
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్‌ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.
2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్‌పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్‌ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: అంబేద్కర్ మదిలో ‘హైదరాబాద్’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..