Gupta funds
-
Gupta Nidhulu: గుప్తనిధుల కోసం తవ్వకాలు
శాలిగౌరారం: మండలంలోని ఆకారం గ్రామంలో గల పురాతన సూర్య దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం–వల్లాల అనుసంధాన డొంకదారి సమీపంలో వ్యవసాయ పంటపొలాల నడుమ పూర్తిగా శిథిలావస్థకు చేరి ఉన్న సూర్య దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో రెండు చోట్ల తవ్వకాలు చేపట్టిన దుండగులు గర్భ గుడిలో కూడా తవ్వకాలు జరిపారు. ఈ దేవాలయంలో సూర్యదేవుడి భారీ పంచలోహ విగ్రహంతో పాటు నంది, ఇతర విగ్రహాలు కూడా ఉండేవని స్థానికులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ సమీపంలోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసినప్పటి నుంచి గుప్తనిధుల కోసం ఇక్కడ తవ్వకాలు జరపడంతో పంచలోహ విగ్రహాలు మాయమయ్యాయని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోమారు గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
గుప్తనిధి కోసం బాలింత దహనం?
సాక్షి, బళ్లారి: ఉగాది అమావాస్య రోజున కొప్పళ జిల్లాలో ఘోరం జరిగింది. సోమవారం రాత్రి అమావాస్య ఘడియల్లో బాలింత మహిళను గుప్త నిధి కోసం కాల్చి వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో గబ్బూరు గ్రామానికి చెందిన కే.నేత్రావతి (26) అనే మహిళకు ఒకటిన్నర నెలల పసికందు ఉంది. బాలింత మహిళను బలి ఇస్తే గుప్త నిధులు బయటకు వస్తాయన్న ఆశతో కొందరు దుర్మార్గులు ఆమెను హత్య చేసి కాల్చివేశారా? లేక ప్రాణాలతో ఉన్నప్పుడే సజీవ దహనం చేశారా? అన్న విషయంలో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆమె ఇంటికి సమీపంలోనే ఈ ఘోరం చోటు చేసుకుంది. దుండగుల కోసం కొప్పళ గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కడపజిల్లాలో గుప్తనిధుల కలకలం
-
కాలగర్భంలో కళా వైభవం!
అద్భుత శిల్పకళా సంపద మట్టిలో కలిసిపోతోంది. నిత్యం పూజలు, అభిషేకాలతో విలసిల్లిన దేవాలయాలు, శిల్పాలు రాళ్ల కుప్పలవుతున్నాయి. గుప్త నిధుల వేటలో రాతి కట్టడాలు ధ్వంసమవుతున్నాయి. చరిత్ర కాలగర్భంలో సమాధి అవుతోంది. తెలంగాణలో గుప్తనిధుల తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పురాతన దేవాలయాల్లోని విగ్రహాల కింద బంగారం, వజ్రాలు ఉన్నాయన్న ఆశతో కొందరు దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. జంతు బలులు చేయడానికీ వెనుకాడటం లేదు. దీంతో కాకతీయులు, రాష్ట్ర కూటులు, చాళుక్యుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న అనేక ఆలయాలు, ఉప ఆలయాలు శిథిలమైపోయాయి. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా పేర్కొనే వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆలయాల ప్రస్తుత పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్ శిథిలావస్థలో రామప్ప ఆలయాలు కాకతీయుల కళావైభవానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం రామప్ప ఆలయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రముఖ ఆలయాల్లో రామప్ప ఒక్కటి. రామప్ప ఆలయంతోపాటు దాని చుట్టు పక్కల కిలోమీటర్ దూరంలో 20 ఉప ఆలయాలను కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయాలు ఆదరణ కరువై శిథిలమవుతున్నాయి. ఘనకీర్తి గల చారిత్రక ఆలయంలోని స్తంభాలు కూలిపోతున్నాయి. కొన్ని కట్టడాలపై మొలచిన పిచ్చి మొక్కల మధ్య శిల్పాలన్నీ వెలవెలబోతున్నాయి. అప్రమత్తమవ్వాలి దేవాలయాలను పరిరక్షించుకోవడంలో ప్రజల పాత్ర ముఖ్యమైంది. గ్రామాల్లోని యువత ఆలయాల్లో తవ్వకాలు వంటి చర్యలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు తెలియజేయాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒక కమిటీగా ఏర్పడి దేవాలయాలను సంరక్షించుకోవాలి. పండుగలు, జాతరలు వచ్చినప్పుడు మాత్రమే దేవాలయాల వైపు చూడటం కాదు.. నిత్యం వాటిపై పరిశీలన ఉండాలి. పురాతన సంపద పరిరక్షణ కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్ కూలిన 36 మీటర్ల ప్రాకారం కేంద్ర పురావస్తు శాఖ అధీనంలోని రామప్ప ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కట్టడాలు కూలిపోతున్నా పురావస్తు శాఖలో చలనం కనిపించడంలేదు. దీంతో గత రెండేళ్లుగా రామప్ప ఆలయం శిథిలమవుతోందని పలువురు చరిత్రకారులు వాపోతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తూర్పు ద్వారాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం 36 మీటర్ల వరకు కుప్పకూలింది. ఇటీవల సిబార (సున్నము, ఇసుక, బెల్లం, కరక్కాయల మిశ్రమం) పద్ధతిలో ప్రహరీ గోడ మరమ్మతులు చేపట్టారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న 16 ఉప ఆలయాలు కూడా పూర్తిగా శిథిలమైపోయాయి. వీటిలో కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం కోసం కూలగొట్టి.. శిలలను కుప్పలుగా పోశారు. యాకూబ్‌సాబ్ స్థలంలో ఉన్న శివాలయం పూర్తిగా కూలిపోయింది. గుప్తనిధుల కోసం గర్భగుడిని గునపాలతో తవ్వేశారు. చాలా చోట్ల గుప్తనిధుల కోసం పురాతన ఆలయాల్లో రాత్రిళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. గ్రామాల్లో నివాసం ఉండేవారే ఇలాంటి వారికి సహకరిస్తున్నారని పలు కేసుల్లో జరిగిన విచారణలో తేలింది. శిల్ప సౌందర్యానికి ప్రతీకలు కాకతీయుల కాలంలో రామప్ప ఆలయంతోపాటు దాన్ని ఆనుకుని కాటేశ్వర, కామేశ్వర, నరసింహస్వామి, నంది మంటపం నిర్మించారు. రామప్ప చుట్టూ ఉన్న కోటగోడ లోపల గొల్లగుడి, యాకూబ్‌సాబ్ గుడి, త్రికూ ట ఆలయంతోపాటు అడవిలో మరో రెండు శివాలయాలు ఉన్నాయి. రామప్ప సరస్సు కట్టపై కల్యాణ మంటపం, కాటేజీల పక్కన త్రికూటాలయం, మరో రెండు చిన్న ఆలయాలు కనిపిస్తాయి. రామప్ప ఆలయం ఉన్న పాలంపేటలో మరో రెండు శివాలయాలు శిథిలమవుతున్నాయి. లక్ష్మీ దేవిపేట, పెద్దాపురం, రామాంజాపురం, నర్సాపురం గ్రామాల్లోని ఆలయాలు శిల్ప సౌందర్యానికి, కాకతీయుల కళా వైభవానికి అద్దం పడుతాయి. ప్రస్తుతం ఆ శిల్పాలు ఎండకు ఎండుతూ వానకు తడు స్తూ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. గణపురంలోని కోటగుళ్లు, కటాక్షపూర్‌లోని ఆలయాలు శిథిలమవుతున్నాయి. -
‘ప్రభుత్వ పెద్దలు సైతం కోటపై కన్నేశారు..’
సాక్షి, కర్నూలు: తుగ్గలి మండలం చెన్నంపల్లికోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వమే అనధికారిక తవ్వకాలు చేపట్టడం దారుణమని పీఏసీ చైర్మన్, డోన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. అధికారులు కాపలా ఉండి రాత్రీ పగలు తేడా లేకుండా తవ్వకాలు చేపట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 14 లేదా 15వ శతాబ్దానికి చెందిన కోటలో ఇప్పుడు ఉన్నట్లుండి తవ్వకాలు ఎందుకు జరుపుతున్నారో ప్రభుత్వం, అధికారులు వివరణ ఇవ్వాలన్నారు. గుప్త నిధుల కోసం అనుకుంటే పురావస్తు శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదని, దీని వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు మాత్రం సీఎం ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసు బందోబస్తు పెట్టి, స్థానికులను భయభ్రాంతులకు గురి చేసి తవ్వకాలు జరుపుతున్నారని అంటున్నారన్నారు. చెన్నంపల్లి కోటలో అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలని సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుగ్గన, ఐజయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆయన క్యాంపు ఆఫీసులో కలిసి విన్నవించారు. అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చెన్నంపల్లి కోటలో మౌఖిక ఆదేశాలతోనే తవ్వకాలు జరుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారన్నారు. అలాగే కోట కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల పరిధిలో లేదని చెప్పారన్నారు. మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టినట్లు తెలపడంతో ప్రాస్పెక్టరీ(ప్రాథమిక) అనుతులు తీసుకున్నారా అని తాము అడిగామన్నారు. తీసుకోలేదని కలెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందని పీఏసీ చైర్మన్ అన్నారు. పురాతన కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణలోనే అక్రమ తవ్వకాలు చేపట్టడం వెనుక మతలబు ఏమిటో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో దుండగులు గుప్త నిధుల కోసం చాలా చోట్ల తవ్వకాలు జరిపారని, ఈ కోవలోనే ప్రభుత్వ పెద్దలు సైతం చెన్నంపల్లికోటపై కన్నేశారని ఆరోపించారు. ఈ తవ్వకాల సమాచారాన్ని పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రవిరెడ్డి, కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. -
విక్రయించేందుకు వచ్చి.. పోలీసులకు చిక్కి.!
► ఆదోనిలో గుప్త నిధుల పేరుతో రైతును బురిడీకి యత్నించిన ముఠా ► పంచలోహ విగ్రహాలను విక్రయించేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన ముఠా సభ్యులు కర్నూలు: పంచలో విగ్రహాలను విక్రయించడానికి వచ్చిన ఓ ముఠా పోలీసుల వలలో పడ్డారు. ఆదోని పట్టణానికి చెందిన బోయ ఉరుకుందప్ప పొలంలో పెద్ద ఎత్తున ధనం ఉందని వెలికి తీస్తామని ముఠా సభ్యులు నమ్మించి అతని వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు విఫలయత్నం చేసి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఆ వివరాలు.. పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ తహీర్, కర్నూలు పట్టణానికి చెందిన మహమ్మద్ షరీఫ్, షేక్ అలీ, నవాబు పేట అల్లాబకాష్ తదితరులు ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం బోయ ఉరుకుందప్ప పొలంలో పంచలోహ విగ్రహాలను పాతిపెట్టారు. బోయ ఉరుకుందప్ప, బోయ ఈరప్పలను కలిసి పలానా చోట టన్నుల కొద్ది గుప్త నిధులున్నాయని నమ్మబలికారు. వాటిని వెలికి తీసేందుకు రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.లక్ష అడ్వాన్స్ తీసుకుని పొలంలోకి వెళ్లి తవ్వకాలు జరిపి రెండు విగ్రహాలను వెలికి తీసి రైతులను నమ్మించారు. ఇంకా భారీ మొత్తంలో ఇక్కడ గుప్త నిధులున్నాయని, మిగిలిన డబ్బులు అప్పగిస్తే వాటిని కూడా వెలికి తీసి ఇస్తామని నమ్మించారు. బయట పడిన పురాతన వస్తువులను విక్రయించేందుకు కర్నూలుకు వచ్చి ముఠా సభ్యులంతా కల్లూరులోని నవాబ్‌పేట అల్లాబకాష్‌ను ఆశ్రయించి పోలీసులకు దొరికిపోయారు. పోలీసులకు ఇలా పట్టుబడ్డారు.. బోయ ఉరుకుందప్ప పొలంలో తవ్వకాలు జరిపి వెలికితీసిన నాగదేవత, శివుడి విగ్రహాలు, 5 బంగారు వర్ణం కలిగిన బల్లేలు, ఇత్తడి బిందె, ఇత్తడి మూతతో పాటు ఒక సంచిలో వేసుకుని కల్లూరులోని నవాబుపేట అల్లాబకాష్ దగ్గరికి వచ్చారు. సోమవారం వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నాల్గవ పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో మారువేషంలో కల్లూరులోని నిర్మల్ నగర్ లక్ష్మీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద కాపు కాసి ఏడుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి 18వ శతాబ్దం నాటి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, నాల్గవ పట్టణ సీఐ నాగరాజురావుతో కలసి విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. -
కొండవీడుకొండల్లో విధ్వంసం
► గుప్తనిధుల కోసం దుండగుల బ్లాస్టింగ్ ► పురాతన బావిలోపల 30 అడుగుల మేర తవ్వకాలు ► అడుగుభాగం నుంచి భారీ సొరంగాలు ఏర్పాటు ► మందుగుండు సామగ్రితో భావిలోపల భారీ రాళ్లు పేల్చివేత ► మూడు నెలల నుంచి నిర్విరామంగా తవ్వకాలు యడ్లపాడు: యడ్లపాడు మండలం కొండవీడు కొండలు ప్రారంభయ్యే బోయపాలెం - సంగం పరిధిలోని రెండు కొండల సంగమం వద్ద తాజాగా భారీ తవ్వకం బయటపడింది. బోయపాలెం నుంచి టెక్స్‌టైల్‌పార్కు భూముల మీదుగా సుమారు 3 కిలోమీటర్లు ప్రయణిస్తే కొండవీడు కొండ అంచులను చేరుకోవచ్చు. అక్కడి నుంచి నడుస్తూ వెయ్యి అడుగుల లోపలకు వెళితే రాజుల కాలం నాటి బావిలోపల 30 అడుగుల లోతులో తవ్వకం కనిపిస్తుంది. రెండు వైపులా ఎత్తై కొండలపైనుంచి వచ్చే వర్షపునీరు కొండవాగులా వచ్చే మార్గం గుండా అతికష్టంగా వెళ్లాల్సి ఉంటుంది. మట్టిదిబ్బలు, గడ్డిదుప్పులు, రాళ్లగుట్టలు, దట్టంగా ఉన్న అడవి చెట్ల మధ్యగా మార్గం చేసుకుని ఈ పురాతన బావిని గుప్తనిధుల దుండగులు తవ్వేశారు. మూడు నెలల నుంచి కొందరు ఈ తవ్వకాలు చేస్తున్నట్లు గొర్రెలు, గేదెల కాపరులు చెబుతున్నారు. బావి కింద నుంచి సొరంగ మార్గాలు... చుట్టూ 10 అడుగుల కైవారంతో ఉన్న బావి లోపల 30 అడుగుల లోతులో తవ్వారు. ఇందులో భారీ రాళ్లను పగులగొట్టి సుమారు 8 ట్రక్కుల వరకు ఒడ్డున పడేశారు. రాళ్లను పగులగొట్టేందుకు మందుగుండు సామగ్రిని వినియోగించి నట్టు తెలుస్తోంది. బావి అడుగు నుంచి రెండు వైపులా మనిషి నిలబడి వెళ్లేంత సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సొరంగం రాజుల కాలం నాటిదా..లేక వీరు కొత్తగా తవ్వుతున్నదా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. గత ఏడాది కొత్తపాలెం కొండల్లోని భారీ రాళ్లకింద 40 అడుగుల సొరంగ చేశారు. అప్పట్లో మూడు నెలలు తవ్వకాలు చేయగా పురాతన పంచలోహ విగ్రహాలు గుప్తనిధుల చోరులకు లభించినట్లు కలకలం రేగింది. చుట్టూ మరో నాలుగు చోట్ల తవ్వకాలు ... అనేక ఆనవాళ్లు ఈ బావిని తవ్వక ముందే చుట్టూరా నాల్గు చోట్ల ఇదే విధంగా తవ్విన ఆనవాళ్లు ఉన్నాయి. చివరకు బావిని ఎంచుకుని తవ్వకాన్ని నిర్విరామంగా కొనసాగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్న బావిచుట్టూ నాల్గువైపులా ప్రమిదలు, పూజలు చేసినట్లు పూలు, రోజ్‌వాటర్, సుగంధ ద్రవ్యాలు వినియోగించిన వస్తువులు ఉన్నాయి. బావిలోపల గడ్డపలుగు, పార ఉండగా, ఒడ్డున కూడా మరో రెండు ఉన్నాయి. వాటి పక్కనే కొండరాళ్లను బ్లాస్టింగ్ చేసే మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి. కొద్దిదూరంలో పూజలు చేసిన ముగ్గులు, రక్తపు చారికలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఖాళీగోతాల్లో హోటల్ నుంచి పార్శిల్ తెచ్చుకున్న భోజన ప్యాకెట్లు, విస్తళ్లు, కిరోసిన్, వాటర్‌బాటిల్స్, ఇతర వస్తువులు అనేకం ఉన్నాయి. తవ్వకాలను సాహసంతో ఛే దించిన బోయపాలెం యువత... కొండవీడు కొండల్లోకి ఆకులు, వనమూలికల కోసం అంటూ పలుగు, పారలతో కొందరు వ్యక్తులు తరచూ వెళ్లడం బోయపాలెం యువకులు గుర్తించారు. అనుమానం వచ్చిన యువకులు ఎంతో సాహసంతో ఆ ప్రాంతానికి వెళ్లి జరిగినదంతా తెలుసుకున్నారు. ఇదే సమాచారాన్ని మీడియా, పోలీసులు, ఫారెస్టు అధికారులకు తెలిపారు. ఎస్ఐ ఎం. ఉమామహేశ్వరరావు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ముందుగా తవ్విన ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులపై అనుమానాలు... గుప్తనిధుల దుండగులు అటవీ శాఖ సిబ్బంది, స్థానికులతో సంబంధాలు పెట్టుకుని తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. భావి తరాలకు చరిత్ర లేకుండా చేస్తున్న దుండగులను, వారికి సహాయకారాలు అందిస్తున్న వారిని పట్టుకుని భవిష్యత్తులో అక్రమ తవ్వకాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
విగ్రహాలను పెకిలించిన దుండగులు
► గుప్తనిధులకోసం పెకిలించి ఉంటారని ఆరోపణ ► సంఘటన స్థలాన్ని పరిశీలించిన ముగ్గురు ఎస్ఐలు శాంతినగర్ : గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం దేవుడి విగ్రహాలను పెకిలించారు. ఈ సంఘటన వడ్డేపల్లి మండలం తనగల గట్టులో చోటుచేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తనగల గట్టుపై వెలసి న తిమ్మప్ప స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. ఆలయ పూజారి పాండురంగయ్య ఎప్పటిలాగే శనివారం సాయంత్రం స్వామివారి ఆలయాన్ని మూసి తాళాలువేసి వెంకటాపురం చేరుకున్నాడు. బుధవారం పౌర్ణమి కావడంతో ఉదయం వెంకటాపురం భక్తులు కృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి పూజలు చేద్దామని పూజారితో ఆలయాన్ని చేరుకున్నారు. వారు వెళ్లేలోగా ఆలయం తలుపులు తెరుచుకుని ఉన్నాయి. స్వామివారి మూల విరాఠ్ (పుట్టుశిల), వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని పెకిలించారు. వెంటనే అయిజ ఎస్ఐ రమేష్‌కు, సర్పంచ్ సత్యమ్మవేణుగోపాల్‌రెడ్డికి సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న తనగల సర్పంచ్ వాణిదివాకర్‌రెడ్డి శాంతినగర్ ఎస్ఐ జి.వెంకటేశ్వర్లకు జరిగిన సంఘటనను వివరించారు. దీంతో స్పందిం చిన అయిజ, శాంతినగర్, రాజోలి ఎస్ఐ జయశంకర్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గట్టుపై ఆలయ సమీపంలో మద్యం సీసాలు, అల్పాహారాలు పడి ఉండటం, నాలుగు అడుగులమేర విగ్రహాల క్రింద తవ్వడం చూసిన పోలీసులు రాత్రి సుమారు ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు మద్యంతాగి విగ్రహాలను ధ్వంసం చేసి ఉంటారన్నారు. ఆలయ పూజారులు పాండురంగయ్య, వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాంతినగర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్ రామనాయుడు పేర్కొన్నారు.