కర్నూలు(సెంట్రల్): ‘‘నేను ఎక్కువగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో పనిచేశా. మొదటగా జిల్లాలోని సమస్యలపై అవగాహన పెంచుకుంటా. ఆ తరువాత వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతూ అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తా’’ అని జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్నారు. సోమవారం ఉదయం 9.37 గంటలకు కలెక్టర్ తన చాంబర్‌లో తొలి మహిళా కలెక్టర్‌గా సర్వమత ప్రార్థనలు అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు కలెక్టర్‌గా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు, రీసర్వేపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే గుడిసెలు లేని రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందన్నారు. రీసర్వేతో వందేళ్ల భూ సమస్యలకు చెక్ పడుతుండడంతో ప్రాధాన్యతగా తీసుకొని పనిచేస్తానన్నారు. ఇక అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్‌తేజ, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఆర్‌డీఓ హరిప్రసాద్, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ నాగప్రసన్న లక్ష్మీ, డీఆర్‌డీఏ పీడీ ఎం.వెంకటసుబ్బయ్య, సీపీఓ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా స్పందిస్తా
నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటా.. ప్రజా సమస్యలపై వాటాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా స్పందిస్తా. ఏ అంశంలోనైనా వేగంగా స్పందించడానికే ఇష్టపడతా’’ అని కలెక్టర్ జి.సృజన అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ముందుగా ఒక్కో అధికారిని పరిచయం చేసుకొని పాలనలో తన ప్రాధాన్యత అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు. అధికారులు సమయ పాలన పాటించకపోయినా, బాధ్యతా రహితంగా వ్యవహరించినా సహించేది లేదని మొదటి సమావేశంలోనే నిక్కచ్చిగా తెలిపారు. నిత్యం ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటానని.. ఫైళ్లను ఈ–ఆఫీసులోనే పంపాలని, అప్పుడే వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఫైళ్ల నిర్వహణలో సమస్యలు ఉంటే అధికారులు నేరుగా తనకు ఫోన్ చేయవచ్చన్నారు. మండలస్థాయిలోని స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే డాక్టర్ జి.సృజన తనదైన శైలిలో విధి నిర్వహణలో పాల్గొన్నారు. ఉదయం స్పందన, జిల్లా ఉన్నతాధికారుల సమావేశాల్లో తన లక్ష్యాలేమిటో వివరించారు. సాయంత్రం కలెక్టరేట్ సమూదాయంలో ఏ అధికారి కార్యాలయం ఎక్కడుందో పర్యటించి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
‘స్పందన’ కంటితుడుపు కాదు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కంటి తుడుపు కాదని, అధికారులు శ్రద్ధగా పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవని జిల్లా కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. మండల, సచివాలయ స్థాయిల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలు జిల్లా స్థాయి స్పందనకు రావడంపై ఆమె అధికారులను నిలదీశారు. తీరు మార్చుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె స్పందనలోనే మొదట పాల్గొని ప్రజల నుంచి వినుతులు స్వీకరించారు. స్పందనలో డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఎస్‌డీసీలు రమా, సీపీఓ అప్పలకొండ, డీఆర్‌డీఏపీడీ ఎం.వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఏమన్నారంటే..
► స్పందనలో వచ్చిన 30–40 సమస్యల్లో అధికంగా మండల, గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిష్కారం కావాల్సిన చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ వచ్చి మూడేళ్లవుతున్నా అక్కడ ఎందుకు పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదు.
► స్పందనలో వచ్చిన సమస్యల్లో పరిష్కరించే అధికారికి కాకుండా ఇతరులకు పంపితే ఆ ఫిర్యాదు రిజెక్ట్ అవుతుంది. తద్వారా అర్జీదారుడు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
► స్పందన సమస్యలను గడువులోపు పరిçష్కరించాలి. తిరస్కరించిన సమస్యలకు తగిన కారణాలతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా చూడాలి.
► ‘జగనన్నకు చెబుతాం’ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ కార్యక్రమాన్ని సీఎంఓ నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు.
దివ్యాంగుల దగ్గరికే వెళ్లి అర్జీల స్వీకరణ
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జి.సృజన మొదటి అధికారిక కార్యక్రమం స్పందనలో తన సేవా గుణాన్ని చాటుకున్నారు. స్పందనకు వచ్చిన వికలాంగులు, అంధుల దగ్గరికే వెళ్లి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
‘‘గతంలో స్పందన సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. ఇప్పటి నుంచి ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలి. లేకపోతే ఏ కారణంతో చేయలేకపోతున్నారో ఎండార్స్‌మెంట్‌లో స్పష్టం చేయాలి.’’
– జి.సృజన, జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment