IPL 2025: గుజరాత్‌ బౌలర్‌పై నోరు పారేసుకున్న హార్దిక్‌.. వైరల్‌ వీడియో | IPL, GT vs MI: Hardik Pandya And Sai Kishore In Heated Staring Battle | Sakshi
Sakshi News home page

IPL 2025: గుజరాత్‌ బౌలర్‌పై నోరు పారేసుకున్న హార్దిక్‌.. వైరల్‌ వీడియో

Published Sun, Mar 30 2025 11:47 AM | Last Updated on Sun, Mar 30 2025 2:11 PM

IPL, GT vs MI: Hardik Pandya And Sai Kishore In Heated Staring Battle

Photo Courtesy: BCCI

గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్‌ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో హార్దిక్‌ పాండ్యా, గుజరాత్‌ స్పిన్నర్‌ సాయి కిషోర్‌ గొడవ పడ్డారు. ముంబై ఓటమి ఖరారైన దశలో తొలుత సాయి కిషోర్‌ హార్దిక్‌ను గెలికాడు. డాట్‌ బాల్‌ వేసిన ఆనందంలో ముంబై కెప్టెన్‌ వైపు బిర్రుగా చూశాడు. 

ఇందుకు హార్దిక్‌ కూడా ధీటుగా స్పందించాడు. సాయి కిషోర్‌తో కంటితో యుద్దం చేస్తూనే దుర్భాషలాడాడు. అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మ్యాచ్‌ అనంతరం హార్దిక్‌, సాయి కిషోర్‌ ఒకరినొకరు హగ్‌ చేసుకోవడం కొసమెరుపు. హార్దిక్‌, సాయి కిషోర్‌ గతంలో కలిసి గుజరాత్‌కు ఆడిన విషయం తెలిసిందే. 

హార్దిక్‌తో గొడవపై సాయి కిషోర్‌ ప్రజెంటేషన్‌ సందర్భంగా కూడా స్పందించాడు. హార్దిక్‌ నాకు మంచి మిత్రుడని అన్నాడు. మైదానంలో ఇలాగే ఉండాలి. అక్కడ ఎవరైనా ప్రత్యర్థులే. మేము విషయాలను వ్యక్తిగతంగా తీసుకోము. మేము మంచి పోటీదారులం. ఆట ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని అన్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్‌ యావరేజ్‌గా బౌలింగ్‌ చేసి ఓ వికెట్‌ తీయగా.. హార్దిక్‌ బౌలింగ్‌లో రాణించి, బ్యాటింగ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. స్లో వికెట్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ భారీ స్కోర్‌ (196/8) చేసింది. 

సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటారు. 

ముంబై బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. బౌల్ట్‌ (4-0-34-1), దీపక్‌ చాహర్‌ (4-0-39-1), సాంట్నర్‌ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్‌ రెహ్మాన్‌ (2-0-28-1), యువ పేసర్‌ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్‌ తొలి ఓవర్‌లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్‌ శర్మను (8) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అనంతరం​ ఐదో ఓవర్‌లో సిరాజ్‌ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్‌ రికెల్టన్‌ను (6) రోహిత్‌ తరహాలోనే క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్‌ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 48; ఫోర్‌, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్‌ ప్రస్దిద్ద్‌ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్‌, స్కైలను ఔట్‌ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్‌ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

ప్రసిద్ద్‌ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్‌, స్కై ఔటయ్యాక హార్దిక్‌ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్‌ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్‌ (6 బంతుల్లో 3), హార్దిక్‌ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్‌ ధీర్‌ (11 బంతుల్లో 18 నాటౌట్‌), సాంట్నర్‌ (9 బంతుల్లో 18 నాటౌట్‌) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

పొదుపుగా బౌలింగ్‌ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్‌ కృష్ణకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. గుజరాత్‌ బౌలరల్లో ప్రసిద్ద్‌, సిరాజ్‌ చెరో 2, రబాడ, సాయికిషోర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్‌ ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement