
రూ.3 లక్షల కోట్ల వ్యాపారం
అంచనా వేస్తున్న సీఏఐటీ
సాక్షి, బిజినెస్ బ్యూరో: మహా కుంభమేళా కాసులు కురిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ వేడుక.. వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు చేయనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఇది భారత్‌లో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందని సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపర, ఆధ్యాత్మిక సమావేశంగా గుర్తింపు పొందిన ఈ కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు పాల్గొన్నారు.
అంచనాలను మించి..
విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని ఈ కార్యక్రమం దృఢంగా నిర్వచించిందని ఖండేల్వాల్ అన్నారు. ‘డైరీలు, క్యాలెండర్లు, జనపనార సంచులు, స్టేషనరీ తదితర మహాకుంభ నేపథ్య ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. కచి్చతమైన బ్రాండింగ్ కారణంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మహా కుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు.
అలాగే దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని భావించారు. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న అపూర్వ ఉత్సాహం కారణంగా.. ఉత్సవాలు ముగిసే నాటికి ఇంకా భారీ సంఖ్యలో ఈ మహా కుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు అయ్యే అవకాశం ఉందని ఖండేల్వాల్ చెప్పారు.
భారీగా ఆర్థిక కార్యకలాపాలు
ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ కార్యక్రమం గణనీయ ప్రోత్సాహాన్ని అందించిందని, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించిందని సీఏఐటీ వెల్లడించింది. ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, మతపర దుస్తులు, పూజా సామగ్రి, హస్తకళలు, వ్రస్తాలు, దుస్తు లు, వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, వెల్‌నెస్ సేవలు, మీడియా, ప్రకటనలు, వినోదం, పౌర సేవలు, టెలికం, మొబైల్, ఏఐ ఆధారిత సాంకేతికత, సీసీటీవీ కెమెరాలు, ఇతర పరికరాలు వంటి అనేక వ్యాపార విభాగాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు నమోదయ్యాయని వివరించింది.

150 కిలోమీటర్ల పరిధిలో లబ్ధి
మహాకుంభ మేళా ఆర్థిక ప్రయోజనాలు ప్రయాగ్‌రాజ్‌కు మాత్రమే కాకుండా 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించాయి. అయోధ్య, వారణాసి, ఇతర మతపర ప్రదేశాలకు యాత్రికులు వెల్లువెత్తారు. మహాకుంభ మేళా భారత్‌లో వ్యాపారం, వాణిజ్యం, సాంస్కృతిక వ్యవస్థ రూపురేఖలను సానుకూలంగా మారుస్తుందని, ఏళ్ల తరబడి కొత్త రికార్డును సృష్టిస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment