GT VS MI: మేము ప్రొఫెషనల్‌గా ఆడలేదు.. రెండిటిలోనూ విఫలమయ్యాం: హార్దిక్‌ పాండ్యా | IPL 2025: Mumbai Indians Captain Hardik Pandya Comments After Losing To Gujarat Titans | Sakshi
Sakshi News home page

GT VS MI: మేము ప్రొఫెషనల్‌గా ఆడలేదు.. రెండిటిలోనూ విఫలమయ్యాం: హార్దిక్‌ పాండ్యా

Published Sun, Mar 30 2025 7:39 AM | Last Updated on Sun, Mar 30 2025 9:56 AM

IPL 2025: Mumbai Indians Captain Hardik Pandya Comments After Losing To Gujarat Titans

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌-2025లో భాగంగా నిన్న (మార్చి 29) గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడ్డాయి. హోం గ్రౌండ్‌లో (అహ్మదాబాద్‌) జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ముంబైని చిత్తు చేసింది. స్లోగా ఉన్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ (196/8) చేసిన గుజరాత్‌.. ఆతర్వాత దాన్ని అద్భుతంగా డిఫెండ్‌ చేసుకుంది. ఈ మ్యాచ్‌ గెలుపుకు గుజరాత్‌ బ్యాటర్లు, బౌలర్లకు క్రెడిట్‌ ఇవ్వాలి. 

తొలుత బ్యాటింగ్‌లో వారు ఎక్కువ రిస్క్‌ చేయకుండానే పరుగులు రాబట్టారు. సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తనలోని క్లాస్‌ను ప్రదర్శించాడు. శుభ్‌మన్‌ గిల్‌ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్‌) కూడా బాగా ఆడారు. వీరు చేసింది తక్కువ పరుగులే అయినా ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశారు. 

ఆతర్వాత వచ్చిన షారుఖ్‌ ఖాన్‌ (9), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (18), రాహుల్‌ తెవాటియా (0), రషీద్‌ ఖాన్‌ (6), రబాడ (7 నాటౌట్‌), సాయి కిషోర్‌ (1) నిరాశపర్చినా చివరికి గుజరాత్‌ మంచి స్కోరే చేసింది. సాయి సుదర్శన్‌ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఉంటే గుజరాత్‌ ఇంకా భారీ స్కోర్‌ చేసేది. 

ముంబై ప్రధాన పేసర్లు బౌల్ట్‌ (4-0-34-1), దీపక్‌ చాహర్‌ (4-0-39-1) బాగానే బౌలింగ్‌ చేసినా స్పిన్నర్ ముజీబ్‌ రెహ్మాన్‌ (2-0-28-1), యువ పేసర్‌ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సాంట్నర్‌ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబైను గుజరాత్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. సిరాజ్‌ ఇద్దరు ముంబై ఓపెనర్లను పవర్‌ ప్లేలోనే ఔట్‌ చేశాడు. తొలుత రోహిత్‌ను (8) క్లీన్‌ బౌల్డ్‌ చేసిన సిరాజ్‌.. ఆతర్వాత మరో ఓపెనర్‌ రికెల్టన్‌ను (6) కూడా అదే తరహాలో పెవిలియన్‌కు పంపాడు. 

ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్‌ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 48; ఫోర్‌, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ దశలో గుజరాత్‌ తమ ఏస్‌ పేసర్‌ ప్రస్దిద్ద్‌ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్‌, స్కైలను ఔట్‌ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్‌ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. 

ప్రసిద్ద్‌ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తిలక్‌, స్కై ఔటయ్యాక హార్దిక్‌ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్‌ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్‌ (6 బంతుల్లో 3), హార్దిక్‌ (17 బంతుల్లో 11) ఇద్దరూ బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్‌ ధీర్‌ (11 బంతుల్లో 18 నాటౌట్‌), సాంట్నర్‌ (9 బంతుల్లో 18 నాటౌట్‌) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. 

ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్‌ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్‌ కృష్ణకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. గుజరాత్‌ బౌలరల్లో ప్రసిద్ద్‌, సిరాజ్‌ చెరో 2, రబాడ, సాయికిషోర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్‌ ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది.

మ్యాచ్‌ అనంతరం ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము ప్రొఫెషనల్‌గా ఆడలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండిటిలోనూ విఫలమయ్యాం. రెండు విభాగాల్లో 15-20 పరుగులు తక్కువ పడ్డాయని అనుకుంటున్నాను. ఫీల్డ్‌లో ప్రాథమిక తప్పులు చేసాము. దానికి వల్ల ప్రత్యర్థులకు 20-25 పరుగులు అదనంగా వచ్చాయి. టీ20ల్లో మ్యాచ్‌ ఫలితాన్ని ఈ పరుగులే నిర్దేశిస్తాయి. గుజరాత్‌ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు ఛాన్స్‌లు ఎక్కువగా తీసుకోలేదు. పిచ్‌ కఠినంగా ఉందని వారికి కూడా తెలుసు. 

వారు ప్రమాదకర షాట్లు ఆడకుండా పరుగులు సాధించగలిగారు. ఈ పరాజయానికి మేమంతా బాధ్యత తీసుకోవాలి. ఇంకా ప్రారంభ దశల్లోనే ఉన్నాము. బ్యాటర్లు టచ్‌లోకి రావాలి. వారు త్వరలోనే సామర్థ్యం మేరకు రాణిస్తారని ఆశిస్తున్నాను. గుజరాత్‌ బౌలర్లు స్లో డెలివరీలను అద్భుతంగా బౌల్‌ చేశారు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైంది. కొన్ని బంతులు నేరుగా వికెట్లపైకి వచ్చాయి. కొన్ని బౌన్స్ అయ్యాయి. ఇలాంటి బంతులను ఎదుర్కోడం బ్యాటర్లకు చాలా కష్టం. గుజరాత్‌ బౌలర్లు నేను బంతితో చేసిందే చేసి సఫలమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement