ప్రైవేట్ బోటుల హల్‌చల్
ప్రైవేట్ బోటుల హల్‌చల్
Published Sat, Aug 20 2016 8:54 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
పర్యాటక శాఖ ఆదాయానికి గండి
చోద్యం చూస్తున్న అధికారులు
విజయవాడ (భవానీపురం) :
పర్యాటక శాఖలోని వివిధ విభాగాలలో అధిక ఆదాయం లభించేది బోటు షికారు ద్వారానే. అయితే ఆ ఆదాయానికి గండి కొడుతూ ప్రైవేట్ బోటులు హల్‌చల్ చేస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వినవస్తున్నాయి.
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పున్నమిఘాట్ సమీపంలో బోటింగ్ పాయింట్ నుంచి పర్యాటక శాఖ బోటు షికారుకు ఏర్పాటుచేసింది. యాత్రికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ బోటు షికారు వలన పర్యాటక శాఖకు రోజుకు సుమారు లక్ష రూపాయలకుపైగానే ఆదాయం లభిస్తోంది. అయితే దానికి గండి కొడుతూ ఒక ప్రైవేట్ సంస్థ స్పీడ్ బోట్లతోపాటు పున్నమిఘాట్‌లో వివిధ ఆకారాలలో గాలితో నింపిన చిన్నపాటి ఫ్యాన్సీ పడవలను తిప్పుతూ యాత్రికులను దోచుకుంటోంది.
పర్యాటక శాఖ కౌంటర్ వద్దే బేరాలు..
మనిషికి రూ. 100 నుంచి రూ. 150 వసూలు చేస్తున్నారు. బోటింగ్ పాయింట్ వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ పక్కనే ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటున్న ప్రైవేట్ సంస్థ సిబ్బంది, పర్యాటక శాఖ కౌంటర్ వద్దకు వచ్చే యాత్రికులను తమ వైపు తిప్పుకుంటున్నారు. వారి బోట్లు ఎక్కే యాత్రికులకు చిన్న స్లిప్‌పై ఒక రబ్బర్ స్టాంప్‌వేసి టిక్కెట్ కింద ఇస్తున్నారు. పైగా పర్యాటక శాఖ టికెట్ కౌంటర్ వద్దే యాత్రికులతో బేరాలు ఆడుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థకు పర్యాటక శాఖ నుంచి అధికారికంగా అనుమతి లేనట్లు సమాచారం. తమ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేట్ సంస్థకు చెందిన వ్యక్తులను అక్కడి నుంచి తరిమి వేయాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ సంస్థ సిబ్బంది హల్‌చల్ చేస్తున్నారు.
Advertisement
Advertisement