CT 2025 Final: గ్లెన్‌ ఫిలిప్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమం | IND Vs NZ: Glenn Phillips Takes Flying Blinder In CT 2025 Final, Stuns Shubman Gill Video Goes Viral | Sakshi
Sakshi News home page

CT 2025 Final: గ్లెన్‌ ఫిలిప్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమం

Published Sun, Mar 9 2025 8:47 PM | Last Updated on Mon, Mar 10 2025 9:59 AM

Glenn Phillips Takes Flying Blinder In CT 2025 Final, Stuns Shubman Gill

క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్‌ నమోదైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఆడిన షాట్‌ను (కవర్స్‌ దిశగా) ఫిలిప్స్‌ అమాంతం గాల్లోకి ఎగిరి పట్టేసుకున్నాడు. ఈ క్యాచ్‌ను ఫిలిప్స్‌ సైతం నమ్మలేకపోయాడు. క్యాచ్‌ పట్టిన తర్వాత కింద కూర్చుని క్యాచ్‌ పట్టానా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్‌ పెట్టాడు. 

ఈ క్యాచ్‌ను చూసి గిల్‌ నోరెళ్లపెట్టాడు. ఈ క్యాచ్‌ తర్వాత దుబాయ్‌ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. అప్పటిదాకా భారత్‌కు సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులు ఫిలిప్స్‌ క్యాచ్‌ చూసి షాక్‌లో ఉండిపోయారు. అస్సలు సాధ్యంకాని క్యాచ్‌ను పట్టడంతో అభిమానులు ఫిలిప్స్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్‌ను సంబంధించిన వీడియో సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. 

ఫిలిప్స్‌ మనిషా లేక పక్షా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫిలిప్స్‌ ఇదే టోర్నీలో విరాట్‌ కోహ్లి క్యాచ్‌ను (గ్రూప్‌ దశ మ్యాచ్‌లో) కూడా ఇలాగే నమ్మశక్యంకాని రీతిలో పట్టుకున్నాడు. ఆ క్యాచ్‌ను ఇది తలదన్నేలా ఉంది. క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అన్న నానుడుని ఫిలిప్స్‌ నిజం చేస్తాడేమో చూడాలి.

ఫిలిప్స్‌​ పట్టుకున్న క్యాచ్‌ ఆషామాషీ వ్యక్తిది కాదు. గిల్‌ మ్యాచ్‌ ఫలితాన్ని డిసైడ్‌ చేసే సత్తా ఉన్న ఆటగాడు. అదీ కాక భారత్‌ అప్పటిదాకా బాగా స్కోర్‌ చేసి విజయం దిశగా దూసుకుపోతుండుంది. ఫిలిప్స్‌ క్యాచ్‌తో భారత్‌ డిఫెన్స్‌లో పడింది. పుండుపై కారం చల్లినట్లు గిల్‌ (31) ఔటైన పరుగు వ్యవధిలోనే భారత్‌ అత్యంత కీలకమైన విరాట్‌ కోహ్లి (1) వికెట్‌ కూడా కోల్పోయింది. 

మరో 17 పరుగుల తర్వాత క్రీజ్‌లో కుదురుకుపోయిన రోహిత్‌ శర్మ (76) కూడా ఔటయ్యాడు. దీంతో భారత్‌ ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయినట్లైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (35), అక్షర్‌ పటేల్‌ (13) భారత ఇన్నింగ్స్‌ను చక్కద్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 161/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 90 బంతుల్లో 91 పరుగులు చేయాలి. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి.

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్‌ మిచెల్‌ (63), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ 15, రచిన్‌ రవీంద్ర 37, కేన్‌ విలియమ్సన్‌ 11, టామ్‌ లాథమ్‌ 14, గ్లెన్‌ ఫిలిప్స్‌ 34, మిచెల్‌ సాంట్నర్‌ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసినా న్యూజిలాండ్‌ మంచి స్కోర్‌ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement