
Photo Courtesy: BCCI
ఓటమి బాధలో (గుజరాత్ చేతిలో) ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ హార్దిక్‌కు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం హార్దిక్‌కు ఈ ఫైన్ విధించబడింది. ఈ సీజన్‌లో హార్దిక్ జట్టు చేసిన మొదటి తప్పిదం కాబట్టి 12 లక్షల జరిమానాతో సరిపుచ్చారు.
హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు సంబంధించిన నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గత సీజన్‌లో హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ మూడు సార్లు స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది. ఇందుకు గానూ హార్దిక్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడింది.
గత సీజన్ వరకు ఓ జట్టు మూడు సార్లు (ఒకే సీజన్‌లో) స్లో ఓవర్‌రేట్ మెయింటైన్ చేస్తే కెప్టెన్‌పై ఓ మ్యాచ్ నిషేధించేవారు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆ రూల్‌ను ఎత్తి వేశారు. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ తప్పిదాల కారణంగా కెప్టెన్లపై నిషేధం ఉండదు. కేవలం జరిమానాలు మాత్రమే ఉంటాయి.
ఇదిలా ఉంటే, గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో ముంబై సీఎస్‌కే చేతిలో ఓడింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయింది. తొలుత బౌలింగ్ చేసి గుజరాత్‌ను భారీ స్కోర్ (196/8) చేయనిచ్చిన ఆ జట్టు.. ఆతర్వాత ఛేదనలో (160/6) చేతులెత్తేసింది.
గుజరాత్ బౌలర్లు సొంత పిచ్ అడ్వాన్‌టేజ్‌ను వినియోగించుకుని ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (4-0-29-2) బౌలింగ్‌లో రాణించినప్పటికీ.. బ్యాటింగ్‌లో తేలిపోయాడు. ఛేదన కీలక దశలో బంతులు వృధా (17 బంతుల్లో 11) చేసి జట్టు ఓటమిని ఖరారు చేశాడు.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ (కెప్టెన్‌గా) చేసిన ప్రయోగాలు కూడా బెడిసికొట్టాయి. రాబిన్ మింజ్‌ను తనకంటే ముందు బ్యాటింగ్‌కు పంపిన హార్దిక్ పెద్ద తప్పిదమే చేశాడు. మింజ్ కీలక దశలో బంతులను వృధా చేసి (6 బంతుల్లో 3) చీప్‌గా ఔటయ్యాడు. తుది జట్టు ఎంపికలోనూ హార్దిక్ పెద్ద తప్పులే చేశాడు. తొలి మ్యాచ్‌లో అద్భుతం చేసిన విజ్ఞేశ్ పుతుర్‌ను, భారీ హిట్టర్.. అందులోనే గత సీజన్‌లో అహ్మదాబాద్‌లో సెంచరీ చేసిన విల్ జాక్స్‌కు తప్పించి భారీ మూల్యం చెల్లించుకున్నాడు.