గిల్‌ను ఔట్‌ చేశాక పాక్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌.. ఏకి పారేస్తున్న టీమిండియా అభిమానులు | Champions Trophy 2025, IND VS PAK: Abrar Ahmed Trolled For Making Face At Shubman Gill | Sakshi
Sakshi News home page

గిల్‌ను ఔట్‌ చేశాక పాక్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌.. ఏకి పారేస్తున్న టీమిండియా అభిమానులు

Published Mon, Feb 24 2025 1:37 PM | Last Updated on Mon, Feb 24 2025 1:37 PM

Champions Trophy 2025, IND VS PAK: Abrar Ahmed Trolled For Making Face At Shubman Gill

భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు ఒకరినొకరు కవ్వించుకోవడం, మాటల యుద్దానికి దిగడం సర్వ సాధారణం. అయితే ఇటీవలికాలంలో ఇలాంటి వాతావరణంలో బాగా మార్పు వచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. మైదానంలో హుందాగా ప్రవర్తిస్తున్నారు. కోహ్లి, రోహిత్‌  జమానా మొదలయ్యాక భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ల్లో స్లెడ్జింగ్‌ అనేదే కనిపించడం లేదు. జూనియర్లు సీనియర్లను గౌరవిస్తున్నారు. వీలైతే సలహాలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది పాక్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి దగ్గర చిట్కాలు తీసుకోవడం చూశాం​.

అయితే తాజాగా జరిగిన భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌లో పాక్‌ యువ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ ఈ మంచి సంప్రదాయానికి తూట్లు పొడిచాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అబ్రార్‌ చాలా ఓవరాక్షన్‌ చేశాడు. ఫలితంగా భారత క్రికెట్‌ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు. 

అసలేం జరిగిందంటే.. భారత్‌, పాకిస్తాన్‌ జట్లు నిన్న (ఫిబ్రవరి 23) దుబాయ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అబ్రార్‌ అహ్మద్‌ అతి చేశాడు. పాక్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్‌ సాఫీగా ఛేదిస్తుండగా.. శుభ్‌మన్‌ గిల్‌ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. గిల్‌ను అబ్రార్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. గిల్‌ను ఔట్‌ చేశాక అబ్రార్‌ ఓవరాక్షన్‌ అంతాఇంతా కాదు. 

చేతులు కట్టుకుని నిలబడి 'వెళ్లు.. ఇక వెళ్లు.. వెళ్లి బ్యాగ్ సర్దుకో' అన్నట్టు సైగలు చేశాడు. దీంతో భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అబ్రార్‌ను సోషల్‌ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో  ఆడుకుంటున్నారు. బ్యాగ్‌ సర్దుకోవాల్సింది గిల్‌ కాదు, మీరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కొందరు గిల్‌ హార్డ్‌ కోర్‌ అభిమానులు వాడకూడని భాషలో అబ్రార్‌ను దూషిస్తున్నారు. ఇంకొందరేమో నీకు సరిగ్గా బుద్ది చెప్పే విరాట్‌ కోహ్లి ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడంటూ కామెంట్స్‌ చేశారు. మొత్తానికి అబ్రార్‌ చేసిన ఓవరాక్షన్‌తో పాక్‌ జట్టు మొత్తం  ట్రోలింగ్‌కు గురైంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. విరాట్‌ సూపర్‌ సెంచరీతో కదంతొక్కడంతో పాక్‌పై భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్‌ అజేయ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ రిజ్వాన్‌ (46), ఖుష్దిల్‌ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 

ఇమామ్‌ ఉల్‌ హక్‌ 10, బాబర్‌ ఆజమ్‌ 23, సల్మాన్‌ అఘా 19, తయ్యబ్‌ తాహిర​్‌ 4, షాహీన్‌ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్‌ రౌఫ్‌ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ 3, హార్దిక్‌ 2, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు.

అనంతరం బరిలోకి దిగిన భారత్‌.. కోహ్లి శతక్కొట్టడంతో (111 బంతుల్లో 100 నాటౌట్‌; 7 ఫోర్లు) 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (56).. విరాట్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేయగా.. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (20), శుభ్‌మన్‌ గిల్‌ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

పాక్‌ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్‌ అహ్మద్‌, ఖుష్దిల్‌ షా తలో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో భారత్‌ సెమీస్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస  పరాజయాలతో పాక్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement