పన్ను ఎగవేతలు ఉండకూడదు.. ఫలితాలు కనిపించాలి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సాక్షి, అమరావతి: ఖజానాకు రాబడులు పెంచేందుకు చర్యలు చేపట్టాలని, ఆదాయార్జన కోసం కొత్త ఆలోచనలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయట పడేసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వనరులు, ఆదాయ వృద్ధిపై మంగళవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సాధారణ పనితీరుతో, సాధారణ లక్ష్యాలతో రొటీన్‌గా పనిచేస్తే ఫలితాలు రావని.. వినూత్న ఆలోచనలతో పనిచేయాలన్నారు.
వాణిజ్య పన్నుల ఎగవేతలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురి చేయొద్దన్నారు. కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, 16వ ఆరి్థక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాను కలిసి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వివరించానని, అధికారులు కూడా దీనిని అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు.
రెవెన్యూ రాబడులపై అధికారులు సీఎంకు వివరణ ఇస్తూ.. 2023–24 సంవత్సరానికి వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం రూ.41,420 కోట్లు రాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.41,382 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ విభాగంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వృద్ధి ఉంటుందని తెలిపారు. నూతన ఎక్సైజ్ విధానం కారణంగా ఆదాయం పెరుగుతుందని వివరించారు.
మైనింగ్ శాఖలో ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో రెవెన్యూ పెరగలేదన్నారు. కోర్టు కేసుల పరిష్కారం, అనుమతుల మంజూరు వంటి చర్యలతో మైనింగ్ ఆదాయాన్ని పెంచాలని సీఎం అన్నారు. సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉగాది నుంచి పీ–4 విధానం
పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీ–4 విధానాన్ని ఉగాది నుంచి ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ తీసుకురావాలని ఆదేశించారు.
మంగళవారం సచివాలయంలో ప్రణాళిక శాఖపై సమీక్ష సందర్భంగా పీ–4 కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు సొంత ఊళ్లు, మండలాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారని.. వారిని స్వయంగా ఆహ్వానించి ఉగాది రోజున పీ–4 కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment