Excavations
-
ఈ తవ్వకాల్లో ఏం దొరికాయో తెలుసా..!?
అలనాటి బలిపీఠానికి చెందిన ఫొటోలివి. పనామా రాజధానికి 177 కిలోమీటర్ల దూరంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఈ సమాధిలో అలనాటి పాలకుడిని, అతడి భార్యను తలకిందులుగా పాతిపెట్టి బలిచేశారు. వారితో పాటు మరో ముప్పయిరెండు మందిని కూడా ఇక్కడ పాతిపెట్టారు. ఈ సువిశాలమైన సమాధిలో వారి అస్థిపంజరాల అవశేషాలతో పాటు విలువైన బంగారు వస్తువులు భారీగా బయటపడటంతో తవ్వకాలు చేపట్టిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఈ సమాధిలో బంగారు శాలువ, బంగారు పళ్లేలు, పాత్రలు, నగలు, తిమింగలం దంతాలు తదితర వస్తువులు ఉన్నాయి. భారీ పరిమాణంలో బంగారు వస్తువులు దొరకడం వల్ల ఈ సమాధి అలనాటి పాలకుడు లేదా సంపన్న కులీనుడికి చెందినది కావచ్చని ఇక్కడ తవ్వకాలు జరిపిన బృందానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జూలియా మాయో తెలిపారు. ఈ సమాధి కనీసం పన్నెండువందల ఏళ్ల కిందటిది కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవి చదవండి: ఈవారం కథ: 'తరలి వచ్చిన వసంతం'! -
fact check: మేలెంచినా కీడెంచుతారా!?
సాక్షి, అమరావతి : కుక్క తోక వంకరలాగే ఈనాడు రాతల్లో కూడా అంతకు మించి వంకర్లు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నయినా వంకర బుద్ధితో చూడడమే ఇందుకు కారణం. పేదలకు మేలు చేసేందుకు.. వారు కట్టుకునే ఇళ్లను మెరక చేసుకునేందుకు, రైతుల పొలాలకు మట్టి తోలుకునేందుకు మట్టి తరలింపులో మినహాయింపులు ఇవ్వడాన్ని సైతం తప్పన్నట్లు గుండెలు బాదుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి చేసినా తప్పేనంటూ ఆ పత్రికాధిపతి రామోజీరావు వితండవాద కథనాలను ప్రచురించటం పరిపాటిగా మారింది. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్పు.. ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా తప్పేనంటూ రెండు నాల్కల ధోరణితో క్షుద్ర రాతలు రాయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లి ప్రజల్లో అపోహలు సృష్టించడం, వారికి మేలు జరుగుతుంటే దాన్ని వక్రీకరించి ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం.. తద్వారా చంద్రబాబును గద్దెనెక్కించాలన్నది ఆయన అసలు లక్ష్యం. ఇందులో భాగమే తాజాగా సోమవారం ‘దోపిడీకి రాజమార్గం’ అంటూ మట్టి తవ్వకాలపై అతిగా ఊహించుకుంటూ ఎప్పటిలాగే అభూతకల్పనలతో ఓ కథనాన్ని చేతికొచ్చింది ఇష్టానుసారం రాసిపారేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నానా ప్రయాసపడ్డారు. ఈ క్షుద్ర రాతలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఒత్తిడా? రాష్ట్రంలో పేదలు నిర్మించుకునే ఇళ్లు, రైతుల పొలాలను మెరక చేసుకునేందుకు వీలుగా వారిపై ఎలాంటి భారం లేకుండా చిన్నతరహా ఖనిజాల వినియోగంపై మినహాయింపులకు గనుల శాఖ సదుద్దేశ్యంతో ప్రతిపాదించింది. కానీ, అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుముల మినహాయింపులు ఇస్తున్నట్లు రామోజీ పెడబొబ్బలు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాలకు గనుల శాఖ వివరణ సమర్పించింది. ఆ విషయం ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉంది. ఇంకా ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఎలా ఒత్తిడి తెచ్చిందో, దానికి ఆమోదముద్ర ఎవరు వేశారో రామోజీరావుకే తెలియాలి. అయినా.. పేదల ఇళ్లకు ‘మినహాయింపు’లను ఉచిత ఇసుకతో ఎలా పోలుస్తారు రామోజీ? అసలు మీ బాబు హయాంలో ఉచితంగా ఇసుక ఎవరికి అందింది? ఆ ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, కమర్షియల్ సంస్థలు, టీడీపీ నేతలకే ఆయన దోచిపెట్టిన బాగోతాలు జగమెరిగినవే కదా..! పేదలకు మేలు జరుగుతుంది.. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఒకొక్కరు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరంతా ఇంటిని నిర్మించుకునేందుకు కంకర, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిపైన గనుల శాఖ వసూలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ రుసుం, డీఎంఎఫ్, మెరిట్ వంటి వసూళ్లతో పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది. దీని మినహాయింపునకు ప్రభుత్వం అంగీకరిస్తే పేదలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో చర్చించిన తర్వాతే ఈ రుసుం మినహాయింపు కోసం గనుల శాఖ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా రైతులు చెరువు మట్టిని వాడుకుంటారు.. ప్రతి ఖరీఫ్ సీజన్‌కు ముందు వేసవిలో రైతులు తమ పొలాల్లో మట్టిని సారవంతం చేసుకోవడం, లోతట్టు భూమిని మెరక చేసుకునేందుకు చెరువు మట్టిని సమీపంలోని పొలాల నుంచి తెచ్చుకుని వాడుకుంటారు. దీనివల్ల తిరిగి పంట వేసుకునే సమయానికి పొలం అనువుగా తయారై మంచి దిగుబడి లభిస్తుంది. తద్వారా రైతు కష్టానికి ఫలితం అందుతుంది. దీనికోసం వినియోగించే మట్టిపై కూడా గనుల శాఖ విధించే రుసుమునకు మినహాయింపులిస్తే రైతులపై ఆర్థిక భారం ఉండదు. ఈ సదుద్దేశంతోనే గనుల శాఖ వ్యవసాయ వినియోగం నిమిత్తం వాడే మట్టిపై మినహాయింపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవాలిలా ఉంటే.. ఒత్తిడి తెచ్చి మరీ సీఎంఓ ఆమోదముద్ర వేయించుకుందని ఈనాడు అడ్డగోలుగా ఓ కథనాన్ని అచ్చేసింది. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు పత్రికపై ఇప్పటికే ప్రభుత్వం పలు పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. అయినా సరే.. రామోజీది వంకర బుద్ధి కదా.. వంకర రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి కలుగుతుంది? ఇక ఈ ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి చేకూరుతుందో రామోజీరావు చెప్పాలి. పేదలు, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయ పార్టీలకు ఎలా ఆపాదిస్తారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి.. ఈ మినహాయింపుల్లేని సమయంలోనూ వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.70 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. అయినా సరే.. ఈ మినహాయింపులతో ఖజానాకు భారీగా నష్టం జరుగుతుందని రాద్ధాంతం చేయడం చూస్తుంటే పేదలు, రైతులపట్ల రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న ఏహ్య భావానికి అద్దంపడుతోంది. ఆర్థిక శాఖకు పూర్తి వివరణ ఇచ్చాం పేదల ఇళ్లు, రైతుల పొలాలు మెరక చేసుకునేందుకు తరలించే మట్టి విషయంలో మినహాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సందేహాలు, పరిశీలనలపై పూర్తి వివరణ ఇచ్చాం. గనుల శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలవల్ల ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీలు, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వాటిపై తక్షణ చర్యల ద్వారా మైనింగ్ అక్రమాలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం. పేదలు, రైతులకు ఇచ్చిన ఈ మినహాయింపులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఈ మినహాయింపులవల్ల మైనింగ్ రెవెన్యూలో తగ్గుదల చాలా పరిమితంగా ఉంటుంది. అక్రమాలకు ఆస్కారంలేదు కాబట్టి ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ఫైలుపై గనుల శాఖ పంపిన వివరణను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ ఫైలుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. అయినా తప్పుడు సమాచారంతో అసత్యాలను పోగేసి ఈనాడు వార్తలు రాయడం దారుణం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
ఎలాంటి తవ్వకాలూ చేపట్టడం లేదు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై యథాతథస్థితి(స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు బుధవారం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కమిషనర్‌ను ఆదేశించింది. తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. పిటిషనర్ ఆరోపిస్తున్న విధంగా ఎలాంటి తవ్వకాలు చేయడం లేదని వీఎంఆర్డీఏ తరఫు న్యాయవాది వరికూటి సూర్యకిరణ్ చెప్పిన విషయాన్ని హైకోర్టు రికార్డ్ చేసింది. నిబంధనల ప్రకారం ఈ కొండ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్)–2 పరిధిలోకి వస్తుంది కాబట్టి, తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణలో ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామంది. విచారణను డిసెంబర్ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం తవ్వకాలకు అనుమతులు తీసుకునేందుకు ఈ ఉత్తర్వులు ఎంత మాత్రం అడ్డంకి కాదని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కైలాసగిరి కొండను తవ్వి నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులివ్వాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఎలాంటి తవ్వకాలు చేయడం లేదని, తెన్నేటి పార్కుకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం కొండ దిగువన ఉన్న చెట్ల తుప్పలను తొలగించి, కార్ పార్కింగ్‌కు అనువుగా చదునుచేస్తున్నామని వీఎంఆర్డీఏ తరఫు న్యాయవాది సూర్యకిరణ్ తెలిపారు. కార్ పార్కింగ్ ఏర్పాటు ప్రజా ప్రయోజనం కిందకే వస్తుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తవ్వకాలకు కేంద్రం నుంచి అనుమతులు తప్పనిసరి కదా.. మీరు అనుమతులు తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలు తన వద్ద సిద్ధంగా లేవని సూర్యకిరణ్ తెలిపారు. తదుపరి విచారణ సమయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానన్నారు. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. -
3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది!
బెర్లిన్: సుమారు మూడు వేల ఏళ్లనాటి కంచు కత్తి జర్మనీలో తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటికీ ఆ కత్తి పదును, మెరుపు ఏమాత్రం తగ్గలేదని పురాతత్వ నిపుణులు తెలిపారు. బవేరియా రాష్ట్రంలోని నోయెర్డ్లింజెన్లో జరిపిన తవ్వకాల్లో ఇది వెలుగు చూసింది. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దం..కంచుయుగం మధ్య కాలం నాటి ముగ్గురు వ్యక్తుల సమాధిలోని అష్టభుజి పట్టీ కలిగిన ఈ కత్తి ఇప్పటికీ కొత్తదిగానే ఉండటం అద్భుతం, అరుదైన విషయమన్నారు. క్రీస్తు పూర్వం 3,300–12,00 సంవత్సరాల మధ్య మానవులు కంచు వాడిన కాలాన్ని చరిత్రకారులు కంచుయుగంగా గుర్తిస్తారు. -
చారిత్రక సంపదకు రక్షణ కరువు... పొలంగా మారిన దంతపురి కోటగట్టు
సరుబుజ్జిలి: పురావస్తుశాఖ పరిధిలోని చారిత్రక సంపదకు రక్షణ లేకుండాపోతోంది. సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ దంతపురి కోటగట్టుపై అక్రమ తవ్వకాలు యథేచ్ఛ సాగుతున్నాయి. కోటకు రక్షణగా నలుదిశలా విస్తరించి ఉన్న గట్టును ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా యంత్రాలు పెట్టి గట్టును తవ్వకం చేసి మట్టిని తరలించుకుపోతున్నారని చెబుతున్నారు. మరికొంతమంది గట్టును తవ్వేసి పొలాలుగా మార్చి వాటిపై పంటలు పండిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘన చరిత్ర.. శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ నుంచి సుమారు 8 కిలోమీటర్లు దూరంలో రొట్టవలస, కొండవలస, పెద్దపాలెం, పాలవలస, రావివలస గ్రామాల మధ్య విస్తరించిన చారిత్రక స్థలం దంతపురి. క్రీ.పూ 261లో అశోకచక్రవర్తి జరిపిన కళింగ యుద్ధ తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. చేది వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. కళింగరాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. శ్రీలంకకు చెందిన మహావంశం అనే బౌద్ధ గ్రంధంలో జంబూద్వీపానికి సప్తనగరాల్లో దంతపురి ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. సింహబాహు అనే రాజు సింహపురం పట్టణాన్ని నిర్మించి బుద్ధుని జ్ఞానదంతంపై స్థూపాన్ని నిర్మించడం వల్ల దంతపురిగా వెలసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. చారిత్రక ఆనవాళ్లు.. రాష్ట్ర పురావస్తు శాఖవ ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రితం చేపట్టిన తవ్వకాల్లో దంతపురి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడి కోటలో 30 అడుగుల ఎత్తయిన ప్రాకారాలు, కోటకు నలుదిక్కులా ద్వారాలు ఉండేవని గుర్తించారు. అప్పట్లో మూడు స్థూపాలు, గుర్తుపట్టలేని పాతతరం విగ్రహాలు, స్నానపు గదులు, నీటిని నిల్వ చేసే జార్లు, ఫ్లవర్ వాజులు, వంటపాత్రలు, దీపాలు, భోజనపు గిన్నెలు, రాతిరుబ్బురోలు, ఎముకతో చేసిన దువ్వెనలు, టెర్రకోట వస్తువులు బయటపడ్డాయి. ఇంతటి చారిత్రక నేపథ్యమున్న ఇక్కడి బౌద్ధస్ఫూపాలు ఇతర ఆనవాళ్లకు రక్షణ కరువైనా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికే బుద్ధుడి విగ్రహం ప్లాట్‌ఫాం శిథిలావస్థకు చేరుకుంది. ఎటువంటి ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో ఆవరణలోనే మందుబాబులు హల్చల్ చేస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దంతపురి కోటగట్టు ప్రదేశాన్ని రీసర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. ప్రాచీన సంపదగా విరాజిల్లుతున్న దంతపురి క్షేత్రంలో ఎటువంటి తవ్వకాలు చేయరాదు. ఇటువంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరం. కోటగట్టుపై తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. – సనపల కిరణ్‌కుమార్, తహసీల్దార్, సరుబుజ్జిలి (చదవండి: ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి) -
క్షుద్ర పూజలతో వణికిపోతున్న వికారాబాద్ ప్రజలు.. పుర్రె, విగ్రహం లభ్యం
దోమ (వికారాబాద్): పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి హైటెక్ సమాజంలోనూ మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. ఇలాంటి కోవలోకి వచ్చే ఘటనలు కొన్ని దోమ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో తరచూ జరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా వారం రోజుల క్రితం ఖమ్మం నాచారం గ్రామం చెరువు దగ్గర ఉన్న అటవీ ప్రాంతాంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం కలకలం రేకెత్తించింది. దీంతో పూజలను చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గుప్త నిధుల అన్వేషణలో.. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల అన్వేషణలో పడి పూజలు నిర్వహిస్తున్నారన్న అనుమానాలు మండల ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మండల పరిధిలోని దిర్సంపల్లి, పాలేపల్లి గ్రామల మధ్యలో ఉన్న ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వేశారు. కొండయపల్లిలోని పోచమ్మ ఆలయం సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలను జరిపారు. బడేంపల్లిలోనూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకుని కేసులు నమోదు చేశారు. గుండాల గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం రాత్రి వేళల్లో క్షుద్రపూజలు చేస్తూ తవ్వాకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో ఓ విగ్రహంతో పాటు ఓ మనిషి పుర్రె లభ్యమైనట్లు గ్రామస్తులు అనుమానించి అధికారులకు తెలిపారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ఓ కారు గుర్తించి తనిఖీ చేశారు. కారులో గుప్త నిధుల్లో వెలికి తీసిన ఓ విగ్రహం బయటపడింది. బయటపడ్డ విగ్రహం పోలీసులకు అప్పగించారు. మంత్రతంత్రాలను నమ్ముతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. ఆస్పత్రులకు వెళ్లకుండా మంత్రాలు చేసే వ్యక్తుల దగ్గరకు వెళ్లి క్షుద్రపూజలతో పాటు తదితర పూజలు నిర్వహించుకుంటున్నారు. వీటిని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పొలం దగ్గరకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుని క్షుద్రపూజలు, మూఢనమ్మాకాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గుండాల సమీపంలో గుప్తనిధుల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహం, ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుప్తనిధుల కోసం తవ్వకాలు భయాందోళనకు గురవుతున్నాం... గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తూ గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా ఇలాంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. – యాదయ్య, ఖమ్మంనాచారం గ్రామం అవగాహన లేకపోవడం వల్లే.. మూఢనమ్మకాలపై పల్లెవాసులకు అవగాహన లేకపోవడం వల్లే మంత్రాలను నమ్ముతున్నారు. ఆయా గ్రామాలలో మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులంటూ ఎన్నో రకాల పూజలు నిర్వహిస్తున్నారు. వాటితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూఢనమ్మకాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలి. – నిమ్మలి వెంకటమ్మ, కొండయపల్లి -
అబ్బుర పరిచిన ఆదిమానవుని ఆనవాళ్లు..
సాక్షి, నంగునూరు: ఆదిమానవుల ఆనవాళ్లు, అతిపురాతన వస్తువులు.. అబ్బుర పరిచే అవశేషాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్ గ్రామాల్లో బయటపడ్డాయి. ఆదిమానవుని సమాధి, వారు వాడుకున్న సామాగ్రీ వెలుగు చూశాయి. ఇవి సుమారు 3000 వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వినియోగించినట్లు పురావస్తుశాఖ అధికారులు పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరి నుంచి మూడు నెలల పాటు నంగునూరు మండలంలోని నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్ గ్రామాల్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అతి పురాతన వస్తువులు, ఆదిమానవుని ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ అవశేషాలను హైదరాబాద్‌లోని పురావస్తుశాలకు తరలించి భద్రపరిచారు. (చదవండి: హైదరాబాద్‌లో 6 రకాల బిర్యానీలు.. కచ్చీ, పక్కీ బిర్యానీ అంటే తెలుసా?) 1.క్యాప్‌స్టోన్‌గా అతిపెద్ద బండరాయి.. ఈ చిత్రంలో కనిపిస్తున్నపెద్ద బండరాయి ఆదిమానవుల సమాధిపై ఉన్న క్యాప్‌స్టోన్. ఇది సుమారుగా 3 వేల సంవత్సరాల కిందటిదిగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సమాధిపై కప్పిఉన్న బండరాయి (క్యాప్‌స్టోన్) 6.70 మీటర్ల పొడవు, 4 మీటర్లు వెడల్పు, 65 సెంటీమీటర్లు మందంతో 43 టన్నుల బరువు ఉంది. దీన్ని క్రేన్ సహాయంతో లేపేందుకు ప్రయత్నించగా దాని సామర్థ్యం సరిపోలేదు. దీంతో 80 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న క్రేన్ సహాయంతో 2 గంటల పాటు కష్టపడి బండను తొలగించారు. 2. సుద్ద ముక్కలు కావు శంఖాలు (కౌంచ్) సుద్దరాళ్లుగా కనిపిస్తున్న ఈ వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డ శంఖాలు. ప్రాచీన మానవుడు ప్రార్థన చేసేందుకు, వ్యక్తి చనిపోయిన తరువాత అంత్యక్రియల సమయంలో గౌరవ సూచకంగా వీటిని వాడేవారని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆనాటి కాలంలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 3. కుండలు పెట్టుకునే రింగ్‌స్టాండ్ ఆదిమానవులు వంట పాత్రలను పెట్టుకునే స్టాండ్ ఇది. వంటలు చేయగానే కుండలు పడిపోకుండా, క్రిమికీటకాలు కుండల్లోకి పోకుండా ఇలాంటి ఎరుపు రంగు కల్గిన కుదర్లు (రింగ్‌స్టాండ్) వాడేవారు. చూడడానికి ఢమరుకం లాగ కనబడుతున్నా వాస్తవానికి మట్టికుండలు పెట్టుకునే ఉపయోగించే రింగ్‌స్టాండ్ ఇది. 4. నక్షత్ర సమూహాలను గుర్తించే కఫ్‌మాక్స్ నక్షత్ర సమూహాలు గుర్తించేందుకు ప్రాచీన మానవుడు బండరాళ్లపై కఫ్‌మాక్స్ లను చెక్కేవారు. ప్రస్తుతం నడుస్తున్న కాలం, తర్వాత వచ్చే సీజన్, ఋతువులను తెలుసుకునేందుకు ఇలాంటి గుర్తులను వారు నివసిస్తున్న ప్రాంతంలో రాతి బండ లపై చెక్కేవారు. (పురావస్తుశాఖ అధికారులు గుంతల్లో ఉప్పు పోయడంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి). 5. తవ్వకాల్లో బయటపడుతున్న మృణ్మయ పాత్రలు ఎరుపు, నలుపుతోపాటు రెండు రకాల రంగులు కల్గిన మిశ్రమ మృణ్మయ బయటపడ్డాయి. రెండు సమాదుల్లో తవ్వకాలు జరుపగా ప్రాచీన మానవులు వాడిన అనేక పాత్రలు, ఎంతో కీలకమై సమాచారం లభించింది. 6. అద్భుతమైన మట్టికుండ ప్రాచీన మానవుడు వాడిన ఎరుపు రంగు మట్టికుండ నర్మెటలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. వేల సంవత్సరాల కిందట తయారు చేసిన మట్టి కుండకు చుట్టు అలంకారంగా సర్కిళ్లు చెక్కగా ఇప్పటికి చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇంత పెద్దకుండను తాగునీటి కోసం ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: జొన్నలకు పులి కాపలా!) 7 ఫైర్‌స్టాండ్, మృణ్మయ పాత్రలు ధాన్యం, విలువైన వస్తువులు మట్టికుండల్లో దాచేవారు. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన పదార్థాలను కుండల్లో పెట్టి సమాధి చేసేవారు. అలాగే ఫైర్‌స్టాండ్ (కుంపటి) పై ఆహార పదార్థాలు వేడి చేసుకోవడమే కాకుండా ధూపం వేసుకునేందుకు వీటిని వాడినట్లు తెలుస్తోంది. 8. రాళ్లుకావు ప్రాచీన మానవుని సమాధి పాలమాకులలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అందంగా పేర్చినట్లు కనబడుతున్న బండ రాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. సుమారుగా 3 వేల సంవత్సరాల కిందట ఈప్రాంతంలో ఆదిమానవులు జీవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని సమాధి చేసి నాలుగు వైపుల బండలను (సిస్ట్) స్విస్తిక్ ఆకారంలో ఏర్పాటు చేసేవారు. దాని చట్టూ రెండు వరుసలుగా వృత్తాకారంలో బండరాళ్లను పేర్చారు. 9. గుంతలు కావు గ్రూవ్స్ మగ్దుంపూర్‌లో ఓరైతు వ్యవసాయ బావి వద్ద ప్రాచీన మానవుడు ఏర్పాటు చేసుకున్న 12 గ్రూవ్స్ గుర్తించారు. జంతువులను వేటాడేందుకు ఉపయోగించే రాతి ఆయుధాలను పదును పెట్టేందుకు వీటిని ఉపయోగించేవారు. 10. గిన్నెల తయారీ అద్భుతం ప్రాచీన మానవులు ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఎరుపు, నలుపు రంగు మట్టి గిన్నెలను ఉపయోగించేవారు. ఇవి ఇతర మట్టిపాత్రలకు భిన్నంగా రెండు రంగులు కల్గి ఉండగా ఇప్పటికి చెక్కుచెదరలేదు. మెన్హీర్ సమీపంలో ఉన్న రెండవ సమాధిలో ఇవి బయటపడ్డాయి. 11. చెక్కు చెదరని దంతాలు మెన్హీర్ వద్ద ఉన్న పెద్ద సమాధిలో జరుపుతున్న తవ్వకాల్లో తెగలోని పెద్ద మహిళదిగా బావిస్తున్న 60 సెంటీమీటర్ల కాలు ఎముక లభించింది. అలాగే 20 సెంటీమీటర్ల దంతంతో కూడిన దవడ భాగం బయటపడింది. దానికి ఉన్న దంతాలు ఇప్పటికి చెక్కుచెదరలేదు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు జరపనున్న పరిశోధనల్లో ఈ రెండు భాగాలు కీలకంగా మారనున్నాయి. 12. ఎముక ఆభరణాలు ఆదిమానవులు ఎముకలతో తయారు చేసిన అభరణాలు వాడినట్లు తెలుస్తోంది. సుమారుగా 20 వరకు డైమండ్ ఆకారంలో ఉన్న ఎముకతో తయారు చేసిన పూసలు మెన్హీర్ వద్ద పెద్ద సమాధిలో జరిపిన తవ్వకాల్లో బయపడ్డాయి. ఇలాంటి ఆకృతి మొదటిసారిగా ఈప్రాంతంలోనే బయట పడ్డట్లు అధికారులు తెలిపారు. (చదవండి: మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు) -
‘పాలమూరు–రంగారెడ్డి’పై ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండోదశలో చేపట్టే పనులకు పర్యావరణ అనుమతులపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ, నారాయణపేటలో కార్యక్రమం జరిగింది. ముందుగా అధికారులు ప్రాజెక్టు అవశ్యకత, లాభాలు, వ్యయాల వం టివి ప్రొజెక్టర్ ద్వారా రైతులకు వివరించారు. అనంతరం వారి అభిప్రాయాలు స్వీకరించారు. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పోలీసులు తనిఖీచేసి అనుమ తించారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించలేదు. ప్రతి కేంద్రం వద్ద 200 నుంచి 300 మంది పోలీసులు మోహరించారు. వెల్దండలో కలెక్టర్ శర్మన్ అధ్యక్షతన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 8 మండలాల రైతులు పాల్గొన్నారు. తమకు పర్యావరణంపై అవగాహన లేదని, నష్టపరిహారంపైనే ఆందోళన ఉందని రైతులు చెప్పారు. నారాయణపేటలో కలెక్టర్ దాసరి హరిచందన అధ్యక్షతన 9 మండలాల రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రైతుల పేర్లను చిట్టీల్లో రాసి డిప్తీస్తూ ఒక్కొక్కరితో మాట్లాడించారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారి పేర్లే తీశారనే ఆరోపణలొచ్చాయి. -
హఠాత్తుగా కుంగిన భూమి.. లోపల ఏమున్నాయో తెలుసా..
దొడ్డబళ్లాపురం: మాగడి తాలూకాలో మఠానికి చెందిన భూమిలో తవ్వకాలు జరుపుతుండగా ప్రాచీన వస్తువులు బయటపడడం ఆసక్తిగా మారింది. మాగడి తాలూకా కన్నూరు గ్రామంలో మక్కళ దేవర మఠంలో మఠానికి చెందిన భూమిలో వ్యవసాయ పనుల నిమిత్తం జేసీబీతో తవ్విస్తుండగా హఠాత్తుగా భూమి లోపలకు కూలిపోయింది. దీంతో అక్కడ తవ్వి చూడగా ఒక గుహ, ప్రాచీన కాలం నాటి ఇత్తడి, తామ్రం, మట్టి వస్తువులు లభించాయి. తట్టలు, దీపం స్తంభాలు, విభూధి ఉండలు, ఉయ్యాల స్తంబం, గంట తదితర వస్తువులు వెలుగుచూసాయి. గతంలో మఠానికి చెందిన స్వామీజీ ఒకరు సజీవ సమాధి అయ్యారని, ఆయన వస్తువులు కూడా సమాధిలో ఉండిపోయి ఇప్పుడు వెలుగు చూసాయని మఠం నిర్వాహకులు తెలిపారు. పోలీసులు పురాతత్వ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
రాజులమ్మతల్లి కలలో చెప్పిందని..
చీపురుపల్లి రూరల్: రాజులమ్మ తల్లి కలలో కనిపించి.. మీ భూముల్లో నేను విగ్రహాల రూపంలో ఉన్నాను.. తవ్వకాలు జరిపితే విగ్రహాలు లభ్యమవుతాయని చెప్పిందంటూ పుర్రేయవలస గ్రామానికి చెందిన కంది లక్ష్మి తవ్వకాలకు పూనుకున్నారు. గ్రామానికి సమీపంలోని చీపురుపల్లి–సుభద్రాపురం ప్రధాన రహదారి పక్కన 25 రోజులుగా తవ్వకాలు సాగిస్తున్నారు. వీటి కోసం రూ.లక్షా 50వేలు ఖర్చుచేశారు. ఆర్థిక భారం కావడంతో తవ్వకాలు మధ్యలో ఆపేశారు. అమ్మవారు కలలో కనిపించి మరో 50 అడుగుల లోతు తవ్వితే విగ్రహాలు కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించినట్టు లక్ష్మి తో పాటు కుటుంబ సభ్యులు తెలిపారు. విగ్రహాలు లభిస్తే ఇళ్లు, భూమి అమ్మేసైనా సరే గుడి కడతామని చెబుతున్నారు. తవ్వకాలు చూసేందుకు ప్రతిరోజూ జనం క్యూ కడుతున్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు -
ఇంటి తవ్వకాల్లో బయటపట్ట బంగారం
న్యూశాయంపేట/వరంగల్ : వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి కందకాలు తీస్తుండగా బంగారు గొలుసు బయటపడింది. దీని పంపకం విషయమై కూలీల గొడవతో విషయం బయటపడగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... బొమ్మలగుడి ప్రాంతానికి చెందిన గొలికారి రమేష్ పాత ఇంటి స్థానంలో నూతన నిర్మాణ పనులను బిల్డర్‌కు అప్పగించాడు. ఆయన కాట్రపల్లికి చెందిన కూలీలతో బుధవారం కందకాలు తవ్విస్తుండగా మూడున్నర తులాల బంగారు గొలుసు బయటపడింది. అయితే, గొలుసు పంపకంపై కూలీలు గొడవ పడుతుండగా ఆనోట ఈనోట విషయం బయటపడింది. దీంతో ఎస్ఐ సతీష్ చేరుకుని కూలీలు విచారించి గొలుసు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పాత ఇళ్లు 30 నుంచి 40 ఏళ్ల క్రితం నిర్మించిన నేపథ్యంలో తమ పూర్వీకులు ఇంకా ఏమైన ఆభరణాలు దాచిపెట్టారా అనే అనుమానాల్ని యజమాని వ్యక్తం చేశారు. -
తవ్వకాల్లో గుట్టలు గుట్టలుగా గవ్వలు..
భువనేశ్వర్: నయాగడ్ జిల్లాలోని తరియా పంచాయతీలో ఉన్న నిచ్చిపూర్ గ్రామంలో కొత్త ఇల్లు నిర్మాణం నిమిత్తం పునాదులు తీసేందుకు తవ్వకాలు చేపడుతుండగా అక్కడి భూగర్భంలో నుంచి గుట్టలు గుట్టలుగా గవ్వలు బయటపడ్డాయి. మొత్తం 10 తట్టల గవ్వలు వెలికి తీసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం రేకిత్తిస్తుండగా, పూర్వీకులు వీటిని గుప్త నిధిగా భావించి భూగర్భంలో పదిలపరిచినట్లు స్థానికులు భావిస్తున్నారు. పూర్వ కాలంలో దైనందిన లావాదేవీల్లో నేటి తరంలో వినియోగించే ధనం తరహాలోనే ఈ గవ్వలను వినియోగించే వారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కేవలం 4 అడుగులు లోపు జరిపిన తవ్వకాల్లోనే ఈ గవ్వలు కనిపించాయని ఇంటి స్థల యజమాని నారాయణ సాహు తెలిపాడు. చదవండి: ఒమర్ అబ్దుల్లా కుటుంబం గృహనిర్బంధం -
మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు
మెక్సికన్ సిటి: మనిషి.. మనిషిని తినడం అనేది చాలా అసాధారణ విషయం. ఇలాంటి వాటి గురించి చాలా అరుదుగా వింటాం. అయితే మనిషి జంతువుల్ని వదిలేసి.. మానవుడిని తిన్న ఘటన గురించి ఇంత వరకు ఎప్పుడు వినలేదు. తాజాగా ఇలాంటి భయానక విషాయన్ని మెక్సికో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రపాలజీ అండ్ హిస్టరీ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. 1500 ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణంలో ఓ స్పానిష్ విజేత.. తన సైన్యంతో కలిసి.. బంధించిన సమూహానికి చెందిన పలువురు మహిళలు, పిల్లల్ని దారుణంగా చంపి.. వారిని తిన్నాడని నివేదిక వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరు మనుషుల్ని తిని.. పందుల్ని వదిలేశారు. టెకోయాక్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఈ భయానక సంఘటన గురించి తెలిసింది. ‘వారు.. వారిని తిన్న స్థలం ఇదే’ అని అజ్టెక్ నాహుఔట్ భాషలో ఉందని నివేదిక తెలిపింది. (చదవండి: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) 1520 లో టెకోయిక్ నివాసితులు స్వదేశీ సమూహాల నుంచి సుమారు 350 మంది ప్రజలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనను ‘జుల్టెపెక్’ అని కూడా పిలుస్తారు. ఇలా బంధించిన వారిలో 15 మంది పురుషులు, 50 మంది మహిళలు, 10 మంది పిల్లలు, 45 మంది సైనికులు ఉన్నారు. వీరంతా ఆఫ్రికన్, స్వదేశీ సంతతికి చెందిన క్యూబన్లు అని నివేదిక వెల్లడించింది. ఇక వీరిని బంధించిన విషయం గురించి విజేత హెర్నాన్ కోర్టెస్‌కు సమాచారం ఇవ్వగా.. అతడు వారిని చంపి.. పట్టణాన్ని నాశనం చేయాలని ఆదేశించాడు. దాంతో అతడి సైన్యం నెలల వ్యవధిలో వీరందరిని చంపి.. 1521 ప్రారంభంలో పట్టణాన్ని నాశనం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఇక్కడ తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎన్రిక్ మార్టినెజ్ వర్గాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార చర్యలో భాగంగా ఈ దాడి జరిగి ఉంటుంది. ఇక ఈ ఘటనలో ప్రాణ త్యాగం చేసిన వారి ఎముకలను, ఇతర సాక్ష్యాలను నిస్సార బావుల్లోకి విసిరినట్లు త్రవ్వకాలు వెల్లడించాయి. ఇక ఇక్కడ ప్రజలు దాడిని ఆపడానికి ప్రయత్నించారు.. కానీ విఫలమయినట్లు తెలుస్తోంది’’ అన్నారు. (చదవండి: ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి) ఆయన మాట్లాడుతూ.. "పట్టణంలో బస చేసిన కొంతమంది యోధులు పారిపోగలిగారు. కాని మహిళలు, పిల్లలు ఇక్కడే ఉన్నారు. దాంతో వారే ప్రధాన బాధితులు అయ్యారు. ఇక తవ్వకాల్లో చిన్న పిల్లల ఎముకలు యుక్త వయసు ఆడవారితో పాటు పడి ఉన్నట్లు గుర్తించాము. ఇక ఖననం చేసిన స్థలాన్ని పరిశీలిస్తే.. ఈ ప్రజలు పారిపోతున్నారని, వారిని దొరకపుచ్చుకుని ఊచకోత కోసినట్లు.. తొందరపాటులో ఖననం చేశారని తెలుస్తుంది" అన్నారు. అంతేకాక ‘‘అనేక దేవాలయాలు కాలిపోయాయి.. విగ్రహాలు తలలు ఖండించారు. పట్టుబడిన కొంతమంది మహిళల తలలు, పుర్రె రాక్‌లో వేలాడదీశారు. మరోక మహిళ గర్భవతి అని తెలిసింది. ఇలా బంధించిన ప్రజలను ఖైదీలుగా ఉంచి.. ఆరు నెలలకు పైగా ఆహారం ఇచ్చారు. ఆ తర్వాత గుర్రాలు, పురుషులు, స్త్రీలను చంపి.. తిన్నారు. అయితే స్పానిష్ ప్రజలు తమతో పాటు ఆహారం కోసం పందులను తీసుకువచ్చారు. కానీ వాటిని తినలేదని తవ్వకాల ద్వారా తెలిసింది’’ అన్నారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
వైఎస్ఆర్ జిల్లా,ఒంటిమిట్ట : గంగపేరూరులోని వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర కల్గిన వీరభద్రస్వామి ఆలయం శిథిలమైంది. ఆఖరికి వీరభద్రుడి శిల్పం, ఆనాటి శాసనాలు మాత్రమే మిగిలాయి. పురాతన ఆలయం కాబట్టి గుప్త నిధులు ఉంటాయనే ఆలోచనతో కొంత మంది 5 బైక్‌ల్లో వచ్చారు. అక్కడ ఉన్న వీరభద్రుడి శిల్పాన్ని తొలగించారు. శిల్పం ఉన్న చోట తవ్వకాలు జరిపారు. ఎంత తవ్వినా ఏమీ కనిపించక పోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన రాత్రి 11 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోందని అక్కడి గ్రామ ప్రజలు అంటున్నారు. -
ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
సాక్షి, అమ్రాబాద్: పదర మండలం రాయలగండి లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం ఎదుట ఉన్న అగ్నిగుండాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. అగ్ని గుండం కోసం పేర్చిన రాళ్లను తొలగించి, తవ్వకాలు జరిపి యథాస్థానంలో ఉంచారు. బుధవారం ఉదయం స్థానికంగా ఉన్న భక్తులు కొంత మంది చూసి తవ్వకాలు జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పదర ఎస్ఐ సురేష్‌కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడున్న వారిని విచారించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. గతంలోనూ తవ్వకాల ప్రయత్నం ఆలయంలో తవ్వకాలు జరిపిన ప్రదేశం ఇదిలాఉండగా గత ఆగస్టు 10వ తేదీన రాయలగండిలో గుప్త నిధుల తవ్వకాల ప్రయత్నం జరిగింది. ఓ కారులో గుప్తనిధుల కోసం రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం సమీపంలో పరికరాలతో అణ్వేషన జరుపుతుండగా స్థానికులు గుర్తించి వెంబడించారు. కారులో పరారైన దుండగులను మన్ననూర్‌లో ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వచ్చిన ఐదు మంది దుండగులతో పాటు కారును, గుప్తనిధుల అన్వేషణకు తెచ్చుకున్న డిటోనేటర్, పౌడర్, వివిధ పరికరాలను స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేశారు. అప్పట్లో అన్వేషణ ప్రయత్నం జరగడం, బుధవారం తవ్వకాలు బయట పడటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాయలగండి ఆలయం వద్ద పోలీసు పహారా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
జాడల్ని చెరిపేసుకుంటున్నాం
రాజ్యాలు, యుద్ధాలు.. గెలుపు ఓటములు.. శిలలు, శాసనాలు.. మహళ్లు, మంతనాలు.. మతాలు, బోధనలు.. ఆరామాలు, ఆలయాలు.. చరిత్రకు సంబంధించిన ఏ జాడలైనా ప్రజలకు హక్కున్న వారసత్వ సంపదే! భావితరాలకూ చెందేలా జాగ్రత్తగా సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!! ఆ బాధ్యతను గుర్తు చెయ్యడం కోసం గత పదిహేనేళ్లుగా ఏకదీక్షగా శ్రమిస్తున్నారు ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ. గత శతాబ్దపు ఎనిమిదవ దశకం చివరి సంవత్సరాలలో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండలో ఆర్కియాలజీ తవ్వకాల్లో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. వాటిని ‘ఉన్నవి ఉన్నట్లుగా’ సంరక్షించుకోవలసిన ఆవశ్యకతపై చరిత్రకారిణి, రచయిత్రి రాణి శర్మ తాజాగా ‘తథాగతుని అడుగుజాడలు’ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు, విశేషాలు. ‘‘పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో 1980ల చివర్లో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండ, బావికొండ, పావురాల కొండలో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. ఈ శాఖ అప్పటి డైరెక్టర్ డాక్టర్ వి.వి. కృష్ణశాస్త్రి ఆనాటి తవ్వకాలకు చాలా కృషి చేశారు. ఈ పుస్తకానికి ప్రేరణ ఆయనే. సముద్ర తీరంలో కొండమీది క్షేత్రాలవి. రెండువేల మూడువందల సంవత్సరాల కిందట బౌద్ధ భిక్షువులు ఎలా విడిచిపెట్టి పోయారో అలాగే దొరికాయి. అయితే ఇన్నేళ్లు మట్టిలో నిక్షిప్తమై ఉన్న కట్టడాలు ఒక్కసారి బయటపడగానే పాడైపోతాయి. వాటిని పరిరక్షించాలి. ఈ తవ్వకాలు జరిగినప్పుడు విశాఖపట్టణ పరిధి చాలా తక్కువగా ఉంది. రానురాను పట్టణ పరిధి విస్తరించి తొట్లకొండ, బావికొండ దాకా వచ్చేసింది. దీనివల్ల రియల్ స్టేట్ వ్యాప్తి చెందడం, ఎలాగైనా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలన్న ప్రభుత్వాల ఉత్సాహం వల్ల ఎంతో అమూల్యమైన ఈ ప్రాచీన నిర్మాణం దెబ్బతినడం మొదలైంది. ప్రాచీనతకు హంగులా!! శిథిలావస్థలో ఉన్న కొన్ని కట్టడాలను చూసి పర్యాటకశాఖ అధికారులు నాతో అన్నారు ‘‘వీటికి మనం కొన్ని హంగులు కల్పించి అందంగా తీర్చిదిద్దాలి’’ అని. ‘‘ఈ వారసత్వ సంపదకు మించిన అందం ఉంటుందా? వీటి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్స్ (వ్యాఖ్యాన కేంద్రాలు) ఏర్పాటు చేయండి’’ అని చెప్పాను. ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్స్ అంటే.. ఈ కట్టడాల చరిత్ర, గొప్పదనం, ప్రత్యేకత, వీటిని ఎందుకు సందర్శిస్తున్నాం, ఎందుకు, ఎలా కాపాడుకోవాలి వగైరాలను బ్రోషర్స్, పుస్తకాలు, ఫిల్ముల ద్వారా సందర్శకులకు వివరించడం, చూపించడం. ఇలా 2004 నుంచి నేటి దాకా వాటిని కాపాడ్డానికి నేను పాడిన పాట్లు దేవుడికే తెలుసు. దీనికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని స్థానిక అధికారుల నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు దగ్గర దగ్గర డెబ్భై ఎనభై లేఖలు రాశా. ఓ రెండుమూడు నెలలకు ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా’ వాళ్లు ఒక లేఖను పట్టుకొని విశాఖపట్టణంలోని మా ఇంటికొచ్చారు.. ‘‘రాణీ శర్మగారు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ గారికి కంప్లయింట్ రాశారట’’ అంటూ. అప్పుడు వాళ్లలో ఒక అధికారిని తొట్లకొండ తీసుకెళ్లి అంతా చూపించాను. ‘‘రాణీ శర్మగారు చెప్పింది నిజమే.. ఈ సైట్ పాడైపోతోంది.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ సైట్‌ను అప్పగిస్తే దీన్ని మేము పునరుద్ధరించి, పరిరక్షించగలం’’ అని ఆయన పైకి లెటర్ రాశారు. స్నానాల బాటను తవ్వేశారు టూరిజం భ్రమలో పడి సైట్‌ను, దాని ప్రాశస్త్యాన్ని పాడుచేసుకోవడం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సైట్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ దానిమీద టూరిజంను వృద్ధి చేసుకుంటారు. పర్యాటకులకు ఇష్టం వచ్చినట్లు మసులుకోనివ్వరు. కారు ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఆపి.. కట్టడం వరకు నడుచుకుంటూ రావాలి. పరిరక్షణలో ఉన్న వాటిని చేతులతో తాకడం.. ముట్టుకోవడం వంటివి చేయనివ్వరు. కానీ మనం?! టూరిస్ట్‌ను ముద్దు చేస్తూ గుమ్మం దాకా వాహనాలలో రానిస్తాం. అలా వాహనాల కోసం ఇక్కడ పూర్వకాలం బౌద్ధ గురువులు స్నానం కోసం నడిచివెళ్లిన బాటను తవ్వేసి రోడ్లు వేశారు! హంగులు, ఆర్భాటాలు కల్పించి.. షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రార్థనా మందిరాలు కట్టి.. దాన్నో విహారకేంద్రంలా తయారు చేశారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవన్నీ చేయకూడదు. వీటన్నిటినీ ఎత్తిచూపుతూ ఉత్తరాలు రాశా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందనా రాలేదు. అది ఏ ఉత్సాహంలో ఉండిందంటే ఎలాగైనా సరే ఈ బౌద్ధక్షేత్రాలను నలుగురికీ చూపించి డబ్బులు గడించాలి అని! పాత తొట్లకొండ మాయం బౌద్ధ గురువులెప్పుడూ అందమైన ప్రకృతి ప్రదేశాలనే తమ ఆవాసాలుగా చేసుకున్నారు. తొట్లకొండలో కూడా అంతే. సముద్రమట్టానికి ఎత్తులో చుట్టూ పచ్చని చెట్లు, చేమల మధ్య చక్కటి వాతావరణంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హోటల్స్, రిసార్టులు కట్టే ఆలోచనతో నాశనం చేస్తున్నారు. నేను చెప్పిన ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్ ఈనాటికీ వాళ్ల కార్యాచరణలో లేకపోగా ఈ మధ్య ఏం చేశారంటే.. 2,300 ఏళ్ల నాటి కట్టడంలోని పాత ఇటుకలన్నిటినీ తీసిపారేసి ఇప్పటి ఇటుకలతో కట్టేశారంతా! ఇప్పుడు మీరు తొట్లకొండను చూద్దామని వస్తే.. నాటి తొట్లకొండకు బదులుగా రెండేళ్ల కిందట కొత్తగా కట్టిన తొట్లకొండ సాక్షాత్కరిస్తుంది. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. ఈ ఆక్రోశంతో, బాధతో, దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ ‘తథాగతుని అడుగుజాడలు’ పుస్తకం రాశాను. ప్రేరణ ఏంటంటే.. నేను చరిత్ర విద్యార్థిని అవడం, ఒకప్పుడు ఇటు తెలంగాణ, అటు కోస్తా అంతటా కూడా బౌద్ధమే ఉండడం. అప్పుడు మనందరం బౌద్ధులమే. వరం కొద్దీ ఈ ప్రాంతం మన ఆంధ్రదేశం ఒడిలో పడింది. ఈ ప్రాముఖ్యం తెలియక టూరిజం ‘అభివృద్ధి’లో కొట్టుకుపోతున్నాయి ప్రభుత్వాలు. ఇదంతా భావితరాల ఆస్తి నియమాలకు విరుద్ధంగా తొట్లకొండ స్తూపానికి దగ్గర్లో నిర్మాణాలు మొదలుపెట్టారు. దీని మీద హైకోర్టులో కేసు వేశా. సాంచీలో కాని, భార్హూత్లో కాని ఎక్కడా ఇలా నిర్మాణాలకు అనుమతించలేదు. అసలు జీవో ప్రకారం కొండంతా కూడా సంరక్షణ ప్రాంతమే. ఈ జీవో అందరికీ చూపించుకుంటూ పోరాడాల్సి వస్తోంది. తొట్లకొండ, బావికొండ, పావురాలకొండను అనాథ ప్రాంతాలుగా చేసేశారు. ఇది ప్రభుత్వ ఆస్తో, ప్రజాప్రతినిధుల ఆస్తో కాదు. ప్రజలది, మన భావితరాలది. ఇవి ప్రపంచ వారసత్వ సంపదలు. వీటికి మనం సంరక్షులం మాత్రమే. దురదృష్టమేమంటే వాటిని భద్రంగా కాపాడే పురావస్తు శాఖను నిర్వీర్యం చేసి, పర్యాటక శాఖ కింద పెట్టడం. పాశ్చాత్య దేశాల్లో ఇలా ఉండదు. ప్రతి ఊళ్లో ‘హిస్టారికల్ సొసైటీస్’ ఉంటాయి. ప్రజలకు వాటి మీద యాజమాన్యపు హక్కుంటుంది. ప్రజలను అడక్కుండా ప్రభుత్వాలు ఏ పనీ చేయడానికి వీల్లేదు. మన దగ్గరా అలాంటి చైతన్యం రావాలి’’ అంటారు ఈమని రాణి శర్మ. – సరస్వతి రమ ఫొటోలు : ఐ.దేవేంద్రనాథ్ రెండవ పుస్తకం రాణీ శర్మ జన్మస్థలం విశాఖపట్టణం. తండ్రి మురుకుట్ల పురుషోత్తమ శర్మ. తల్లి పార్వతి. తండ్రి ఉద్యోగరీత్యా ప్రాథమిక విద్యను రాయలసీమలో, ఉన్నత విద్యను మచిలీపట్టణం, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో అభ్యసించారు. భర్త ఈఏఎస్ శర్మ ఐఏఎస్ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్లడంతో రాణీ శర్మ కూడా తన అధ్యాపక వృత్తిని అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో కొనసాగించారు. పదవీ విరమణ తర్వాత విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. ‘తథాగతుని అడుగుజాడలు’ ఆమె రెండవ పుస్తకం. మొదటి పుస్తకం హైదరాబాద్ పూర్వ సంస్కృతి మీద రాసిన ‘‘ది డియోడిస్ ఆఫ్ హైదరాబాద్ : ఎ లాస్ట్ హెరిటేజ్ ’’. -
ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు
సాక్షి, కొల్లిపర/ గుంటూరు: కృష్ణానదిలో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు రాత్రివేళ చేపట్టారు. గమనించిన గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలో ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం అమలులో ఉంది. పది రోజుల కిందట కృష్ణానదికి వరదలు రావడంతో నిన్నటి వరకు వరద ఉధృతి నెలకొంది. రెండు రోజుల నుంచి నీరు తగ్గి ఇసుక దిబ్బలు బయట పడ్డాయి. వాటిపై ఇసుక మాఫియ కన్నుపడింది. ఇక అంతే రాత్రి వేళల్లో ఇసుక తరలించటం మొదలు పెట్టారు. రెండు రోజుల నుంచి హన్మాన్పాలెంలో డంప్ చేసి, ఇసుకను చక్రాయపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అలాగే శనివారం రాత్రి కొల్లిపర గ్రామానికి చెందిన కొంత మంది కొత్తబొమ్మువానిపాలెం కృష్ణానది కరకట్ట పుష్కర ఘాట్ వద్ద జేసీబీ, కూలీల సాయంతో లారీ, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. అది గమనించిన హన్మాన్పాలెం, బొమ్మువానిపాలెం గ్రామస్తులు అక్కడకు వెళ్లారు. వారిని చూసిన అక్రమార్కులు జేసీబీని పక్కన ఉన్న పొలంలో నుంచి కరకట్టకు ఎక్కించారు. అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మీరు ఎవరు, ఏ అనుమతితో ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో డ్రైవర్ స్పందించి మీరెవరు మమ్ములను ప్రశ్నించడానికి అంటూ ఎదురుదాడికి దిగాడు. ట్రాక్టర్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు.గ్రామస్తులు బైకును ట్రాక్టర్‌కు అడ్డుగా పెట్టి అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు లారీ, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర, వాహన యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మూడు ఇసుక ట్రాక్టర్లపై కేసు యర్రబాలెం(మంగళగిరి): యర్రబాలెం గ్రామంలోని రాజధాని రోడ్లలో నిల్వ ఉంచిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్నారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఇసుక ట్రాక్టర్‌తో సహా పరారయ్యాడు. మరో రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
లేదే కనికరం.. రాదే పరిహారం!
సాక్షి,తుగ్గలి(కర్నూలు) : బంగారు నిక్షేపాల వెలికి తీతకు సంబంధించి భూములు విక్రయించిన రైతులకు అటు కంపెనీ డబ్బు ఇవ్వక, పరిహారం, బీమా రాక తీవ్రంగా నష్టపోయారు. మండలంలో బొల్లవానిపల్లి, జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల సరిహద్దుల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన జియోమైసూర్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ గత 20 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో పలు సర్వేలు చేసింది. చివరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి వాటిని వెలికితీసేందుకు 2013లో ప్రభుత్వ అనుమతులు పొందింది. ఈ మేరకు 2018 ఏప్రిల్ 12న ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఎకరా రూ.12లక్షల ప్రకారం 350 ఎకరాలు కొనుగోలు చేసేలా కంపెనీ రైతులతో ఒప్పందం చేసుకుంది. ఒకటి రెండు నెలల్లో భూములు కోల్పోయే రైతులకు కొన్న ప్రకారం మొదటి విడతగా రూ.10 లక్షలు, మలిదశలో రూ.2లక్షలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. పంటలు కూడా వేయొద్దని, త్వరలో డబ్బు ఇచ్చి పనులు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందకుండా, పంటలు వేయకుండా తమ పొలాలు బీళ్లు పెట్టారు. అయితే కంపెనీ చెప్పిన గడువు ముగిసి నెలలు గడిచినా డబ్బు ఇవ్వలేదు. దీంతో బంగారు నిక్షేపాల వెలికితీత పనులు ప్రారంభం కాలేదు. చివరకు ఏడాది దాటిపోయి నా డబ్బు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ మాటలు నమ్మి మోసపోయామని అటు పంటలు వేసుకోక, ఇటు పంట రుణాలు పొందక చివరకు పంట నష్టపరిహారం, బీమా లాంటివి కోల్పోయామని బాధిత రైతులు వాపోతున్నారు. రెంటికీ చెడ్డ రేవడిలా తమ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరువుతో అల్లాడిపోతున్నామని, కుటుంబాలు గడవడం కూడా కష్టమైందని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో తమకు డబ్బు ఇవ్వకపోగా, ప్రభుత్వం నుంచి వచ్చే పంటనష్ట పరిహారం, బీమా వంటి సౌకర్యాలు కోల్పోయామని వాపోతున్నారు. పంటలు వేసుకోకుండా చేసిన కంపెనీనే తమకు జరిగిన నష్టాన్ని భరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కర్నూలులో స్పందన కార్యక్రమంలో కూడా తమ కష్టాలు చెప్పుకున్నామని తెలిపారు. రైతులకు న్యాయం చేస్తాం బంగారు నిక్షేపాల వెలికితీతకు సంబంధించి కొన్ని ఆటంకాలు ఏర్పాడ్డాయి. దీంతో అనుకున్న సమయంలో పనులు ప్రారంభించ లేక పోయాం. త్వరలోనే ఆటంకాలు తొలగిపోతాయి. పంటలు వేసు కోకుండా, పరిహారం, బీమా కోల్పోయిన రైతులు నష్టపోకుండా కంపెనీతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – హనుమప్రసాద్, కంపెనీ ప్రతినిధి నెలకే డబ్బు ఇస్తామన్నారు బంగారు నిక్షేపాల వెలికితీత అని జియోమైసూర్ కంపెనీ ఏడాది క్రితం భూమలు కొంటామని చెప్పి ఎకరా రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నాది 6.20 ఎకరాలు కంపెనీకి పోతోంది. కంపెనీ వారు పంటలు వేసుకోవద్దు, డబ్బు ఇచ్చి పనులు మొదలు పెడతామని చెప్పారు. అయితే ఇంత వరకు డబ్బు ఇవ్వలేదు. దీంతో పంటలు వేసుకోక, పరిహారం బీమాకు నోచుకోక నష్టపోయిన తమను కంపెనీనే ఆదుకోవాలి. –లేపాక్షిరెడ్డి,రైతు, బొల్లవానిపల్లి పంటలు వేసుకోవద్దన్నారు బంగారు గనుల పనులు మొదలు పెడతామని పంటలు వేసుకోవద్దని కంపెనీ వారు చెప్పారు. ఏడాది దాటినా డబ్బు ఇవ్వలేదు. దీంతో తాము పంటలు వేసుకోక, ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం, బీమా అన్నీ కోల్పోయాం. తమకు కలిగిన నష్టానికి కంపెనీనే బాధ్యత వహించాలి. – అంజినయ్య, రైతు, బొల్లవానిపల్లి -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
వైఎస్ఆర్ జిల్లా, అట్లూరు : అట్లూరు మండలం కమలకూరు పంచాయతీ నల్లాయపల్లి రెవెన్యూ పొలంలోని పాపాయకుంట దగ్గర ఉన్న పురాతనమైన బావిలో గత వారం రోజు లుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. పూర్వ కా లంలో రాజులు ఇక్కడికి వేటమార్గంలో వచ్చినప్పుడు వారాల తరబడి ఈ బావి సమీపంలో సేద తీర్చు కోవడంతో పాటు కొంతమేర గుప్తనిధులు ఈ బావిలో భద్రపరిచేవారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బావిలో తవ్వకాలు జరపగా సు మారు పది అడుగుల లోతులో రెండు నీటి తొట్లు బయటపడ్డాయి. పోలీసులు వి చారణ జరిపితే తవ్వకాలు జరిపిన వ్యక్తులు ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. -
చూస్తే ‘డంగు’ అయిపోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా వెలుగు చూడని బుద్ధుడిదిగా భావిస్తున్న భారీ గార ప్రతిమ (డంగుసున్నంతో రూపొందిన) వెలుగు చూసింది. ఇక్ష్వాకుల కాలంలో క్రీస్తుశకం మూడో శతాబ్దంలో దీన్ని రూపొందించినట్లు పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్తూప కేంద్రమైన ఫణిగిరిలో శుక్రవారం ఈ అద్భుతం బయల్పడింది. ఫణిగిరి బౌద్ధ స్తూపం ప్రాంగణంలో ఫిబ్రవరి నుంచి పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. బౌద్ధ స్తూపం, చైత్యాలు, బుద్ధుడి ధాతువు, బుద్ధుడి జీవిత చరిత్రను కళ్లముందు నిలిపే అద్భుత చెక్కడాలను గతంలో వెలికి తీశారు. ఆ తర్వాత తవ్వకాలు నిలిపివేశారు. ఇటీవల హెరిటేజ్ తెలంగాణ (రాష్ట్ర పురావస్తుశాఖ) ఏఎస్ఐ నుంచి అనుమతి తీసుకుని ఫిబ్రవరిలో మళ్లీ తవ్వకాలు ప్రారంభించింది. ఈ క్రమంలో శుక్రవారం దాదాపు ఆరడగుల పొడవున్న బుద్ధుడి ఆకారం వెలుగు చూసింది. ఆ ప్రతిమ వెనుక భాగం మాత్రమే కన్పిస్తోంది. దాన్ని చూస్తే నిలబడి ఉన్న బుద్ధుడి ఆకారంగానే కనిపిస్తోంది. అయితే బుద్ధుడి జీవిత చరిత్రలో ఒక ఘట్టానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. బుద్ధుడి చరిత్రలో ఉండే రాజులకు సంబంధించినదై కూడా ఉంటుందనే మరో అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై అలంకరణ గుర్తులున్నాయి. సాధారణంగా బుద్ధుడి శరీరంపై ఎక్కడా అలంకరణ ఉండదు. కంకణాలు, ముంజేతి అలంకరణలు కనిపిస్తున్నందున అది బుద్ధుడిగా మారకముందు రూపమై ఉంటుందని, లేదంటే ఇతర రాజులకు సంబంధించినదై ఉంటుం దని తవ్వకాలకు నేతృత్వం వహిస్తున్న హెరిటేజ్ తెలంగాణ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు పేర్కొంటున్నారు. ఆ విగ్రహం ముందు భాగం చూస్తేగాని కచ్చితమైన రూపాన్ని ప్రకటించలేమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా.. పురాతన కాలం నాటి కట్టడాలున్న ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో డంగు సున్నంతో రూపొందించిన శిల్పాలు వెలుగు చూడటం సహజం. కానీ ఇవి రెండడుగుల కంటే ఎక్కువ పొడవున్న దాఖలాలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. కానీ తొలిసారి మానవుడి సహజ ఎత్తు పరిమాణంలో ఉండే సున్నం (గార) ప్రతిమ వెలుగుచూసిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఆరడగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు కనిపించలేదని నాగరాజు, విశ్రాంత అధికారులు రంగాచార్యులు, తవ్వకంలో పాలుపంచుకున్న భానుమూర్తిలు వెల్లడించారు. ఇది చాలా అరుదైన ప్రతిమగా వారు అభివర్ణించారు. లోన ఇటుకలు.. ఈ విగ్రహాన్ని తొలుత ఇటుకలతో నిర్మించి దానిపై మందంగా డంగు సున్నం మిశ్రమ లేపనంతో ఆకృతి తెచ్చారు. ఆ విగ్రహానికి పలు ప్రాంతాల్లో రంధ్రాలున్నాయి. దానికి చేరువలో భారీ గోడ ఉన్న ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. అంటే ఆ విగ్రహాన్ని ప్రత్యేక పద్ధతిలో గోడకు అమర్చి ఉంటారని, అది గోడతోపాటు అలాగే కూలిపోయి భూగర్భంలో ఉండిపోయి ఉంటుందని భావిస్తున్నారు. వెలికి తీసే తరుణంలో అది ముక్కలు కానుంది. దాన్ని తిరిగి పూర్వపు పద్ధతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి అతికించనున్నారు. ఇందుకోసం విగ్రహాన్ని వివిధ భంగిమల్లో ఫొటోలు తీశారు. విగ్రహం పగుళ్ల ఆధారంగా నంబర్లు వేశారు. వెలికి తీశాక అ ముక్కలను హైదరాబాద్ తరలించి ఫొటో డాక్యుమెంటేషన్ ఆధారంగా డంగు సున్నం మిశ్రమంతో తిరిగి అతికించి పూర్వరూపం తెస్తారు. ఈ భారీ విగ్రహం వెలుగు చూసిన విషయాన్ని వెంటనే హెరిటేజ్ తెలంగాణ ఇన్చార్జి డైరెక్టర్ సునీత భగవత్ దృష్టికి తీసుకెళ్లామని, ఆమె సూచనల మేరకు నిపుణులతో చర్చించి దాన్ని హైదరాబాద్ తరలింపు, సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు నాగరాజు పేర్కొన్నారు. అపూర్వ గుర్తు ఆ విగ్రహం వెలుగు చూసిన వెంటనే మా సిబ్బంది నా దృష్టికి తెచ్చారు. అది అతి అరుదైన ప్రతిమగా వారు చెప్పారు. కానీ పూర్తిగా వెలికి తీశాక గాని వివరాలు తెలియవు. ఇప్పటి వరకైతే అది చరిత్రకు సంబంధించి అపూర్వ గుర్తుగా భావిస్తున్నాం. తవ్వకాలు కొనసాగించి అక్కడ ఇంకా ఏమున్నాయో గుర్తిస్తాం. శనివారం కొన్ని వివరాలు వెల్లడవుతాయి. సునీత భగవత్, ఇన్చార్జి డైరెక్టర్ -
గుప్త నిధుల కోసమే తవ్వకాలా...!
విజయనగరం, కొత్తవలస రూరల్: కొత్తవలస పంచాయతీ బలిఘట్టం గ్రామ సమీపంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయం వద్ద మూలవిరాట్టును ఆనుకుని వెనుక భాగంలో సుమారు మూడడుగుల మేర జరిగిన తవ్వకాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విగ్రహాన్ని సైతం పెకలించి దాని కింద తవ్వకాలు జరిగిన వైనం చూస్తుంటే గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేసుంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలనాటి రాజుల గుప్తనిధులు దాచి ఉంచారన్న సమాచారంతోనే ఈ తవ్వకాలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. సోమవారం భక్తుల కంట పడిన తవ్వకాల పనులు ఆదివారం రాత్రి జరిగి ఉంటాయని చెబుతున్నారు. ఈ తవ్వకాల వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని అపచారం జరిగిందని పేర్కొంటున్నారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలో మద్యం సేవిస్తుండడంతో ఆకతాయిలు చేసిన పనై ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. పెద్దాపురం రాజుల కాలం నుండి... శ్రీవేణుగోపాలస్వామి ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నాటిదని పాతసుంకరపాలెం గ్రామపెద్ద పెదిరెడ్ల సూరిబాబు తెలిపారు. అప్పటి రాజులు స్వామికి నిత్యం పూజలు చేసేవారని నిత్య స్నానాధుల కోసం బావి కూడా తవ్వారని పేర్కొన్నాడు. ఈ ఆలయంలో అప్పటి రాజులు గుప్త నిధులు దాచారని చాలా కాలంగా ప్రచారం సాగుతుందని గతంలో జీర్ణావస్థకు చేరుకున్న ఆలయానికి 1987లో పునఃనిర్మాణ పనులు చేపట్టే సమయంలో రాగి చెంబు ఒకటి తవ్వకాల్లో దొరికిందని అప్పటి నుంచి ఈ ఆలయం వద్ద గుప్త నిధులు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగలు తవ్వకాలు జరిపి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల వద్ద క్షుద్ర పూజలు ఆలయం వెనుక తవ్విన ప్రాంతంలో తవ్వడానికి ముందు వివిధ రకాల పూజలు నిర్వహించినట్టు ఆనవాళ్లు కనిపించాయని బహుసా క్షుద్రపూజలు ఏమైనా నిర్వహించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా గుప్త నిధులు ఉన్నాయా ఏమైనా తస్కరించారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. దేవుని విగ్రహం పగులగొట్టి తవ్వకాలు జరపటం అపచారంగా భావిస్తున్నామని పోలీసులకు సమాచారం అందించామని పెదిరెడ్ల సూరిబాబు తదితరులు తెలిపారు. బుధవారం సీఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో వచ్చి ఆలయ ప్రాంగణం పరిశీలన చేసారని స్థానికులు తెలిపారు. -
వేదమంత్రాల సాక్షిగా అర్చకుడి ఆత్మార్పణం
రాజమహేంద్రవరం క్రైం: గుప్తనిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరపాలంటూ ధర్మకర్తల మండలి ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్చకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం, కణుపురు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి దేవాలయంలో కొత్తలంక మల్లికార్జున శర్మ (30)అర్చకుడు. అతని తండ్రి సత్యనారాయణ శర్మ 40 ఏళ్లుగా ఇక్కడే అర్చకుడిగా విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటుండడంతో మల్లికార్జున శర్మ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే దేవాలయంలో గుప్త నిధులున్నాయనే వదంతులు రావడంతో దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యులు మల్లికార్జునశర్మపై తవ్వకాలకోసం ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి అతను అంగీకరించకపోవడంతో ఆయన స్థానంలో మరో పూజారిని నియమించారు.ఈ నేపథ్యంలో మల్లికార్జున శర్మ మంగళవారం పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆస్పత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. తనపై జరిగిన వేధింపుల విషయాన్ని సెల్ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. ఆలయంలో గుప్తనిధులు తవ్వేందుకు సహకరించాలని ధర్మకర్తల మండలి సభ్యులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని, కాగా తాను వేదమంత్రాలు వల్లెవేస్తూ మృతి చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.దీనిపై అర్చక సమాఖ్య ఆందోళన వ్యక్తంచేసింది. మల్లికార్జున శర్మ మృతదేహంతో తమ నిరసనను తెలిపింది. అర్చకులకు రక్షణ కల్పించాలని కోరింది. -
కేరళలో ఎందుకీ విపత్తు ?
దేవభూమి కేరళ వర్ష బీభత్సానికి చివురుటాకులా వణుకుతోంది. అసలు ఎందుకీ ప్రకృతి ప్రళయం ? 2011లో చేసిన ఒక తప్పిదమే ఇప్పుడు వెంటాడుతోందా ? ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, కొండ ప్రాంతాల్ని తొలిచేయడం వల్లే ఈ దుస్థితి ఎదురైందా? అనే అనుమానాలు తలెత్తడం సహేతుకమే. గాడ్గిల్ కమిటీ సిఫారసులు బేఖాతర్ పశ్చిమ కనుమల్లో ఉన్న కేరళలో ప్రతీ ఏడాది వర్షాలు ఎక్కువ. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచీ భారీ వర్షాలు మామూలే. వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి ముందస్తుగా సరైన చర్యలు చేపట్టకపోవడం, పర్యావరణవేత్తలు చేసిన సూచనల్ని, సలహాల్ని పెడచెవిన పెట్టడం వల్ల ఇప్పుడు అతివృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేరళ ముప్పు ముంగిట్లో ఉందని 2011లోనే గాడ్గిల్ కమిటీ హెచ్చరించింది. లక్షా 40 వేల విస్తీర్ణంలోని పశ్చిమ కనుమల్ని పర్యావరణపరంగా అత్యంత సున్నితమైనవని పేర్కొంటూ వాటిని మూడు జోన్లగా విభజించింది. ఈ జోన్లలో మైనింగ్ తవ్వకాలు, ఎడాపెడా నిర్మాణాలు చేపట్టవద్దంటూ సూచనలు చేసింది. అటవీ కార్యకలాపాలకు మాత్రమే ఈ జోన్లను వాడుకోవాలని సిఫారసు చేసింది. కానీ అప్పట్లో కేరళలో అధికారంలో ఉన్న యూడీఎఫ్ ప్రభుత్వం గాడ్గిల్ కమిటీ చేసిన సిఫారసుల్ని పెడచెవినపెట్టింది. యథేచ్ఛగా తవ్వకాలు.. ఈ సీజన్లో కేరళలో అత్యధికమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం కొండచరియలు విరిగిపడటమే. ఇడుక్కి, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్, కొజికోడ్, మలాపురం వంటి జిల్లాల్లో కొండచరియలు తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికంగా నివాసం ఉండే వారి సహకారంతో కొండ ప్రాంతాలను ఎలా కాపాడుకోవచ్చో గాడ్గిల్ కమిటీ వివరించింది. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా, కొండ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టింది. కేరళ వ్యాప్తంగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న యూనిట్లు 1500కి పైగానే ఉన్నాయి. ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కొండల్లో తవ్వకాలు జరపడం వల్ల నేల అడుగు భాగంలో మట్టి కదిలిపోయి డొల్లగా మారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొండ ప్రాంతాల్లో తవ్వకాలపై నిషేధం విధించాలంటూ 2011లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ ఈ విపత్తు మానవ తప్పిదమేనని అంటున్నారు. కొండలపై ఆకాశహర్మ్యాలు: పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న సాకుతో కేరళ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా రిసార్టులు, రెస్టారెంట్ల నిర్మాణానికి ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అటవీ భూముల్ని ఆక్రమించి చెట్లను నరికేసి ఎడాపెడా భవంతులు నిర్మించారు. వాటర్ జోన్లలో కూడా చట్టవిరుద్ధంగా ఆకాశహర్మ్యాలు వెలిశాయి. దీంతో కొండప్రాంతాలు నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. పై నుంచి వస్తున్న ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం అసాధ్యమైంది. అదే ఇప్పుడు కేరళకు వరద ముప్పును తెచ్చిపెట్టింది. రిజర్వాయర్లలో నీటి మట్టం పెరిగిపోయి గేట్లను ఎత్తేయడం ఒక్కటే ఇప్పటి పరిస్థితికి కారణం కాదని, ప్రభుత్వం పర్యావరణ వ్యతిరేక విధానాలను అనుసరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ స్టడీస్ మాజీ శాస్త్రవేత్త వి. థామస్ అన్నారు. కేరళలో 44 నదులు ప్రవహిస్తున్నాయి. నదీ గర్భాన్ని తవ్వుతూ తీరాల వెంట గృహ నిర్మాణాలు చేపట్టడంతో జనవాసాలను వరద నీరు ముంచెత్తింది. 1924 తర్వాత ఈ స్థాయిలో వానలు కురవడం ఇదే ప్రథమం కేవలం రెండున్నర నెలల్లోనే 37% అధిక వర్షపాతం నమోదు ఇడుక్కిజిల్లాలో 83.5% అధిక వర్షపాతం 27 డ్యామ్‌ల గేట్లను ఎత్తేశారు 211 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయ్ మృతుల సంఖ్య 180 పై మాటే 20 వేల ఇళ్లు ధ్వంసం 10 వేల కిలోమీటర్ల రహదారులు నాశనం రూ.8,316 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వరదముప్పులో ఉన్న జిల్లాలు ః 13 రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు ః 9 ఆగస్టు 26 వరకు కొచ్చి విమానాశ్రయం మూసివేత ఆసియాలో అతి పెద్ద డ్యామ్ ఇడుక్కి నుంచి గత మూడు నాలుగు రోజులుగా సెకండ్‌కి 10–15 లక్షల లీటర్ల నీరు విడుదల సహాయ చర్యల్లో నిమగ్నమైన 18 బృందాలు, మరో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం ఓనం పండుగ కోసం కేటాయించిన 30 కోట్ల రూపాయల నిధులు వరద సహాయానికి మళ్లింపు -
మాంత్రికుల సలహాలతో కోటలో తవ్వకాలు.!
సాక్షి, కర్నూలు: జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో నిధుల కోసం గత కొన్ని నెలలుగా అధికారుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఏమి లేదని తెలిసి అధికారులు తవ్వకాలు నిలిపివేశారు. అయితే తాజాగా మళ్లీ కోటలో నిధి వేటగాళ్లు తవ్వకాలు ప్రారంభించారు. నిధి వేటగాళ్లు క్షుద్ర మాంత్రికుల సలహాలతో కోటలో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు తవ్వకాల్లో ఏనుగు దంతాలు, మూడు తలల నాగుపడగ, కొన్ని జంతు కలేబరాల అవశేషాలు మాత్రమే బయటపడటం విశేషం. అదేవిధంగా సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమయ్యాయి. రాయుల కాలం నాటి చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో తవ్వకాలకు అనుమతినిచ్చింది. దీంతో పురావస్తు, మైనింగ్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున తవ్వకాలు జరిగాయి. వజ్ర వైఢ్యూర్యాలు, బంగారాన్ని ఈ కోట లోపల దాచి, దానిపై సీసం పోశారని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ భారీ వర్షాలు కురిసిన సమయంలో వజ్రాల కోసం వేట సాగిచండం, కొంత మందికి వజ్రాలు దొరికియాని వార్తలు రావడం తెలిసిందే. అనేకసార్లు ఇక్కడ అక్రమ తవ్వకాలు కూడా జరిగాయి. -
'పెద్దబొంకూరు'పై గద్దల కన్ను
సాక్షి, హైదరాబాద్: శాతవాహనుల కాలం నాటి చారిత్రక ప్రదేశంపై నేతల కన్ను పడింది. పురావస్తు శాఖ దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అతికష్టం మీద సేకరించిన భూమిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలంటూ ఒత్తిడి ప్రారంభించారు. ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టే వంకతో భూమిని సొంతం చేసుకునే ప్లాన్ వేశారు. అందులో క్రీడా మైదానం, దాని ఆసరాగా వాణిజ్య సముదాయం నిర్మించాలని ఆ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిని ఆనుకుని ఈ భూమి ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎలాగైనా తమకు అనుకూలంగా మలచుకు నేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక పెద్దబొంకూరులో జరుగుతున్న వ్యవహారమిది. చారిత్రక ప్రాధాన్యం పెద్దబొంకూరుకు చారిత్రకంగా చాలా ప్రాధాన్యముందని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించింది. దీనికి పది కిలోమీటర్ల దూరంలో ధూళికట్టలో బౌద్ధ స్తూపం ఉంది. దక్షిణ భారత దేశంలో లభించిన బౌద్ధ ప్రాంతాల్లో ఇది అత్యంత కీలకమైంది. శాతవాహనులు ప్రత్యేక శ్రద్ధతో బౌద్ధ స్తూపాలు, ఇతర నిర్మాణాలు కట్టించారు. దానికి అనుబంధంగానే పెద్దబొంకూరును తీర్చి దిద్దారు. పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ చారిత్రక అవశేషాలున్నట్టు గుర్తించి ఐదు దఫాల్లో తవ్వకాలు జరిపారు. అందులో ఏకంగా ఐదు వేల వరకు నాణేలు లభించాయి. కొన్ని రోమన్ బంగారు నాణేలు కూడా దొరకటంతో ఇది వాణిజ్య కేంద్రమన్న ఉద్దేశంతో తవ్వకాలు కొనసాగించారు. విశాలంగా ఉన్న హాళ్లు, ఇతర గదుల అవశేషాలు, 22 బావులు ఉన్నట్టు తేలింది. ఇది నాణేల ముద్రణ జరిగే కేంద్రంగా వాడుకుని ఉంటారని భావించారు. అయితే తర్వాత తవ్వకాలు నిలిచిపోయాయి. ఆ 40 ఎకరాలు భవిష్యత్తులో పెద్దబొంకూరు ప్రాంతంలో విస్తృతంగా తవ్వకాలు జరపాలన్న ఉద్దేశంతో అప్పట్లోనే 68 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. నెల రోజుల క్రితం అక్కడ మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. కానీ ఇంతలోనే ఆ భూమిపై నేతల కన్ను పడింది. ఇప్పటి వరకు జరిగిన అన్వేషణను చాలించి మిగతా ఖాళీ భూమిని అప్పగిస్తే ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టేందుకు వీలు కలుగుతుందంటూ ఒత్తిడి తెస్తున్నారు. గతంలో 25 ఎకరాల్లో తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు మూడెకరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నందున అంతవరకు భూమి అట్టిపెట్టుకుని మిగతా 40 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్ చేయాలన్న ఒత్తిడి ప్రారంభించారు. జాతీయ రహదారిపై ఉన్న భూమి కావడంతో అక్కడ స్టేడియం.. దానికి అనుబంధంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మింపచేస్తే తమకు గిట్టుబాటు అవుతుందన్న ఆలోచనలో వారున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని కొందరు ఉన్నతస్థాయి నేతలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ప్రస్తుతం సచివాలయం స్థాయిలో ఆ మేరకు వ్యవహారం సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికారులు పూర్తిస్థాయి తవ్వకాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో చిన్నచిన్న ట్రెంచ్‌లు తవ్వి నిర్మాణాల ఆనవాళ్లు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఆ ట్రెంచుల్లో కూడా నాటి పూసలు, ఇతర అవశేషాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. అయితే ట్రెంచుల్లో పెద్దగా అవశేషాల జాడ లేనందున మిగతా భూముల్లో తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం పురావస్తు శాఖ నుంచి వ్యక్తమయ్యేలా నేతలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. సైట్ మ్యూజియం నిర్మించాల్సిన స్థలం సమీపంలోనే ఉన్న ధూళికట్ట వద్ద తవ్వకాలు జరిపినప్పుడు చారిత్రకంగా ఎంతో విలువైన శాతవాహనుల ఆధారాలు లభించాయి. వాటిని సందర్శకులు తిలకించే అవకాశమే లేకుండా పోయింది. ఆ ఆధారాలన్నీ పురావస్తు శాఖ స్టోర్ రూమ్‌లో మగ్గిపోతున్నాయి. ధూళికట్ట ప్రధాన రహదారికి దూరంగా ఉన్నందున, అక్కడి ఆధారాలు, పెద్దబొంకూరు తవ్వకాల్లో లభించిన ఆధారాలను.. జాతీయ రహదారిపై ఉన్న పెద్దబొంకూరు వద్ద సైట్ మ్యూజియం నిర్మించి ప్రదర్శనకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన పురావస్తు శాఖ వద్ద పెండింగులోనే ఉండిపోయింది. తవ్వకాలు కొనసాగుతున్న ప్రాంతం