#Ugadi 2024 తెలుగువారి తొలి పండుగ ఉగాది అంటేనే ఆనందం. ఉత్సాహం. కొత్తకు నాంది అనే సంబరం. ముఖ్యంగా ఉగాది అనగానే తీపి, చేదు, లాంటి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అందరికీ గుర్తొస్తుంది. ప్రతి పదార్ధం జీవితంలోని విభిన్న అనుభవాలకు గుర్తుగా అమృతం లాంటి జీవితాన్ని ఆస్వాదించే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఉగాది పచ్చడికి అంత ప్రాధాన్యత.
గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్తగా ఆరంభించ డానికి ఇది శుభతరుణమని భావిస్తారు. ఉగాదికి పులిహోర, బొబ్బట్లు, పూర్ణం బూరెలతోపాటు ఉగాది పచ్చడి చేయడం అనవాయితీ. అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
పచ్చడి ఇలా..
పచ్చి మామిడికాయ – ఒకటి (మీడియం సైజు)
వేప పువ్వు – టేబుల్ స్పూన్ (తొడిమలు ఒలిచినది)
కొత్త చింతపండు – నిమ్మకాయంత (రసం చిక్కగా తీసుకోవాలి)
బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్‌లు
ఉప్పు – పావు టీ స్పూన్
మిరియాలు లేదా మిరియాల పొడి అర టీ స్పూన్ లేదా రెండు చిన్న పచ్చిమిర్చి
తయారీ:
పచ్చి మామిడి కాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా సన్నగా ముక్కలు తరగాలి.
ఇందులో వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి.
షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. రుచి కోసం టేబుల్ స్పూన్ కొబ్బరి కోరు, ఒక అరటి పండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉగాది పచ్చడి.స్పూన్‌తో అరచేతిలో వేసుకుని తినేటట్లు చిక్కగా ఉంటుంది.
తెలంగాణలో
తెలంగాణలో ఇదే మోతాదులో తీసుకున్న దినుసులను ఒక పెద్ద పాత్రలో వేసి ముప్పావు వంతు నీటిని పోసి కలపాలి. గ్లాసులో పోసి తాగేటట్లు జారుడుగా ఉంటుంది.
పిల్లలు మెచ్చేలా..!
ఉగాది పచ్చడి ప్రాశస్త్యాన్ని పిల్లలకు చెబుతూనే , వారికి నచ్చే విధంగా ఉగాది పచ్చడిని ఫ్రూట్ సలాడ్‌లా కూడా చేసుకోవచ్చు. ఉగాది పచ్చడిలో వేసే ఆరు రకాల పదార్థాలతో సంప్రదాయ బద్ధంగా ఉగాది పచ్చడిని చేసుకొని, అందులోనే అరటిపండు, యాపిల్, ద్రాక్ష చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవచ్చు. దీనికి కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకుంటే మరీ జారుగా కాకుండా, చక్కగా స్పూన్‌తో తినేలా ఫ్రూట్ సలాడ్‌లా భలేగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్రస్టింగ్‌గా తింటారు.
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మన అందరి జీవితాల్లో శాంతిని, సుఖ సంతోషాలను కలగ చేయాలని, అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం.!
Comments
Please login to add a commentAdd a comment