godhavari pushkaralu
-
మళ్లీ పన్నెండేళ్లకు..
-
మళ్లీ పన్నెండేళ్లకు..
వైభవంగా ముగిసిన పుష్కరఘట్టం గోదావరి తల్లికి హారతితో వీడ్కోలు 12 రోజుల్లో సుమారుగా 76.96 లక్షల మంది పుణ్యస్నానాల ఆచరణ తరలివచ్చిన భక్తజనం.. కిక్కిరిసిన ఘాట్లు బాసరలో అధికారికంగా ముగింపు వేడుక సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అంగరంగ వైభవంగా సాగిన పుష్కర పర్వం ముగిసింది. పవిత్ర గోదావరిలో పుణ్య స్నానమాచరించిన లక్షలాది మంది భక్తులు పునీతులయ్యారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలు ప్రారంభమైన ఈనెల 14 నుంచి 24 వరకు అన్ని ఘాట్లలో కలిపి 63.98 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. చివరి రోజు శనివారం 12.98 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. మొత్తం 12 రోజుల్లో కలిపి సుమారుగా 76.96 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్లు అంచనా. పుష్కరాల చివరి రోజు బాసరలో గోదావరి హారతి కన్నుల పండువగా సాగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన గోదావరి హారతి కన్నుల పండువగా జరిగింది. జిల్లాలో ప్రధాన ఘాట్ల అన్నింటిలో ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాసరలో బురద నీటిలో... ఏర్పాట్లలో ఘోర వైఫల్యం.. ఘాట్ల మట్టి దిబ్బలు తొలగించకపోవడం.. నదిలోకి నీరు లేకపోవడం.. ఆరంభంలో అవసరంగా వన్‌వే పేరుతో పొలీసుల ట్రాఫిక్ ఆంక్షలు.. ఇలా పలు కారణాలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో పుష్కరాల నిర్వహణలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. కొత్తగా నిర్మించిన ఘాట్ల వద్ద మట్టిని అలాగే ఉంచడంతో నదిలో ఉన్న నీళ్లు ఘాట్ల వద్దకు చేరలేదు. రూ.కోట్లు వెచ్చించి ఘాట్లు నిర్మించినా.. మట్టి తొలగించే చిన్న పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో బాసరకు వచ్చిన లక్షలాది మంది భక్తులు బురద నీటిలో స్నానాలు చేయాల్సి వచ్చింది. బాసరకు వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా.. లక్షలాది మంది భక్తులు బాసరలో పుష్కర స్నానాలు ఆచరించి, చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఒక్క అమ్మవారి దర్శనం విషయంలో మాత్రం దేవాలయ అధికారులు సఫలీకృతులయ్యారు. క్యూలైన్ల నిర్వహణ, గర్భగుడి ముందు ప్రత్యేక ఏర్పాట్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ వేళల్లో పావు గంటలోపే అమ్మవారి దర్శనం కాగా, రద్దీ మరీ ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రమే రెండు నుంచి మూడు గంటలు పట్టింది. లడ్డూ విక్రయాల విషయంలోనూ అంచనాలు తారుమారు కావడంతో చివరి రెండు రోజులు ఒక్కో భక్తునికి రెండు చొప్పున లడ్డూలు విక్రయించారు. పుష్కరాల 12 రోజుల్లో బాసరకు వీఐపీల తాకిడి అంతగా లేదు. కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, సినీ నటుడు సుమన్, బీజే పీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. సోన్‌లో సక్సెస్.. పక్కనే 44వ జాతీయ రహదారి.. ఎస్సారెస్పీ నుంచి నిత్యం నీటి విడుదల.. ఘాట్ల వద్ద స్వచ్ఛమైన నీరు.. దీంతో నిర్మల్ మండలం సోన్ ఘాట్లకు భక్తులు పోటెత్తారు. అంచనాలకు మించి తరలివచ్చారు. నిత్యం లక్షల్లో భక్తుల రాకతో ఘాట్లన్నీ కిటకిటలాడాయి. హైదరాబాద్, మహారాష్ట్రతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి భారీగా వాహనాల్లో తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. రాకపోకలకు సౌకర్యంగా ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా కొనసాగింది. పీఠాధిపతులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు సోన్ఘాట్లో పుష్కర స్నానాలు ఆచరించారు. సోన్‌లో పిండప్రదానాలు చేస్తే కాశీలో చేసినంత పుణ్యం వస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పిండప్రదానాలు జరిగాయి. మంచిర్యాలలో అంచనాలకు మించి.. జిల్లాలోనే అత్యధికంగా మంచిర్యాల గోదావరి తీరంలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. నిత్యం లక్షల్లో పోటెత్తడంతో గోదావరి తీరం జనసంద్రాన్ని తలపించింది. ప్రధాన రైలు మార్గం కావడం.. ప్రత్యేక రైళ్లు నడపడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. పైగా ఇక్కడ గోదావరి తీరం విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, పుష్కలంగా నీళ్లుండటంతో ఇక్కడ స్నానాలు ఆచరించేందుకు భక్తులు మొగ్గుచూపారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో భక్తులను పక్కనే ఉన్న ముల్కల్ల, సీతారాంపల్లి ఘాట్లక మళ్లించాల్సి వచ్చింది. పుష్కర ప్రయుక్త బ్రహ్మ యజ్ఞం, నక్షత్ర యాగం వంటి ధార్మిక కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ఈ ఆధ్మాతిక కార్యక్రమంలో చినజీయర్ స్వామి ప్రవచనాలు చేశారు. పులకించిన ఉత్తరవాహిని.. ఉత్తర వాహిని చెన్నూర్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మొదట్లో పొలీసులు నది వద్దకు వాహనాలను అనుమతించలేదు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఆంక్షలను ఎత్తివేశారు. చివరి మూడు రోజులు గోదావరిలో నీటి ప్రవాహం పెరగడంతో కొందరు భక్తులు షవర్ల వద్ద పుష్కర స్నానాలు ఆచరించారు. హైదరాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఘాట్ల వద్ద భక్తులకు మంచినీటిని సరఫరా చేయడంలో మినహా అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. గూడేనికి అంతంతే... శ్రీ సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న గూడెం ఘాట్‌కు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాలు వేశారు. ఇక్కడ ఘాట్ నిర్మాణంలో ఉన్న లోపం కారణంగా ఘాట్ వద్దకు నీరు వచ్చి చేరలేదు. పైగా లోతు ఎక్కువగా ఉండటంతో నదిలోకి దిగేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో భక్తులు షవర్ల కిందే పుష్కర స్నానాలు ఆచరించాల్సి వచ్చింది. చాలా మంది భక్తులు సమీపంలో ఉన్న ధర్మపురి, రాయపట్నంకు తరలిపోయారు. జిల్లా మంత్రులతోపాటు, హరీష్, ఈటల వచ్చి చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఏర్పాట్ల విషయమై స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు నిలదీసిన ఘటనలు జరిగాయి. చిన్న ఘాట్లకు అధిక సంఖ్యలో.. ఇంత వరకు అంతగా ప్రచారంలో లేని చిన్న ఘాట్ల వద్ద ఈ సారి పుష్కరాల్లో లక్షల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ ఘాట్లకు అంచనాలకు మించి వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముల్కల్ల ఘాట్ వద్ద సుమారు ఆరు లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. లోకేశ్వరం మండలం బ్రహ్మేశ్వర్‌లో రెండు లక్షలకు పైగా, కూచన్‌పల్లి, ఖనాపూర్, లక్షెట్టిపేట్, సీతారాంపల్లి వంటి ఘాట్లలకు లక్షకు మించి భక్తులు పుణ్యస్నానాలు చేశారు. -
జనహారతి
పుష్కరుడు పులకరించిన వేళ! 12 రోజుల్లో 2.92 కోట్ల మంది పుణ్యస్నానాలు మహాహారతితో ముగిసిన పన్నెండేళ్ల పండుగ పుష్కరుడు పులకరించేలా.... గోదారమ్మ పరవశించేలా పన్నెండేళ్ల పండుగ వైభవంగా ముగిసింది. గోదావరి మహాపుష్కరాలు ఆరంభమైంది మొదలు ముగిసేవరకు భక్తులు వెల్లువలా తరలివచ్చారు. గతంలో ఏ పుష్కరాలకు లేనంతగా 12 రోజుల్లో 2,92,17,992 మంది భక్తులు జిల్లా వ్యాప్తంగా పుష్కర స్నానమాచరించారు. పన్నెండు రోజుల పండుగతోపుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలో 6 కోట్ల మందికి పైగాపుష్కరస్నానమాచరిస్తే అందులో సగం మంది మన జిల్లాకే వచ్చారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : గోదావరి మహా పుష్కరాలు ముగిశాయి. 14న ఉదయం 6.20 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులమీదుగా ధర్మపురిలో పుష్కరాలు ప్రా రంభించిన నాటి నుంచి మొదలు శనివారం సాయంత్రం 6.21 గంటలకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ దంపతుల చేతుల మీదుగా మహాహారతి కార్యక్రమంతో పుష్కర పండుగకు ఘన వీడ్కోలు పలికేంతవరకు జనం తండోపతండాలుగా పుష్కర ఘాట్లకు వస్తూనే ఉన్నారు. గోదావరి పుష్కరాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన దాఖలాల్లేవు. రాష్ర్టవ్యాప్తంగా 6 కోట్ల మందికిపైగా పుష్కర స్నానమాచరిస్తే అందులో సగం మంది కరీంనగర్ జిల్లాకే రావడం విశేషం. వీరిలో పుష్కర స్నానం చేసి వివిధ ఆలయాల్లో దైవదర్శనం చేసుకున్న వారు 1.73 కోట్ల మంది ఉన్నారు. సాధారణ భక్తులతోపాటు పుష్కర స్నానం చేసేందుకు జిల్లాకు తర లివచ్చిన ప్రముఖులెందరో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, సినీ, కళారంగ ప్రముఖులు, ఉన్నతాధికారులు... ఇలా ప్రముఖులెందరో వచ్చారు. పన్నెం డు రోజుల పండుగతో పుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రతిరోజు లక్షల మంది భక్తులతో ధర్మపురి దద్దరిల్లింది. కాళేశ్వరం కిటకిటలాడింది. కోటిలింగాల కోటేశ్వరుడి నామస్మరణతో ఊగిపోయింది. మంథని మహాజాతరలా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే.... గోదావరి పుష్కరాలు కరీంనగర్‌కు ప్రత్యేక శోభను సంతరించి వెళ్లాయి. కాళేశ్వరంలో... త్రిలింగ క్షేత్రం... త్రివేణి సంగమంలో 12 రోజుల పండగ మహా వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య లో భక్తులు తరలివచ్చారు. 12 రోజుల్లో 83 లక్షల పైచిలుకు భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. ఇందులో 30 లక్షల మంది కాళేశ్వర ముక్తీరస్వామిని దర్శించుకున్నారు. అభిషేకాలు, దర్శన టికెట్లు, లడ్డూ, పులి హోర ప్రసాదాల ద్వారా రూ.1.40కోట్ల ఆదాయం ఆలయూనికి సమకూరింది. అంచనాకు మించి భక్తులు తరలిరావడంతో పలుమార్లు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. 5 నుంచి 8వ రోజు వరకు రోజుకు 8 నుంచి 10 లక్షల వరకు భక్తులు తరలిరావడంతో కాస్త అసౌకర్యం తప్పలేదు. కాటారం నుంచి కాళేశ్వరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండు రోజులు కాళేశ్వరంలోనే బస చేయగా, స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు పన్నెండు రోజులు ఇక్కడే మకాం వేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఓఎస్డీ సుబ్బరాయుడు నిరంతర పర్యవేక్షణతో ట్రాఫిక్ సమస్య సహా భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా అపశ్రుతులు దొర్లాయి. పుష్కర స్నానానికి వస్తూ కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు, మంథని మండలం ఎగ్లాస్పూర్ వద్ద ఆరుగురు మృతి చెందారు. మహారాష్ట్రలోని వెంకటాపురానికి చెందిన ఒకరు, కథలాపూర్ మండలం తాం డ్రియాల సర్పంచ్ పానుగం టి శంకర్ అస్వస్థతతో మరణించారు. పుష్కరాలను రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించగా, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మహాహారతితో ముగింపు పలికారు. ధర్మపురి... భక్తకోటి ధర్మపురి పుష్కరఘాట్లలో 93 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు చేశారు. మొదటి నుంచే భారీగా తరలివచ్చారు. మొదటి రెండు రోజు లు భక్తుల సంఖ్య 1.50 లక్షల నుంచి 2.25 లక్షల మధ్యలో ఉండగా తరువాత రోజుల్లో భక్తజనం పెరిగింది. గడిచిన శని, ఆదివారాల్లో అత్యధికంగా జనం వచ్చారు. ట్రాఫిక్ ఇబ్బం దులతో భక్తులు సమస్యల పాలయ్యారు. స్పీకర్ మధుసూదనాచారితో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పుష్కర స్నానాలు ఆచరించారు. ఆర్టీసీ వారు ధర్మపురిలో 60-100 ఉచిత బస్సులు నడిపి భక్తులకు ఘాట్ల వద్దకు చేర్చారు. ధర్మపురి గోదావరి పుష్కర స్నానాల అనంతరం లక్ష్మీనృసింహస్వామివారిని 50 లక్షల మంది దర్శించుకున్నారు. మొత్తం 12 రోజుల వ్యవధిలో గుడికి రూ.1.38 కోట్ల ఆదాయం సమకూరింది. సాయంత్రం ధర్మపురి అన్ని ఘాట్లలో పూర్ణాహుతి నిర్వహించడంతోపాటు మంత్రి ఈటల చేతుల మీదుగా మహాహారతి ఇచ్చి పన్నెండు రోజుల పండుగకు ముగింపు పలికారు. మంథని, గోదావరిఖనిలోనూ... మంత్రపురిగా పిలువబడే మంథనిలో సైతం పుష్కర గోదావరి పరవశించింది. పన్నెండు రోజుల్లో 24 లక్షల మంది భక్తులు పుష్కర స్నా నం చేశారు. పది లక్షల మంది భక్తులు గౌతమేశ్వరున్ని దర్శించుకున్నారు. గోదావరిఖని వద్దనున్న మూడుఘాట్ల వద్ద 12రోజులుగా 17.25 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు పుష్కరఘాట్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా జడ్జి నాగమారుతీశర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, ఢిల్లీకి చెందిన బోర్డు డెరైక్టర్ డీఎన్ ప్రసాద్ గోదావరిఖని పరిసర ప్రాంత పుష్కరఘాట్లలో స్నానం చేసి వెళ్లారు. కోటిలింగాలలో 20 లక్షలు కోటిలింగాలలో పుష్కరాల మొదటిరోజు ప్రారంభమైన భక్తుల ప్రవాహ ఝరి చివరిరోజు వరకు కూడా తగ్గలేదు. శనివారం లక్ష మంది పుష్కరస్నానం చేశారు. మొత్తం 12 రోజుల్లో 20 లక్షలమంది స్నానమాచరించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు మొదలైన రద్దీ ఘాట్లు ముగిసే వరకు కొనసాగింది. మంత్రి ఈటల, చీఫ్ విప్ కొప్పుల, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కోటిలింగాల పుష్కర ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటిలింగాల పుష్కర ఘాట్ నుంచి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బోట్లో వెళ్లి వచ్చారు. కోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. డెప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
దరికి చేర్చే దారి కాల్ సెంటర్
పుష్కరఘాట్ (రాజమండ్రి): పుష్కర స్నానాలకు వచ్చి తప్పిపోయిన యాత్రికులను తిరిగి బంధువుల వద్దకు చేర్చడంలో కాల్‌సెంటర్లు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. పుష్కరఘాట్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ రూమ్ కాల్‌సెంటర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో తప్పిపోయిన వారి వివరాలను టోల్‌ఫ్రీ నంబర్ 12890 ద్వారా నమోదు చేసుకుని ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో పది లైన్లతో కూడిన కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం వరకు సుమారు రెండు వేల మంది తప్పిపోయిన వారి వివరాలు నమోదు చేశారు. 1,930 మందిని గుర్తించి వారి బంధువుల వద్దకు చేర్చారు. మిగిలిన వారి వివరాల లభ్యం కాలేదు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాల్సెంటర్లో వివిధ కళాశాలల విద్యార్థులు సేవలందిస్తున్నారు. పుష్కర యాత్రికులకు సేవలు అందించే భాగ్యం కలిగినందుకు వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర సేవ చేస్తానని ఊహించలేదు పుష్కరాల్లో సేవలందించే భాగ్యం లభిస్తుందని ఊహించలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. రెవెన్యూ శాఖ పిలిచిన ఇంటర్వ్యూలో కాల్‌సెంటర్ ఆపరేటర్‌గా ఎంపికై 12 రోజులు సేవలందించడం జీవితంలో మర్చిపోలేనిది. - పి.సాయికుమార్, కాకినాడ ఈ అనుభవం మర్చిపోలేనిది పుష్కరాల్లో విధులు నిర్వహించడం గొప్ప విష యం. కాల్సెంటర్లో పని చేసే అవకాశం లభించినప్పుడు చాలా సంతోషించాను. ఈ అనుభవం జీవితంలో మర్చిపోలేనిది. - వి.హర్షిత, సీఏ విద్యార్థిని -
ఆ నలుగురు
అనుక్షణం..అప్రమత్తం అన్నింటా తామై... జనంతో మమేకమై లక్షల్లో జనమొస్తున్నా సమస్యలను అధిగమిస్తూ ముందుకు.. పుష్కర భారాన్ని మోసే నాలుగు స్తంభాలుగా మారి... నిరంతర సేవల్లో కలెక్టర్, జేసీ, ఎస్పీ, ఓఎస్డీ 'ఘాట్ నెం.2 వద్ద కొబ్బరి చిప్పలు గోదావరిలో పేరుకుపోయి భక్తుల కాళ్లకు గుచ్చుకుంటున్నాయి... వెంటనే తొలగించండి... అందరూ అప్రమత్తంగా ఉండండి...'అధికారులకు.... కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశం. 'సాధారణ భక్తులు గంటల కొద్దీ లై న్లో ఇబ్బంది పడుతున్నారు... వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపేయండి... పుష్కర ఘాట్ల దగ్గర చెత్త పేరుకుపోయింది... శానిటేషన్ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఇక్కడ తాగడానికి నీళ్లు కన్పించడం లేదు... ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వెంటనే పిలవండి...'కాళేశ్వరం ఆలయం వద్ద అటు ఇటు తిరుగుతూ జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు ఆదేశాలు. 'కాళేశ్వరం రూట్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడండి... వచ్చే వాహనాలను ఒకవైపు, తిరిగి వెళ్లే వాహనాలను మరోవైపు మళ్లించండి... ఎక్కడ జామ్ అయ్యిందో వెంటనే క్లియర్ చేసే బాధ్యత అక్కడి పోలీ సులు తీసుకోండి.. 'ఓఎస్డీ సుబ్బరాయుడు ఆదేశాలు. 'వీఐపీ పుష్కర ఘాట్‌లో జనం తక్కువగా ఉన్నారు... ఇతర ఘాట్ల నుంచి ఇక్కడికి భక్తులను మళ్లించండి... ధర్మారం దగ్గర ట్రాఫిక్ త్వరగా క్లియర్ చేయండి... లేకుంటే ధర్మపురి వద్ద మళ్లీ ట్రాఫిక్ జామ్ అవుతుంది...'పోలీసులకు ఎస్పీ జోయల్ డేవిస్ ఆదేశాలు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కోరుట్ల/మంథని : పన్నెండేళ్ల పండుగకు లక్షల్లో జనం వస్తా రు... వాళ్లకు ఏ ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయడమంటే మాటలా.... అధికారుల వల్ల అయ్యే పనేనా? ప్రతిరోజూ వేలాది వాహనాలు జిల్లాకు వస్తే ట్రాఫిక్‌ను నియంత్రించగలమా? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీఐపీల పేరిట వచ్చే ప్రముఖులకు తగిన భద్రత కల్పించడానికే నానాతంటాలు పడే మన జిల్లా పోలీసులు లక్షల మంది ఒకేచోట గుమిగూడేచోట తగిన రక్షణ కల్పించడం సాధ్యమవుతుందా? గోదావరి మహాపుష్కరా ల ప్రారంభానికి ముందు సామాన్యుల్లో కలి గిన సందేహమిది. అవన్నీ పటాపంచలు చేస్తూ జిల్లా పాలనా, పోలీస్ యంత్రాంగం పుష్కరాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. రాష్ర్టంలో ఎక్కడా లేనంతగా జిల్లాకు వరదలా భక్తులు వస్తున్నా వెరవకుండా ఇటు ఏర్పాట్లలో లోపం రాకుండా, అటు భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఈ విషయంలో జిల్లాకు చెందిన నలుగురు ఉన్నతాధికారులు చేస్తున్న కృషి, అమలు చేస్తున్న ప్రణాళిక పట్ల జిల్లావ్యాప్తంగా ప్రశంసలొస్తున్నాయి. వాళ్లెవరో కాదు... జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీ జోయ ల్ డేవిస్, ఓఎస్డీ సుబ్బరాయుడు. తొలిరోజు అక్కడక్కడా చిన్న చిన్న ఇబ్బందులు, లోటుపాట్లు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు వెళుతున్నారు. కొందరు అధికారులు యథాలాపంగానే అలస్వతం వహిస్తున్నా... మరికొందరు సిబ్బంది సహాయ నిరాకరణ చేస్తున్నా... సామ, దాన, దండోపాయాలతో దారికి తెచ్చుకుంటూ సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి భేషజాలకు పోకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులమన్న అహాన్ని పక్కనబెట్టి సామాన్య ఉద్యోగుల మాదిరిగా చేతిలో వాకీటాకీతో భక్తుల మధ్యలో తిరుగుతున్నారు. భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూస్తూ... అప్పటికప్పుడే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్, ఎస్పీ క్షణక్షణం పర్యవేక్షణ ధర్మపురి పుణ్యక్షేత్రంలో తొమ్మిది రోజుల వ్యవధిలో సుమారు కోటిన్నర మంది భక్తులు పుష్కర స్నానాలు, నృసింహాస్వామి దర్శనాలకు తరలివచ్చారు. ఇంతమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడం అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కలెక్టర్ నీతూప్రసాద్ పుష్కరాల్లో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులను సమన్వయపర్చడం గమనార్హం. రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య సఖ్యత కొరవడిన క్షణంలో.. 'ఇన్నాళ్లు ప్రతిష్టాత్మకంగా ధర్మపురి పుష్కరాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించాం.. చిన్నచిన్న పాటి సమస్యలను పట్టించుకోవద్దు'అని సర్దిచెప్పి సమస్యను సద్దుమణిగేలా చేశారు. ఎస్పీ జోయల్ డేవిస్ సైతం నిత్యం రోడ్లపైనే కన్పిస్తున్నారు. గత శని, ఆదివారాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిన సందర్భంలో స్వయంగా గంటల తరబడి రోడ్డుపై నిలబడి ధర్మపురి-రాయపట్నం రూట్లో నిలిచిన వాహనాలను క్రమబద్దీకరించారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందనే సమాచారం వచ్చినా అక్కడ ప్రత్యక్షమవుతూ భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్, ఎస్పీ ఇరువురూ ఒకవైపు కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పజెప్పుతూనే... తామూ క్షేత్రస్థాయిలో పుష్కర భక్తజనంతో మమేకమై పుష్కర ఘాట్లు, నృసింహాస్వామి ఆలయ ఆవరణను కలియదిరుగుతూ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా పుష్కర విధుల నిర్వహణను సవాల్‌గా తీసుకుని సక్సెస్ చేస్తున్నారు. ప్రతి రోజు ఎక్కడ చూసినా ధర్మపురి పుణ్యక్షేత్రంలో కలెక్టర్, ఎస్పీలు ఎవరికి వారు వేర్వేరుగా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ కనిపించడం విశేషం. కుంభమేళాను తలపించే రీతిలో గోదావరికి పోటెత్తుతున్న జనప్రవాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో వీరిద్దరి పాత్ర కీలకంగా మారి భక్తజనాన్ని మెప్పిస్తోంది. కర్రపట్టి జేసీ... లాఠీపట్టి ఓఎస్డీ విధిలో నిర్వహణలో అలుపెరకుండా పరుగులు పెడుతూ అధికారులను తమదైన శైలిలో పని చేయిస్తూ కాళేశ్వరంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించడంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఓఎస్డీ సుబ్బారాయుడు తమ మార్క్‌ను చూపుతున్నారు. పుష్కరాల ప్రారంభానికి ముందే భక్తుల సౌకర్యాలపై పలుమార్లు సమీక్షలు నిర్వహించిన జేసీ ఇప్పుడు శానిటేషన్ నుంచి నీటిసరఫరా, క్యూలైన్లలో భక్తుల వసతులపై ఆరా తీసి సమస్యలుంటే వాటి పరిష్కారానికి కృషి చే యడం అందరిని ఆలోచింపచేస్తోంది. ఇంటి గ్రేటెడ్ కంట్రోల్ రూం సహా అన్ని శాఖల అధికారులతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కాళేశ్వరం ఆలయంలో వీఐపీ దర్శనాలతో గంటల తరబడి సాధారణ భక్తులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తుతుండడాన్ని గమనించిన జేసీ గత వారం రోజులుగా అక్కడే మకాం వేసి సాధారణ భక్తులు ఫస్ట్... వీఐపీ లు నెక్స్ అనే విధంగా వ్యవహరిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చిన రోజుల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తూ ఆ ద్వారం వద్ద స్వయంగా తానే కూర్చొని సాధారణ భక్తులకు అసౌకర్యం కల్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎక్కడ ఇబ్బందులెదురైనా అక్కడ ప్రత్యక్షమై వాటిని అధిగమించేందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఓఎస్డీ సుబ్బారాయుడు సైతం శాంతిభధ్రతల పరిరక్షణలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ముందుకెళ్తున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రధాన ఘాట్, వీఐపీ ఘాట్‌తో పాటు కాళేశ్వరంలో అవసరమైన చోట్ల పోలీసులను ఏర్పాటు చేసి చిన్న సంఘటనకు కూడా ఆస్కారం ఇవ్వకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో ఓఎస్డీ తీసుకున్న చర్యలు భక్తుల కష్టాలను దూరం చేశాయి. లక్షల్లో భక్తులు తరలివస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వన్‌వేతో పాటు తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు. -
106 ఏళ్లు.. ఏడో పుష్కరం
నిర్మల్‌రూరల్ : ఈ అవ్వ పేరు ఎనగందుల లక్ష్మీబాయి. నిర్మల్ నివాసి. 106 ఏళ్లుంటాయి. మునిమనుమలతో కలిసి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా సోన్ ఘాట్‌కు పుష్కరస్నానానికి వచ్చింది. 'ఆ గంగమ్మ ఆశీస్సులతోనే అందరం సల్లంగున్నం.. నా కొడుకులు, బిడ్డలు, మనుమలు, వాళ్ల పిల్లలతో పుష్కర స్నానం జేసిన. ఇది ఏడోసారి' అని పేర్కొంది. వయసు మీద పడ్డా.. ఆరోగ్యం అంతగా సహకరించకున్నా.. 'నేనూ మీతో వస్తానంది' అని, ఆమె కోరికను కాదనలేక తీసుకువచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
కాళేశ్వరంలో ప్రముఖుల స్నానాలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రంలో ఆదివారం సాయంత్రం పలువువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారితోపాటూ మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు పుణ్యస్నానాలు చేశారు. మరో వైపు కాళేశ్వరం వద్ద గోదావరి పుష్కరాల్లో రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 3 గంటల సమయానికి 3.5 లక్షల మంది స్నానాలు చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే, కాళేశ్వరం- మహదేవపూర్ మార్గంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
' చంద్రబాబు నిర్వాకం వల్లే తొక్కిసలాట'
హైదరాబాద్: సీఎం చంద్రబాబునాయుడు పుష్కరఘాట్‌లో ఉన్నపుడే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ కూడా ధృవీకరించారని తెలిపారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోయారని ఎస్పీ చెప్పిన తర్వాతే చంద్రబాబు వెళ్లిపోయారని పేర్కొన్నారు. అధికారుల నివేదికలు వాస్తవాలను బయట పెడుతున్నాయన్నారు. ఎస్పీ పై ఒత్తిడి తెచ్చి తాను ఇలా చెప్పలేదని చెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని ఉమ్మారెడ్డి అన్నారు. టీడీపీ మంత్రులు, నాయకులు ఈ ఘటనపై రకరకాలుగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు నిర్వాకం వల్లే దాదాపు 32 మంది చనిపోయారని మండిపడ్డారు.