holy dip
-
Bihar: విషాదాన్ని మిగిల్చిన పండుగ.. నీట మునిగి 46 మంది మృతి
పాట్నా: బిహార్‌లో జివుతియా పండుగ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో 46 మంది నీట మునిగి మరణించారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొన్నారు.కాగా బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ‘జీవిత్పుత్రిక’ పండుగ జరుపుకున్నారు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండటంతో పాటు పిల్లలతో కలిసి నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుమారు 46 మంది గల్లంతయ్యారు.వీరిలో ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికితీసినట్లు విపత్తు నిర్వహణ విభాగం(డీఎండీ) అధికారులు తెలిపారు. తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.ఈ విషాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని సీఎం నితీష్‌కుమార్ వెల్లడించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందిందని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. -
అయోధ్యలో జ్యేష్ఠ పౌర్ణమి పుణ్య స్నానాలు
హిందూ క్యాలెండర్లో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఏడాదికి 12 సార్లు వస్తుంది. ప్రతి పౌర్ణమికీ ఏదోఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు పవిత్ర నదులలో స్నానం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.ఈసారి జ్యేష్ఠ పౌర్ణమి తిథి జూన్ 21న ఉదయం 6:01కి మొదలై జూన్ 22 ఉదయం 5:07 వరకూ ఉంది. ఈ సందర్భంగా అయోధ్యకు చేరుకున్న లక్షలాదిమంది భక్తులు సరయూ నదిలో స్నానాలు చేస్తున్నారు. ఈరోజు సరయూ జయంతి నిర్వహిస్తున్నారు. సరయూ నది ఈ రోజునే భూమిపైకి వచ్చిందని చెబుతారు. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు వీలుగా స్థానిక అధికారులు సరయూ ఘాట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
గంగలో భక్తుల పుణ్యస్నానాలు.. తీరంలో సందడి
ఈరోజు (ఆదివారం) గంగా దసరా.. ఈ సందర్భంగా భక్తులు వారణాసిలోని గంగా దశాశ్వమేధ ఘాట్‌లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఘాట్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. అలాగే ప్రయాగ్‌రాజ్, అయోధ్య, హరిద్వార్‌లోని గంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.గంగా నది ఘాట్ల వద్ద స్నానాలు చేసే భక్తులకు భద్రత కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్‌కుమార్ పలువురు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్నానఘట్టాలను పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించాలని, నదీ ఘాట్ల వద్ద తగినంత వెలుతురు ఉండేలా చూడాలని, బారికేడింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.గత కొన్నేళ్లుగా ఉత్సవాల నేపధ్యంలో తలెత్తుతున్న వివాదాలను గుర్తుంచుకుని, ఊరేగింపు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని పోలీసులకు డీజపీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిశితంగా పరిశీలించాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో యూపీ-112 వాహనాలను మోహరించాలని కోరారు. #WATCH | Varanasi, UP: Devotees take a holy dip at the Dashashwamedh Ghat of the Sacred Ganga on the occasion of Ganga Dussehra. pic.twitter.com/DlZPo3rlDV— ANI (@ANI) June 16, 2024 -
'బీజేపీ గంగానది లెక్క.. మా పార్టీలో చేరితే పాపాలన్నీ తొలగిపోతాయ్..'
అగర్తల: బీజేపీ గంగా నది లాంటిదని వ్యాఖ్యానించారు త్రిపుర సీఎం మాణిక్ సాహా. తమ పార్టీలో చేరితే పుణ్యస్నానం చేసినట్లేనని, పాపాలన్నీ తొలగిపోతాయని అన్నారు. దక్షిణ త్రిపుర కక్రాబన్‌లో ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇంకా స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను నమ్ముతున్న వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. మీరంతా బీజేపీలో చేరండి. మా పార్టీ గంగానది లెక్క. ఇందులో చేరితే గంగానదిలో పవిత్ర స్నానం చేసినట్లే. పాపాలు తొలగిపోతాయ్' అని అన్నారు. అలాగే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా మరోమారు అధికారంలోకి వస్తామని మాణిక్ సాహా ధీమా వ్యక్తం చేశారు. త్రిపురలో కమ్యూనిస్టుల పాలనలో ప్రజల హక్కులను అణచివేశారని ఆరోపించారు. చదవండి: 'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్ -
బఘేల్ విన్యాసాలు.. భలే భలే
రాయ్‌పూర్: గిర్రున తిరిగి నీటిలో హుషారుగా మునకలు వేస్తున్న పెద్దాయనను చూశారా. వయసు శరీరానికే గానీ మనసు కాదు అన్నట్టుగా విన్యాసాలు చేస్తున్నారాయన. ఆయనేమి సామాన్య వ్యక్తి కాదు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం చత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేశ్ బఘేల్ పుణ్యస్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన నీటి విన్యాసాలు ప్రదర్శించారు. ఒక్క గెంతున నీటిలోకి దుమికారు. వెనక్కి గెంతి కూడా ఆయనీ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఈ వీడియోను ట్విటర్లో భూపేశ్ బఘేల్ షేర్ చేశారు. మహాదేవ్ పేరు తలచుకుని.. సంపూర్ణ కార్తీక స్నానం ఆచరించినట్టు పేర్కొన్నారు. గత నెలలో దుర్గ్ జిల్లాలో జరిగిన గౌరి పూజాకార్యక్రమంలో కొరడాతో కొట్టించుకుని ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. (క్లిక్ చేయండి: మా గవర్నర్ అనర్హుడు.. తప్పించండి) -
నేటితో ముగియనున్న కుంభమేళా..
ప్రయాగరాజ్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కుంభమేళాకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో సోమవారం చివరి రోజు మహాశివరాత్రి కావడంతో దాదాపు 400 మంది కేంద్ర పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. కుంభమేళాలో ఈ ఒక్కరోజు 60 లక్షల నుంచి కోటి మంది భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు పేర్కొన్నారు. భారీస్ధాయిలో వచ్చే యాత్రికుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా మేజిస్ర్టేట్ విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. పొరుగు జిల్లాలైన కౌశంబి, ప్రతాప్‌గఢ్, ఫతేపూర్ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి 15న ప్రారంభమైన కుంభమేళా నేటితో ముగియనుంది. ప్రయాగరాజ్‌లో కుంభమేళా ప్రతి ఆరేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకు మహాకుంభమేళాను యాత్రికులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. -
4న బాధ్యతలు చేపట్టనున్న ప్రియాంక!
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఉత్తరప్రదేశ్ (తూర్పు) పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఫిబ్రవరి 4న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. కుంభమేళాలో గంగానదిలో పుణ్యస్నానమాచరించి పార్టీలో ఆమె పదవీ బాధ్యతలు తీసుకుంటారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రియాంకతో పాటు ఆమె సోదరుడు రాహుల్ గాంధీ కూడా గంగా నదిలో పుణ్యస్నానం చేయనున్నారు. అదే రోజు వీరిద్దరూ కలిసి లక్నోలో విలేకరుల సమావేశంలో పాల్గొనున్నారు. ఒకవేళ ఫిబ్రవరి 4న కాకుంటే 10న వసంత పంచమి రోజు కావడంతో ఆ రోజు ప్రియాంక బాధ్యతలు చేపడతారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2001లో గంగా నదిలో పుణ్యస్నానం చేశారు. ప్రియాంక, రాహుల్ గానీ అప్పట్లో స్నానమాచరించలేదు. కాగా, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో పాగా వేసేందుకు ప్రియాంక గాంధీ పాటు జ్యోతిరాదిత్య సింధియాకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. -
ఏడాదంతా పుష్కర స్నానం చేయవచ్చు
ముక్త్యాల(జగ్గయ్యపేట):భక్తులు పుష్కర స్నానాలు ఏడాదంతా చేయవచ్చని మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. గ్రామంలోని కోటిలింగ హరిహర మహా క్షేత్రం పుష్కర ఘాట్‌లో మంగళవారం తెల్లవారు జామున పుష్కర స్నానమాచరించి భక్తులకు హితోపదేశం చేశారు. పుష్కరాలు 12 రోజులు జరుగుతాయని, అయితే భక్తులు స్నానాలు 12 రోజుల్లోనే చేయాలని లేదని, ఏడాదిలోపు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. మూడు కోట్ల మంది దేవతలు నదిలో ఉంటారని అందుకే నది శక్తివంతంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతమంతా కొద్ది రోజుల్లో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ ఆశ్రమం నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్, ఈవో దూళిపాళ్ల సుబ్రహ్మణ్యం, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
గొందిమళ్లలో గవర్నర్ పుష్కర స్నానం
మహబూబ్‌నగర్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు శనివారం కృష్ణా పుష్కర స్నానం ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గొందిమళ్లలో గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఆధికారులు గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు అలంపూర్ చేరుకుని.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. గురువారం విజయవాడలో పున్నమి ఘాట్‌లో గవర్నర్ దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను గవర్నర్ దంపతులు దర్శించుకున్న సంగతి తెలిసిందే. -
18న వైఎస్ జగన్ పుష్కర స్నానం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న పుష్కర స్నానం ఆచరించనున్నారు. వాస్తవానికి ఆయన శనివారం (13వ తేదీ) విజయవాడలో పుష్కర స్నానం చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల రేపటి కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘అంత్య’ ఘట్టాన ఆనందపారవశ్యం
కొవ్వూరు : కొవ్వూరు గోష్పాదక్షేత్రం ఘాట్‌లో రెండోరోజు భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 25 వేలమంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన పిండప్రదాన షెడ్లు చాలకపోవడంతో చాలామంది ఆరుబయటే పుణ్యకార్యాలు నిర్వహించారు. సుందరేశ్వరస్వామి ఆలయం వద్ద ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. కొవ్వూరు మండలంలోని చిడిపి, కుమారదేవం, ఆరికిరేవుల, వాడపల్లి, మద్దూరు పుష్కఘాట్లలో స్థానికులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఈ ప్రాంతాల్లో సుమారు రెండువేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక, తాడిపూడి ఘాట్లూ భక్తులతో కిక్కిరిశాయి. ఈ మండలంలో సుమారు ఐదువేల మంది స్నానాలు ఆచరించినట్టు అధికారులు చెప్పారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్లో సోమవారం 50,725 మంది స్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. పెనుగొండ డివిజన్లో 10,800 మంది, నిడదవోలులో 2,225 మంది, పెరవలి మండలంలో 12,200 మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. -
మళ్లీ పన్నెండేళ్లకు..
వైభవంగా ముగిసిన పుష్కరఘట్టం గోదావరి తల్లికి హారతితో వీడ్కోలు 12 రోజుల్లో సుమారుగా 76.96 లక్షల మంది పుణ్యస్నానాల ఆచరణ తరలివచ్చిన భక్తజనం.. కిక్కిరిసిన ఘాట్లు బాసరలో అధికారికంగా ముగింపు వేడుక సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అంగరంగ వైభవంగా సాగిన పుష్కర పర్వం ముగిసింది. పవిత్ర గోదావరిలో పుణ్య స్నానమాచరించిన లక్షలాది మంది భక్తులు పునీతులయ్యారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలు ప్రారంభమైన ఈనెల 14 నుంచి 24 వరకు అన్ని ఘాట్లలో కలిపి 63.98 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. చివరి రోజు శనివారం 12.98 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. మొత్తం 12 రోజుల్లో కలిపి సుమారుగా 76.96 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్లు అంచనా. పుష్కరాల చివరి రోజు బాసరలో గోదావరి హారతి కన్నుల పండువగా సాగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన గోదావరి హారతి కన్నుల పండువగా జరిగింది. జిల్లాలో ప్రధాన ఘాట్ల అన్నింటిలో ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాసరలో బురద నీటిలో... ఏర్పాట్లలో ఘోర వైఫల్యం.. ఘాట్ల మట్టి దిబ్బలు తొలగించకపోవడం.. నదిలోకి నీరు లేకపోవడం.. ఆరంభంలో అవసరంగా వన్‌వే పేరుతో పొలీసుల ట్రాఫిక్ ఆంక్షలు.. ఇలా పలు కారణాలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో పుష్కరాల నిర్వహణలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. కొత్తగా నిర్మించిన ఘాట్ల వద్ద మట్టిని అలాగే ఉంచడంతో నదిలో ఉన్న నీళ్లు ఘాట్ల వద్దకు చేరలేదు. రూ.కోట్లు వెచ్చించి ఘాట్లు నిర్మించినా.. మట్టి తొలగించే చిన్న పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో బాసరకు వచ్చిన లక్షలాది మంది భక్తులు బురద నీటిలో స్నానాలు చేయాల్సి వచ్చింది. బాసరకు వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా.. లక్షలాది మంది భక్తులు బాసరలో పుష్కర స్నానాలు ఆచరించి, చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఒక్క అమ్మవారి దర్శనం విషయంలో మాత్రం దేవాలయ అధికారులు సఫలీకృతులయ్యారు. క్యూలైన్ల నిర్వహణ, గర్భగుడి ముందు ప్రత్యేక ఏర్పాట్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ వేళల్లో పావు గంటలోపే అమ్మవారి దర్శనం కాగా, రద్దీ మరీ ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రమే రెండు నుంచి మూడు గంటలు పట్టింది. లడ్డూ విక్రయాల విషయంలోనూ అంచనాలు తారుమారు కావడంతో చివరి రెండు రోజులు ఒక్కో భక్తునికి రెండు చొప్పున లడ్డూలు విక్రయించారు. పుష్కరాల 12 రోజుల్లో బాసరకు వీఐపీల తాకిడి అంతగా లేదు. కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, సినీ నటుడు సుమన్, బీజే పీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. సోన్‌లో సక్సెస్.. పక్కనే 44వ జాతీయ రహదారి.. ఎస్సారెస్పీ నుంచి నిత్యం నీటి విడుదల.. ఘాట్ల వద్ద స్వచ్ఛమైన నీరు.. దీంతో నిర్మల్ మండలం సోన్ ఘాట్లకు భక్తులు పోటెత్తారు. అంచనాలకు మించి తరలివచ్చారు. నిత్యం లక్షల్లో భక్తుల రాకతో ఘాట్లన్నీ కిటకిటలాడాయి. హైదరాబాద్, మహారాష్ట్రతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి భారీగా వాహనాల్లో తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. రాకపోకలకు సౌకర్యంగా ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా కొనసాగింది. పీఠాధిపతులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు సోన్ఘాట్లో పుష్కర స్నానాలు ఆచరించారు. సోన్‌లో పిండప్రదానాలు చేస్తే కాశీలో చేసినంత పుణ్యం వస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పిండప్రదానాలు జరిగాయి. మంచిర్యాలలో అంచనాలకు మించి.. జిల్లాలోనే అత్యధికంగా మంచిర్యాల గోదావరి తీరంలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. నిత్యం లక్షల్లో పోటెత్తడంతో గోదావరి తీరం జనసంద్రాన్ని తలపించింది. ప్రధాన రైలు మార్గం కావడం.. ప్రత్యేక రైళ్లు నడపడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. పైగా ఇక్కడ గోదావరి తీరం విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, పుష్కలంగా నీళ్లుండటంతో ఇక్కడ స్నానాలు ఆచరించేందుకు భక్తులు మొగ్గుచూపారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో భక్తులను పక్కనే ఉన్న ముల్కల్ల, సీతారాంపల్లి ఘాట్లక మళ్లించాల్సి వచ్చింది. పుష్కర ప్రయుక్త బ్రహ్మ యజ్ఞం, నక్షత్ర యాగం వంటి ధార్మిక కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ఈ ఆధ్మాతిక కార్యక్రమంలో చినజీయర్ స్వామి ప్రవచనాలు చేశారు. పులకించిన ఉత్తరవాహిని.. ఉత్తర వాహిని చెన్నూర్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మొదట్లో పొలీసులు నది వద్దకు వాహనాలను అనుమతించలేదు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఆంక్షలను ఎత్తివేశారు. చివరి మూడు రోజులు గోదావరిలో నీటి ప్రవాహం పెరగడంతో కొందరు భక్తులు షవర్ల వద్ద పుష్కర స్నానాలు ఆచరించారు. హైదరాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఘాట్ల వద్ద భక్తులకు మంచినీటిని సరఫరా చేయడంలో మినహా అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. గూడేనికి అంతంతే... శ్రీ సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న గూడెం ఘాట్‌కు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాలు వేశారు. ఇక్కడ ఘాట్ నిర్మాణంలో ఉన్న లోపం కారణంగా ఘాట్ వద్దకు నీరు వచ్చి చేరలేదు. పైగా లోతు ఎక్కువగా ఉండటంతో నదిలోకి దిగేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో భక్తులు షవర్ల కిందే పుష్కర స్నానాలు ఆచరించాల్సి వచ్చింది. చాలా మంది భక్తులు సమీపంలో ఉన్న ధర్మపురి, రాయపట్నంకు తరలిపోయారు. జిల్లా మంత్రులతోపాటు, హరీష్, ఈటల వచ్చి చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఏర్పాట్ల విషయమై స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు నిలదీసిన ఘటనలు జరిగాయి. చిన్న ఘాట్లకు అధిక సంఖ్యలో.. ఇంత వరకు అంతగా ప్రచారంలో లేని చిన్న ఘాట్ల వద్ద ఈ సారి పుష్కరాల్లో లక్షల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ ఘాట్లకు అంచనాలకు మించి వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముల్కల్ల ఘాట్ వద్ద సుమారు ఆరు లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. లోకేశ్వరం మండలం బ్రహ్మేశ్వర్‌లో రెండు లక్షలకు పైగా, కూచన్‌పల్లి, ఖనాపూర్, లక్షెట్టిపేట్, సీతారాంపల్లి వంటి ఘాట్లలకు లక్షకు మించి భక్తులు పుణ్యస్నానాలు చేశారు. -
పుష్కర స్నానం ఆచరించిన నందమూరి బాలకృష్ణ
రాజమండ్రి (తూర్పు గోదావరి) : గోదావరి పుష్కరాల్లో స్నానం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో శనివారం పుష్కర స్నానమాచరించిన ఆయన తన తల్లిదండ్రులు ఎన్టీ రామారావు, బసవతారకంలకు పిండ ప్రదానాలు చేశారు. ఈ 12 రోజులూ రాజమండ్రిలో పుష్కర విధులను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను ఆయన అభినందించారు. అలాగే స్వచ్ఛంద సంస్థల సేవలు కూడా బాగున్నాయన్నారు. పుష్కర స్నానాలు ఆచరించినవారందరికీ గోదావరి మాత శుభాశీస్సులు అందించాలని, పుష్కర పుణ్యం లభించాలని కోరుతున్నానన్నారు. అనంతరం ఘాట్‌లో ఉన్న జ్ఞానసరస్వతి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు. -
అలా చేస్తే రాహుల్‌కు జ్ఞానోదయం అవుతుందేమో!
- రాహుల్ గాంధీపై ఎంపీ కవిత సెటైర్లు బూర్గంపాడు: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఏ పాలనలో రైతులను, వారి సక్షేమాన్న విస్మరించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తున్నట్లు ప్రచారం కోసం పర్యటనలు చేయడం హాస్యాస్పదమన్నారు. పదేళ్లపాలనలో చేసిన పాపాలు పోవాలంటే ఆయన (రాహుల్ గాంధీ) తెలంగాణలోనో, ఆంధ్రలోనో పుష్కరస్నానం చేస్తేనన్నా జ్ఞానోదయమవుతుందని హితవు పలికారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతెఘాట్‌లో పుష్కర పూజల అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి ఎంపీ కవిత విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తొలిఏడాదికే వచ్చిన గోదావరి మహాపుష్కరాలను రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఎమ్మెల్యే జలగం వెంకటరావు చొరవతో ఏర్పాటు చేసిన మోతె పుష్కరఘాట్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. గవర్నర్‌తో పాటు పలువురు వీఐపీలు ఇక్కడ పుష్కరస్నానమాచరిస్తున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాలలోని తెలుగువారంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని గోదావరి మాతను ప్రార్థించామన్నారు. -
భద్రాచలంలో పోటెత్తిన భక్తులు
ఖమ్మం(భద్రాచలం): భద్రాచలంలో పుష్కర స్నానాలకు భక్తులు పొటెత్తారు. సోమవారం తెల్లవారు జామునుంచి ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరారు. భద్రాచలం, మోతే, పర్ణశాల వద్ద భక్తులు కిటకిట లాడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అధికారులు ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ మళ్లిస్తున్నారు. కాగా, నేడు గవర్నర్ నరసింహన్ భద్రాచలంలో పుణ్య స్నానాలు ఆచరించినున్నారు. -
పుష్కరాల్లో మరో ఇద్దరు మృతి
కరీంనగర్(ధర్మపురి): కరీంనగర్ జిల్లా ధర్మపురికి పుష్కర స్నానం కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. బాలాపూర్‌కు చెందిన కర్నాటి అశోక్(42) తన భార్య సునీత, ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి 9.30 గంటల సమయంలో ధర్మపురి చేరుకున్నాడు. బస్టాండ్ సమీపం నుంచి గ్రామపంచాయతీ నందిచౌరస్తా వద్దకు చేరుకుని అక్కడ ఉన్న ఫెన్సింగ్‌కు ఒరిగాడు. ఫెన్సింగ్‌కు అమర్చిన విద్యుత్ దీపాలకు చెందిన వైరు దెబ్బతినడంతో పాటు వర్షంతో తడిసి ఉండటంతో అశోక్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవటంతో రాత్రి 10 గంటలకు మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అశోక్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గుండెపోటుతోటుతో వృద్ధుడు.. ధర్మపురికి పుష్కర స్నానాల కోసం వచ్చిన ఓ వృద్ధుడు శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం నాచారం గ్రామానికి చెందిన అనుగుల వెంకటిగౌడ్(70) బంధువులతో కలిసి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో పుష్కరస్నానం కోసం ఘాట్ వద్దకు వెళ్లిన సమయంలో గుండెనొప్పితో కుప్పకూలిపోయూడు. బంధువులు వెంటనే ఆయనను వైద్యశిబిరానికి తరలించారు. అప్పటికే వెంకటిగౌడ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
‘బక్రాల’ వేటలో అసలు బాధ్యుడు
పుష్కరాల వంటి కార్యక్రమాలకు వీఐపీలు రద్దీలేని వేళల్లోనే వచ్చి, వెంటనే వెళ్లిపోవాలనే మార్గదర్శకాలు చెబుతున్నాయి. అందుకే 1991 గోదావరి పుష్కరాలకు నాటి సీఎం నేదురుమల్లి నాలుగో రోజున వెళ్లారు. 2003లో నాటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సాధారణ ఘాట్‌లో స్నానం చేస్తామంటే స్థానిక కలెక్టర్ వారించారు. ఈ సారి ఒక్క రాజమండ్రిలోనే పుష్కరాల పుణ్యమంతా సుడులు తిరుగుతోందన్నట్టుగా ప్రచారం చేశారు. అనర్థం జరిగిపోయాక గోదావరిలో ఎక్కడ చేసినా పుష్కర స్నానమేనని సెలవిస్తున్నారు. ‘కరాళ నృత్యం చేస్తున్న కరువు నుంచి జనాన్ని కాపాడ్డానికి అపురూపంగా పెంచుతున్న పంట చేలను మేస్తోందే!’ అని దర్బపుల్లలతో అదిలించినందుకే ఆవు చచ్చిపోయింది. అది తనను పరీక్షించడానికి వచ్చిన ‘మాయ ఆవు’ అని తెలిసినా... మహర్షి గౌతముడు చలించిపోయాడు. ఆవు చావుకు బాధ్యత వహించి ఘోర తపస్సుతో శివుడ్ని మెప్పించి, గోహత్య దోష నివారణకు శివుడి జటాజూటంలోని గంగమ్మ పాయని వరంగా పొంది, నేలకు దించిన ఫలితమే పవిత్ర గోదావరి! ఇలాగే జరిగిందో, లేదోగానీ, ఇది విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథ. అనర్థాలకు కారకులైన వారు వాటికి నైతిక బాధ్యత వహించాలని అది చెప్పే నీతి ఒక సంస్కృతిగా, సంప్రదాయంగా వేల ఏళ్లుగా ఈ నేల మీద అమలవుతోంది. గౌతమి (గోదావరి) అందుకు ప్రత్యక్ష సాక్షి. ఆ గోదావరిలో పవిత్ర పుష్కర స్నానమాచరిద్దామని వచ్చి, పాలకుల వైఫల్యా నికి ప్రాణాలు పోగొట్టుకున్న 27 మంది చావుకు ఎవరూ బాధ్యత వహించరా? ఈ మానవ తప్పి దానికి నైతిక బాధ్యత అంటూ ఉండదా? రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి లాల్‌బహదూర్ శాస్త్రి రాజీనామా చేసినది తన వల్లే రైలు ప్రమాదం జరిగిందనీ కాదు, తన రాజీనామాతో ఇక రైలు ప్రమాదాలే జరుగవనీ కాదు. సరిగ్గా అలాగే, తన పాలనలో బందిపోటు దొంగతనాలు పెరిగినందుకు ఉత్తరప్రదేశ్ సీఎం పదవి నుంచి విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ వైదొలిగారు! (తర్వాత దేశానికి ప్రధాని అయ్యారు) బస్సుల జాతీయీకరణపై ైహైకోర్టు తప్పుబట్టినందుకే నీలం సంజీవరెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీమద్యం వల్ల కొందరు చనిపోయినందుకు నైతిక బాధ్యత వహించాలంటే మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు కనుమూరి బాపిరాజు. ఎందుకిలా జరిగింది? గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులకు పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు తెలుగు ప్రజలకుగానీ, ప్రభుత్వాలకుగానీ కొత్తేమీ కాదు. ప్రభుత్వ యంత్రాం గానికి వాటిని విజయవంతంగా నిర్వహించిన అనుభవమూ ఉంది. ఈసారి భారీగా నిధుల కేటాయింపులూ జరిగాయి, అంతా ప్రణాళికాబద్ధంగా జరుగు తున్నదని చెప్పారు. కనుక రాష్ట్ర ప్రజలు సర్కారునూ, దాని ప్రచారాన్నీ నమ్మి అంతా సవ్యంగా జరుగుతుందని వచ్చారు. కానీ, తొక్కిసలాటలో వందల మంది క్షతగాత్రులయ్యారు. 27 మంది ప్రాణాలొదిలారు. ఇది మనిషి పరిధిలో లేని ప్రకృతి వైపరీత్యం కాదు. ఏ రకంగా చూసినా మానవ తప్పిదమే! నిర్వహణా లోపం వల్ల జరిగింది. ఎవరూ బాధ్యత వహించకుంటే, ఇలాంటి నిర్వహణా లోపాలు, నిర్లక్ష్యాలు, అలసత్వాలు పునరావృతమై సామాన్యులు తరచూ బలి కావాల్సి వస్తుంది. అది జరక్కూడదంటే, జరిగిన దారుణాన్ని సరిగ్గా పరిశీలించి, సమీక్షించి, విశ్లేషించాలి. అన్ని స్థాయిల్లో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయ నిందలకిది సమయం కాదనే మాట నిజమే, అంత మాత్రాన తప్పెక్కడ జరిగింది? బాధ్యులెవరు? అన్నది గుర్తించకూడదని కాదు. బాధ్యత ఎక్కడ మొదలై ఎవరి వద్ద ఆగిపోతుంది? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అన్నీ తానై నడిపించిన ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికా రులు ఈ బాధ్యతా వలయం నుంచి తప్పుకొని సాధారణ అధికారులనో, కిందిస్థాయి ఉద్యోగుల్నో బలిపశువుల్ని చేస్తారా? అదీ కాదంటే అలా దూసు కురావడం తప్పంటూ తొక్కిసలాటలో నలిగిన, ప్రాణాలొదిలిన భక్తుల్నే బాధ్యుల్ని చేస్తారో చూడాలి. అనవసర జాప్యంతో టెండర్లు పిలవకుండా, నామినేషన్ పద్ధతిన ‘అయిన వాళ్లకు’ పనులు అప్పగించడంతో భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయే తప్ప చాలా చోట్ల పనులే జరగలేదు. జరి గిన అరకొర పనుల్లో నాణ్యత కొండెక్కింది. కట్టలు తెంచుకున్న అవినీతిని కళ్లారా చూస్తున్న అధికార, ఉద్యోగ వర్గాల్లో పనిలో తపన తగ్గింది. సరైన ప్రణాళికే లేక ఎక్కడికక్కడ నిర్వహణ వైఫల్యాలు, సమన్వయ లోపాలు, సౌక ర్యాల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. స్థానికాధికారులను, సిబ్బందిని సక్రమంగా పనిచేసుకోనీకుండా ఉన్నతాధికారగణం, రాజకీయ వ్యవస్థ నిరం తరం జోక్యం చేసుకున్నాయి. విపత్తు నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణకు క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు కాలేనంతగా సమీక్షలు జరిపి, నెల రోజులు ఊదరగొట్టిన మంత్రులు, ఉన్నతాధికార వర్గం ఇప్పుడేం చెబుతారు? ఇంత జరిగినా ప్రచార యావ ఇంకా తగ్గలేదు. అవగాహన కార్యక్రమాలు, వర్క్షాపులంటూ పుష్కరాలకొచ్చిన జనాన్ని పోగేసి ఊదరగొడుతున్నారు. తెగ హడావుడి చేస్తూ, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. ప్రచార యావే... జనం ప్రాణాల మీదకి తెచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావ, తదనుగుణంగా జరిగిన నిర్వాకాలే మారణకాండకు ప్రధాన కారణం. ప్రచారం మీదున్న దృష్టిలో పదోవంతైనా పనుల మీద, వాటి నాణ్యత మీద ఉంటే ఈ దుస్థితి దాపురిం చేది కాదనే భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. రూ.1,650 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేస్తే... టెండర్లెందుకు పిలవలేదు? దేనికెంత ఖర్చయింది? పనుల ప్రమాణాలు, నిర్వహణ, నాణ్యత ఎందుకిలా దిగజా రాయి? అని ప్రజలు బేరీజు వేసి వాస్తవాలను అవగాహన చేసుకోగలు గుతారు. అప్పుడు తప్పెక్కడ జరిగిందో, బాధ్యులెవరో తేలిపోతుంది. గంట న్నర సేపు తొక్కిసలాట, అదీ దఫ దఫాలుగా జరుగుతున్నా నిలువరిం చాల్సిన పోలీసులు, భద్రతా సిబ్బంది లేరు. తొక్కిసలాటలో ఊపిరాడక నాలుక పిడుచగట్టుకు పోయిన వారి గొంతు తడపడానికి కాసిని మంచి నీళ్లు లేవు. ఆపత్కాలంలో ఆదుకునే వైద్య సదుపాయాల్లేవు, కొన ఊపిరితో ఉన్న వాళ్లని తరలించడానికి అంబులెన్స్‌లు లేవు. కానీ, ఘాట్ మధ్యలో సీఎం సకుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేస్తుంటే బయట లక్షలాది జన సందోహం కిక్కిరిసి వేచివుంది. అదీ నాలుగయిదు గంటల నిరీక్షణ... ఎందుకు? జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద చంద్రబాబు కీర్తి పతాకాన్ని ఎగురవేసే లఘు చిత్రం చిత్రీకరణ కోసం! ఎంత దుర్మార్గమిది? వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సరస్వతీ ఘాట్‌కు సీఎం, ఆయన కుటుంబం ఎందుకు పరిమితం కాలేదు? అధికారులు వారిస్తున్నా... ఆఖరు నిమిషంలో ఆయన సామాన్యుల ఘాట్‌కు వచ్చి, అక్కడే పూజ, స్నానాదికాలు ఎందుకు చేశారు? ఈ అంశాన్నీ విచారణ పరిధిలోకి తెస్తారా, లేదా? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సమూహ నిర్వహణా మార్గదర్శకాలన్నిటినీ ఎందుకు తుంగలో తొక్కారో తేలాలిప్పుడు. సరైన ప్రణాళిక, పని విభజన, బాధ్యతల పంపకం ఎందుకు జరగలేదు? అన్నీ మంచిగా జరిగితే కీర్తిని తన ఖాతాలో వేసుకోవాలనే దృష్టితో సీఎం అన్నిటికీ తానే కేంద్ర బిందువుగా ఉండటం వల్లే ఈ అనర్థమని ఉద్యోగవర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అధికారుల తెలివిడి ఏమైంది? రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేసీ చేసీ అధికారులు తమ విధుల్ని, రాజ్యాంగ బద్ధమైున బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. రాజకీయ కారణాలతో ఓ ముఖ్యమం త్రి ఏం చెప్పినా అధికారులు తలలూపాలని లేదు. నిబంధనలు ఒప్పుకో వనో, అలా చేస్తే ఇలాంటి ఇబ్బందులొస్తాయనో.... చెప్పి ఉండాల్సింది. రాజ్యాంగం, చట్టాలు, సర్వీసు నిబంధనలకు లోబడి పని చేసే ప్రజా సేవకు లమే తప్ప రాజకీయ వ్యవస్థ చెప్పినట్టల్లా ఆడే బంట్లం కాదనే స్పృహ వారి కుండాలి. ఇటువంటి కార్యక్రమాలకు వీఐపీలు, జన సందోహం లేని వేళల్లోనే రావాలని, వచ్చి వెంటనే వెళ్లిపోవాలని ఎన్డీఎంఏ మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. వీఐపీలొచ్చినపుడు రెవెన్యూ, పోలీసు తదితర సిబ్బంది దృష్టంతా వారిపైనే ఉంటుంది, కనుక సాధారణ విధుల నిర్వహణకు భంగం కలుగు తుందనేది దీని ఉద్దేశం. 1991 గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవానికి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వెళ్లలేదు. పండితులు, అధికా రులతోనే పుష్కరాలను ప్రారంభం చేయించి, 4 రోజులు తర్వాత, రద్దీ తగ్గాక పుష్కర స్నానం చేశారు. 2003లో ఇదే చంద్రబాబు సీఎంగా ఉండగా పుష్కరాలు జరిగినపుడు స్థానిక కలెక్టర్ జవహర్‌రెడ్డి ఎన్డీఎంయే నిబంధనల్ని ఖచ్చితంగా అమలు జరిపించారు. నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వీఐపీ ఘాట్‌లో గాక, సాధారణ భక్తుల ఘాట్‌లో స్నానం చేస్తామంటే నిర్మొ హమాటంగా కుదరదని, ఇబ్బందులొస్తాయని నచ్చజెప్పారు. కానీ, ఈ సారి ఒక్క రాజమండ్రిలోనే గోదావరి పుష్కరాలు జరుగుతున్నట్టు, పుణ్యమంతా అక్కడే సుడులు తిరుగుతున్నట్టుగా ప్రభుత్వం ప్రచారం చేసింది. సీఎంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అంతా అక్కడే మోహరించారు. అదే సమయంలో తన పుష్కర స్నానానికి కొవ్వూరు ఘాట్‌ను ఎంపిక చేసుకొని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జనానికి సరైన సంకేతం పంపారు. ప్రభుత్వం హోర్డింగ్స్, టీవీ, పత్రికలు, రేడియో... అం తటా రాజమండ్రి గురించే ప్రచారం చేశారు. అనర్థం జరిగిపోయాక ఇప్పుడు ముఖ్యమంత్రి... నాసిక్ నుంచి బంగాళాఖాతం వరకు గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుష్కర స్నానమేనని సెలవిస్తున్నారు. ఇవే మాటలను ముం దునుంచే విస్తృతంగా ప్రచారాన్ని, అందుకు ఏర్పాట్లను చేసి ఉండాల్సింది, తెలంగాణలో ఇలా వికేంద్రీకరణ జరిగింది. బాసర, ఎస్సారెస్పీ, పోచం పాడు, ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, ఏటూరు నాగారం, మణుగూరు, భద్రాచలం ఇలా చాలా ప్రాంతాలలో సదుపాయాలు కల్పించి, ప్రచారం చేశారు. మంత్రులు కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర బిందువుగా బాధ్యత వహించాల్సిందే! ‘‘పాణాలు పోయాక పది లచ్చలిస్తామంటున్నారయ్యా..! కావాలంటే పది లచ్చలు నేనిస్తాను..మా పిన్నిని తీసుకురమ్మనండి..బాబూ!’’ అని హోరున విలపిస్తున్న శ్రీకాకుళం జిల్లా బలగ బత్తిన సత్తిబాబుకు ఎవరు సమాధానం చెబుతారు? అదలా ఉంచితే న్యాయవిచారణ అంటూ ముఖ్యమంత్రి దాట వేతకు యత్నిస్తున్నారు. నిస్సందే హమైన మానవ తప్పిదానికి నేరుగా ఆయనే బాధ్యత వహించాలి. పైగా రాజ్యాంగపరమైన బాధ్యతా ఉంది, వీటన్నిటి కంటే ఉన్నతమైన నైతిక బాధ్యతా ఉంది. చంద్రబాబు పరిపాలనా దక్షుడన డం ఉత్త ప్రచారమేనని మరో మారు రుజువైంది. అదే ఆయన నైజం. విజ యాల కీర్తిని తన ఖాతాలో, వైఫల్యాల అపకీర్తిని ఇతరుల ఖాతాలో వేయడం ఆయన రివాజు. ఈ రివాజు ప్రకారమే రాజమండ్రి దుర్ఘటన నెపం ఎవరిపై నెట్టాలా? అని ఆయన ఒక బలిపశువు (బక్రా)ను వెతుకుతున్నారు. ఈమెయిల్: dileepreddy@sakshi.com సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - దిలీప్ రెడ్డి -
రేపు ఇఫ్తార్ లో పాల్గొంటున్న వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ఇఫ్తార్ ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులలో జరిగే గోదావరి పుష్కరాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్తారు. అక్కడ ఆయన పుష్కర స్నానం చేస్తారు.