సాక్షి, కర్నూలు: తుగ్గలి మండలం చెన్నంపల్లికోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వమే అనధికారిక తవ్వకాలు చేపట్టడం దారుణమని పీఏసీ చైర్మన్, డోన్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. అధికారులు కాపలా ఉండి రాత్రీ పగలు తేడా లేకుండా తవ్వకాలు చేపట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 14 లేదా 15వ శతాబ్దానికి చెందిన కోటలో ఇప్పుడు ఉన్నట్లుండి తవ్వకాలు ఎందుకు జరుపుతున్నారో ప్రభుత్వం, అధికారులు వివరణ ఇవ్వాలన్నారు.
గుప్త నిధుల కోసం అనుకుంటే పురావస్తు శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదని, దీని వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు మాత్రం సీఎం ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసు బందోబస్తు పెట్టి, స్థానికులను భయభ్రాంతులకు గురి చేసి తవ్వకాలు జరుపుతున్నారని అంటున్నారన్నారు. చెన్నంపల్లి కోటలో అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలని సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బుగ్గన, ఐజయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆయన క్యాంపు ఆఫీసులో కలిసి విన్నవించారు.
అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చెన్నంపల్లి కోటలో మౌఖిక ఆదేశాలతోనే తవ్వకాలు జరుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారన్నారు. అలాగే కోట కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల పరిధిలో లేదని చెప్పారన్నారు. మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టినట్లు తెలపడంతో ప్రాస్పెక్టరీ(ప్రాథమిక) అనుతులు తీసుకున్నారా అని తాము అడిగామన్నారు. తీసుకోలేదని కలెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందని పీఏసీ చైర్మన్ అన్నారు.
పురాతన కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణలోనే అక్రమ తవ్వకాలు చేపట్టడం వెనుక మతలబు ఏమిటో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో దుండగులు గుప్త నిధుల కోసం చాలా చోట్ల తవ్వకాలు జరిపారని, ఈ కోవలోనే ప్రభుత్వ పెద్దలు సైతం చెన్నంపల్లికోటపై కన్నేశారని ఆరోపించారు. ఈ తవ్వకాల సమాచారాన్ని పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రవిరెడ్డి, కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment