
Photo Courtesy: BCCI/GT X
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది టైటాన్స్ వైఫల్యాలకు అతడు ఏమాత్రం కారణం కాదని పేర్కొన్నాడు. కెప్టెన్ ఒక్కడి ప్రదర్శన మీద జట్టు జయాపజయాలు ఆధారపడి ఉండవని.. ఆటగాళ్లంతా సమిష్టిగా రాణిస్తేనే గెలుపు వరిస్తుందని ఫిలిప్స్ అన్నాడు.
అరంగేట్ర సీజన్‌లోనే చాంపియన్‌గా
కాగా 2022లో గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలో.. తమ అరంగేట్ర సీజన్‌లోనే చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాతి ఏడాది ఫైనల్ చేరింది. అయితే, 2024లో పాండ్యా టైటాన్స్‌ను వీడి తన సొంతజట్టు ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఫలితంగా టైటాన్స్ పగ్గాలను యాజమాన్యం భారత యువ తార గిల్‌కు అప్పగించింది.
పేలవ ప్రదర్శన
అయితే, గతేడాది తొలిసారిగా గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచి.. పది పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. పాండ్యా జట్టును వీడటంతో పాటు మహ్మద్ షమీ (అప్పుడు టైటాన్స్ జట్టులో) గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరం కావడం టైటాన్స్ ప్రదర్శనపై ప్రభావం చూపింది.
అయితే, ఈసారి తాము ఆ ప్రతికూలతలు అధిగమించి అనుకున్న ఫలితాలు రాబడతామని గిల్ స్పష్టం చేశాడు. తమ జట్టు ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో గ్లెన్ ఫిలిప్స్ హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ జట్టుగా ఆడాల్సిన ఆట.
గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం
ఒక్క ఆటగాడు లేదా కెప్టెన్ జట్టు మొత్తాన్ని గెలిపించలేదు. కాబట్టి శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ వల్లే గతేడాది గుజరాత్ ప్రదర్శన బాలేదని చెప్పడం సరికాదు. టీ20 క్రికెట్ స్వరూపమే వేరు. మ్యాచ్ రోజు ఎవరు ఫామ్‌లో ఉంటారో వారిదే పైచేయి అవుతుంది. గతేడాది సన్‌రైజర్స్, కేకేఆర్ సీజన్ ఆసాంతం ఒకే లయను కొనసాగించి ఫైనల్ వరకు చేరాయి.
ఏదేమైనా తమ తొలి రెండు సీజన్లలో గుజరాత్ అద్భుతంగా ఆడింది. మంచి ఫామ్ కనబరిచింది. ఈ ఏడాది అదే ఫలితాన్ని పునరావృతం చేయగలమని నమ్ముతున్నా. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ విషయంలో ఒత్తిడికి గురవుతాడని నేను అస్సలు అనుకోను. అతడు టీమిండియా ప్రధాన ప్లేయర్. జాతీయ జట్టుకు ఆడటం కంటే లీగ్ క్రికెట్‌లో ఆడటం తేలికే’’ అని గిల్‌కు ఫిలిప్స్ మద్దతు ప్రకటించాడు.
రూ. 2 కోట్లకు కొనుగోలు
కాగా 2021లో గ్లెన్ ఫిలిప్స్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుక్కోగా.. ఆ మరుసటి ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 1.5 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. కానీ తుదిజట్టులో మాత్రం ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు రైజర్స్ అతడిని విడిచిపెట్టింది. దీంతో గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు అతడిని వేలంపాటలో కొనుక్కుంది.
ఇక ఇప్పటి వరకు ఐపీఎల్‌లో కేవలం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఫిలిప్స్ 65 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మంగళవారం తమ తొలి మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.
Comments
Please login to add a commentAdd a comment