అయోధ్యలో తొలి శ్రీరామ నవమి వేడుకలు..ప్రత్యేకతలు ఏంటంటే..! | Rama Navami At Ayodhya: Suryatilak Ritual And Some Special Features | Sakshi
Sakshi News home page

అయోధ్యలో తొలి శ్రీరామ నవమి వేడుకలు..ప్రత్యేకతలు ఏంటంటే..!

Published Wed, Apr 17 2024 6:40 AM | Last Updated on Wed, Apr 17 2024 9:02 AM

Rama Navami At Ayodhya: Suryatilak Ritual And Some Special Features - Sakshi

అయోధ్యలో ప్రారంభమైన కొత్త రామాలయం తొలి శ్రీరామ నవమి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత జరగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకలు ఇవే కావడంతో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. అవేంటో సవివరంగా చూద్దామా..!

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేలా రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దర్శనం, హారతి సమయానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీరాముడిని దర్శించుకునేలా అనుమతించింది. సుమారు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవి. అందువల్ల ఈ రోజున వీఐపీ ప్రత్యేక దర్శనాలు నిషేధించారు. మళ్లీ ఈ నెల ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి వీఐపీ పాసులు అందుబాటులోకి రానున్నాయి.

దర్శన వేళలు..
ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది.

బాల రాముడికి సూర్యుడి తిలకం..
శ్రీరామ నమమి రోజున అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది.  బాలరాముడి నుదిటి మీద శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి కిరణాలు నుదిట మీద పడే విధంగా ఏర్పాటు చేశారు. పురాణల ప్రకారం..చైత్రమాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందువల్ల మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు బాల రాముడి నుదుటి మీద సూర్యకిరణాలతో తిలకం పడేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను ఇంట్లో ఉండి తిలకించే విధంగా ప్రత్యక్ష ప్రసారమయ్యేలా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అంతేగాదు అయోధ్య నగరం అంతటా దాదాపు వంద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రసారం కానున్నాయి. ట్రస్ట్ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయి.

ఏకంగా లక్ష కేజీల లడ్డూలు..
శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్‌ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు.

అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

(చదవండి: నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement