గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న చెన్నంపల్లి కోట ఇదే
చెన్నంపల్లి కోట.. ఇప్పుడు అందరి నోటా నానుతున్న మాట. ఇక్కడ కొనసాగు తున్న తవ్వకాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ అధికారులే నిధుల కోసం వేట సాగించడం చర్చ నీయాంశమైంది. ఇక్కడికి ఎవరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు కనిపించకపోవడం.. అధికారులు ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీకి చెందిన కీలక నేత ఆదేశాల మేరకు నిధిని కొల్లగొట్టడానికి తవ్వకాలుజరుపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కర్నూలు, తుగ్గలి : కొన్నేళ్లుగా చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అధికారులే ఏకంగా రంగంలోకి దిగి పోలీసు బందోబస్తు మధ్య ఈనెల 13 నుంచి కోటపై తవ్వకాల పనులు చేపట్టారు. ఏజెన్సీ ద్వారా తవ్వకాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా దాని పేరు ఏమిటో ఇంత వరకు బయటపెట్టకపోవడం గమనార్హం. దీంతో ఇక్కడి ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా అనుమతులు లేకున్నా టీడీపీ ముఖ్య నేత ఆదేశాలతో నిధుల వేట మొదలు పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తవ్వకాల పనులు ముమ్మరం చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, పోలీసు అధికారుల సమక్షంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఐదో రోజు ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డోన్ డీఎస్పీ బాబా పకృద్దీన్ తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించారు. వీరే కాక పత్తికొండ, బనగానపల్లె, డోన్ సీఐలు విక్రమసింహ, శ్రీనివాసులు, శ్రీనివాస్, ఏడుగురు ఎస్‌ఐలు, మహిళా సీఐ ఆదిలక్ష్మి, 150 మంది దాకా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తవ్వకాలపై గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రకరకాలుగా ప్రచారం...
ఐదు రోజులుగా దాదాపు 20 మందికి పైగా కూలీలు రాళ్లను పగులగొట్టి పక్కకు తొలగిస్తున్నారు. నిధి ఉన్నట్లు చెబుతున్న ప్రాంతం ఇరుకుగా ఉండడంతో పనులు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. 607 సర్వే నంబరులో 102.54ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట ఉంది. దాదాపు 300 అడుగులకు పైగా ఎత్తులో ఉండడంతో యంత్రాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోతోంది. దీంతో ఎన్ని రోజులైనా కూలీలే తవ్వకాలు చేయాల్సి వస్తోంది. ఈ కోటలో విశేషంగా వజ్ర, వైఢూర్యాలు, బంగారం లాంటి సంపద ఉందని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. గతంలో అనంతపురానికి చెందిన ఓ స్వామీజీతో పాటు, పలు ముఠాల సభ్యులు అనేకమార్లు కోటపై అధునాతన పరికరాలతో పరీక్షించి విశేషంగా సంపద ఉందని గుర్తించారు.
చాలా సార్లు గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపారు. అయితే ప్రతిసారీ విషయం బయటకు పొక్కు తుండడంతో విఫలమవుతూ వచ్చింది. అయితే ఈ సారి ఏకంగా ప్రభుత్వ అనుమతులపై స్పష్టత ఇవ్వకుండా అధికారులే రంగంలోకి దిగడంతో చర్చనీయాంశమైంది. నిధులు లేనప్పుడు ఇంత భారీ స్థాయిలో ఎందుకు తవ్వకాలు చేపడుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. తవ్వకాల్లో అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల హస్తం లేకపోతే అధికారులు అనుమతులపై ఎవరికీ చెప్పకుండా ఇంత బహిరంగంగా తవ్వకాలు జరిపే ప్రసక్తే లేదని ప్రజలు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అనుమతులపై మాత్రం సమాధానం ఇవ్వడం లేదు.
అంతటా ఉత్కంఠ
కోటలో నిధి కోసం అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం తవ్వకాల్లో కొన్ని టెంకంలాంటి ముక్కలు, ఓ ఎముక బయటపడింది. ఇక నిధి వస్తుందేమోనని అందరూ ఆత్రుతతో ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. అయితే ప్రచారం జరుగుతున్నట్లు.. పక్కనే ఉన్న బండరాయికి వేసిన సీసం టెంకం స్పష్టంగా కనబడలేదు. పని చేసే చోట రాళ్లు, మట్టి వేగవంతంగా తొలగించేందుకు వీలుకావడం లేదు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో నిధి బయట పడుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment