దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కళ్యాణం చేస్తారు..?
నవమి నాడే కళ్యాణం ఎందుకంటే..
ఆగమ శాస్త్రం ప్రకారం... శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం. అందువల్ల గొప్ప వ్యక్తులు, అవతార పురుషులు జన్మించిన తిథి నాడే.. ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం వేళ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు. ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలలో వివరించబడింది.
శ్రీరామ చంద్రుడు, జానకి దేవి ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు. వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు. అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగ శాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదమే సీతమ్మ తల్లి. చైత్రమాసం శుద్ద నవమి రోజున లోక కళ్యాణం అని సంకల్పంలో పండితులు చదువుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు. తలంబ్రాల కార్యక్రమంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం పాటను భజంత్రీలు పాడుతుంటారు. "శ్రీ సీతారామాభ్యాంనమ:" అంటూ పూజలు కూడా చేస్తారు.
ఈ శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. శ్రీరామచంద్రుడిని తెలుగు వారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. అంతేకాదండోయ్ రామాలయం లేని ఊరే ఉండదు కూడా. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు.
మరో కథనం ప్రకారం..
సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది.
కోదండ రామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంటా.. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేకం సమయాన తిలకించి పులకితులవుతారట. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతి ఏడాది భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ చరితార్థం అవుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
(చదవండి: Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment