
మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ మేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో ఇప్పటి వరకు 55 కోట్ల మంద పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దేశంలోని 143 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది సనాతన ధర్మ పరాయణులు కాగా వీరిలో దాదాపు సగం మంది పుణ్నస్నానాలు ఆచరించినట్లయిందని తెలిపింది. మొత్తం జనాభాలో ఇది 38 శాతంతో సమానమని తెలిపింది.
26వ తేదీకల్లా ఈ సంఖ్య 60 కోట్లకు మించిపోనుందని అంచనా వేసింది. జనవరి 13న ప్రారంభమైన కుంభ మేళా ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినంతో ముగియనుండటం తెలిసిందే. ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మత, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంగా నిలిచిపోనుందని యూపీ ప్రభుత్వం తెలిపింది.
హోటల్ పరిశ్రమకు పెద్ద ఊతం
మహాకుంభ మేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్ల పరిశ్రమ 20 నుంచి 30 వృద్ధి నమోదు చేసుకుందని ప్రభుత్వం తెలిపింది. అదాయ మార్జిన్లు కూడా 5 నుంచి 10 శాతం పెరిగాయంది. సందర్శకుల రాకతో టూర్, ట్రావెల్ పరిశ్రమ కూడా బాగా లబ్ధి పొందిందని వివరించింది. ఈ నెల 26వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్‌లోని మూడు, నాలుగు నక్షత్రాల హోటళ్లు, లాడ్జీలు, లగ్జరీ టెంట్ హౌస్‌లు పెద్ద సంఖ్యలో ముందుగానే బుక్కయ్యాయన్నారు.
కుంభ మేళా పొడిగింపు అబద్ధం
భక్తుల రద్దీ కొనసాగుతున్న దృష్ట్యా మహా కుంభ్ మేళాను మరికొద్ది రోజులు పొడిగించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజి్రస్టేట్ రవీంద్ర మందర్ స్పష్టతనిచ్చారు. పవిత్ర దినాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కుంభ మేళా 26వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ తేదీల్లో ఎలాంటి మార్పులూ ఉండవని కుండబద్దలు కొట్టారు. పొడిగింపు అంటూ వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. కుంభమేళా కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులెవరూ పరీక్షలను నష్టపోలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అనివార్య కారణాలతో ఎవరైనా సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలను మిస్సయినా వారి కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని కోరామన్నారు.
కాశీకి 17 రోజుల్లో కోటి మంది
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరుగుతున్న వేళ ఫిబ్రవరి 1 నుంచి 17వ తేదీ వరకు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కోటి మంది భక్తులు దర్శించుకున్నారని మంగళవారం అధికారులు తెలిపారు. అత్యంత రద్దీ ఉండే శివరాత్రినాడు కూడా ఇంత రద్దీ లేదన్నారు. ఈ నేపథ్యంలో వారణాసిలోని స్కూళ్లలో 8వ తరగతి వరకు తరగతులను ఈ నెల 27వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. వారణాసిలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతోపాటు మైదాగిన్, గొడొవ్లియా, దశాశ్వమేథ వంటి ముఖ్య ప్రాంతాల్లో తీవ్రమైన రద్దీ నెలకొందని వివరించారు. ప్రాముఖ్యమున్న గంగా ఆరతి కార్యక్రమాన్ని నామమాత్రంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27 నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపడతామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment