karnatak
-
Maithili: 'ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్' గా.. వేగాన్ లెదర్!
"ఒక చదరపు మీటరు లెదర్ తయారయ్యే ప్రక్రియలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ఎంతో ఊహించగలరా? అక్షరాలా 17 కిలోలు. లెదర్ బ్యాగ్‌లు, షూస్, బెల్టులు, పర్సులు, వాచ్‌ల మీద మనకున్న మక్కువ తక్కువేమీ కాదు. కానీ పర్యావరణానికి ఇంత చేటు చేస్తుందని తెలిసిన తర్వాత వాటి వాడకాన్ని ప్రోత్సహించలేం, మమకారాన్ని చంపుకోలేం. అన్నింటికీ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాం కదా! దీనికి కూడా ఓ మార్గం కనిపించకపోతుందా! సరిగ్గా ఇలాగే ఆలోచించిన మైథిలి పోకచెట్టు బెరడుతో ఓ ప్రత్యామ్నాయాన్ని మన ముందుకు తెచ్చారు. అదే వేగాన్ లెదర్. వేగాన్ లెదర్‌ని ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్గా పరిచయం చేస్తున్నారు మైథిలి." తిరిగి ఇచ్చేద్దాం! మైథిలిది కర్నాటకలోని శృంగేరి. ఆమె భర్త సురేశ్‌తో కలిసి ‘భూమి ఆగ్రో వెంచర్స్’ పేరుతో వేగాన్ లెదర్ తయారీ పరిశ్రమను స్థాపించారు. ఈ ప్రయత్నం కేవలం పర్యావరణహితం కోసం, మనుషులను పర్యావరణ హిత జీవనశైలి దిశగా నడిపించడమేనన్నారామె. కంప్యూటర్స్‌తో మొదలు పెట్టిన కెరీర్ వేగాన్ లెదర్ పరిశ్రమ వైపు మలుపు తీసుకోవడాన్ని వివరించారామె. మాది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలో లక్షలాది ఎకరాల్లో పోక చెట్లను పెంచుతారు. మేము చదువు పూర్తయిన తర్వాత శివమొగ్గలో కంప్యూటర్ సేల్స్, సర్వీసెస్ వ్యాపారం మొదలుపెట్టాం. పాతికేళ్లపాటు విజయవంతంగా నిర్వహించాం. ఇక మా వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందనే అభి్రపాయానికి వచ్చాం. అలాంటి సమయంలో ఓ సారి మా సొంతూరికి వచ్చినప్పుడు పోకచెట్టు బెరళ్లను చూసినప్పుడు ఈ ఆలోచన వచ్చింది. కప్పులే కాదు చెప్పులు కూడా! పర్యావరణ ప్రేమికులు కొందరు పోకచెట్టు బెరడుతో ఫంక్షన్లలో భోజనం వడ్డించే ప్లేట్లు, పాయసం వడ్డించే కప్పుల వంటి వాటిని చేస్తున్నారు. పేపర్ ప్లేట్‌కు బదులు అరెక్కా (పోకచెట్టు) ప్లేట్ వాడడం వల్ల పేపర్ తయారీ సమయంలో జరిగే నీటికాలుష్యాన్ని నివారించిన వారమవుతాం. అయితే పోకచెట్టును ఇంకా విస్తృతంగా వినియోగంలోకి తీసుకు రాగలిగితే పర్యావరణానికి హానికారకంగా మారుతున్న అనేక పరిశ్రమలకు ఇది చక్కటి ప్రత్యామ్నాయం అవుతుందని ఆలోచించాం. అప్పుడు మాకు మొదటగా తోళ్ల పరిశ్రమ గుర్తువచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన త్జీర్డ్ వీన్హోవెన్ కూడా తోళ్లకు ప్రత్యామ్నాయం కోసం మొక్కలపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిసింది. మా పోకచెట్టు బెరడు ఆలోచన వీన్హోవెన్కు కూడా నచ్చింది. ప్రయోగాలు చేయగా చేయగా మా ప్రయత్నం విజయవంతం అయింది. ఇది జంతువులకు ప్రాణహానిని నివారించే లెదర్ కాబట్టి వేగాన్ లెదర్, పామ్ లెదర్ అంటున్నాం. రసాయన రహిత, భూమిలో కలిసిపోయే మెటీరియల్ ఇది. తేలికగా ఉంటుంది కూడా. ఇప్పుడు పెద్ద ఎత్తున వేగాన్ లెదర్‌ను ఎగుమతి చేస్తున్నాం. వీటితో పెన్హోల్డర్లు, చెప్పులు, పుస్తకాల అట్టలు, వ్యానిటీ బ్యాగ్ తదితరాలు తయారవుతున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు ఇందులో చక్కటి సేవందిస్తున్నారు. గత ఏడాది మే–జూన్ నెలల్లో జీ 20 సదస్సుల సందర్భంగా స్టాల్ నిర్వహించాం. యానిమల్ లెదర్ తయారీలో కార్బన్ డయాక్సైడ్‌తోపాటు నీటి కాలుష్యం కూడా ఎక్కువే. యానిమల్ లెదర్ కోసం పాతిక వేల లీటర్ల నీరు అవసరమయ్యే చోట పామ్ లెదర్ తయారీకి నీటి వాడకం ఆరు వందల లీటర్లకు మించదు. పైగా పామ్ లెదర్ తయారీలో వాడిన నీటిని తిరిగి పంటలకు వినియోగించుకోవచ్చు కూడా. మేము సమాజానికి తిరిగి ఇవ్వాలనే ప్రయత్నంతో చేసిన ఆలోచన నుంచి పర్యావరణానికి మా వంతుగా సేవలందించే అవకాశం వచ్చింది. సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు’’ అన్నారు మైథిలి. ఇవి చదవండి: ‘మనకెందుకమ్మా వ్యాపారం.. పెద్ద రిస్క్’ అని అనుకుంటే..!? ఇప్పుడిలా.. -
భూమిపై మోదీ ఒక్కరే లేరు! రాహుల్ గాంధీ ధ్వజం
సాక్షి, శివమొగ్గ: కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని మోదీ కేవలం తన గురించి మాత్రమే చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘భూమిపై మోదీ ఒక్కరే లేరు. సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. కానీ ఆయన మరే విషయమూ మాట్లాడటం లేదు’’ అన్నారు. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా బాళేబైలిలో మంగళవారం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. మోదీ మొదటగా సామాన్య ప్రజల గురించి మాట్లాడాలని సూచించారు. కర్ణాటకలో సొంత పార్టీ నేతల అవినీతిపై ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. (చదవండి: పాక్ చొరబాటుదారుల కాల్చివేత..డ్రగ్స్ స్వాధీనం) -
బయటకొస్తే బైకు మాకు.. పువ్వు మీకు
సాక్షి, బెంగళూరు (బనశంకరి): కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌లోనూ బెంగళూరు ప్రజలు మామూలుగానే సంచరిస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు కఠిన చర్యలకు దిగారు. రోజూ ఉదయం 10 గంటల అనంతరం నగర ప్రముఖ రోడ్లలో బ్యారికేడ్లు అమర్చి తనిఖీ చేయడం, అకారణంగా బయటకు వచ్చారని తేలితే వాహనం సీజ్ చేసి జరిమానా, కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల లాక్డౌన్ ఉల్లంఘనులకు బస్కీలు, గుంజీలు తీయడం, లాఠీలతో పోలీసులు పాఠం చెబుతుంటే కొన్నిచోట్ల మర్యాదగా బైక్ సీజ్ చేయడం జరుగుతోంది. బెంగళూరు పీణ్యా పోలీసులు బయట తిరిగేవారికి గులాబీ పువ్వు అందించి బైక్ స్వాధీనం చేసుకుంటున్నారు. జరిమానాల వల్ల సర్కారుకు రూ.3.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఫైన్లపై పలుచోట్ల ప్రజలు– పోలీసులతో గొడవలకు దిగడం వల్ల ఉద్రిక్తతలూ చోటు చేసుకుంటున్నాయి. మాగడిరోడ్డు, నాగరబావి, మైసూరురోడ్డు, యశవంతపుర, హెబ్బాల, తుమకూరురోడ్డు, శివాజీనగర, శాంతినగర, కార్పొరేషన్ సర్కిల్, కేఆర్.మార్కెట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో వాహనాల సంచారం అధికంగా ఉంటోంది. ఏదో కారణంతో బయటకు.. యథాప్రకారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు సడలింపు ఉంటోంది. ఆ తరువాత కూడా రద్దీ తగ్గడం లేదు. ఎక్కువమంది మెడికల్ షాపులు, వ్యాక్సినేషన్ అనే కారణాలు చెబుతున్నారు. లేదా.. కరోనా టెస్టుకు, ఆసుపత్రికి, వంటగ్యాస్ తీసుకురావడానికి వెళుతున్నాము అని చెబుతారు. అయినప్పటికీ పోలీసులు వాహనాల సీజ్ చేస్తుండడంతో వాహనదారులు లబోదిబోమనడం పరిపాటైంది. 31 వేల వాహనాలు సీజ్.. ఇప్పటివరకు నగర పరిధిలో 31,515 వాహనాలను జప్తుచేసి రూ.3.50 కోట్లు జరిమానా వసూలు చేశారు. ఇందులో బైకులు 25,658, ఆటోలు 1,308, కార్లు తదితరాలు 1,549 ఉన్నాయి. చదవండి: చూ మంతర్‌కాళి.. కరోనా పో: బీజేపీ ఎమ్మెల్యే పూజలు -
తుపాకి కాల్చటం నేర్పిస్తానని భార్యను..
సాక్షి, బెంగళూరు : తుపాకీని కాల్చడం నేర్పిస్తానని భార్యను పొట్టనబెట్టుకున్నాడో భర్త. ఈ సంఘటన కర్ణాటక, తుముకూరు జిల్లాలోని డి.కొరటిగెరెలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలు శారద (28). సోమవారం రాత్రి 9:30 సమయంలో ఆమె భర్త కృష్ణప్ప (35) తన స్నేహితుని వద్దనున్న నాటు తుపాకీని తీసుకొచ్చి దీనిని ఎలా కాల్చాలో చూపిస్తానన్నాడు. ఏం జరిగిందో కానీ తూటా పాయింట్ బ్లాంక్‌లో నేరుగా ఆమె తలలోకి దూసుకుపోయింది. అభాగ్యురాలు క్షణాల్లో మృతిచెందింది. తెల్లవారుజామున 2 గంటలకు హెబ్బూరు పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని కృష్ణప్పను అరెస్టు చేశారు. కావాలనే హత్య చేశాడా, ప్రమాదవశాత్తు జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. -
దాసీపై మాస్పతాస్త్రం
దురాచారం ఒక వ్యవస్థగా వేళ్లూనుకున్నప్పుడు దానిని పెకలించే మహాశక్తి ఏదైనా ఆవిర్భవించాలి.అలా ఆవిర్భవించి, ‘దేవదాసీ’ వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేస్తున్న స్త్రీశక్తే... మాస్. కడుపులో ఉన్న ఆడబిడ్డను కడుపులో ఉండగానే చంపేయడం, పదేళ్లు కూడా దాటని పసిమొగ్గలపై అత్యాచారాలకు పాల్పడటం.. ఇవన్నీ ప్రతిరోజూ మనం వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. అయితే కడుపులో ఆడబిడ్డ ఉందని తెలిస్తే చాలు, ఆ బిడ్డను అప్పుడే అమ్మేసే సంస్కృతి గురించి విన్నప్పుడు మాత్రం మనం ఉన్నది ఎలాంటి సమాజంలో! అనే ప్రశ్న తలెత్తక మానదు. ఒకరిది పేదరికం, మరొకరిది తెలియనితనం, ఇంకొకరిది ఇదేంటని ప్రశ్నించలేని పిరికితనం.. ఇవన్నీ కలిసి వారిని దేవదాసీలుగా మార్చాయి. తమ పెద్దలు, ఊళ్లో వాళ్లు చెప్పిందే వేదవాక్కంటూ ఎన్నో ఏళ్లు దేవదాసీలుగా మగ్గిపోయారు. ఎన్నో అవమానాలు పడ్డారు. దేవుడికి అంకితం చేశామనే పేరుతో ‘మగాళ్ల‘కు అప్పగించేస్తుంటే పంటిబిగువున బాధను ఆపుకున్నారు. తమ బిడ్డలకు సమాజం నుండి ఛీత్కారాలు ఎదురవుతున్నా తమ రక్తాన్ని గంజిగా మార్చి దానినే వారికి పానకంలా తాగించారు. అలా ఎన్నో ఏళ్లు సాగాయి. తమలా మరికొందరు ఆ దారుల్లోకి వస్తూనే ఉన్నారు. అంతేకాదు, కడుపులో ఉన్న ఆడబిడ్డలు కడుపులోనే అమ్ముడయిపోతున్నారు. అప్పుడే వారికి అర్థమైంది.. ఇంకా ఇలానే భరిస్తూ పోతే తమ బిడ్డలను కూడా అదే నరకంలోకి తోస్తారని. అంతే.. కళ్లు తెరిచారు. తమ భావితరాలు ‘దాసీ’ బతుకుల్లో మగ్గిపోకూడదని పోరాటం ప్రారంభించారు. ఇంకా పోరాడు తూనే ఉన్నారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన దేవదాసీల్లో వచ్చిన ఈ మార్పు ఓ విప్లవంలా కొనసాగుతోంది. కర్ణాటక దేవదాసీ(ప్రొహిబిషన్ ఆఫ్ డెడికేషన్)యాక్ట్-1982 ద్వారా రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థపై ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. అయితే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48 వేల మంది దేవదాసీలున్నట్ల్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వీరిలో ఎక్కువమంది బీదర్, బెల్గాం, రాయచూరు, బళ్లారి ప్రాంతాల్లో ఉన్నారు. ఒక్క బెల్గ్గాంలోనే దాదాపు 5 వేల మంది దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా బెల్గ్గాం జిల్లాలో దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తూ అనంతరం తమ జీవన విధానాన్ని మార్చుకున్న కొంతమంది మహిళలతో ఏర్పాటైన సంస్థే ‘మాస్’(మహిళల అభివృద్ధి సంరక్షణా సంస్థ-ఎంఏఎస్ఎస్). సామాజిక దురాచారమైన దేవదాసీ చెరలో మగ్గుతున్న బెళ్గావి జిల్లాలోని కొందరు మహిళలు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల ప్రమేయంతో ఆ చెర నుండి బయటపడ్డారు. వారిలో సీతవ్వ, సరసవ్వ, ఐరావతిలు కూడా ఉన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 1997లో ‘మాస్’ పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం పదుల సంఖ్యలో సభ్యత్వంతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం దాదాపు 4,500 మంది మాజీ దేవదాసీలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దేవదాసీ పద్ధతిని రూపుమాపేందుకు ‘మాస్’ సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ విషయంపై ‘మాస్’ సంస్థ కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్న సీతవ్వ, సంస్థ సభ్యురాలైన ఐరావతి ఏమంటారంటే...‘‘బెళ్గావిలోని గోకాక్ తాలూకాలో ఉన్న యల్లమ్మ గుడ్డలో జరిగే జాతరలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అమ్మాయిలను దేవదాసీలుగా మార్చేవారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి తమ ఆడపిల్లలను దేవదాసీలుగా మారుస్తుంటారు. అయితే మా సంఘం ఏర్పాటైన నాటి నుండి అక్కడ ఎవరినీ దేవదాసీలుగా మార్చకుండా చూస్తున్నాం. ఇంతకు ముందు మేము దేవదాసీలుగా ఉన్న వాళ్లమే కాబట్టి ఎవరైనా తమ సంబంధీకుల్లో లేదా ఇతరుల ఆడబిడ్డలను దేవదాసీలుగా మారుస్తున్నారా అన్న విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంటుంది. దేవదాసీ వ్యవస్థపై నిషేధం విధించిన నాటినుండి అమ్మాయిలను దేవదాసీలుగా మార్చే ప్రక్రియ రాత్రివేళల్లో సాగుతోంది. అందుకే మా సంస్థ సభ్యులతో బృందంగా వెళ్లి రాత్రివేళల్లో నిఘా వేసేవాళ్లం. ఆ సందర్భంలో అమ్మాయి సంబంధీకులు మాపై దాడులకు కూడా పాల్పడ్డారు. అయినా సరే, మరే ఆడబిడ్డా మాలాగా మారకూడదనే దృఢ నిశ్చయంతో వారిని అడ్డుకునేవాళ్లం. అలా ఎంతోమంది ఆడబిడ్డలను ఆ చెరలో పడకుండా చూడగలిగాము’’ అంటూ తమ సంఘం చేసిన పనులను చెప్పారు ఐరావతి. చెరవీడినవారికి.... దేవదాసీ వ్యవస్థలో మగ్గి ప్రస్తుతం ఆ చెరనుండి బయటపడ్డ వారు వారి పిల్లలకు ఓ పుట్టినిల్లులా భరోసా ఇస్తోంది ‘మాస్’. మాజీ దేవదాసీలు, వారి పిల్లలకు రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మేమున్నామంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తోంది. తమపై జరిగే అన్యాయాలను నిరోధించేందుకు గాను మాస్ సంస్థలో న్యాయ సలహా కేంద్రం కూడా ఏర్పాటైంది. న్యాయవ్యవస్థ నుండి తమకు లభించే ప్రయోజనాలు, న్యాయస్థానాల నుండి సహాయాన్ని ఎలా పొందవచ్చు అనే అంశాలపై కూడా సలహాలు, సూచనలు అందిస్తోంది. వీటితో పాటు మాస్ సంస్థలోని సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బాల్యవివాహాలను అరికట్టడంతో పాటు వివిధ సామాజిక దురాచారాలపై వీధినాటికలను ప్రదర్శిస్తూ గ్రామాల్లోని మహిళల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు చేయాల్సిన కృషి వంటి అంశాలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉంటారు. మాజీ దేవదాసీల పిల్లలకు మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేస్తోంది మాస్. ఈ క్రమంలో మాస్ సంస్థ సభ్యులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సరే ఎలాంటి అవరోధాలనూ లెక్కచేయక ముందుకు సాగుతున్నారు. - షహనాజ్ కడియం, సాక్షి, బెంగళూరు; ఫొటోలు: టి.కె. ధనుంజయ స్వయం ఉపాధి కూడా... ‘దేవదాసీ విధానం నుండి విముక్తి కల్పించిన తర్వాత మేం ఆలోచించింది మా ఉపాధి గురించి, మా బిడ్డల భవిష్యత్తు గురించి. అందుకే ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ముందుగా మేం స్వయం ఉపాధి కార్యక్రమంలో శిక్షణ తీసుకున్నాం. బుట్టల అల్లిక, ఎంబ్రాయిడరీ, అగరుబత్తుల తయారీలో శిక్షణ పొంది మా సభ్యులకు కూడా శిక్షణ ఇప్పించాం. ప్రస్తుతం మా సంస్థలోని సభ్యులంతా స్వశక్తితో జీవనాన్ని సాగిస్తున్నారు. మా సంఘంలోని సభ్యుల పిల్లల ఉన్నత చదువుల కోసం రుణాలను కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది మాజీ దేవదాసీల పిల్లలు ‘దాసీ’ శృంఖలాలను తెంచుకుంటూ తమదైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. - సీతవ్వ, మాస్ సంస్థ కార్యనిర్వాహక అధికారి -
గుండె ‘చెరువు’
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: కర్ణాటక ప్రాంతం నుంచి వరద నీరు జిల్లా మీదుగా ప్రవహిస్తున్నా చెరువుల్లో చుక్క నీరు చేరని పరిస్థితి. నేతల మౌనంతో వీటి కింద 80,190 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమవుతోంది. రెండు మూడేళ్లుగా వరుస కరువుతో చెరువులు ఒట్టిపోయాయి. ఈ ఏడాది వర్షాకాలంలో రెండు నెలలు గడిచినా 10 శాతం చెరువుల్లోనూ నీరు చేరకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో 479 పంచాయతీరాజ్, 163 చిన్న నీటిపారుదల చెరువులతో పాటు సుమారు 1000 పైగా చిన్న చెరువులు, ఊట కుంటలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వర్షాలు ఆశాజనకంగా లేకపోవడం.. చెరువుల్లో ఆశించిన నీరు చేరకపోవడం గమనార్హం. ఆదోని, తుగ్గలి, హలహర్వి, మద్దికెర, వెలుగోడు ప్రాంతాలను మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లో వర్షపాతం అంతంతమాత్రమే నమోదైంది. కర్ణాటక, మహరాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా తుంగభద్ర, కృష్ణా నదులకు భారీగా వరద నీరు రావడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. అయితే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంలో నీటి పారుదల శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వృథాగా దిగువకు వదిలే బదులు కాల్వలకు అనుబంధంగా ఉన్న చెరువుల్లో నింపుకునే అవకాశాలున్నా.. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం రైతన్నకు శాపమవుతోంది. ఈ కారణంగా సీజన్లో చెరువుల కింద ఆయకట్టు సాగు ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల డివిజన్లోని మహానంది మండలంలో ఆరు చెరువుల పరిధిలో 1892.41 ఎకరాల ఆయకట్టు ఉండగా వర్షాలు లేకపోవడంతో బీడావారుతున్నాయి. పాణ్యం, బనగానపల్లె, అవుకు మండలాల్లో 21 చెరువుల కింద 7914.31 ఎకరాల ఆయకట్టు సాగవుతుండగా.. ఇప్పటి వరకు ఏ ఒక్క చెరువులో చుక్క నీరు చేరకపోవడంతో రైతులు బెంగపెట్టుకున్నారు. కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లోని చెరువుల కింద నేటికీ విత్తనం పడకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కర్నూలు డివిజన్ విషయానికొస్తే పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని 16 చెరువుల్లో మాత్రమే నీటి నిల్వలు ఉండగా.. మిగతా మండలాల్లోని చెరువుల్లో నీరు లేక సాగు ప్రశ్నార్థకమైంది. ఈ విషయాన్ని ‘న్యూస్‌లైన్’ ఎస్ఈ ఎ.సుధాకర్ దృష్టికి తీసుకెళ్లగా జిల్లాలోని చిన్న నీటి పారుదల శాఖ పరిధిలోని చెరువులను కాల్వల ద్వారా నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదన్నారు. ఉత్తర్వులు అందిన వెంటనే చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.