
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మార్చి 29) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో (అహ్మదాబాద్) జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.
ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలై నిరాశగా ఉన్నాయి. ముంబై సీఎస్‌కే చేతిలో.. గుజరాత్ పంజాబ్ చేతిలో పరాజయం పాలయ్యాయి. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఒక్కరు కూడా సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విదేశీ విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
స్కై (29), తిలక్ వర్మ (31) పర్వాలేదనిపించినా అవి వారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు కావు. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. గత సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో నిషేధం ఎదుర్కొన్నాడు. గుజరాత్‌తో నేటి మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో ఉంటాడు. హార్దిక్ ఎంట్రీతో రాబిన్ మింజ్ తప్పుకోవాల్సి ఉంటుంది. సీఎస్‌కేతో మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్‌కు ఓ అణిముత్యం దొరికాడు.
24 ఏళ్ల స్పిన్నర్ విజ్ఞేశ్ పుతుర్ సీఎస్‌కేతో మ్యాచ్‌లో మ్యాజిక్ చేశాడు. కేరళకు చెందిన పుతుర్ జాతీయ స్థాయిలో ఎలాంటి మ్యాచ్‌లు ఆడకుండా నేరుగా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి తన తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబైకు పుతుర్ అద్భుతమైన బౌలింగ్ మినహా ఎలాంటి ఊరట లభించలేదు.
పుతుర్ రాణించినా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ సామర్థ్యం మేరకు రాణించలేదు. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాహర్.. ఆతర్వాత బౌలింగ్‌లో ఓ వికెట్ తీశాడు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.
ర్యాన్ రికెల్టన్ (వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్ పుతుర్
గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో పరాజయంపాలైనప్పటికీ.. బ్యాటింగ్‌లో అదరగొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (74), శుభ్‌మన్ గిల్ (33), బట్లర్ (54), రూథర్‌ఫోర్డ్ (46) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. మధ్య ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు కాస్త వేగంగా ఆడి ఉంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలిచేదే. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ప్రధాన బౌలర్లందరూ నిరాశపరిచారు.
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన సిరాజ్, రబాడ.. గుజరాత్ తురుపుముక్క రషీద్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ అదే స్థాయిలో పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్ ఒక్కడే రాణించాడు. అతను 4 ఓవర్లలో కేవలం 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ముంబైతో జరుగబోయే నేటి మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
హెడ్ టు హెడ్ రికార్డులు..
ఐపీఎల్‌లో గుజరాత్, ముంబై ఇప్పటివరకు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ 3, ముంబై రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. గుజరాత్‌కు ముంబైపై సొంత మైదానంలో ఘనమైన రికార్డు ఉంది. ఆ జట్టు ముంబైపై సాధించిన మూడు విజయాలు అహ్మదాబాద్‌లో వచ్చినవే. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. అహ్మదాబాద్ పిచ్‌పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయం. ఈ పిచ్‌పై గత మ్యాచ్‌లో పంజాబ్ 243 పరుగులు చేయగా.. ఛేదనలో గుజరాత్ 232 పరుగులు చేసింది.