CM orders
-
అనుమానాలెన్నో?
చెన్నంపల్లి కోట.. ఇప్పుడు అందరి నోటా నానుతున్న మాట. ఇక్కడ కొనసాగు తున్న తవ్వకాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ అధికారులే నిధుల కోసం వేట సాగించడం చర్చ నీయాంశమైంది. ఇక్కడికి ఎవరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు కనిపించకపోవడం.. అధికారులు ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీకి చెందిన కీలక నేత ఆదేశాల మేరకు నిధిని కొల్లగొట్టడానికి తవ్వకాలుజరుపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కర్నూలు, తుగ్గలి : కొన్నేళ్లుగా చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అధికారులే ఏకంగా రంగంలోకి దిగి పోలీసు బందోబస్తు మధ్య ఈనెల 13 నుంచి కోటపై తవ్వకాల పనులు చేపట్టారు. ఏజెన్సీ ద్వారా తవ్వకాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా దాని పేరు ఏమిటో ఇంత వరకు బయటపెట్టకపోవడం గమనార్హం. దీంతో ఇక్కడి ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా అనుమతులు లేకున్నా టీడీపీ ముఖ్య నేత ఆదేశాలతో నిధుల వేట మొదలు పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తవ్వకాల పనులు ముమ్మరం చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, పోలీసు అధికారుల సమక్షంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఐదో రోజు ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డోన్ డీఎస్పీ బాబా పకృద్దీన్ తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించారు. వీరే కాక పత్తికొండ, బనగానపల్లె, డోన్ సీఐలు విక్రమసింహ, శ్రీనివాసులు, శ్రీనివాస్, ఏడుగురు ఎస్ఐలు, మహిళా సీఐ ఆదిలక్ష్మి, 150 మంది దాకా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తవ్వకాలపై గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రకరకాలుగా ప్రచారం... ఐదు రోజులుగా దాదాపు 20 మందికి పైగా కూలీలు రాళ్లను పగులగొట్టి పక్కకు తొలగిస్తున్నారు. నిధి ఉన్నట్లు చెబుతున్న ప్రాంతం ఇరుకుగా ఉండడంతో పనులు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. 607 సర్వే నంబరులో 102.54ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట ఉంది. దాదాపు 300 అడుగులకు పైగా ఎత్తులో ఉండడంతో యంత్రాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోతోంది. దీంతో ఎన్ని రోజులైనా కూలీలే తవ్వకాలు చేయాల్సి వస్తోంది. ఈ కోటలో విశేషంగా వజ్ర, వైఢూర్యాలు, బంగారం లాంటి సంపద ఉందని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. గతంలో అనంతపురానికి చెందిన ఓ స్వామీజీతో పాటు, పలు ముఠాల సభ్యులు అనేకమార్లు కోటపై అధునాతన పరికరాలతో పరీక్షించి విశేషంగా సంపద ఉందని గుర్తించారు. చాలా సార్లు గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపారు. అయితే ప్రతిసారీ విషయం బయటకు పొక్కు తుండడంతో విఫలమవుతూ వచ్చింది. అయితే ఈ సారి ఏకంగా ప్రభుత్వ అనుమతులపై స్పష్టత ఇవ్వకుండా అధికారులే రంగంలోకి దిగడంతో చర్చనీయాంశమైంది. నిధులు లేనప్పుడు ఇంత భారీ స్థాయిలో ఎందుకు తవ్వకాలు చేపడుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. తవ్వకాల్లో అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల హస్తం లేకపోతే అధికారులు అనుమతులపై ఎవరికీ చెప్పకుండా ఇంత బహిరంగంగా తవ్వకాలు జరిపే ప్రసక్తే లేదని ప్రజలు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అనుమతులపై మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. అంతటా ఉత్కంఠ కోటలో నిధి కోసం అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం తవ్వకాల్లో కొన్ని టెంకంలాంటి ముక్కలు, ఓ ఎముక బయటపడింది. ఇక నిధి వస్తుందేమోనని అందరూ ఆత్రుతతో ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. అయితే ప్రచారం జరుగుతున్నట్లు.. పక్కనే ఉన్న బండరాయికి వేసిన సీసం టెంకం స్పష్టంగా కనబడలేదు. పని చేసే చోట రాళ్లు, మట్టి వేగవంతంగా తొలగించేందుకు వీలుకావడం లేదు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో నిధి బయట పడుతుందని భావిస్తున్నారు. -
ఆగని వేట, తవ్వకాల్లో పెద్దల హస్తం?
కర్నూలు, తుగ్గలి: తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట ఆగడం లేదు. నేరుగా అధికారులే రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లే అధికారులు పోలీసు బలగంతో వచ్చి.. గ్రామస్తుల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీ ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. బుధవారం తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తుల అనుమానాలను నివృత్తి చేస్తామంటూ అధికారులు గురువారం గ్రామసభ నిర్వహించారు. ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పత్తికొండ సీఐ విక్రమసింహ, తుగ్గలి, పత్తికొండ ఎస్ఐలు, భారీగా పోలీసులు వచ్చారు. ఈ సభ గందరగోళంగా మారింది. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ గ్రామసభలో ఆదోని ఆర్డీఓ ఓబులేసు మాట్లాడుతూ 607 సర్వే నంబరులో 102.54 ఎకరాలున్న చెన్నంపల్లి కోట విజయనగర రాజుల కాలం నాటిదని చెప్పారు. ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని కొన్నేళ్లుగా సాగుతున్న ప్రచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం తవ్వకాలు ప్రారంభినట్లు తెలిపారు. అయితే రాత్రి గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారని, వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామసభ ఏర్పాటు చేశామని వివరించారు. ట్రెజరీ చట్టం 2–88 ప్రకారం భూమిలో ఉన్న సంపద ప్రభుత్వానికి చెందుతుందన్నారు. కోటలో సంపద ఉందని, దాన్ని వెలికి తీస్తామని ఓ ఏజెన్సీ ప్రభుత్వ అనుమతులు కోసం సీఎం పేషీని కోరిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తవ్వకాలు జరుపుతున్నామే తప్ప..మీరు అనుమానిస్తున్నట్లు ఇది ఎవరి కోసమో కాదన్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, మైనింగ్ అధికారులు, గ్రామస్తులతో కమిటీ ఏర్పాటు చేసి.. వారి సమక్షంలో తవ్వకాలు జరుపుతామని చెప్పారు. దీన్నంతటినీ వీడియో తీస్తామన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తెలపాలని కోరడంతో సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ నబీరసూల్ గ్రామస్తుల తరఫున మాట్లాడారు. ప్రభుత్వ అనుమతులు ఉంటే గ్రామ ప్రజలకు, మీడియాకు చూపించకుండా దొంగ దారిలో తవ్వకాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆర్డర్ చూపాలని కోరితే అలాంటి రూల్ లేదని ఆర్డీఓ చెప్పడం సరైందికాదన్నారు. చట్టాలు తమకూ తెలుసని, ప్రజలెవరూ అమాయకంగా లేరని అన్నారు. భూమిలో ఉన్న సంపదను తీయాల్సి వస్తే చట్టం ప్రకారం ఆ సంపదలో చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల అభివృద్ధికి 33 శాతం కేటాయించాలన్నారు. కోటలో సంపద ఉంటే దాంట్లో కొంత పంచాయతీ అభివృద్ధికి కూడా కేటాయించేలా అధికారులు గ్రామసభ తీర్మానం ద్వారా కలెక్టర్‌కు పంపాలన్నారు. అలా కుదరదని ఆర్డీఓ చెప్పడంతో తవ్వకాలు కూడా జరపనిచ్చే ప్రసక్తే లేదని నబీరసూల్ తేల్చి చెప్పారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అధికారులతో వాదించారు. ప్రభుత్వ అనుమతులు చూపకుండా తవ్వకాలు ఎలా చేస్తారని నిలదీశారు. ఆర్డర్ చూపుతానని ఆర్డీఓ చెప్పగానే.. టీడీపీ నాయకులు జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, ఎంపీపీ వెంకటేశ్వర్లు, సర్పంచ్ రంగమ్మ తనయుడు వెంకటపతి, వారి అనుచరులు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ఇది తమ గ్రామ సమస్య అని, మీకేం సంబంధం అంటూ గందరగోళం సృష్టించారు. ఇదే అదనుగా అధికారులు గ్రామసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగైదు గంటల తర్వాత మళ్లీ కొంత మంది గ్రామస్తులతో కమిటీ వేసినట్లు చెబుతూ తవ్వకాలు కొనసాగించారు. అధికారులే తవ్వకాలకు పూనుకోవడంతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోట పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎంత మంది ఉన్నారో తెలియడం లేదని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. తవ్వకాలు జరిపే వారిలో కొందరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. కోట విశిష్టత.. చెన్నంపల్లి గ్రామం వెనుక ఉన్న కొండపై పురాతన కోట ఉంది. ఈ కోటలో ఇప్పటికీ చెక్కు చెదరని బురుజులు కనిపిస్తాయి. విజయనగర రాజులు, మౌర్యవంశీయులు, గుత్తి పాలకులకు ఈ కోటతో సంబంధం ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కొండపై గోడలు, ద్వారాలు, బురుజులు, కోనేర్లు, ఊరువాకిలి ఉన్నాయి. ప్రస్తుతం ఊరువాకిలి పూర్తిగా శిథిలావçస్థకు చేరుకుంది. ఈ కోట నుంచి గుత్తి కోటకు సొరంగ మార్గం ఉందని ప్రజలు చెబుతుంటారు. అంతేకాక కోట ప్రారంభంలో ఉన్న రాతి బండపై నిరంతరం నీళ్లు ఉండటం ఓ ప్రత్యేకత. కోటకు ఏడు కిలోమీటర్ల దూరంలోని జొన్నగిరి వద్ద అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి. ఇలాంటి పురాతనమైన చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. పదేళ్ల క్రితం అనంతపురం జిల్లాకు చెందిన ఓ స్వామీజీ ఈ కోటలో విశేషంగా బంగారం ఉందని, దాన్ని బయటకు తీసేందుకు సహకరిస్తే ప్రతి ఇంటికీ పిడికెడు బంగారం ఇవ్వొచ్చని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. స్వామీజీ సూచనను అనుసరించి కోటపై ఉన్న ఓ రాతి బండ వద్ద నిధి ఉందంటూ రాత్రి సమయాల్లో తరచూ తవ్వకాలు చేసేవారు. చివరకు అప్పటి కలెక్టర్, ఎస్పీలకు సమాచారం అందడంతో తవ్వకాలు జరిపిన చోట పోలీసులు పెద్దబండరాయి వేయించారు. అయినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎలాగైనా గుప్త నిధులు తీయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. మాట్లాడుతున్న బీవైరామయ్య, చిత్రంలో పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి దోచుకోవడమే చంద్రబాబు పని– వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య దొరికినంత దోచుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు పని అని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని తెలుసుకున్న వారు గురువారం చెన్నంపల్లికి వచ్చి అధికారులను నిలదీశారు. అనంతరం సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ నబీరసూల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాజుల కోటలో గుప్త నిధులున్నాయని, ఎవరికీ సమాధానం ఇవ్వకుండా అక్రమ తవ్వకాలు జరపడం అన్యాయమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచభూతాలను సైతం వదిలిపెట్టలేదన్నారు. మట్టి, నీరు ఇలా వేటినీ వదలడం లేదని విమర్శించారు. చెన్నంపల్లి కోటలో ప్రభుత్వ అనుమతులు చూపకుండా.. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అధికారులు తవ్వకాలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వ అనుమతులు ఉంటే వాటిని మీడియాకు, ప్రజలకు ఎందుకు చూపలేదని నిలదీశారు. అమాయక ప్రజలపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గుప్త నిధులు కొల్లగొట్టేందుకే టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ఈ పన్నాగం పన్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సొంత నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండానే అధికారులు తవ్వకాలు జరుపుతారా అని అన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మాదిరిగా గుప్త నిధులను తీయాలని సూచించారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో ఆలయంలోని నిధులను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇక్కడ కూడా అలాగే చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం వచ్చినా ఇలాంటి ఆటలు సాగనివ్వబోమని వారు హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ నాగేష్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గోపాలరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు హనుమంతు, ఎంపీటీసీ సభ్యులు రామాంజినేయులు, రంగనాథరెడ్డి, మధుయాదవ్ పాల్గొన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
-
అంతా ఆన్లైన్ చెలా‘మనీ’
విజయనగరం అర్బన్: నోట్ల కొరత నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందులను పోగొట్టుకోవడానికి నగదు రహిత లావాదేవీలే శరణ్యమని, దాన్ని ప్రతి ఒక్కరి చేతా అలవాటు చేయించాలన్న సీఎం ఆదేశాలు ఇక్కడి బ్యాంకర్లు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. జిల్లాలోని పలు బ్యాంక్‌ల్లో బుధవారం అరకొర నగదు ఉన్నప్పటికీ నగదు రహిత లావాదేవీలనే అందించడం కనిపించింది. ప్రధానంగా ఎస్బీఐ శాఖల్లోనే ఈ ఆదేశాలు అమలవుతున్నాయి. ఇప్పటికే రూపేకార్డు పొందిన ఖాతాదారుడు నగదు కోసం పట్టణంలోని ఒక జాతీయ బ్యాంక్‌కు వస్తే ఆయనకు నగదు లేదని చెప్పి, స్వైపింగ్ మెషీన్ ద్వారా లావాదేవీలను చేరుుంచారు. విత్‌డ్రా చేస్తున్న ఖాతాదారుని అవసరాన్ని తెలుసుకొని నగదు ఇవ్వాలని, ఆ మేరకు నోట్ల కొరతను తీర్చుకుంటూ నగదు రహిత లావాదేవీలను అలవాటు చేయించాలని తమకు ఆదేశాలొచ్చినట్టు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. రూపే కార్డులేని వారికి తక్షణమే మంజూరు చేస్తున్నామని తెలిపారు. బిజినెస్ కరస్పాండెంట్లు జిల్లాలో బ్యాంక్‌లు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో సమీప బ్యాంక్‌లు ఇప్పటికే బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసి వారి ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారుు. తాజా పరిస్థితులకు అనుగుణంగా వారికి ’రూపేకార్డుల వినియోగం, మొబైల్ బ్యాంక్, ఆన్లైన్ బ్యాంకింగ్...’ వంటి సేవలపై శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎస్బీఐకి దాదాపు 1,350 మంది బిజినెస్ కరస్పాండెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌పైనా విసృ్తతంగా ప్రచారం చేపడుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు ఇంకా రూ. 500ల నోట్లు రాలేదు. దీనివల్ల ఇక నగదు లావాదేవీలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. కొందరికే బ్యాంకు ఖాతాలు జిల్లాలో 14,53,543 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిలో తాజా లెక్కల మేరకు 83 శాతం ఖాతాదారులకే రూపే కార్డులున్నాయి. ఇవికాకుండా జన్‌ధన్ యోజనలో 5.69 లక్షల ఖాతాల్లో 3.84 లక్షల మందికి రూపేకార్డులు ఇచ్చారు. వీటితో లావాదేవీలకు విధిగా ఆధార్ సీడింగ్ ఉండాలి. ఇందులో అయితే 20వేల మంది జన్‌ధన్ ఖాతాదారులకు ఆధార్‌సీడింగ్ పూర్తికాలేదు. వీరిలో దాదాపు 80 శాతం మంది నిత్యవసరాల కోసమే నగదు విత్‌డ్రా చేస్తారు. ఈ నేపధ్యంలో బ్యాంకుల్లో నోట్లు ఇవ్వకపోడంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
సీఎంకు చేరిన ‘మార్కెట్’ జాబితాలు!
నాలుగైదు రోజుల్లో నియామక ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. దసరా వరకు కొన్ని పోస్టులనైనా భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని మార్కెట్ కమిటీల పాలకమండళ్ల నియామకాల కోసం చైర్మన్లు, డెరైక్టర్ల పేర్లతో జాబితాలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల జాబితాలు శుక్రవారం కేసీఆర్‌కు అందాయని సమాచారం. దీంతో మరో నాలుగైదు రోజుల్లో మార్కెట్ కమిటీల చైర్మన్లు, డెరైక్టర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల గుర్తింపునకు డిప్యూటీ సీఎం కడియం అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పాలకమండళ్లు ఏర్పాటైతే తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందో అన్న భావనతో పోస్టుల గుర్తింపు, వివరాలు సిద్ధంగా ఉంచడంలో ఆలస్యం చేశారని ఆయా శాఖల అధికారులను మందలించారని సమాచారం. మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థ పాలక మండళ్ల వివరాలు మాత్రమే స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. వీటి తయారీకి రెండు మూడురోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు
అధికారులకు సీఎం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. వెబ్ ఆధారితంగా బదిలీలు చేయాలని సీఎం సూచించారని, ఈ మేరకు త్వరలోనే విధివిధానాలు, షెడ్యూల్ విడుదలవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతిభ, పనితీరు, ఫలితాల ఆధారంగా బదిలీలు జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు నెల రోజుల్లో ల్యాప్‌టాప్‌లు అందించాలన్నారు. ఫలితాల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గ్రేడింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వాలని వెల్లడించారు. రాష్ట్రంలో వంద శాతం స్వచ్ఛ విద్యాలయాలు ప్రధానమంత్రి న రేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ విద్యాలయాల లక్ష్యాన్ని రాష్ట్రంలో వందశాతం పూర్తి చేశామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. షెడ్యూల్ విడుదల చేయాలి: ఎస్టీయూ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ను జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కత్తి నరసింహారెడ్డి, సుధీర్‌బాబు బుధవారం ఓ ప్రక టనలో ప్రభుత్వాన్ని కోరారు. -
ఉభయ తారక ‘మద్యం’
పల్లెల్లో అధికారిక బెల్ట్‌షాపులు! సాక్షి, హైదరాబాద్: పల్లెల్లో గుడుంబా విక్రయాలు, బెల్టుషాపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఉభయ తారక మంత్రం వేయబోతుంది. మండలంలో మద్యం దుకాణం పొందిన డీలర్‌కే గుడుంబా, బెల్టుషాపులు లేకుండా చేసే అధికారం కట్టబెట్టబోతోంది. అదే సమయంలో మద్యం దుకాణం (ఎ4) లెసైన్స్ పొందిన డీలర్ ఆ మండలంలో గుర్తించిన గ్రామాల్లో బి-లెసైన్స్ ద్వారా అధికారికంగా దుకాణాలు నడుపుకునే స్వేచ్ఛను ఇవ్వనుంది. మండలంలో 2014-15లో అమ్మకాలు, ఎక్సైజ్ శాఖకు చెల్లించిన రుసుముల ఆధారంగా లెసైన్సు ఫీజును నిర్ణయించి ఏడాది కాలానికి వ్యాపారాన్ని అప్పగించనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మద్యం విధానంపై కసరత్తు చేసిన ఆబ్కారీ శాఖ ఈ మేరకు ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్ శర్మకు అందజేశారు. ఆయన కమిషనర్‌తో కలిసి ముఖ్యమంత్రితో భేటీ అయి కొత్త విధానంలోని లోటుపాట్లను తెలియజేయగా, సీఎం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో బుధవారం కూడా సచివాలయం స్థాయిలో కమిషనర్ చర్చలు జరిపారు. గురువారం కమిషనర్ జిల్లాల వారీగా డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమావేశమై లెసైన్సు ఫీజులను నిర్ధారించనున్నట్లు సమాచారం. మండలంలో ఒక్కరే యజమాని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో లేని మండలాల్లో ప్రస్తుతం రెండు నుంచి ఐదు వరకు మద్యం దుకాణాలున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటికి లెసైన్సులు ఇచ్చారు. అయితే ఈసారి మద్యం విధానంలో మండలాన్ని యూనిట్‌గా నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఆ మండ లంలో మద్యం వ్యాపారమంతా ఒక వ్యక్తి చేతుల మీదుగానే సాగుతుంది. ఫీజును కూడా అదే స్థాయిలో నిర్ధారించనున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం 10వేల నుంచి 50వేల జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజుగా ఉంది. ఆ మండలంలో 4 మద్యం దుకాణాల వరకు లెసైన్సుల జారీకి అవకాశం ఉంది. 4 దుకాణాలకు లెసైన్సు రూ.1.36 కోట్లు అవుతుంది. ఇక లెసైన్సు ఫీజు కన్నా ఏడురెట్లు పైబడిన వసూళ్లతో మద్యం అమ్మితే చెల్లించిన ప్రివిలేజ్ ఫీజును కూడా ఈ లెసైన్సు ఫీజుకు జత చేస్తారు. ఈ లెక్కన గతంలో జరిగిన అమ్మకాల ఆధారంగా మండ లానికి రూ. 1.50 కోట్ల వరకు ఫీజు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంత మొత్తంలో చెల్లించే స్తోమత ఉన్నవారే డ్రాలో పాల్గొంటారు. మునిసిపాలిటీల్లో వార్డుల వారీగా.. ఇక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ‘గ్రూపు లెసైన్స్’ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వార్డుల్లో దుకాణాలు, వ్యాపారం ఆధారంగా ఒక వ్యక్తి లేదా గ్రూపుగా ముందుకొచ్చిన వారికి లెసైన్సు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక మద్యం విధానం తీసుకు రావాలని సీఎం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో దానిపైనా ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. గుడుంబా, బెల్టుషాపులు ఉండవిక! మండలంలో మద్యం వ్యాపారానికి సంబంధించి లెసైన్సు ఒకరికే ఇవ్వడంతో పాటు రూ.15 మద్యం కూడా అందుబాటులోకి తెస్తుండడంతో గుడుంబాను గ్రామాల్లో నుంచి తరిమికొట్టే బాధ్యత కూడా అదే వ్యాపారి తీసుకుంటాడని ప్రభుత్వం భావిస్తోంది. గుడుంబా, బెల్టుషాపుల ద్వారా అనధికారిక అమ్మకాలు సాగితే తన వ్యాపారానికి దెబ్బపడే అవకాశం ఉండటంతో వీటిని ఆ వ్యాపారే నిరోధిస్తాడని ప్రభుత్వ నమ్మకం. అలాగే గుడుంబా ఎక్కువగా విక్రయించే గ్రామంలో అధికారికంగానే బి-లెసైన్సు మద్యం దుకాణం తెరవడం వల్ల రూ.15 మద్యం అందుబాటులోకి వ స్తుందని, జనం నాటుసారా జోలికి పోరని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. -
పోలవరం పనులు సబ్ కాంట్రాక్టర్‌కు..!
తొలుత ‘రాక్‌ఫిల్ డ్యాం’ నిర్మాణం.. ♦ దశల వారీగా మిగతా పనులు ♦ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ♦ భారీగా అంచనా పెంపు.. సీఎం ఆదేశం! ♦ ముడుపుల కోసమేన్న సందేహాలు! సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ‘ట్రాన్స్ట్రాయ్’ నుంచి తీసుకొని సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పోలవరం నిర్మాణ పనులు చేస్తున్న ‘ట్రాన్స్ట్రాయ్’ వ్యవహారంపై బుధవారం రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ భేటీలో చర్చించారు. సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని, కాంట్రాక్టర్ ఎంపిక బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలనే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. సబ్ కాంట్రాక్టు వ్యవహారం అంతా సాఫీగా సాగాలని, ‘అవినీతి’ కనిపించని విధం గా ఉత్తర్వులను జాగ్రత్తగా రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించినట్లు తెలిసింది. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా చెప్పినట్లు అధికార వర్గాల సమాచారం. రాక్‌ఫిల్ డ్యాంతో మొదలు..:తొలుత రాక్‌ఫిల్ డ్యాంతో సబ్ కాంట్రాక్టు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ట్రాయ్, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ అంచనా వ్యయం రూ.700 కోట్లు. కాంట్రాక్టు దక్కించుకొని రెండేళ్లు కావస్తున్నా పనుల్లో పెద్దగా పురోగతి లేని విషయం విదితమే. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న రూ.250 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ మేరకూ పనులు జరగలేదు. ‘కాంట్రాక్టు కట్టబెట్టిన రెండేళ్ల తర్వాత.. ‘ట్రాన్స్ట్రాయ్’కి రాక్‌ఫిల్ డ్యాం నిర్మించిన అనుభవం లేదని ప్రభుత్వం గుర్తించింది. అనుభవం ఉన్న సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈమేరకు సబ్ కాంట్రాక్టు అప్పగిస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడతాయి’ అని పోలవరం పనులు పర్యవేక్షిస్తున్న సీనియర్ ఇంజనీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. చైనా కంపెనీకి భాగస్వామ్యం.. రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ పనులు అప్పగించడానికి వీలుగా సీఎం చైనా పర్యటనలో ఒక కంపెనీతో ‘అవగాహన’ కుదుర్చుకున్నారని సమాచారం. స్థానికంగా సీఎంకు ప్రీతిపాత్రమైన కంపెనీ, చైనా కంపెనీతో ‘జాయింట్ వెంచర్’ ఏర్పాటు చేయించడానికి తెర వెనక కసరత్తు పూర్తయిందని అధికార వర్గాలు తెలిపాయి. కాసులు దండుకోవడానికి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించే సమయంలోనే భారీగా పెంచితే విమర్శలు వస్తాయని, తొలుత కొంతమేర అంచనా వ్యయం పెంచి, దశలవారీగా పెంచుకుంటూ పోతే బాగుంటుందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతోందని తెలుస్తోంది. సబ్ కాంట్రాక్టు ఇవ్వనున్న కంపెనీలకు లాభం రావాలని, అదే మేర ప్రభుత్వ పెద్దలకూ అనుకున్నట్లుగా కాసులు రాలాలని, అందుకు అనుగుణంగానే ఉత్తర్వులు ఉంటాయని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారులంతా గురువారం రాజమండ్రిలోనే ఉన్నారని, శుక్రవారం నుంచి కసరత్తు ప్రారంభమవుతుందని, వచ్చే వారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఎన్నో సందేహాలు..: నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రాజెక్టు పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న నిర్ణయంతీసుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పనులను కేంద్రానికే అప్పగించాలి. అందుకు భిన్నంగా పనులను విభజించి సబ్ కాంట్రాక్టర్‌ను తెరమీదకు తేవడంలో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుతున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
‘పాలమూరు’ భూములకు వంద కోట్లు!
* ఎకరాకు రూ.3 లక్షల చొప్పున మార్కెట్ రేటు చెల్లింపునకు సర్కారు సిద్ధం * సీఎం ఆదేశాలతో కదిలిన ప్రభుత్వం * ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాల ఖరారు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భూముల కొనుగోళ్లకే తొలి ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా భూకొనుగోళ్ల పథకం మార్గదర్శకాలు ఖరారు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు కసరత్తు ఆరంభించారు. గతంలో మాదిరి భూసేకరణ కాకుండా ఏకంగా భూముల యజమానుల నుంచి మార్కెట్ ధరకే భూములు కొనుగోలు చేయాలని ఇదివరకే నిర్ణయించిన ప్రభుత్వం... ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలను ఖరారు చేసి తొలి విడత భూముల కొనుగోళ్లకు రూ.100 కోట్లు కేటాయించేలా చర్యలు చేపట్టింది. భూముల కొనుగోళ్ల కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ మార్గదర్శకాల ఉత్తర్వులు ఖరారైన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించనుంది. శ్రీశైలంలో వరద ఉండే రోజుల్లో 70 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టు కింద మూడు జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ ప్రాజెక్టు చేపడితే ఏడు గ్రామాలు, 25,292 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇందులో కర్వేని, వట్టెం రిజర్వాయర్ల కిందే ఎక్కువగా 10 వేల ఎకరాల ముంపు ఉండనుండగా మిగతా రిజర్వాయర్ల కింద 3 వేల ఎకరాల వరకు ముంపు ఉండనుంది. ఇక లోకిరేవు రిజర్వాయర్ కింద నాలుగు గ్రామాలు, కేపీ లక్ష్మీదేవునిపల్లి కింద మరో మూడు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రాజెక్టును నిర్ణీత నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు వీలుగా భూసేకరణ, సహాయ పునరవాసానికే తొలి ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఇది వరకే నిర్ణయించారు. ప్రాజెక్టుల కింద భూ సేకరణ, పరిహార చెల్లింపులు వేగంగా జరిపేందుకు ప్రాజెక్టులవారీగా ప్రత్యేక అథారిటీలు ఏర్పాటు చేసి వీటి ద్వారానే చెల్లింపులు వేగంగా జరిపేలా చూడాలని ఆదేశించారు. అయితే నెలలు గడుస్తున్నా ఆదేశాలు అమలు కాకపోవడంపై సీఎం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా భూముల కొనుగోళ్ల పథకానికి తుదిరూపమిచ్చి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తొలి విడతగా నార్లాపూర్ కింద ఉన్న ముంపునకు గురయ్యే భూముల కొనుగోలుకు రూ.100 కోట్లు కావాలని నీటిపారుదలశాఖ ఆర్థికశాఖను కోరినట్లు తెలిసింది. మిగతా భూసేకరణను సైతం ఆగస్టులోగా పూర్తి చేసి అదే నెల రెండో వారం నుంచి టెండర్ల ప్రక్రియపై ముందుకెళ్లాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
అ‘భద్రత’ !
