ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజు జరుపుకునే తొలి పండుగ. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం. హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. 2024లో ఉగాది ఏప్రిల్ 9వ తేదీన (మంగళవారం) వస్తుంది.
"యుగాది" అనే పదం రెండు పదాల కలయిక - "యుగం" (వయస్సు) , "ఆది" (ప్రారంభం) ఒక శుభ సందర్భం అని అర్థం. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 9 న క్రోధి అర్థం కోపం కలిగించేదని.
మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అసోం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోను ఈ పండుగ జరుపు కుంటారు. బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి.
మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు.
ఇతర విశేషాలు
ఈ రోజు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు.
త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు.
ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునే వారు.
శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే.
వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే.
వారం రోజుల ముందు నుంచే సందడి
ఉగాదికి వారం రోజుల ముందునుంచే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, అలంకరించుకునే పనులతో సందడి మొదలవుతంది. రంగురంగుల రంగువల్లులతో ఇంటి ముంగిళ్లు ముస్తాబవుతాయి. మామిడి ఆకుల తోరణాలతో గుమ్మాలను అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దానధర్మాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
వంటలు, ఉగాది పచ్చడి, నైవేద్యాలు
సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పాలు పొంగించి, పిండి వంటలు సిద్ధం చేసి. ఇష్టదైవాన్ని పూజిస్తారు. పులిహోర, పాయసం, బొబ్బట్లు ఇలా ఎవరికికి నచ్చినట్టు వారు తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా అందిస్తారు.
ఏడాదంతా మంచి జరగాలని
తొలి పండుగగా తెలుగువారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసే పండగ ఉగాది. కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు. కొత్తమామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు,కారం, ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడితో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు ఏదైనా మంచి కార్యం తలపెడితే శుభం జరుగుతుందని నమ్ముతారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొనుగోలు చేస్తారు.కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు.
పంచాంగ శ్రవణం
ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది రోజున కవి సమ్మేళనాలు, కవి సన్మానాలు అంటూ కవులు, రచయితలు సందడి సందడిగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment