కొండవీడుకొండల్లో విధ్వంసం | Gupta funding Miscreants blasting | Sakshi
Sakshi News home page

కొండవీడుకొండల్లో విధ్వంసం

Published Mon, Mar 28 2016 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

కొండవీడుకొండల్లో విధ్వంసం

కొండవీడుకొండల్లో విధ్వంసం

గుప్తనిధుల కోసం  దుండగుల బ్లాస్టింగ్
పురాతన బావిలోపల 30 అడుగుల మేర తవ్వకాలు
అడుగుభాగం నుంచి  భారీ  సొరంగాలు ఏర్పాటు
మందుగుండు సామగ్రితో భావిలోపల భారీ రాళ్లు పేల్చివేత
మూడు నెలల నుంచి  నిర్విరామంగా తవ్వకాలు

 
యడ్లపాడు: యడ్లపాడు మండలం కొండవీడు కొండలు ప్రారంభయ్యే బోయపాలెం - సంగం పరిధిలోని రెండు కొండల సంగమం వద్ద తాజాగా భారీ తవ్వకం బయటపడింది. బోయపాలెం నుంచి టెక్స్‌టైల్‌పార్కు భూముల మీదుగా సుమారు 3 కిలోమీటర్లు ప్రయణిస్తే కొండవీడు కొండ అంచులను చేరుకోవచ్చు. అక్కడి నుంచి నడుస్తూ వెయ్యి అడుగుల లోపలకు వెళితే రాజుల కాలం నాటి బావిలోపల 30 అడుగుల లోతులో తవ్వకం కనిపిస్తుంది.

రెండు వైపులా ఎత్తై కొండలపైనుంచి వచ్చే వర్షపునీరు కొండవాగులా వచ్చే మార్గం గుండా అతికష్టంగా వెళ్లాల్సి ఉంటుంది. మట్టిదిబ్బలు, గడ్డిదుప్పులు, రాళ్లగుట్టలు, దట్టంగా ఉన్న అడవి చెట్ల మధ్యగా మార్గం చేసుకుని ఈ పురాతన బావిని గుప్తనిధుల దుండగులు తవ్వేశారు. మూడు నెలల నుంచి కొందరు ఈ తవ్వకాలు చేస్తున్నట్లు గొర్రెలు, గేదెల కాపరులు చెబుతున్నారు.

 బావి కింద నుంచి సొరంగ మార్గాలు...
చుట్టూ 10 అడుగుల కైవారంతో ఉన్న బావి లోపల 30 అడుగుల లోతులో తవ్వారు. ఇందులో భారీ రాళ్లను పగులగొట్టి సుమారు 8 ట్రక్కుల వరకు ఒడ్డున పడేశారు. రాళ్లను పగులగొట్టేందుకు మందుగుండు సామగ్రిని వినియోగించి నట్టు తెలుస్తోంది. బావి అడుగు నుంచి రెండు వైపులా మనిషి నిలబడి వెళ్లేంత సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సొరంగం రాజుల కాలం నాటిదా..లేక వీరు కొత్తగా తవ్వుతున్నదా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.  గత ఏడాది కొత్తపాలెం కొండల్లోని భారీ రాళ్లకింద 40 అడుగుల సొరంగ చేశారు. అప్పట్లో మూడు నెలలు తవ్వకాలు చేయగా పురాతన పంచలోహ విగ్రహాలు గుప్తనిధుల చోరులకు లభించినట్లు కలకలం రేగింది.

 చుట్టూ మరో నాలుగు చోట్ల తవ్వకాలు ... అనేక ఆనవాళ్లు
ఈ బావిని తవ్వక ముందే చుట్టూరా నాల్గు చోట్ల ఇదే విధంగా తవ్విన  ఆనవాళ్లు ఉన్నాయి. చివరకు బావిని ఎంచుకుని తవ్వకాన్ని నిర్విరామంగా కొనసాగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్న బావిచుట్టూ నాల్గువైపులా ప్రమిదలు, పూజలు చేసినట్లు పూలు, రోజ్‌వాటర్, సుగంధ ద్రవ్యాలు వినియోగించిన వస్తువులు ఉన్నాయి. బావిలోపల గడ్డపలుగు, పార ఉండగా, ఒడ్డున కూడా మరో రెండు ఉన్నాయి. వాటి పక్కనే కొండరాళ్లను బ్లాస్టింగ్ చేసే మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి. కొద్దిదూరంలో పూజలు చేసిన  ముగ్గులు, రక్తపు చారికలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఖాళీగోతాల్లో హోటల్ నుంచి పార్శిల్ తెచ్చుకున్న భోజన ప్యాకెట్లు, విస్తళ్లు, కిరోసిన్, వాటర్‌బాటిల్స్, ఇతర వస్తువులు అనేకం ఉన్నాయి.

 తవ్వకాలను సాహసంతో  ఛే దించిన బోయపాలెం యువత...
కొండవీడు కొండల్లోకి ఆకులు, వనమూలికల కోసం అంటూ పలుగు, పారలతో కొందరు వ్యక్తులు తరచూ వెళ్లడం బోయపాలెం యువకులు గుర్తించారు. అనుమానం వచ్చిన యువకులు ఎంతో సాహసంతో ఆ ప్రాంతానికి వెళ్లి జరిగినదంతా తెలుసుకున్నారు. ఇదే సమాచారాన్ని మీడియా, పోలీసులు, ఫారెస్టు అధికారులకు తెలిపారు. ఎస్‌ఐ ఎం. ఉమామహేశ్వరరావు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ముందుగా తవ్విన ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు.
 
  అటవీశాఖ అధికారులపై  అనుమానాలు...

గుప్తనిధుల దుండగులు అటవీ శాఖ సిబ్బంది, స్థానికులతో సంబంధాలు పెట్టుకుని తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. భావి తరాలకు చరిత్ర లేకుండా చేస్తున్న దుండగులను, వారికి సహాయకారాలు అందిస్తున్న వారిని పట్టుకుని భవిష్యత్తులో అక్రమ తవ్వకాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement