
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) భారత్, పాకిస్తాన్ మ్యాచ్ (దుబాయ్ వేదికగా) జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) చేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.
ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించాడు. విరాట్‌తో కలిసి మూడో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేశాడు.
అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ (20) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్ (46) యధావిధిగా క్లాసికల్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
కాగా, ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీతో పాటు మరో నాన్ క్రికెటింగ్ అంశం హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధరించిన వాచీ అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ వాచీ గురించి క్రికెట్ అభిమానులు ఆరా తీయగా కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూశాయి.
ఈ వాచీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్‌ల్లో ఒకటైన రిచర్డ్ మిల్లె RM 27-02 టైమ్‌పీస్ అని తెలిసింది. దీని విలువ భారత కరెన్సీలో సుమారు 6.92 కోట్లుంటుంది. ఈ అల్ట్రా లగ్జరీ వాచ్ చాలా అరుదుగా దర్శనమిస్తుంది. అత్యంత సంపన్నులు మాత్రమే ఇలాంటి ఖరీదైన ఈ వాచీలను ధరించగలరు. ఈ వాచీ విలువ తెలిసి క్రికెట్ అభిమానులు షాక్ తిన్నారు.
ఈ అరుదైన వాచీని మొదట టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ కోసం రూపొందించారని తెలుస్తోంది. ఇది విప్లవాత్మక కార్బన్ TPT యూనిబాడీ బేస్‌ప్లేట్‌కు ప్రసిద్ధి చెందింది. ఇలాంటి వాచీలు ఇప్పటివరకు కేవలం 50 మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయని సమాచారం.
ఇదిలా ఉంటే, పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ 8 ఓవర్లు వేసి కీలకమైన బాబర్ ఆజమ్, సౌద్ షకీల్ వికెట్లు తీశాడు. అత్యంత పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. 8 ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం హార్దిక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. అప్పటికే భారత విజయం ఖరారైపోయింది. మ్యాచ్‌ను తొందరగా ముగించే క్రమంలో హార్దిక్ 6 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ ఓ మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో హార్దిక్ 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 216 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. 30.76 సగటున 200 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్ల జాబితాలో హార్దిక్ 24వ స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment