
రత్నాల రాశులతో విలసిల్లిన నేల హంపి. కాఫీ తోటలతో విలసిల్లుతున్న చిక్‌మగళూరు. హొయసల వాస్తుశైలికి తార్కాణం హలేబీడు. బహు విశేషణాల మల్లిగ మాల మైసూరు. మైసూర్ పాలకుల బెంగళూరు ప్యాలెస్.మధ్యలో మృగరాజు గాండ్రించే బందీపూర్.చివరాఖరుకు అరేబియా తీరాన గోవా...ఒకే రైలుబండిలో మొత్తం తిరిగి వద్దాం. రాజమహల్లాటి గోల్డెన్ చారియట్ ట్రైన్ ఉంది. ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా ప్యాకేజ్ ఉంది. మెనీ మెనీ థాంక్స్ టూ ఐఆర్‌సీటీసీ.
గోల్డెన్ చారియట్ అనేది మనదేశంలో విలాసవంతమైన పర్యటన కోసం ఇండియన్ రైల్వేస్ డిజైన్ చేసిన రైలు ప్రయాణం. ఇందులో ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా, జ్యువెల్స్ ఆఫ్ సౌత్, గ్లింప్సెస్ ఆఫ్ కర్నాటక ప్యాకేజ్‌లున్నాయి. ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా ప్యాకేజ్‌లో బెంగళూరు, నంజన్‌గుడ్, బందీపూర్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీ, మైసూరు, హలేబీడు, చిక్‌మగుళూరు, హంపి, గోవాలు కవర్ అవుతాయి.
1వ రోజు
బెంగళూరు నుంచి నంజన్‌గుడ్‌కి ప్రయాణం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పర్యాటకులు యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఉదయం ఎనిమిదిన్నరకు ట్రైన్ ఎక్కి లో తమకు కేటాయించిన క్యాబిన్‌లో చెక్ ఇన్ అవుతారు. రైలు 9.45కి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
లంచ్ రైల్లోనే. మధ్యాహ్న ఒకటిన్నరకు నంజన్‌గుడ్ చేరుతుంది. రైలు దిగిన తర్వాత రోడ్డు మార్గాన బందిపూర్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీకి ఒకటిన్నర గంట ప్రయాణం. సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు అడవిలో విహారం తర్వాత తిరిగి నంజన్‌గుడ్ స్టేషన్‌కు చేరి రైలెక్కాలి. ఎనిమిది తరవాత రాత్రి భోజనం. రైలు మైసూరు వైపు సాగుతుంది.
బందీపూర్: ఇది దట్టమైన అడవి. పశ్చిమ కనుమలు అంటేనే పచ్చదనానికి పుట్టిల్లు. దట్టమైన అడవుల నెలవు. ఈ పర్వతశ్రేణుల్లో విస్తరించిన అడవి ఇది. ఈ పులుల సంరక్షణ కేంద్రంలో పులి ఠీవిగా రాజుగా సంచరిస్తుంటుంది. కానీ పగలు చూడలేం. సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్‌ని మాత్రమే చూడగలం. మైసూర్– ఊటీ హైవేలో ఉంది. ఈ అటవీ ప్రాంతం ఏనుగులు, రకరకాల జింకలు, వందలాది జాతుల పక్షుల నిలయం.
ఇక్కడ మహావృక్షాలను చూడడానికి తలెత్తి ఆకాశాన్ని చూడాల్సిందే. ఆకాశాన్నంటే మహావృక్షాలనే అతిశయోక్తి అలంకారం ఈ వృక్షాలను చూసే పుట్టిందేమో! వెదురు, టేకు, రోజ్‌వుడ్ వృక్షాలుంటాయి. చందనవృక్షాలను తాకి చేతిని వాసన చూసుకుని మురిసిపోవచ్చు. అడవిలో సఫారీకి పర్యటించడానికి జీపులు, మినిబస్సులున్నాయి. ఇప్పుడు ఎలిఫెంట్ సఫారీ లేదు. ట్రెకింగ్ చేయవచ్చు. కానీ ఈ టూర్ ప్యాకేజ్‌లో అంత సమయం ఉండదు.
2వ రోజు
మైసూరు పర్యటన. ఉదయం రైల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత రైలు దిగి మైసూరు ΄్యాలెస్‌కు రోడ్డు ప్రయాణం. మధ్యాహ్న భోజనం సమయానికి రైలెక్కాలి లేదా ఆ సమయంలో శ్రీరంగపట్టణం వెళ్లి రావచ్చు. ట్రైన్ శుభ్రం చేసుకోవడం కోసం ఆగుతుంది. రాత్రి భోజనం రైల్లోనే, బనావర్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణం సాగుతుంది.
మైసూరు: ఈ నగరానికి ఉన్నన్ని విశేషణాలు బహుశా మరే నగరానికీ ఉండక΄ోవచ్చు. హెరిటేజ్ సిటీ, సిటీ ఆఫ్ ΄్యాలెస్, ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కర్నాటక, సాండల్‌వుడ్ సిటీ, సిటీ ఆఫ్ జాస్మిన్...ఇన్ని పేర్లతో పిలుచుకుంటారు. ఇంకా ముఖ్యంగా పర్యాటకులు గుర్తుంచుకోవాల్సింది మైసూరు ఉచ్చారణ గురించి. ఇంగ్లిష్ స్పెల్లింగ్ ఆధారంగా మైసూర్ లేదా మైసోర్ అని పలికితే కన్నడిగులకు నచ్చదు. సౌమ్యులు కాబట్టి కోప్పడరు కానీ నొచ్చుకుంటారు.
మైసూరు అనాల్సిందే. వడయార్‌లు నివసించిన మైసూరు ప్యాలెస్, మైసూరుకి ఆ పేరు తెచ్చిన చాముండి హిల్స్‌లో చాముండేశ్వరి ఆలయం వంటి పర్యాటక ప్రదేశాలను చూసిన తర్వాత ఇక్కడ దొరికే మైసూరు మల్లిగె (మల్లెపూలు)లు కొనుక్కుని జడకు చుట్టుకుని మురిసి΄ోవాల్సిందే. అలాగే మైసూరు సిల్క్ చీరలు, మైసూర్ శాండల్ సోప్‌లు కూడా.
3వ రోజు
హలేబీడు, చిక్‌మగళూరుకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బణావర్‌లో రైలు దిగి హలేబీడుకు వెళ్లాలి. హలేబీడు సైట్‌సీయింగ్ తర్వాత రైలెక్కి మధ్యాహ్న భోజనం చేస్తూ చిక్‌మగుళూరుకు వెళ్లాలి. సాయంత్రం కాఫీ తోటల్లో విహారం, సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత అక్కడే రాత్రి భోజనం పూర్తి చేసుకుని రైలెక్కి హోస్పేటకు సాగి΄ోవాలి.
హలేబీడు... ఇది 11వ శతాబ్దంలో విలసిల్లిన హొయసల సామ్రాజ్యానికి తార్కాణం. ఢిల్లీ సుల్తానుల విధ్వంసం తర్వాత మిగిలిన శిథిలాలు నాటి శిల్పుల గొప్పదనాన్ని తెలుసుకోవడానికి మిగిలిన ఆనవాళ్లు. ఏకరాతిలో చెక్కిన మహాశిల్పాలు చూపుతిప్పుకోనివ్వవు. బారులు తీరిన ఏనుగులు, సింహాలతో ఆలయం గోడలంతా శిల్పనైపుణ్యమే. ఈ శిల్పాలను ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తే ఇందులో ఒక మహా చారిత్రక గ్రంథం దాగి ఉందని చెబుతారు చరిత్రకారులు.
చిక్‌మగళూరు: విస్తారమైన కాఫీ తోటల మధ్య కాఫీ సువాసనను ఆఘ్రాణిస్తూ విహరించడం గొప్ప అనుభూతి. కాఫీ తోటల్లో చెట్ల సన్నని కొమ్మలు కాఫీ గింజల బరువుకు నేలకు వంగి΄ోతుంటాయి. ఆకు పచ్చ రంగు నుంచి ఎరుపు రంగుకు మారిన గింజలను కోసి బుట్టలో వేస్తుంటారు మహిళలు.
టీ తోటల్లో టీ ఆకు సేకరించేవాళ్లు బుట్టను వీపుకు కట్టుకుంటారు. కాఫీ గింజలను సేకరణలో బుట్టను ముందుకు తగిలించుకుంటారు. కాఫీ పొడి తయారు చేసే ఫ్యాక్టరీల నుంచి కాఫీ వాసన గాల్లో తేలుతూ పర్యాటకులను ఆహ్వానిస్తుంది.
4వ రోజు
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోస్పేట జంక్షన్‌లో ట్రైన్ దిగి హంపిలోని పర్యాటకప్రదేశాల వీక్షణానికి తీసుకువెళ్తారు. లంచ్ సమయానికి తిరిగి రైలెక్కాలి. సాయంత్రం వరకు ఖాళీ సమయం. రాత్రి భోజనం తర్వాత గోవా వైపు ప్రయాణం సాగుతుంది.
హంపి: తుంగభద్ర తీరాన 14వ శతాబ్దంలో విలసిల్లిన నగరం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబిస్తున్న ఆనవాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. కృష్ణదేవరాయలు పాలించిన నేల. రాయల కాలంలో రత్నాలు రాశులు పోసిన నేలలో ఇప్పుడు మనకు కనిపించేవి రాళ్లు మాత్రమే.
విరూపాక్ష ఆలయం, ముస్లిం పాలకుల చేతిలో ధ్వంసమైన నిర్మాణాల శిథిలాల ఆధారంగా వాటి పూర్తి స్వరూపాన్ని మనోనేత్రంతో వీక్షించుకోగలిగితే నాటి శిల్పకారుల చాతుర్యానికి చేతులెత్తి మొక్కకుండా ఉండలేం. హంపిని ఏటా సందర్శించే ఏడు లక్షల పర్యాటకుల్లో మనమూ ఉందాం.
5వ రోజు
గోవాలో విహారం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నార్త్ గోవాలోని చర్చ్‌ల వీక్షణం. తిరిగి స్టేషన్‌కి వచ్చి ట్రైన్‌లో లంచ్. ట్రైన్ మాద్‌గోవ్ వైపు సాగుతుంది. సాయంత్రం సౌత్ గోవాలో ఉత్సాహం ఉరకలు వేసే కార్యక్రమాలు, గాలా డిన్నర్ తర్వాత ట్రైన్ బెంగళూరు వైపు సాగుతుంది.
గోవా అంటే మనకు అరేబియా తీరమే గుర్తు వస్తుంది. కానీ ఇది ఒక మినీ వరల్డ్. ప్రాచ్య పాశ్చాత్యాల కలయిక. పోర్చుగీసు పాలకులు నిర్మించిన కట్టడాలు ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. చర్చ్‌ల నిర్మాణంలో వైవిధ్యత ఆకట్టుకుంటుంది. ఇక్కడ కొన్ని హిందూ ఆలయాలు కూడా పాశ్చాత్యశైలిలో ఉంటాయి. హిందూ– క్రిస్టియన్ ఐకమత్యాన్ని చాటే శిల్పాన్ని తప్పకుండా చూడాలి. లీనింగ్ టవర్ ఆఫ్ పిసాను పోలిన నిర్మాణం ఉంది. అది మంగేషి ఆలయం.
6వ రోజు
యశ్వంత్‌పూర్ స్టేషన్‌కు ట్రైన్ చేరుతుంది. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నిర్వహకులు పర్యాటకులకు వీడ్కోలు పలుకుతారు.
ప్యాకేజ్ ఇలా...
ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా 5 రాత్రులు, 6 రోజుల ప్యాకేజ్‌లో డీలక్స్ క్యాబిన్ ట్విన్ షేరింగ్‌లో ఒకరికి 4,20,680 రూపాయలు. సింగిల్ సప్లిమెంట్ కేటగిరీ 3,15,950 రూపాయలు.
రెండు పడకల క్యాబిన్‌కి అటాచ్‌డ్ బాత్‌రూమ్ కూడా ఉంటుంది. టూర్‌లో అన్ని భోజనాలు, టీ కాఫీ, నీటి బాటిల్, కూల్ డ్రింకులతోపాటు వైన్, బీర్ వంటి ఇతర డ్రింకులు
రైలులో పారా మెడికల్ సర్వీస్, బట్లర్ సర్వీస్, స్టేషన్‌లలో పోర్టర్ సర్వీస్ గైడ్ సర్వీస్‌తోపాటు పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రన్స్ ఫీజ్, స్టిల్ కెమెరా ఫీజ్.
డీలక్స్ క్యాబిన్ బుక్ చేసుకున్న పర్యాటకులకు రైలు దిగి రోడ్డు మార్గాన ప్రయాణానికి వోల్వో బస్, వోక్స్‌వ్యాగన్ వంటి వాహనాలుంటాయి.
లాండ్రీ ఖర్చులు, ప్యాకేజ్‌లో లేని ఇతర బేవరేజ్‌లు, పర్యాటక ప్రదేశాల్లో వీడియో కెమెరా ఫీజ్, ఇంటి నుంచి టూర్ మొదలయ్యే ప్రదేశానికి చేరడానికి, పర్యటన పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి అయ్యే వాహన ఖర్చులు ఈ ప్యాకేజ్‌లో వర్తించవు.
(చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?)