బౌద్ధవిహారం: బిహార్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..? | Bird Watching Trip In Vikramshila Gangetic Dolphin Sanctuary In Bihar | Sakshi
Sakshi News home page

చాణుక్యుడు, ఆర్యభట్ట, అశోకుడు వంటి వాళ్లని కాదని బిహార్‌ పేరెలా వచ్చిదంటే..

Published Mon, Mar 10 2025 10:00 AM | Last Updated on Mon, Mar 10 2025 10:00 AM

Bird Watching Trip In Vikramshila Gangetic Dolphin Sanctuary In Bihar

బిహార్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? చారిత్రక– పౌరాణిక సాహిత్యంలో ఈ ప్రదేశం ఉంది. కానీ...అప్పట్లో ఈ ప్రదేశం పేరు బిహార మాత్రం కాదు. చాణుక్యుడు పుట్టాడు... కానీ అతడి పేరు రాలేదు. ఆర్యభట్ట పుట్టాడు... అతడి పేరూ రాలేదు. అశోకుడు పాలించాడు... ఆ చక్రవర్తి పేరూ రాలేదు. బుద్ధుడు విహరించిన ఈ ప్రదేశం బుద్ధవిహారగా పేరు తెచ్చుకుంది.. బౌద్ధ విహారాలు... చైత్యాల నిలయం బౌద్ధవిహారగా స్థిరపడింది. స్థానిక భాషల్లో విహార... బిహారగా వాడుకలోకి వచ్చింది. నాడు బుద్ధుడు విహరించిన బుద్ధవిహారయే నేటి మన బిహార్‌. గంగా తీరాన నడక... నదిలో డాల్ఫిన్‌ వీక్షణం ఈ టూర్‌లో బోనస్‌.

నలంద విద్యాలయం
నలంద విశ్వవిద్యాలయం మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ్ర΄ాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటి, తొలి రెసిడెన్సియల్‌ యూనివర్సిటీ ఇదే. ఈ బౌద్ధ మహావిహారకు విద్యాభ్యాసం కోసం క్రీ.శ ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు దేశవిదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. వారు నివసించడానికి ఒక్కొక్కరికి ఒక్కో గది, ఆ గదిలో గోడలకు ఒక వైపు పుస్తకాల అర, మరొక గోడకు దుస్తులు పెట్టుకునే వెసులుబాటు ఉండేవి. ప్రతి గది బయట నీరు వెలుపలకు వెళ్లడానికి నిర్మాణంలోనే పైపుల ఏర్పాటు ఉండేది. 

పౌర్ణమి రోజు చంద్రుడి వెలుతురు పడి ప్రకాశించే చంద్రశిలలను చూడవచ్చు. క్లాసు రూముల ఏర్పాటు చాలా సమగ్రంగా ఉంటుంది. అందరూ నేల మీదనే కూర్చోవాలి. అయితే ఆచార్యులు కూర్చునే పీఠం వంటి స్థానం, విద్యార్థులు ఒకరికొకరు మూడడుగుల దూరంలో కూర్చునే విధంగా ఉంది నిర్మాణం. భక్తియార్‌ ఖిల్జీ హయాంలో ఇక్కడ తాళపత్ర గ్రంథాలను రాశి΄ోసి తగుల పెట్టిన చోట ఇటుకలు కూడా నల్లగా మాడి΄ోయి ఉన్న గోడలను చూపిస్తారు గైడ్‌లు. 

ఇక్కడ దుకాణాల్లో పెన్నులు నలంద, రాజ్‌గిర్‌ వంటి బౌద్ధ క్షేత్రాల పేర్లతో ఉంటాయి. టూర్‌కి గుర్తుగా తెచ్చుకోవచ్చు, స్నేహితులుగా బహుమతులుగా ఇవ్వవచ్చు. ఇది పట్నాకు 70 కిలోమీటర్ల దూరాన ఉంది. పట్నా నుంచి బయలుదేరిన తర్వాత నలంద పర్యటన పూర్తి చేసుకుని రాజ్‌గిర్‌కు వెళ్లాలి. నలంద మహావిహారను చూసిన తర్వాత సూర్యమందిర్, చైనా యాత్రికుడు హ్యూయాన్‌ త్సాంగ్‌ మందిరాన్ని కూడా చూడాలి. ఈ ఆలయం ఒక చరిత్ర పుస్తకానికి దృశ్యరూపం. వీటి తర్వాత చూడాల్సిన ప్రదేశం ఆర్కియలాజికల్‌ మ్యూజియం.

మహాబోధిగయ 
బోద్‌గయకు ఆ పేరు రావడానికి కారణం మహాబోధి వృక్షమే. సిద్ధార్థ గౌతముడు ఈ బోధి చెట్టు కింద ధ్యానం చేశాడు. అతడికి జ్ఞానోదయమై బుద్ధుడిగా మారిన ప్రదేశం ఇది. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. ఈ బోధి వృక్షాన్ని చూస్తే ఆశ్చర్యంతోపాటు క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల నాటి వృక్షమా అనే సందేహం కలుగుతుంది. 

ఆ సందేహంలో అర్థం ఉంది. బుద్ధుని కాలం నాటి మహాబోధి వృక్షం మతహింసలో భాగంగా అగ్నికి ఆహుతై΄ోయింది. ఆ స్థానంలో శ్రీలంక నుంచి తెచ్చి నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే... శ్రీలంకలోని అనూరాధపురను ΄ాలిస్తున్న రాజు దేవానాం ప్రియ తిస్స బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. బౌద్ధ పట్ల అవగాహన కోసం అశోక చక్రవర్తిని కోరాడు. అశోకుడు బౌద్ధ ప్రచారంలో భాగంగా తన కూతురు సంఘమిత్ర, కొడుకు మహేంద్రను శ్రీలంకకు పంపించాడు. 

శ్రీలంకకు వెళ్లేటప్పుడు సంఘమిత్ర ఈ మహాబోధి నుంచి సేకరించిన మొక్కను తీసుకెళ్లి దేవానాం ప్రియ తిస్సకు బహూకరించింది. ఆ మొక్కను అనూరాధ పురలో నాటారు. బోధగయలోని మూలవృక్షం స్థానంలో శ్రీలంక బోధి వృక్షం నుంచి మొక్కను తెచ్చి నాటారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న బోధి వృక్షం. ఈ వృక్షం పక్కనే మహాబోధి ఆలయం ఉంది. బౌద్ధం పరిఢవిల్లుతున్న భూటాన్, థాయ్‌లాండ్‌ వంటి అనేక దేశాల మోనాస్ట్రీలు కూడా బోద్‌గయలో ఉన్నాయి. 

వీటిలో వ్యక్తమయ్యే సంపన్నతను చూసినప్పుడు బుద్ధుడు చెప్పిన నిరాడంబరత కోసం బౌద్ధంలో ఆశించకూడదనిపిస్తుంది. ఈ ప్రదేశం బిహార్‌ రాజధాని నగరం పట్నా నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. గయకు 15 కిలోమీటర్ల దూరం. ఈ టూర్‌లో చూడాల్సిన మరో ప్రదేశం నిరంజన నది. బుద్ధుడు ధ్యానంలో ఉన్న కాలంలో తరచూ ఈ నదికి వెళ్లేవాడు. స్థానికులు ఫాల్గు నదిగా పిలుస్తారు. 

వైశాలి గత వైభవం
బుద్ధుడు తన జీవితకాలంలో ఎక్కువ కాలం ( మూడు దఫాలు) వైశాలిలో జీవించాడు. తన చివరి బోధనను వెలువరించాడు. బుద్ధుడి అవశిష్టంతో ఇక్కడ ఒక స్థూపాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో అశోకుడు ఏకసింహం స్థూపాన్ని నిర్మించాడు. మ్యూజియం కూడా ఉంది. 

ఈ ప్రదేశం ఒకప్పుడు లిచ్ఛవుల రాజధాని. ఆసియా ఖండంలో తొలి రిపబ్లిక్‌ స్టేట్‌ కూడా ఇదే. వైశాలి గత వైభవం విశాలమైనదే కానీ ఇప్పుడిక్క బౌద్ధ విశిష్ఠతలు మినహా మరే ప్రత్యేకతలూ కనిపించవు. జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు పుట్టిన ప్రదేశం కూడా ఇదే. చిన్న జైన మందిరం కూడా ఉంది.

విక్రమశిల మహావిహార
ఇది కూడా భక్తియార్‌ ఖిల్జీ చేతిలో ధ్వంసమైన ప్రాచీన విశ్వవిద్యాలయం. మనదేశంలో ఉన్న ప్రధానమైన బౌద్ధ మహావిహారల్లో మూడు బీహార్‌లోనే ఉన్నాయి. విక్రమశిల... వందకు పైగా గురువులు, వెయ్యికి పైగా విద్యార్థులతో విలసిల్లిన విద్యాలయం. తత్వం, వ్యాకరణం, ఆధిభౌతికం, తర్కశాస్త్రాలను బోధించేవారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆసియా ఖండంలో బౌద్ధాన్ని విస్తరించారు. 

ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఈ యూనివర్సిటీ శిథిలాలను భద్రపరిచి పునరుద్ధరించే పనిలో ఉంది. చారిత్రక జ్ఞాపకాల గౌరవార్థం ప్రభుత్వం నలంద, విక్రమశిల పేర్లతో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. లోకల్‌ ఆటో రిక్షా, కార్‌ ట్యాక్సీల వాళ్లతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా చెప్పాలి.

ఓదంతపురి చదువుల క్షేత్రం
మనదేశంలో ప్రసిద్ధమైన బౌద్ధ మహావిహారలు మూడు. నలంద, విక్రమశిల, ఓదంతపురి విహారలు. నలంద తర్వాత రెండవ విశ్వవిద్యాలయం ఓదంతపురి. ఇది బీహార్‌ షారిఫ్‌లో ఉంది. పట్నా– రాజ్‌గిర్‌ రైల్వేలైన్‌లో వస్తుంది. 

ఈ మహావిహార కూడా టర్కీ నుంచి వచ్చి భారత్‌ మీద దాడి చేసిన ఖిల్జీ చేతిలో ధ్వంసమైనదే. ఇక్కడ బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన ప్రాధాన్యత తప్ప మరే ప్రత్యేకతలూ లేక΄ోవడంతో పర్యాటకపరంగా సౌకర్యాలు తక్కువ.

సారనాథ్‌ రాజముద్ర 
బుద్ధుడు తొలి ప్రవచనాన్ని వెలువరించిన ప్రదేశం సారనాథ్‌. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహణలో ఉంది. ఇక్కడి స్థూపం పరిరక్షణ పనులు పూర్తి చేసి పర్యాటకులకు ప్రవేశం కల్పించారు. మనం అధికారిక ముద్రగా స్వీకరించిన నాలుగు సింహాల పిల్లర్‌ ఇక్కడిదే. 

అయితే అసలు పిల్లర్‌ని మ్యూజియానికి తరలించారు. నమూనాలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ టూర్‌కి ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్‌ సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్యాకేజ్‌లో సారనాథ్‌(ఉత్తరప్రదేశ్‌), బుద్ధుడు పుట్టిన లుంబిని (నేపాల్‌), మహాపరినిర్వాణం పొందిన కుశినగర (ఉత్తరప్రదేశ్‌) కూడా కవర్‌ అవుతాయి.

రాజ్‌గిర్‌ విశ్వశాంతి కిరణం
ఇది మహాభారత కాలం నుంచి ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రదేశం. జరాసంధుని రాజ్యం గిరివ్రజ. పాండవ మధ్యముడు భీముడితో జరాసంధుడు యుద్ధం చేసిన ప్రదేశంగా చెబుతారు. జైనులకు కూడా ఇది ప్రముఖ ప్రదేశమే. 24వ తీర్థంకరుడు మహావీరుడు (ముని సువ్రత) పద్నాలుగేళ్లు నలంద, రాజ్‌గిర్‌లలో జీవించాడు. మగధ రాజ్యానికి తొలినాళ్లలో రాజధాని ఇదే. రాజగృహ అని పిలిచేవాళ్లు. 

ఇక్కడ అనేక రాజ్యాల రాజుల సమావేశంలో బుద్ధుడు బౌద్ధాన్ని బోధించాడు. రాజ్‌గిర్‌ విశ్వశాంతి స్తూపం నుంచి కనిపించే గ్రద్ధకూట పర్వతం మీద బుద్ధుడు కొంతకాలం ధ్యానం చేసుకున్నాడు. సప్తపర్ణి గుహలో బౌద్ధ సమావేశాలు జరిగేవి. సమీపంలోని వేణుబన్‌ (వెదురు వనం)లో సాంత్వన దేవాడు. శిష్యులు, సామాన్యులతోపాటు మగధ రాజు బింబిసారుడికి కూడా ఇక్కడే బోధనలు చేశాడు. 

విశ్వశాంతిని కోరుతూ బుద్ధుడు చేసిన బోధనలకు ప్రతీకగా ఆ ప్రదేశంలో తెల్లటి అందమైన శాంతిస్థూపాన్ని నిర్మించారు. ఈ కొండ మీదకు వెళ్లడానికి రోప్‌వే ఉంటుంది. ఈ రోప్‌వే బకెట్‌ ఒక్కరు మాత్రమే కూర్చునేటట్లు ఉంటుంది. కొండ మీదకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. 

(చదవండి: వన్‌ లెగ్డ్‌ జీన్స్‌..! ఇదేం ఫ్యాషన్‌ ట్రెండ్‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement