
ఉడుపి శ్రీకృష్ణుడిని చూడాలి. శృంగేరి శారదామాతను దర్శించాలి. కుక్కె సుబ్రహ్మణ్యం... మంగళాదేవి...కుద్రోలి గోకర్ణనాథేశ్వర స్వామి ఆలయం. కద్రి... ధర్మస్థల మంజునాథులనూ చూడాలి.
అన్నింటినీ ఓకే ట్రిప్‌లో చుట్టేయవచ్చు. ఐఆర్‌సీటీసీ డివైన్ కర్నాటక ప్యాకేజ్ ఉంది. పై వాటితోపాటు మాల్పె... తన్నేర్‌బావి బీచ్‌లు. మినీ గోమఠేశ్వరుడు ఈ టూర్‌లో బోనస్.
మొదటి రోజు
ఈ రైలు హైదరాబాద్‌లో బయలుదేరి తెలంగాణలో జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్, డోన్, గుత్తి, యరగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి కాట్పాడి, జోలార్‌పేట, సేలం జంక్షన్, ఈ రోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్ తర్వాత కేరళలో అడుగుపెట్టి పాలక్కాడ్, షోర్‌నూర్, తిరూర్, కోళికోద్, వాడకర, తలస్సెరి, కన్నూరు, పయ్యనూర్, కన్హాగాడ్, కాసర్‌గోడ్ దాటిన తర్వాత కర్నాటకలో ప్రవేశించి మొత్తం 33 గంటలకు పైగా ప్రయాణించి 1532 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక ఐదు దక్షిణాది రాష్ట్రాలను చుట్టేస్తుందన్నమాట.
ఇది కేవలం మన గమ్యాన్ని చేరే ప్రయాణంగా భావిస్తే మంగళూరు చేరేలోపే బోర్ కొడుతుంది. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, కంటికి కనిపించిన అన్నింటినీ గమనిస్తూ, మనోనేత్రంతో విశ్లేషించుకుంటూ సాగితే ఐదు రాష్ట్రాల వైవిధ్యాన్ని, ప్రజల జీవనశైలిని ఒకే ప్రయాణంలో ఆస్వాదించవచ్చు.
రెండోరోజు
ఉదయం తొమ్మిదన్నరకు మంగళూరుకు చేరుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉడుపికి ప్రయాణం. హోటల్‌లో చెక్ ఇన్. శ్రీకృష్ణ ఆలయ దర్శనం, మాల్పే బీచ్ విహారం తర్వాత రాత్రి బస ఉడుపిలోనే. ఉడుపిలోని శ్రీకృష్ణుడిని ద్వైత తత్వాన్ని బోధించిన మధ్వాచార్యుడు స్థాపించాడు. ఈ ఆలయానికి వెళ్లినప్పుడు కళ్లు మూసుకుని స్మరించుకుని వెనక్కి వచ్చేశారంటే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు.
ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించాలి. దర్శనం కోసం క్యూలో ఉన్నంత సేపు ఆలయ ప్రాంగణాన్ని, అక్కడి ఆచార సంప్రదాయాలను గమనించాలి. బయటకు వచ్చిన తర్వాత గోపురాన్ని, శిల్పాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వెనుదిరగాలి.
ఎందుకంటే ఈ నిర్మాణం ఓ వైవిధ్యం. ఇలాంటి ఆలయం దేశంలో మరొకటి లేదు. శ్రీకృష్ణుడి దర్శనం తర్వాత మాల్పె బీచ్ విహారానికి వెళ్లవచ్చు. దీనిని ఒక అడ్వెంచర్ పార్క్ అని చెప్పాలి. స్టాల్స్‌లో దొరికే కన్నడ చిరుతిళ్లను రుచి చూస్తూ అరేబియా తీరాన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ సమయం గడపవచ్చు. టైమ్ ఉంటే సెయింట్ మేరీ ఐలాండ్‌కు వెళ్లిరావచ్చు.
ఉడుపిలో ఉన్న రోజు మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనంలో రకరకాల ఉడుపి రుచులను ఆస్వాదించడం మర్చిపోవద్దు. ఉడుపి హోటళ్లలో శాకాహారంతోపాటు మాంసాహారంలో స్థానిక స్పెషల్ వంటకాలను రుచి చూడాలి. ఎప్పుడూ సందడిగా ఉంటాయి. దేశమంతటా విస్తరించిన ఉడుపి హోటళ్లు ఎప్పుడూ సందడిగా ఉంటాయి. అలాంటిది ఉడుపిలో అసలు సిసలైన ఉడుపి రుచులను అసలే మిస్ కాకూడదు. ఇక్కడ తుళు భాష ఎక్కువగా మాట్లాడతారు. తుళు అంటే... దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగును ప్రశంసించిన కృష్ణదేవరాయల మాతృభాష.
మూడోరోజు
శృంగగిరి చల్లదనం..శారదామాత వీక్షణం
శృంగేరిలోని శారదాపీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో ఒకటి. రామాయణంలోని బాలకాండలో రుష్యశృంగుడి గురించిన ప్రస్తావన ఉంది. ఆ రుష్యశృంగుడు తపస్సు చేసుకున్న కొండ కావడంతో దీనికి శృంగగిరి శృంగేరి అనే పేరు వచ్చింది. ఎండకాలం చల్లగా ఉంటుంది. విద్యాశంకర ఆలయ నిర్మాణ కౌశలాన్ని ఆస్వాదించి, శారదామాత దర్శనంతో ఆశీస్సులు పొందిన తర్వాత ఆది శంకరాచార్యుని ఆలయం, శృంగేరి మఠం చూడాలి. హోటల్ గది చెక్ అవుట్ చేసి శృంగేరి వైపు సాగి΄ోవాలి. శారదాంబ ఆలయ దర్శనం తర్వాత మంగళూరుకు ప్రయాణం. రాత్రి బస మంగళూరులో.
నాల్గోరోజు
నేత్రానందం మంజునాథాలయం
ధర్మస్థలకు ప్రయాణం, మంజునాథ ఆలయ దర్శనం, ఆ తర్వాత కుక్కె సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని సాయంత్రానికి మంగుళూరు చేరాలి. ఆ రాత్రి బస కూడా మంగళూరులోనే. ఇక ధర్మస్థల... నేత్రావతి నది తీరం. ఇక్కడ మంజునాథ ఆలయంతోపాటు మంజూష మ్యూజియాన్ని కూడా చూడాలి. ఇది పరిశోధన గ్రంథాల నిలయం. మాన్యుస్క్రిప్ట్‌లు, పెయింటింగ్‌లున్నాయి.
పక్కనే ఒక కొండ మీద 39 అడుగుల గోమఠేశ్వరుడిని చూడాలి. ఇది యాభై ఏళ్ల కిందట చెక్కిన శిల్పం. బాహుబలిగా చెప్పుకునే అసలు గోమఠేశ్వరుడి విగ్రహం కాదిది. అసలు గోమఠేశ్వరుని ప్రతిరూపాలు మరో నాలుగున్నాయి కర్నాటకలో. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వింటేజ్ కార్ మ్యూజియాన్ని కూడా విజిట్ చేయవచ్చు.
పరశురాముడి క్షేత్రం
కుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయం... ఇది కుమారధార నది తీరాన ఉంది. ఐదు వేల ఏళ్ల నాటి ఆలయం. ఇది కార్తికేయుడి ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి పేరుతో పూజలందుకుంటున్నాడు. గరుడుని బారి నుంచి తప్పించుకోవడానికి వాసుకి ఇక్కడకు వచ్చాడని చెబుతారు. పురాణేతిహాసాల ప్రకారం ఈ ప్రదేశం పరశురాముడు స్థాపించిన ఏడు క్షేత్రాల్లో ఇదొకటి.
ఐదోరోజు
మంగళాదేవి ఆలయం విశాలంగా ఉంటుంది. చక్కటి గోపురం, లోపల నిర్మాణాలకు ఎర్ర పెంకు పై కప్పు, వర్షపునీరు జారి΄ోవడానికి వీలుగా ఏటవాలుగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది. కద్రి మంజునాథ ఆలయ గోపురం ప్రత్యేకమైన వాస్తుశైలిలో ఉంటుంది. ఇక టూర్‌లో సేదదీరే ప్రదేశం తన్నేర్‌బావి బీచ్.
ఇది పర్యటనకు అనువైన ప్రదేశంగా బ్లూ ప్లాగ్ గుర్తింపు పొందిన బీచ్. వీలైతే సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. ఇక చివరగా కుద్రోలి గోకర్ణనాథేశ్వర ఆలయం కొత్తది. రాజులు నిర్మించినది కాదు. కేవలం వందేళ్ల దాటింది. కన్నడ సంప్రదాయ యక్షగాన కళాకారుడు, యుద్ధవిద్య గారడి విన్యాసాలు చేసేవాళ్లు సమూహంగా మారి నిర్మించుకున్నారు.
ఆరవ రోజు
రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు కాచిగూడకు చేరుతుంది. పర్యటన అలసట తీరే వరకు విశ్రాంతి తీసుకున్న తర్వాత టూర్ మొదటి రోజు చూసిన ప్రదేశాల విండో టూర్‌ను మరోసారి ఆస్వాదించవచ్చు.
ప్యాకేజ్ ఇలా...
ప్యాకేజ్‌లో బస త్రీ స్టార్ హోటల్‌లో ఉంటుంది. ఏసీ వాహనాల్లో ప్రయాణం. మూడు రోజులు బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది.
భోజనాలు, ట్రైన్‌లో కొనుక్కునే తినుబండారాలు, సైట్ సీయింగ్ ప్రదేశాల ఎంట్రీ టికెట్‌లు, బోటింగ్ – హార్స్ రైడింగ్ వంటి వినోదాల ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు.
ఈ రైలు వారానికొకసారి మాత్రమే ఉంటుంది. ప్రతి మంగళవారం కాచిగూడలో బయలుదేరుతుంది.
సింగిల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపు 39 వేలవుతుంది. ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలవుతుంది.
డివైన్ కర్నాటక (ఎస్‌హెచ్‌ఆర్086). ఇది ఆరు రోజులు ఐదు రాత్రుల టూర్ ప్యాకేజ్. ఇందులో ప్రధానంగా ధర్మస్థల, మంగళూరు, శృంగేరి, ఉడిపి కవర్ అవుతాయి.
– వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్ ప్రతినిది
(చదవండి: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..! స్పెషాలిటీ ఏంటంటే..)