ఆ నలుగురు | collector, jc, sp, osd work hard for godhavari pushkaralu in karimnagar district | Sakshi
Sakshi News home page

ఆ నలుగురు

Published Sat, Jul 25 2015 10:41 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

collector, jc, sp, osd work hard for godhavari pushkaralu in karimnagar district

అనుక్షణం..అప్రమత్తం

  •  అన్నింటా తామై... జనంతో మమేకమై
  •  లక్షల్లో జనమొస్తున్నా సమస్యలను అధిగమిస్తూ ముందుకు..
  •  పుష్కర భారాన్ని మోసే నాలుగు స్తంభాలుగా మారి...
  •  నిరంతర సేవల్లో కలెక్టర్, జేసీ, ఎస్పీ, ఓఎస్డీ

 'ఘాట్ నెం.2 వద్ద కొబ్బరి చిప్పలు గోదావరిలో పేరుకుపోయి భక్తుల కాళ్లకు గుచ్చుకుంటున్నాయి... వెంటనే తొలగించండి... అందరూ అప్రమత్తంగా ఉండండి...'అధికారులకు.... కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశం.
 
 'సాధారణ భక్తులు గంటల కొద్దీ లై న్లో ఇబ్బంది పడుతున్నారు... వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపేయండి... పుష్కర ఘాట్ల దగ్గర చెత్త పేరుకుపోయింది... శానిటేషన్ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఇక్కడ తాగడానికి నీళ్లు కన్పించడం లేదు... ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను వెంటనే పిలవండి...'కాళేశ్వరం ఆలయం వద్ద అటు ఇటు తిరుగుతూ జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు ఆదేశాలు.
 
'కాళేశ్వరం రూట్‌లో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడండి... వచ్చే వాహనాలను ఒకవైపు, తిరిగి వెళ్లే వాహనాలను మరోవైపు మళ్లించండి... ఎక్కడ జామ్ అయ్యిందో వెంటనే క్లియర్ చేసే బాధ్యత అక్కడి పోలీ సులు తీసుకోండి.. 'ఓఎస్డీ సుబ్బరాయుడు ఆదేశాలు.
 
'వీఐపీ పుష్కర ఘాట్‌లో జనం తక్కువగా ఉన్నారు... ఇతర ఘాట్ల నుంచి ఇక్కడికి భక్తులను మళ్లించండి... ధర్మారం దగ్గర ట్రాఫిక్ త్వరగా క్లియర్ చేయండి... లేకుంటే ధర్మపురి వద్ద మళ్లీ ట్రాఫిక్ జామ్ అవుతుంది...'పోలీసులకు ఎస్పీ జోయల్ డేవిస్ ఆదేశాలు.
 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కోరుట్ల/మంథని :
పన్నెండేళ్ల పండుగకు లక్షల్లో జనం వస్తా రు... వాళ్లకు ఏ ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయడమంటే మాటలా.... అధికారుల వల్ల అయ్యే పనేనా? ప్రతిరోజూ వేలాది వాహనాలు జిల్లాకు వస్తే ట్రాఫిక్‌ను నియంత్రించగలమా? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీఐపీల పేరిట వచ్చే ప్రముఖులకు తగిన భద్రత కల్పించడానికే నానాతంటాలు పడే మన జిల్లా పోలీసులు లక్షల మంది ఒకేచోట గుమిగూడేచోట తగిన రక్షణ కల్పించడం సాధ్యమవుతుందా? గోదావరి మహాపుష్కరా ల ప్రారంభానికి ముందు సామాన్యుల్లో కలి గిన సందేహమిది. అవన్నీ పటాపంచలు చేస్తూ జిల్లా పాలనా, పోలీస్ యంత్రాంగం పుష్కరాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. రాష్ర్టంలో ఎక్కడా లేనంతగా జిల్లాకు వరదలా భక్తులు వస్తున్నా వెరవకుండా ఇటు ఏర్పాట్లలో లోపం రాకుండా, అటు భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఈ విషయంలో జిల్లాకు చెందిన నలుగురు ఉన్నతాధికారులు చేస్తున్న కృషి, అమలు చేస్తున్న ప్రణాళిక పట్ల జిల్లావ్యాప్తంగా ప్రశంసలొస్తున్నాయి.  వాళ్లెవరో కాదు... జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీ జోయ ల్ డేవిస్, ఓఎస్డీ సుబ్బరాయుడు. తొలిరోజు అక్కడక్కడా చిన్న చిన్న ఇబ్బందులు, లోటుపాట్లు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు వెళుతున్నారు. కొందరు అధికారులు యథాలాపంగానే అలస్వతం వహిస్తున్నా... మరికొందరు సిబ్బంది సహాయ నిరాకరణ చేస్తున్నా... సామ, దాన, దండోపాయాలతో దారికి తెచ్చుకుంటూ సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి భేషజాలకు పోకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులమన్న అహాన్ని పక్కనబెట్టి సామాన్య ఉద్యోగుల మాదిరిగా చేతిలో వాకీటాకీతో భక్తుల మధ్యలో తిరుగుతున్నారు. భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూస్తూ... అప్పటికప్పుడే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
 
 కలెక్టర్, ఎస్పీ క్షణక్షణం పర్యవేక్షణ
 ధర్మపురి పుణ్యక్షేత్రంలో తొమ్మిది రోజుల వ్యవధిలో సుమారు కోటిన్నర మంది భక్తులు పుష్కర స్నానాలు, నృసింహాస్వామి దర్శనాలకు తరలివచ్చారు. ఇంతమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడం అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కలెక్టర్ నీతూప్రసాద్ పుష్కరాల్లో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులను సమన్వయపర్చడం గమనార్హం. రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య సఖ్యత కొరవడిన క్షణంలో.. 'ఇన్నాళ్లు ప్రతిష్టాత్మకంగా ధర్మపురి పుష్కరాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించాం.. చిన్నచిన్న పాటి సమస్యలను పట్టించుకోవద్దు'అని సర్దిచెప్పి సమస్యను సద్దుమణిగేలా చేశారు. ఎస్పీ జోయల్ డేవిస్ సైతం నిత్యం రోడ్లపైనే కన్పిస్తున్నారు. గత శని, ఆదివారాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిన సందర్భంలో స్వయంగా గంటల తరబడి రోడ్డుపై నిలబడి ధర్మపురి-రాయపట్నం రూట్‌లో నిలిచిన వాహనాలను క్రమబద్దీకరించారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందనే సమాచారం వచ్చినా అక్కడ  ప్రత్యక్షమవుతూ భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్, ఎస్పీ ఇరువురూ ఒకవైపు కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పజెప్పుతూనే... తామూ క్షేత్రస్థాయిలో పుష్కర భక్తజనంతో మమేకమై పుష్కర ఘాట్లు, నృసింహాస్వామి ఆలయ ఆవరణను కలియదిరుగుతూ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా పుష్కర విధుల నిర్వహణను సవాల్‌గా తీసుకుని సక్సెస్ చేస్తున్నారు. ప్రతి రోజు ఎక్కడ చూసినా ధర్మపురి పుణ్యక్షేత్రంలో కలెక్టర్, ఎస్పీలు ఎవరికి వారు వేర్వేరుగా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ కనిపించడం విశేషం. కుంభమేళాను తలపించే రీతిలో గోదావరికి పోటెత్తుతున్న జనప్రవాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో వీరిద్దరి పాత్ర కీలకంగా మారి భక్తజనాన్ని మెప్పిస్తోంది.
 
 కర్రపట్టి జేసీ... లాఠీపట్టి ఓఎస్డీ
 విధిలో నిర్వహణలో అలుపెరకుండా పరుగులు పెడుతూ అధికారులను తమదైన శైలిలో పని చేయిస్తూ కాళేశ్వరంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించడంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఓఎస్డీ సుబ్బారాయుడు తమ మార్క్‌ను చూపుతున్నారు. పుష్కరాల ప్రారంభానికి ముందే భక్తుల సౌకర్యాలపై పలుమార్లు సమీక్షలు నిర్వహించిన జేసీ ఇప్పుడు శానిటేషన్ నుంచి నీటిసరఫరా, క్యూలైన్లలో భక్తుల వసతులపై ఆరా తీసి సమస్యలుంటే వాటి పరిష్కారానికి కృషి చే యడం అందరిని ఆలోచింపచేస్తోంది. ఇంటి గ్రేటెడ్ కంట్రోల్ రూం సహా అన్ని శాఖల అధికారులతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కాళేశ్వరం ఆలయంలో వీఐపీ దర్శనాలతో గంటల తరబడి సాధారణ భక్తులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తుతుండడాన్ని గమనించిన జేసీ గత వారం రోజులుగా అక్కడే మకాం వేసి సాధారణ భక్తులు ఫస్ట్... వీఐపీ లు నెక్స్ అనే విధంగా వ్యవహరిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చిన రోజుల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తూ ఆ ద్వారం వద్ద స్వయంగా తానే కూర్చొని సాధారణ భక్తులకు అసౌకర్యం కల్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎక్కడ ఇబ్బందులెదురైనా అక్కడ ప్రత్యక్షమై వాటిని అధిగమించేందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
 ఓఎస్డీ సుబ్బారాయుడు సైతం శాంతిభధ్రతల పరిరక్షణలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ముందుకెళ్తున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రధాన ఘాట్, వీఐపీ ఘాట్‌తో పాటు కాళేశ్వరంలో అవసరమైన చోట్ల పోలీసులను ఏర్పాటు చేసి చిన్న సంఘటనకు కూడా ఆస్కారం ఇవ్వకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో ఓఎస్డీ తీసుకున్న చర్యలు భక్తుల కష్టాలను దూరం చేశాయి. లక్షల్లో భక్తులు తరలివస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వన్‌వేతో పాటు తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement