
పాకిస్తాన్ యువ బౌలర్ అబ్రార్ అహ్మద్ వ్యవహారశైలిపై ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని.. అంతేతప్ప అతి చేయకూడదంటూ చీవాట్లు పెట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా పాకిస్తాన్ ఆదివారం టీమిండియాతో తలపడింది.
దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 241 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీయగా.. పేసర్లలో హార్దిక్ పాండ్యా రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ దక్కించుకున్నారు.
పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిజ్వాన్(46) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లోనే 20 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆదిలో దూకుడుగా ఆడినా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు.
చక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధ శతకానికి చేరువైన సమయంలో అనూహ్య రీతిలో గిల్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న ఈ 25 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.
అయితే, ఆ సమయంలో అబ్రార్ అహ్మద్ కాస్త అతిగా స్పందించాడు. రెండు చేతులు కట్టుకుని నిలబడి.. ‘‘ఇక వెళ్లు’’.. అన్నట్లుగా కళ్లతోనే సైగలు చేయగా సహచర ఆటగాళ్లు కూడా వచ్చి అతడితో ఆనందం పంచుకున్నారు. అప్పుడు మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి కాస్త సంయమనం పాటించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. అబ్రార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
‘‘ప్రిన్స్‌తో పెట్టుకున్నందుకు.. కింగ్ మీకు చుక్కలు చూపించాడు. మిమ్మల్ని ఓడించాడు. అందుకే అతి చేయొద్దు’’ అంటూ టీమిండియా అభిమానులు కోహ్లి శతకంతోనే పాక్ జట్టుకు బదులిచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ గిల్ వికెట్ తీసిన తర్వాత అబ్రార్ అహ్మద్ వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రం కూడా స్పందించాడు.
‘‘అబ్రార్ బంతి వేసిన తీరు నన్ను ఆకట్టుకుంది. కానీ అతడి చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. సెలబ్రేట్ చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వికెట్ తీసిన ఆనందాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు. కానీ.. మ్యాచ్‌లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటివి పనికిరావు. ఎంత హుందాగా ఉంటే అంత మంచిది.
అయితే, ఈరోజు అబ్రార్ అతి చేశాడు. అతడిని వారించేందుకు అక్కడ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇలాంటి ప్రవర్తన టీవీల్లో చూడటానికి కూడా అస్సలు బాగాలేదు’’ అని వసీం అక్రం అబ్రార్‌కు చురకలు అంటించాడు. కాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. గ్రూప్-ఎ నుంచి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది.
ఇక మెగా వన్డే టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో పాటు గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment