అసమానతలు రూపుమాపేందుకు కృషి
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
గన్నవరం :
దేశంలోని ఆర్థిక అసమానతలు, వివక్షతను రూపుమాపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోదీ 66వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా మండలంలోని కేసరపల్లి శివారు జీసస్ గ్రేస్ లెప్రసీ కాలనీలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల సంక్షేమ కోసం శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వెంకయ్య నాయుడు పాల్గొని కాలనీవాసుల కోసం బహూకరించిన ఎల్ఈడీ టీవీని ప్రారంభించారు. అనంతరం 25 కుటుంబాలకు పండ్లు, దుప్పట్లు, నూతన వస్త్రాలు, 10 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘ కార్యదర్శి ఎ. చంద్రశేఖర్ స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపకుండా అక్కున చేర్చుకోవాలని కోరారు. కాలనీలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నూజివీడు సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా కాలనీవాసులకు ఉపకరణాలు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్, జిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, ఎంపీపీ పట్రా కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు మరీదు లక్ష్మీదుర్గ, సర్పంచ్ సాతులూరి శివనాగరాజకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహాయ అధికారి డీవీఎస్ఎన్ శాస్త్రి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల ఆంజిబాబు పాల్గొన్నారు.