tourisim
-
కదలకుండా చుట్టిరావొచ్చు! ‘పర్యాటకం’లో వర్చువల్ విప్లవం
సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో కూడా సాంకేతికత కీలకభూమిక పోషిస్తోంది. వర్చువల్, ఆగుమెంటెడ్ రియాల్టీ (వీఆర్, ఏఆర్) సరికొత్త పర్యాటక అనుభూతులను అందిస్తోంది. పర్యాటక ప్రదేశాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకటించడం సాంకేతికత అవసరానికి ఊతమిస్తోంది. దీనితో పాటు నేషనల్ డిజిటల్ టూరిజం మిషన్‌లో భాగంగా యునిఫైడ్ టూరిజం ఇంటర్ఫేస్ కోసం కేంద్ర పర్యాటక శాఖ కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వెబ్‌పోర్టల్, టూరిస్టు డెస్టినీ యాప్‌లను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఇప్పటికే ఏపీ మ్యూజియాల్లో వీఆర్, ఏఆర్‌లు విశేష ఆదరణ పొందుతున్నాయి. శిల్పారామాల్లో సైతం 12డి వర్చువల్ అనుభూతులను విస్తరిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో లేజర్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్‌లను కూడా అభివృద్ధి చేస్తోంది. వర్చువల్ టూరిజం ఇలా.. వర్చువల్ టూర్లు కేవలం ఒకే స్థలంలో కూర్చోవడం ద్వారా పర్యాటకులు కోరుకునే ప్రదేశాలను చుట్టిరావచ్చు. దేశంలోని కళలు, సంస్కృతి, గొప్ప వారసత్వ సంపద దృష్ట్యా వర్చువల్ టూరిజం అద్భుతమైన వైవిధ్యాన్ని అందిస్తోంది. ఇక్కడ పర్యాటకులు వీఆర్ కళ్లజోళ్లు ధరించి రిమోట్ కంట్రోల్‌ను ఉపయోగిస్తూ గమ్యస్థానాల్లో కలియదిరిగే అనుభూతిని పొందుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇలా.. తమిళనాడు టూరిజం శాఖ వీఆర్ ఆధారిత బుక్లెట్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీని అభివృద్ధి చేసి వెబ్సైట్లో సైతం అందుబాటులో ఉంచింది. 2016లో గుజరాత్ టూరిజం సింధు లోయలోని లోథాల్, ధోలవీర, రాణి–కి–వావ్‌తో సహా అనేక పురాతన ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో లైవ్ యాక్షన్ వీఆర్ వీడియోలను రూపొందించింది. 2021లో కేరళ టూరిజం శాఖ వర్చువల్ టూర్ గైడ్ కోసం ఏఆర్ యాప్‌ని తీసుకొచ్చింది. ఇది రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను కలుపుతూ రియల్ టైమ్ ఆడియో వీడియో గైడ్‌గా ప్రసిద్ధి చెందింది. యాప్ సాయంతో.. నిత్యం పెరుగుతున్న పర్యాటక యాప్‌లతో ట్రావెల్, టూరిజం పరిశ్రమ పోటీపడాల్సి వస్తోంది. ఢిల్లీ టూరిజం శాఖ ‘దేఖో మేరే ఢిల్లీ’ యాప్.. అన్ని టికెట్ల బుకింగ్‌తో పాటు పర్యాటకులు ఒకే ప్లాట్ఫామ్లో సకల యాత్రలను ప్లాన్ చేసుకునే వీలుకల్పిస్తోంది. ప్రసిద్ధ వారసత్వ కట్టడాలను వైబ్‌సైట్ ద్వారా వర్చువల్ వాక్–త్రూలను అందిస్తోంది. మరోవైపు మ్యూజియాలు సైతం ఆన్లైన్ ప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి. (చదవండి: ఆక్వాకు ఉజ్వల భవిత..స్టేక్ హోల్డర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు) -
బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం అస్సలు కుదరదు!
రియాద్ : సాంప్రదాయ ఆయిల్ ఆర్థిక వ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా, దుబాయ్ తరహా ఆయిలేతర ఆర్ధిక వ్యవస్థను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఇటీవల దాదాపు 49 దేశాలకు ఆన్లైన్ వీసా సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. వీటిలో అమెరికా, ఆస్ట్రేలియా వంటి పాశ్చాత్య దేశాలు కూడా ఉన్నాయి. అయితే సాంప్రదాయిక పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఆ దేశంలోని ప్రజలకు, ముఖ్యంగా మహిళలపై ఎన్నో ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు పర్యాటకుల ద్వారా వాటికి భంగం కలగకుండా చూసేందుకు ఆదేశం కొన్ని నిర్దిష్ట చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా విదేశీ పర్యాటకులు సౌదీలో పర్యటించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలంటూ కొన్ని మార్గదర్శకాలను శనివారం విడుదల చేసింది. వాటిల్లో డ్రెస్‌కోడ్ అతి ముఖ్యమైంది. మహిళలు భుజాలు, మోకాళ్లు కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం లాంటివి అస్సలు కుదరదు. అశ్లీలత, అసభ్యత లాంటి వాటికి పర్యాటకులు దూరంగా ఉండాలి. ఇలా దాదాపు 19 నిబంధనలను ఆదేశ పర్యాటక శాఖ తన వెబ్సైట్లో ఇంగ్లీష్ భాషలో విదేశీ పర్యాటకుల కోసం అందుబాటులోకి ఉంచింది. అయితే నిబంధనలను అతిక్రమిస్తే ఎంత జరిమానా విధిస్తారనేది స్పష్టం చేయలేదు. -
పర్యాటకాభివృద్ధికే అమరావతి షాపింగ్ ఫెస్టివల్
మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు ప్రతిబింబంగా రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్–2016 నాంది పలుకుతుందని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్ –2016 వెబ్‌సైట్‌ను మంత్రులు అధికారికంగా ప్రారంభించారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్ వర్గాలను రాష్ట్రం వైపు దృష్టిసారించేలాగా నూతన వ్యవస్థకు నాంది ప్రస్తావనగా స్వరాజ్యమైదానంలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఫెస్టివల్లో వివిధ ఉత్పత్తులను డిస్కౌంట్ స్కేల్ విధానంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఫెస్టివల్లో ఉత్పత్తిదారులు, షాపింగ్ నిర్వాహకులు, ప్రముఖ షాపింగ్ మాళ్ల నిర్వాహకులు భాగస్వామ్యులయ్యేలా జిల్లా యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఇప్పటికే జూవెలరీ, ఫర్నిచర్, రెడీమెడ్ తదితర సంస్థలు, షాపుల నిర్వాహకులు ముందుకు వచ్చారని తెలిపారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ వ్యాపారులు షాపుల నిర్వహణకు కొద్దిమొత్తంలో రుసుం చెల్లించి తమ ఉత్పత్తులకు అద్భుత ప్రచారం పొందొచ్చని సూచించారు. ఇకపై వార్షిక వేడుకగా అమరావతి ఫెస్టివల్ నిలుస్తుందని, ఆ దిశగా కార్యచరణ రూపొందించామని పేర్కొన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని జరిగే రూ.1000 కొనుగోలుపై బహుమతులు అందిస్తామని, ఫెస్టివల్ జరిగే అన్ని రోజులూ లక్కీడ్రా తీస్తామని తెలిపారు. కార్నివాల్ ర్యాలీ ప్రారంభిం ఫెస్టివల్ ప్రారంభంలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మంత్రులు కార్నివాల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ బందరు రోడ్డులో బెంజిస్కరిల్ వరకు సాగింది. మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్‌కలెక్టర్ డాక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ బోటుల హల్చల్
పర్యాటక శాఖ ఆదాయానికి గండి చోద్యం చూస్తున్న అధికారులు విజయవాడ (భవానీపురం) : పర్యాటక శాఖలోని వివిధ విభాగాలలో అధిక ఆదాయం లభించేది బోటు షికారు ద్వారానే. అయితే ఆ ఆదాయానికి గండి కొడుతూ ప్రైవేట్ బోటులు హల్చల్ చేస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వినవస్తున్నాయి. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పున్నమిఘాట్ సమీపంలో బోటింగ్ పాయింట్ నుంచి పర్యాటక శాఖ బోటు షికారుకు ఏర్పాటుచేసింది. యాత్రికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ బోటు షికారు వలన పర్యాటక శాఖకు రోజుకు సుమారు లక్ష రూపాయలకుపైగానే ఆదాయం లభిస్తోంది. అయితే దానికి గండి కొడుతూ ఒక ప్రైవేట్ సంస్థ స్పీడ్ బోట్లతోపాటు పున్నమిఘాట్లో వివిధ ఆకారాలలో గాలితో నింపిన చిన్నపాటి ఫ్యాన్సీ పడవలను తిప్పుతూ యాత్రికులను దోచుకుంటోంది. పర్యాటక శాఖ కౌంటర్ వద్దే బేరాలు.. మనిషికి రూ. 100 నుంచి రూ. 150 వసూలు చేస్తున్నారు. బోటింగ్ పాయింట్ వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ పక్కనే ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటున్న ప్రైవేట్ సంస్థ సిబ్బంది, పర్యాటక శాఖ కౌంటర్ వద్దకు వచ్చే యాత్రికులను తమ వైపు తిప్పుకుంటున్నారు. వారి బోట్లు ఎక్కే యాత్రికులకు చిన్న స్లిప్పై ఒక రబ్బర్ స్టాంప్‌వేసి టిక్కెట్ కింద ఇస్తున్నారు. పైగా పర్యాటక శాఖ టికెట్ కౌంటర్ వద్దే యాత్రికులతో బేరాలు ఆడుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థకు పర్యాటక శాఖ నుంచి అధికారికంగా అనుమతి లేనట్లు సమాచారం. తమ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేట్ సంస్థకు చెందిన వ్యక్తులను అక్కడి నుంచి తరిమి వేయాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ సంస్థ సిబ్బంది హల్చల్ చేస్తున్నారు. -
పర్యాటకం.. ఎందుకింత జాప్యం !
ఆలస్యంగా మేల్కొన్న పర్యాటక శాఖ బోట్లకు మరమ్మతులు ప్రారంభం మరో ఐదు రోజులే వ్యవధి హడావుడిగా పనులు సాక్షి, విజయవాడ : పుష్కర భక్తులను ఆకట్టుకునేందుకు ఎటువంటి అనుమతి లేకుండానే ప్రయివేటు సంస్థ హడావుడి చేస్తోంది. పర్యాటక శాఖ మాత్రం ఆలస్యంగా మేల్కొంది. హడావుడిగా బోట్లకు మరమ్మతులు చేస్తోంది. దీంతో పుష్కరాలకు పర్యాటక శాఖ బోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత దుర్గమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) నిర్వహించే బోట్లలో కొద్దిసేపు కృష్ణమ్మ ఒడిలో నదీవిహారం చేస్తుంటారు. విజయవాడలోని పున్నమిఘాట్, దుర్గాఘాట్, సీతానగరంలో బోటింగ్ పాయింట్ల నుంచి భవానీ ద్వీపానికి బోటింగ్ సౌకర్యం ఉంది. నదిలో సుమారు పదిహేను నిమిషాలు ప్రయాణించిన తర్వాత భవానీ ద్వీపం చేరుకుంటారు. ఆహ్లాదకరంగా సాగే ఈ బోటింగ్‌పై అనేక మంది ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం కీలకమైన పెద్ద బోట్లకు మరమ్మతుల పనులు చేస్తుండటంతో ఇద్దరు ప్రయాణించే జట్క్ స్కీ, నలుగురు ప్రయాణించే స్పీడ్ బోట్లను మాత్రమే వినియోగిస్తున్నారు. దీంతో ఎక్కువ మంది పర్యాటకులు ప్రయివేటు బోట్లను ఆశ్రయిస్తున్నారు. నిధుల విడుదలలో జాప్యం బోట్ల మరమ్మతులకు రూ.15లక్షల మంజూరుకు ఉన్నతాధికారులు తీవ్ర జాప్యంచేశారు. వారం రోజులు క్రితం నిధులు మంజూరుకావడంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వాస్తవంగా ఇప్పటికే బోట్లకు మరమ్మతులు పూర్తికావాల్సి ఉంది. అయితే కేవలం 40శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పుష్కరాలకు ఐదు రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో బోట్లకు మరమ్మతులు పూర్తవుతాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హడావుడిగా పనులు చేస్తుండటం వల్ల నాణ్యతపై కూడా ఆ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పర్యాటక శాఖ బోట్ల పరిస్థితి ఇలా.. – బోధిసిరి : ఏపీటీడీసీ ఆధ్వర్యంలోని అతి పెద్ద బోటు బోధిసిరి. ఇందులో ఒకేసారి 120 ప్రయాణించవచ్చు. ఏసీ సౌకర్యం ఉంది. విందులు, వినోదాలు నిర్వహించుకునేందుకు వేదిక ఉంది. ప్రస్తుతం ఈ బోటు ఫ్లోరింగ్ మొత్తం దెబ్బతినడంతో తిరిగి ఉడ్ ఫ్లోరింగ్ వేస్తున్నారు. చుట్టూ ఉన్న అద్దాలు దెబ్బతినడంతో వాటిని తీసివేసి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పెయిటింగ్ వేయాల్సి ఉంది. పున్నమిఘాట్లో ఉంచి బోధిసిరి బోటుకు మరమ్మతులు చేస్తున్నారు. పుష్కరాల నాటికి ఈ బోటును సిద్ధం చేయాలని రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. – అమర్పాలీ : ఈ బోటులో 50 మంది ప్రయాణించవచ్చు. దీనికి చుట్టూ బీడింగ్, ఫ్లోరింగ్ దెబ్బతింది. ఇంజిన్ కూడా మార్చాల్సి ఉంది. ప్రస్తుతం చెక్కతో బోటు చూట్టూ బీడింగ్ ఏర్పాట్లుచేస్తున్నారు. వుడ్ వర్క్ పూర్తికావడంతో పైబర్ షీట్స్ వేస్తున్నారు. ఇంజిన్‌కు మరమ్మతులు రెండు, మూడు రోజుల్లో పూర్తవుతాయి. దీనిని సీతానగరం బోటింగ్ పాయింట్ వద్ద ఉంచి మరమ్మతులు చేస్తున్నారు. – కృష్ణవేణి : ఈ బోటులో 50 మంది ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ఈ బోటుకు ఫ్లోరింగ్ పూర్తిచేశారు. పెయిటింగ్ వేస్తున్నారు. సీతానగరంలో ఉంచి మరమ్మతులు చేస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ బోటు సిద్ధమవుతుందని చెబుతున్నారు. – భవానీ : ఈ బోటులో ఒకేసారి 70 మంది ప్రయాణం చేయవచ్చు. బోటు లోపల ఫ్లోరింగ్ పని జరుగుతోంది. బోటులోని ఇనప యంత్రlపరికరాలు పూర్తిగా తుప్పుపట్టిపోవడంతో మరమ్మతులు చేస్తున్నారు. ఉండవల్లి సమీపంలోని ఘాట్ వద్ద ఉంచి మరమ్మతులు చేస్తున్నారు. క్రూయిజ్ బోటును తట్టుకునేనా? చాంపియన్ హ్యాపీ క్లబ్ పర్యాటక, ఇరిగేషన్ శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండానే పుష్కరాలకు కృష్ణానదిలో ఏసీ క్రూయిజ్ బోటును సిద్ధం చేస్తోంది. ఈ బోటు పనులు మలిదశకు చేరుకున్నాయి. ఇందులో డ్యాన్స్‌లు, వివిధ రకాల పార్టీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం నదిలో ప్రత్యేకంగా జట్టీలు కడుతున్నారు. ఈ క్రూయిజ్‌ను తట్టుకుని ఏపీటీడీసీ బోట్లు ప్రయాణికులను ఆకట్టుకునేనా.. అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పుష్కరాల సమయంలో నదిలోకి ప్రయివేటు బోటును అనుమతించవద్దని పలువురు డిమాండ్ చేస్తున్నారు.