1780 కాలం
ఫ్రెంచ్ దేశస్తుడు జోసెఫ్ మాంట్గోల్ఫియర్, అతని తమ్ముడు ఎతియన్ ఓసారి మంటలోంచి పుట్టిన పోగ పైకిపోతూ దాంతో పాటు చిన్న తేలికైన వస్తువులని మోసుకుపోవడం గమనించారు. అంటే చల్లగాలి కన్నా వేడిగాలి తేలికైనది (తక్కువ సాంద్రత కలది) అన్నమాట. నీట్లో విపోడిచిన కర్ర పైకి తేలినట్టు చల్లగాలిలో వేడిగాలి పైకి కదులుతుంది అన్నమాట.
1783లో, జూన్ 5వ నాడు ఆ అన్నదమ్ములు ఫ్రాన్స్ లో తమ స్వగ్రామం అయిన ఆనోనేల, బట్టతో చేసిన ఓ సంచిని వేడిగాలితో నింపారు. వేడిగాలి పైకి లేస్తూ దాంతో పాటు సంచినీ మోసుకుపోయింది. అలా ఆ వేడిగాలి నిండిన సంచి 10 నిముషాలలో 2.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. త్వరలోనే వేడిగాలి చల్లారి ఆ గాలిబుడగ నేలకి దిగి వచ్చింది. నవంబర్‌లో ఆ అన్నదమ్ములు తమ వేడిగాలి బుడగని పారిస్‌లో ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలో 3 లక్షల జనం గాల్లోకి లేచిన గాలిబుడగని ప్రత్యక్షంగా చూశారు. ఈసారి గాలి బుడగ 9.6 కిలోమీటర్లు గాలిలో ప్రయాణించింది.
ఆ కాలంలోనే హైడ్రోజన్ అనే అతి తేలికైన వాయువు కనుక్కోబడింది. ఇది వేడిగాలి కన్నా కూడా చాలా తేలికైనది. అప్పటికి తెలిసిన వాయువులు అన్నిట్లోకి అది అతితక్కువ సాంద్రత కలది. ఫ్రెంచ్ శాస్త్రవేత్త జోక్ చార్లెస్ గాలిబుడగలని వేడిగాలితో కాక హైడ్రోజన్‌తో నింపాలని సూచించాడు. ఆ సూచన అమలు అయ్యింది. హైడ్రోజన్ నిండిన గాలిబుడగలు మనుషులని మోస్తూ గాల్లో ప్రయాణించాయి. పందొమ్మిదవ శతాబ్దపు ఆరంభంలో ఎంతోమంది అలాంటి బుడగలలో ప్రయాణించారు. మొట్టమొదటిసారిగా మనుషులు కొన్ని కిలోమీటర్ల ఎత్తువరకు గాల్లోకి పోగలిగారు. అయితే ఈ గాలిబుడగలు కేవలం గాలిలో కొట్టుకుపోగలవు అంతే.
అలా కాకుండా దాని బుట్టలోప్రోపెల్లర్‌ని నడిపించగలిగే ఓ యంత్రాన్ని అమరిస్తే? ఓడ ప్రోపెల్లర్ దానిని ఎటు కావాలంటే అటు ఎలా తీసుకుపోతుందో అదే విధంగా ఈప్రోపెల్లర్ గాలిబుడగని కావలసిన దిశలో తీసుకుపోతుంది. అలాప్రోపెల్లర్ చేత ప్రేరేపింపబడే గాలిబుడగని డిరిజిబిల్ (dirgible) అంటారు. అంటే ఒక ప్రత్యేక దిశ (direction)లో ప్రేరేపింప శక్యమైనది అని అర్ధం. మొట్టమొదటి డిరిజిబిల్‌ని ఫెర్డినాండ్ ద జెప్పెలిన్ అనే జర్మన్ దేశస్థుడు నిర్మించాడు. అతడు గాలిబుడగని ఓ బారైన, పోగచుట్ట ఆకారం గల తేలిక లోహమైన అల్యూమినియంతో నిర్మించిన ఓ పై తొడుగులో అమర్చాడు. అటువంటి పోడవైన ఆకృతి గాలినీ సులభంగా ఛేదించగలడు. 1900 జులై 2 నాడు మొట్ట మొదటి డిరిజిబిల్ గాల్లోకి లేచింది. మనుషులకి వాళ్లు కావలసిన దిశలో ప్రయాణించే అవకాశం ఏర్పడింది.
అప్పట్నుండి 40 ఏళ్ళుగా ఈ డిరిజిబిల్స్ ఇంకా ఇంకా పెద్దవవుతూ, మెరుగవుతూ వచ్చాయి. కాని వాటిలో నింపే హైడ్రోజన్ చాలా ప్రమాదకరమైనది. హైడ్రోజన్ మండే వాయువు. నిప్పు అంటుకుంటే పేలుతుంది. దానికి బదులుగా మరో వాయువు హీలియమ్ వాడొచ్చు. అది హైడ్రోజన్ అంత తేలికైనది కాదు గానీ ఎప్పుడూ నిప్పు అంటుకోదు. అయినా ఈ డిరిజిబిల్స్ అంత వేగంగా కదలగలిగేవి కావు. పైగా తుఫానుల్లో చిక్కుకుంటే ధ్వంసం అయిపోయేవి. అయినప్పటికీ రైట్ బ్రదర్స్ వచ్చి విమానాలపై ప్రయోగాలు చేసే వరకు గాలి బుడగలు మానవుడికి ఎగరాలనే అభిలాషను తీర్చాయి. నేటికీ పర్యాటక స్థలాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. టర్కీలో ఎయిర్ బెలూన్స్ ప్రత్యేక ఆకర్షణ.
Comments
Please login to add a commentAdd a comment