మళ్లీ పన్నెండేళ్లకు.. | godhavari pushkaralu will come again after 12 years | Sakshi
Sakshi News home page

మళ్లీ పన్నెండేళ్లకు..

Published Sun, Jul 26 2015 9:20 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

godhavari pushkaralu will come again after 12 years

  •  వైభవంగా ముగిసిన పుష్కరఘట్టం గోదావరి తల్లికి హారతితో వీడ్కోలు
  •  12 రోజుల్లో సుమారుగా 76.96 లక్షల మంది పుణ్యస్నానాల ఆచరణ
  •  తరలివచ్చిన భక్తజనం.. కిక్కిరిసిన ఘాట్లు
  •  బాసరలో అధికారికంగా ముగింపు వేడుక
  •  సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
    అంగరంగ వైభవంగా సాగిన పుష్కర పర్వం ముగిసింది. పవిత్ర గోదావరిలో పుణ్య స్నానమాచరించిన లక్షలాది మంది భక్తులు పునీతులయ్యారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలు ప్రారంభమైన ఈనెల 14 నుంచి 24 వరకు అన్ని ఘాట్లలో కలిపి 63.98 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. చివరి రోజు శనివారం 12.98 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. మొత్తం 12 రోజుల్లో కలిపి సుమారుగా 76.96 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్లు అంచనా. పుష్కరాల చివరి రోజు బాసరలో గోదావరి హారతి కన్నుల పండువగా సాగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన గోదావరి హారతి కన్నుల పండువగా జరిగింది. జిల్లాలో ప్రధాన ఘాట్ల అన్నింటిలో ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
     బాసరలో బురద నీటిలో...
     ఏర్పాట్లలో ఘోర వైఫల్యం.. ఘాట్ల మట్టి దిబ్బలు తొలగించకపోవడం.. నదిలోకి నీరు లేకపోవడం.. ఆరంభంలో అవసరంగా వన్‌వే పేరుతో పొలీసుల ట్రాఫిక్ ఆంక్షలు.. ఇలా పలు కారణాలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో పుష్కరాల నిర్వహణలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. కొత్తగా నిర్మించిన ఘాట్ల వద్ద మట్టిని అలాగే ఉంచడంతో నదిలో ఉన్న నీళ్లు ఘాట్ల వద్దకు చేరలేదు. రూ.కోట్లు వెచ్చించి ఘాట్లు నిర్మించినా.. మట్టి తొలగించే చిన్న పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో బాసరకు వచ్చిన లక్షలాది మంది భక్తులు బురద నీటిలో స్నానాలు చేయాల్సి వచ్చింది. బాసరకు వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా.. లక్షలాది మంది భక్తులు బాసరలో పుష్కర స్నానాలు ఆచరించి, చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఒక్క అమ్మవారి దర్శనం విషయంలో మాత్రం దేవాలయ అధికారులు సఫలీకృతులయ్యారు. క్యూలైన్ల నిర్వహణ, గర్భగుడి ముందు ప్రత్యేక ఏర్పాట్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ వేళల్లో పావు గంటలోపే అమ్మవారి దర్శనం కాగా, రద్దీ మరీ ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రమే రెండు నుంచి మూడు గంటలు పట్టింది. లడ్డూ విక్రయాల విషయంలోనూ అంచనాలు తారుమారు కావడంతో చివరి రెండు రోజులు ఒక్కో భక్తునికి రెండు చొప్పున లడ్డూలు విక్రయించారు. పుష్కరాల 12 రోజుల్లో బాసరకు వీఐపీల తాకిడి అంతగా లేదు. కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, సినీ నటుడు సుమన్, బీజే పీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు  సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు.
     సోన్‌లో సక్సెస్..
     పక్కనే 44వ జాతీయ రహదారి.. ఎస్సారెస్పీ నుంచి నిత్యం నీటి విడుదల.. ఘాట్ల వద్ద స్వచ్ఛమైన నీరు.. దీంతో నిర్మల్ మండలం సోన్ ఘాట్లకు భక్తులు పోటెత్తారు. అంచనాలకు మించి తరలివచ్చారు. నిత్యం లక్షల్లో భక్తుల రాకతో ఘాట్లన్నీ కిటకిటలాడాయి. హైదరాబాద్, మహారాష్ట్రతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి భారీగా వాహనాల్లో తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. రాకపోకలకు సౌకర్యంగా ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా కొనసాగింది. పీఠాధిపతులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు సోన్‌ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించారు. సోన్‌లో పిండప్రదానాలు చేస్తే కాశీలో చేసినంత పుణ్యం వస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పిండప్రదానాలు జరిగాయి.
     మంచిర్యాలలో అంచనాలకు మించి..
     జిల్లాలోనే అత్యధికంగా మంచిర్యాల గోదావరి తీరంలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. నిత్యం లక్షల్లో పోటెత్తడంతో గోదావరి తీరం జనసంద్రాన్ని తలపించింది. ప్రధాన రైలు మార్గం కావడం.. ప్రత్యేక రైళ్లు నడపడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. పైగా ఇక్కడ గోదావరి తీరం విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, పుష్కలంగా నీళ్లుండటంతో ఇక్కడ స్నానాలు ఆచరించేందుకు భక్తులు మొగ్గుచూపారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో భక్తులను పక్కనే ఉన్న ముల్కల్ల, సీతారాంపల్లి ఘాట్లక మళ్లించాల్సి వచ్చింది. పుష్కర ప్రయుక్త బ్రహ్మ యజ్ఞం, నక్షత్ర యాగం వంటి ధార్మిక కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ఈ ఆధ్మాతిక కార్యక్రమంలో చినజీయర్ స్వామి ప్రవచనాలు చేశారు.
     పులకించిన ఉత్తరవాహిని..
     ఉత్తర వాహిని చెన్నూర్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మొదట్లో పొలీసులు నది వద్దకు వాహనాలను అనుమతించలేదు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఆంక్షలను ఎత్తివేశారు. చివరి మూడు రోజులు గోదావరిలో నీటి ప్రవాహం పెరగడంతో కొందరు భక్తులు షవర్ల వద్ద పుష్కర స్నానాలు ఆచరించారు. హైదరాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఘాట్ల వద్ద భక్తులకు మంచినీటిని సరఫరా చేయడంలో మినహా అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
     గూడేనికి అంతంతే...
     శ్రీ సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న గూడెం ఘాట్‌కు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాలు వేశారు. ఇక్కడ ఘాట్ నిర్మాణంలో ఉన్న లోపం కారణంగా ఘాట్ వద్దకు నీరు వచ్చి చేరలేదు. పైగా లోతు ఎక్కువగా ఉండటంతో నదిలోకి దిగేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో భక్తులు షవర్ల కిందే పుష్కర స్నానాలు ఆచరించాల్సి వచ్చింది. చాలా మంది భక్తులు సమీపంలో ఉన్న ధర్మపురి, రాయపట్నంకు తరలిపోయారు. జిల్లా మంత్రులతోపాటు, హరీష్, ఈటల వచ్చి చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఏర్పాట్ల విషయమై స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు నిలదీసిన ఘటనలు జరిగాయి.
     చిన్న ఘాట్లకు అధిక సంఖ్యలో..
     ఇంత వరకు అంతగా ప్రచారంలో లేని చిన్న ఘాట్ల వద్ద ఈ సారి పుష్కరాల్లో లక్షల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ ఘాట్లకు అంచనాలకు మించి వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముల్కల్ల ఘాట్ వద్ద సుమారు ఆరు లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు.  లోకేశ్వరం మండలం బ్రహ్మేశ్వర్‌లో రెండు లక్షలకు పైగా, కూచన్‌పల్లి, ఖనాపూర్, లక్షెట్టిపేట్, సీతారాంపల్లి వంటి ఘాట్లలకు లక్షకు మించి భక్తులు పుణ్యస్నానాలు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement