
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తాజాగా జనవరి 27 (సోమవారం) రాత్రి 10 గంటల వరకు ఒక్కరోజులో 1.5 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.
జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకూ 14 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుంభమేళాలో పాల్గొని, పవిత్ర స్నానం చేశారు. ఈ సమయంలో ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బాబా రామ్‌దేవ్ తదితరులు ఉన్నారు.
మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలివస్తున్నారు. ఇటాలియన్ భక్తుడైన ఆంటోనియో తాను భారతదేశంలో జరిగే కుంభమేళాను చూడాలనే తన కలను నెరవేర్చుకున్నానని తెలిపారు. 10 సంవత్సరాలుగా ఇక్కడికి రావాలనుకుంటున్నానని, ఇప్పుడు కుంభమేళా సమయంలో వచ్చానని మీడియాకు తెలిపారు. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాంటి 12 కుంభమేళాల తరువాత వచ్చిన మహా కుంభమేళా ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.
ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే