దివ్యం.. భవ్యం.. రమ్యం రామచరితం | sri rama navami 2024 festival special: Know all about sri Rama Navami Festival | Sakshi
Sakshi News home page

దివ్యం.. భవ్యం.. రమ్యం రామచరితం

Published Wed, Apr 17 2024 1:42 AM | Last Updated on Wed, Apr 17 2024 1:42 AM

sri rama navami 2024 festival special: Know all about sri Rama Navami Festival - Sakshi

నేడు శ్రీరామనవమి

పితృవాక్పాలన, ధర్మవర్తన, సదా సత్యమే పలకడం, ప్రజానురంజకమైన పాలనను అందించడం.. వంటి ఎన్నో లక్షణాలను బట్టి అందరి గుండెల్లో దేవుడిగా కొలువు తీరాడు రాముడు. అయితే మన నిత్యజీవితంలో అసలు రామ శబ్దం లేనిదెప్పుడు? చిన్నప్పుడు లాల పోసి శ్రీరామ రక్ష చెప్పడం దగ్గరనుంచి ‘రామాలాలీ.. మేఘశ్యామాలాలీ’ అనే జోలపాటతో బిడ్డలను నిద్ర పుచ్చడం వరకు... అందరి జీవితాలలో రాముడు ఒక భాగంగా మారిపోయాడు. నేడు ఆ జగదభిరాముడు ఇలపై పుట్టినరోజు.. అంతేనా... ఆదర్శదంపతులుగా పేరు ΄పొందిన సీతారాముల పెళ్లిరోజు కూడా. ఈ సందర్భంగా ఆ పురుషోత్తముడి గురించి...

ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలనూ, అన్నిసుఖాలనూ విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్యవాసం చేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెరవలేదు. తాను నమ్మిన సత్య, ధర్మమార్గాలనే అనుసరించాడు. ఒక మంచి కొడుకులా, అనురాగాన్ని పంచే భర్తలా, ఆత్మీయతను అందించే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ... అందరితో అన్ని విషయాలలోనూ వినమ్రతతో మెలిగే మర్యాద పురుషోత్తముడిలా... ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో ఆ విధంగానే నడుచుకున్నాడు.

అన్నివేళలా ధర్మాన్నే పాటించాడు. ఆపన్నులకు స్నేహహస్తాన్ని అందించాడు. ఆత్మీయులకు, మిత్రులకు అండగా నిలిచాడు. తాను అవతార పురుషుడినని అనలేదు. అనుకోలేదు కూడా... దేవుడినని ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరికీ ఏ ధర్మాన్నీ బోధించలేదు. తాను ఆచరించినదే ధర్మం – అనుకునే విధంగా వ్యవహరించాడు. అందుకే ధర్మం రూపు దాల్చితే రాముడిలా ఉంటుందేమో అనుకునేలా ప్రవర్తించాడు. 

సంపూర్ణావతారం
ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటిలోనూ సంపూర్ణమైనవి రామావతారం, కృష్ణావతారాలే. మిగిలినవి అంశావతారాలు. అంటే అప్పటికప్పుడు ఆవిర్భవించినవి. మత్స్య, కూర్మ, హయగ్రీవ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, కల్కి అవతారాలు. మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది, సన్మార్గంలో నడిపించడం కోసం మానవుడిలా పుట్టాడు. అందరిలాగే ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అయితేనేం, ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. అందుకే కదా... అతి సామాన్యులనుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి, సకల గుణాభిరాముడయ్యాడు.  

కల్యాణ వైభోగం
ఆ శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథి శ్రీరామ నవమి. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ పూజాదికాలు, రామనామ పారాయణం చేస్తారు. అసలు చైత్ర మాసప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధివీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు... ఇలా ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి.

కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు.  

పుట్టినరోజునే పెళ్లి వేడుకలా.!?
శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే శ్రీ సీతారామకళ్యాణం జరిపించడంలోని అంతరార్థం ఏమిటనేదానికి పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ఏమి చెబుతోందంటే– ఆ పరమాత్ముడు అవతారమూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాల్సి ఉందనీ, ఒకవేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించడం సంప్రదాయమని పేర్కొంది. అందుకే లోక కళ్యాణం కోసం సీతారాములకు çపుణ్యక్షేత్రమైన భధ్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు అభిజిత్‌ లగ్నంలో పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు.

 శ్రీరామ నవమినాడు ఏం చేయాలి? 
ఈరోజు రామునితోబాటు సీతాదేవి ని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా పూజించాలి. రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథుని కూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కళ్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసన కర్రలు దానం చేయడం మంచిది. 

సమర్పించవలసిన నైవేద్యం
పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర ΄పొంగలి, చెరకు, విప్పపూలు నివేదించాలి. సీతారామ కళ్యాణ తలంబ్రాలను ధరిస్తే ఆటంకాలు తొలగి సత్వరం వివాహం అవుతుందని పెద్దలంటారు.

నిత్యజీవితంలో రాముడు...
లాల పోసేటప్పుడు శ్రీరామ రక్ష, జోలపాడేటప్పుడు రామాలాలీ మేఘ శ్యామాలాలీ... ఓదార్పుగా అయ్యోరామ... అనకూడని మాట వింటే రామ రామ... పద్దు పుస్తకాలనుప్రారంభిస్తూ శ్రీరామ...  కూర్చునేటప్పుడు లేచేటప్పుడూ రామా... ఇలా ఆయన అందరి నాలుకలమీదా నర్తిస్తూనే ఉన్నాడు... ఉంటాడు. అల్లరి చేస్తే కిష్కింద కాండ, కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ విశాలమైన ఇంటి గురించి చెప్పేటప్పుడు లంకంత ఇల్లు పాతవాటి గురించి చెప్పాలనుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటిది...

సామెతలు: రామాయణంలో పిడకల వేట; రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు... చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహువంటారు. ఎంతకీ చూడ్డానికి రాబోతే సీతకన్నేశావంటారు. సైన్యంలా వస్తే రామదండు అంటారు. చక్కని జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. ఎవరైనా కొట్టుకుంటే రామరావణ యుద్ధమంటారు. అందరిళ్లలోని గిల్లి కజ్జాలను ఇంటంటి రామాయణమంటారు.  రాముడు మనకు విలువలను, వ్యక్తిత్వాన్నీ నేర్పితే రామాయణం మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరిమీదా ప్రసరించాలని కోరుకుంటూ....   – డి.వి.రామ్‌ భాస్కర్‌

తారక మంత్రం
‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే .. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకం విష్ణుసహస్ర నామంతో సమానమైనదంటారు.  మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమశ్శివాయల నుంచి తీసుకున్న అక్షరాల కలయిక అయిన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల కలిగే ఫలితం కంటె ఎక్కువ ఫలం కలుగుతుంది. మన పెదవులు రామనామంలోని ‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలకు రాకుండా మూసుకుంటాయి. కాబట్టి ‘రామ’ అనే రెండక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరిస్తుండడం వల్ల పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని కబీరుదాసు, భక్త రామదాసు, తులసీదాసు వంటి మహాభక్తులు ఉవాచించారు. 

శుభప్రదం... రామచరిత పారాయణం
రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది.  దేశం సుభిక్షంగా ఉంది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటి రాజుకొసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరుదాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామమయం’’ అని వేనోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుని పుణ్యచరితమైన రామాయణాన్ని విన్నా, చదివినా, అందులోని శ్లోకాలను, ఘట్టాలను మననం చేసుకున్నా, శుభం కలుగుతుందని ప్రతీతి. 

12 గంటలకు ఎందుకు?
రాముడు త్రేతాయుగంలో వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్‌ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు  జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి  శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్‌ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని భద్రాద్రిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశం నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి– ఆనాటి సాంప్రదాయం మేరకు నేటికీ భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమర్పించడం ఆనవాయితీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement