపి కొత్త తరహా రుచుల్ని తీసుకొచ్చారు. 1819లో స్విట్జర్ల్యాండ్ దేశంలో ‘ఫ్రాంకోయిస్ లూయిస్ కైల్లర్’ తొలిసారి చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ మొదలు పెట్టారు. ‘స్విస్ చాక్లెట్’ సృష్టికర్త ఆయనే. ఇప్పటికీ కైల్లర్ బ్రాండ్ చాక్లెట్ ప్రపంచంలోనే శ్రేష్ఠమైన చాక్లెట్.మొదట్లో ఒకే రంగులో ఉండే చాక్లెట్లు ఆ తర్వాత కొత్త కొత్త రంగులతో మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ల వ్యాపారం లక్షల కోట్ల ఆదాయంతో నడుస్తోంది. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, చిన్నారులకు వేడుకలు... ఇలా ఏ శుభకార్యం జరిగినా చాక్లెట్లు ఉండాల్సిందే అనేంతగా పేరు పొందాయి. అయితే మీకు చాక్లెట్లంటే ఎంత ఇష్టమున్నా వాటిని ఎక్కువగా తింటే అనేక సమస్యలు వస్తాయి. తరచూ చాక్లెట్లు తింటే పళ్లు పాడవుతాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రమే చాక్లెట్లు తినండి. ఇది కూడా చదవండి: ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే! -
Internet Day: మొదటి ఎలక్ట్రానిక్ సందేశం చేరిందిలా..
ఈ రోజు (అక్టోబర్ 29) అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం. ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగానికున్న ప్రాధాన్యతను గుర్తు చేసుకునేందుకే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1969, అక్టోబర్ 29న ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్‌కు మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపారు. నాడు ఇంటర్నెట్ను అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్(ఆర్పానెట్) అని పిలిచేవారు.ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కనెక్ట్ చేసింది. ఎటువంటి సమాచారాన్నయినా తక్షణమే అందుకునేలా చేసింది. వివిధ రంగాలలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికింది. మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని 1969లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన చార్లెస్ .. స్టాన్ఫోర్డ్ పరిశోధనా సంస్థకు పంపారు. ఇది గ్లోబల్ నెట్వర్క్ అభివృద్ధికి పునాది వేసింది. అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరపుకుంటున్నారు.అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా, ఇంటర్నెట్ చరిత్రకు సంబంధించిన అంశాలను వివిధ పత్రికల్లో ప్రచురిస్తుంటారు. టెక్ ఔత్సాహికులు ఈరోజున కొత్త ఆన్లైన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు వర్చువల్ సెమినార్లు ఏర్పాటు చేస్తారు. నేడు పాఠశాలలలో పాటు వివిధ సంస్థలలో డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, ఇంటర్నెట్ భవిష్యత్తుపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.ఇది కూడా చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో.. -
చరిత్ర సృష్టించిన అందాల రాణి
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్‌ను సాధించి రాచెల్ గుప్తా (20) చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో ఈ కిరీటాన్నిదక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. సుమారు 70కిపైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి భారతదేశానికి టైటిల్‌ను అందించింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. రేచల్ విజయం యవద్దేశం గర్వించేలా చేసిందని కుటుంబ సభ్యుడు తేజస్వి మిన్హాస్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకాక్ MGI హాల్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో రాచెల్ గ్ర్యాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్‌కి చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. అలాగే 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఇకపై రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది. ఈ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించడమే కాదు, 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్ లారాదత్తా సరసన చేరింది. కాగా రాచెల్ ఆమె మాడెల్, నటి వ్యాపారి. ఇన్‌స్టాగ్రామ్‌లో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఆమె సొంతం. -
బొమ్మలు చెప్పే చరిత్ర..!
భావాన్ని వ్యక్తపరచడానికి భాషే అవసరం లేదు, సంజ్ఞ చాలు! కళలో ప్రావీణ్యం ఉంటే గనుక అదొక అద్భుతమే! ఆ అద్భుతం పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేట గిరిజనుల సొంతం! ఆదిమానవుడు తన బతుకు చిత్రాన్ని బొమ్మలతోనే చూపించాడు. అదే భావితరాలకు చరిత్రగా నిలిచింది. ఆ కళ నేటికీ ఉనికిలో ఉంది..ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో! పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలోని సవర తెగకు చెందిన గిరిజనులు తమ జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను గీతల బొమ్మలతోనే అభివర్ణిస్తారు. అదే సవర చిత్రకళ! ప్రకృతిని దైవంగా కొలిచే గిరిజనులు అటవీ ఉత్పత్తుల దగ్గర్నుంచి పంట చేతికందే వరకు ప్రతిదశనూ పండుగలా జరుపుకుంటారు. ఆ క్రమంలో టెంక పండుగ, విత్తనాల పండుగ, పుష్పి పండుగ, గాటి వారాలు, పులి పండుగ, ఆగం పండుగ, అమ్మవారి పండుగ, సంబరాలు (ఇంటి పండుగ), కొత్త అమావాస్య, గొడ్డాలమ్మ (కంది పండుగ), కొర్ర కొత్త పండుగ, కొండెం కొత్త పండుగ, ఉజ్జీడమ్మ తల్లి పండుగ వంటి పర్వదినాల్లో ఇళ్లు, ముంగిళ్లు, చెట్లు, తోటలు, ఆలయాలను సవర చిత్రకళతో అద్భుతంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ చిత్రాలకు ఉపయోగించే ప్రతీది సహజసిద్ధమైందే. వరి, బొగ్గు, మట్టి, ఇటుక బెడ్డ రాయి, పసుపు, చెట్టు బెరడును ఉపయోగించి బొమ్మలు వేస్తారు. ఈ చిత్రకళ సుమారు మూడువేల ఏళ్ల కిందటిది. మధ్యప్రదేశ్‌లోని భీమ్ భేట్కా గుహల్లో గుర్తించిన ఆదీవాసీ చిత్రాలను ఈ కళకు తొలి ఉదాహరణలుగా చెబుతున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. భాష లేని ఆ కాలంలో భావాలను వ్యక్తపరచడానికి ఆనాటి మానవుడు తనలోని సృజనకు పదునుపెట్టి ఆ చిత్రాలను గీసినట్టు తేల్చారు. సవర చిత్రకళను కాపాడుకోవడానికి ఉత్సాహవంతులకు శిక్షణనూ అందిస్తున్నారు.కార్డులను అందజేస్తున్నాం..ఈ కళను సవర తెగకు చెందిన గిరిజనులు కాలానుగుణంగా అభివృద్ధిచేస్తూ బతికిస్తున్నారు. దాదాపు 500 మంది కళాకారులకు ఇదే జీవనోపాధి. రెండేళ్లుగా నేను, గౌరీశ్ మాష్టారు గిరిజన ప్రాంతాలన్నీ తిరుగుతూ సవర చిత్రకళాకారులను గుర్తిస్తూ, వారికి లేపాక్షి అధికారుల సాయంతో హస్తకళ(డీసీహెచ్) కార్డులను అందజేస్తున్నాం.బేతాళ అనిల్‌కుమార్, హస్తకళల రిసోర్స్‌పర్సన్, పాలకొండవస్తువుల మీదా బొమ్మలు..మా నాన్నకు సవర చిత్రకళలో మంచి నైపుణ్యం ఉంది. ఆయన మా ఇంటి గోడలపై బొమ్మలు వేస్తుండటం చూసి నాకూ దానిపట్ల ఆసక్తి పెరిగింది. సవర ఆదివాసీ డ్రాయింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. గోడలు, కాగితాల మీదే కాదు వస్తువుల మీదా బొమ్మలు వేస్తాను. లేపాక్షి ద్వారా మాలాంటి యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం జరగాలి.గేదెల శంకర్, సవర చిత్రకళాకారుడుఅదొక వరం కేవలం గీతలతోనే సందర్భానికి తగిన సన్నివేశాన్ని గీయడం గొప్ప నైపుణ్యం. ఆదొక వరం. డిగ్రీ చదివిన నాకు సరైన ఉద్యోగం లేకపోడంతో చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న ఈ కళే కొంతవరకు ఉపాధినిస్తోంది.సవర నరేష్, జగత్పల్లి గ్రామం, సీతంపేటం మండల యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి(చదవండి: పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..) -
Valmiki Jayanti 2024 ఆది స్మరణీయుడు
జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు, మూర్తీభవించిన ధర్మతేజం శ్రీరాముని దివ్యచరిత్రను, శ్రీరామ నామ మాధుర్యాన్ని మన కందించిన కవికోకిల, ఆది కవి వాల్మీకి మహర్షి చిరస్మరణీయుడు. శ్రీరాముని దివ్యచరితాన్ని కావ్య రూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాల్లో గుబాళింప చేసిన వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యాన్ని అందించారు. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరచాడు. శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్ర ధర్మం, భత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు. ఆధునిక సమాజంలో మనం ఉపయోగించే ప్రసార కౌశలాలు, కార్యనిర్వహణ కౌశలాలు, ప్రశాసనం, నగర, గ్రామీణ నిర్మాణ యోజన, సార్థకమైన వ్యూహరచనా నిర్మాణం, ఆంతరిక రక్షణా పద్ధతి, యుద్ధ వ్యూహరచన మొదలైనవాటికి రామాయణ రచన నిధి వంటిది.ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి సదావందనీయుడు. ప్రతి ఒక్కరూ రామాయణ కావ్యం చదివి అందులోని నీతిని అవలోకనం చేసుకుని, అందులో కొంతయినా ఆచరించ గలిగితే ఆ మహాకవి ఋణం తీర్చుకున్నట్లే. -
World Food Day 2024 : ఆహార భద్రత ఏదీ?
1945లో ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) స్థాపన తేదీని గుర్తుచేసుకోవడానికి అక్టోబర్ 16న ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ జరుపుకొంటున్నాం. ఆకలి, ఆహార భద్రతకు సంబంధించిన ఇతర సంస్థలు... ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి వంటివి ఈ రోజును ఘనంగా జరుపుకుంటాయి.ఆకలిని ఎదుర్కోవడానికి, సంఘర్షణ ప్రాంతాలలోశాంతికి దోహదపడటానికి, యుద్ధం సంఘర్షణలకు ఆకలిని ఉపయోగించడాన్ని ఆపడంలో ప్రముఖ పాత్ర పోషించినందుకు ప్రపంచ ఆహార కార్యక్రమం 2020లో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ‘ప్రపంచ ఆహార దినోత్సవం 2024’ యొక్క సారాంశం ‘మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ఆహార హక్కు’. 2022 నివేదిక ప్రకారం ఆహార భద్రత కలిగిన మొదటి ఐదు దేశాలు ఫిన్లాండ్, ఐర్లాండ్, నార్వే, ఫ్రాన్స్, నెదర్లాండ్‌లు. అత్యంత ఆహార అభద్రత ఉన్న దేశాలు యెమెన్, హైతీ, సిరియాలు. భారతదేశంలో ఆహార భద్రత ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. 2022లో, ప్రపంచ ఆహార భద్రతా సూచిక పరంగా 113 ప్రధాన దేశాలలో భారత దేశానికి 68వ స్థానాన్ని ఇచ్చింది. 2024లో, ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ –2024) ప్రకారం 127 దేశాలలో భారతదేశం 27.3 స్కోరుతో 105వస్థానంలో ఉంది. దేశంలో 27 కోట్ల మందిఆకలితో ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ జనాభాలో అధిక భాగం వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, దేశంలో పెరుగుతున్న జనాభా కారణంగా అందరికీ ఆహారం లభించడం సవాలుగా ఉంది. కరవు, వరదల అస్థిర చక్రాలను దేశం అనుభవిస్తున్నందున, వాతావరణ మార్పుల కారణంగా భారతదేశం ఆహార భద్రత ముప్పులో ఉంది. దేశంలో సగటు కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం మాత్రమే నమోదవుతున్నప్పటికీ, అవపాతం హెచ్చుతగ్గులు వివిధ ప్రాంతా లలో తీవ్రంగా మారుతూ పంటలను అస్థిరపరుస్తున్నాయి. ఆహార భద్రతను మెరుగుపరచడానికి... ఆహారాన్ని వృధా చేయడాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, న్యాయమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహించడం, వైవిధ్యంపై శ్రద్ధ చూపడం, దిగుబడి అంతరాన్ని తగ్గించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఆహార అభద్రతకు పరోక్ష కారణాలను పరిష్కరించడం వంటి మార్గాలు అవసరం.– డా. పి.ఎస్. చారి మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్, తిరుపతి