సాక్షి, ఖమ్మం: జనవరి చివరిలోగా నూతన ‘ఆహార భద్రత’ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించినా జిల్లాలో కార్యరూపం దాల్చలేదు. సీఎం ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. గతంలో జిల్లాలో మొత్తం 6,60,495 కార్డులు ఉండగా, ఇందులో 6,08,187 తెల్లకార్డులు, 51,163 కార్డులు అంత్యోదయ అన్నయోజన, 1,145 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ఆహార భద్రత పథకం కింద ప్రస్తుతం 7,29,720 కార్డుల జారీకి అర్హులను గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో 43,838 అంత్యోదయ అన్నయోజన కార్డులున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూపన్ల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్నారు. అయితే గతం కన్నా 69,225 కార్డులు పెరిగినట్లు అధికారులు చూపుతున్నా అనర్హుల పేరుతో వేలాది మంది అర్హులకు కోత పెట్టారు. ప్రధానంగా గతంలో అన్నపూర్ణ పథకం కింద 1,145 కార్డులుంటే వీరికి సరుకుల పంపిణీ నిలిపివేశారు. సాధారణ పంపిణీలో వీరిని కూడా అర్హులుగా చూపుతుండడం గమనార్హం. అలాగే అంత్యోదయ అర్హులను గతంతో పోల్చి తే ప్రస్తుతం 7,425 మందిని తొలగించారు. నిబంధనల పేరుతో లబ్ధిదారులకు సరుకుల పంపిణీ నిలిపివేయడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఆదాయ, భూ పరిమితి పెంచినా లబ్ధిదారుల సంఖ్య మాత్రం ఎక్కువగా పెరగలేదు. పింఛన్ల మాదిరిగానే ఆహార భద్రత కార్డుల సర్వే కూడా తప్పుల తడకగా సాగిందని లబ్ధిదారులు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. గతంలో రేషన్ అందేదని, ఇప్పుడు అసలు మూడు నెలలుగా కూపన్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అరుుతే వారికి సమాధానం చెప్పేవారేలేరు. సరుకులకు కోత.. ఈ నెలలో ఉగాదితో పాటు శ్రీరామ నవమి పండుగలు వస్తున్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కింద బియ్యం, కిరోసిన్, చక్కెర, చింతపండు, గోధుమలు, పామోలిన్ పంపిణీ చేయాలి. ప్రతి కార్డు లబ్ధిదారునికి కేజీ వరకు పామోలిన్ ఇవ్వాలి. కానీ జనవరి నుంచి జిల్లాలో పామోలిన్ పంపిణీ నిలిచిపోయింది. అధికారులేమో ప్రభుత్వం నుంచి సరఫరా రావడం లేదని చేతులు దులిపేసుకుంటున్నారు. ఇక చింతపండు, కారం నాణ్యత లేకపోవడంతో లబ్ధిదారులు తీసుకోవడం లేదు. బహిరంగ మార్కెట్లో పామోలిన్, కారం, చింతపండు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం నుంచి పామోలిన్ సరఫరా లేక పోగా, సరఫరా అవుతున్న సరుకులు నాణ్యతగా లేకపోవడంతో లబ్ధిదారుల బాధ వర్ణనాతీతం. ఇదిలా ఉంటే కార్డుల పంపిణీ లేకపోవడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఆహార భద్రత కార్డుల పరిశీలనతో సంబంధం లేకుండా రేషన్ సరఫరా చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇలానే పింఛన్ దరఖాస్తుల సమయంలోనూ అధికారులు మాటలు చెప్పారని, ఆతర్వాత రెండు నెలలుగా పింఛన్ నిలిపివేశారని, ఇప్పుడు రేషన్ బియ్యం ఇలాగే పంపిణీ చేయరేమోనని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం అయినా కార్డులు పంపిణీ చేస్తారా..? అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా అనర్హతకు గురైన కొంతమంది లబ్ధిదారులకు కార్డులు ఇప్పిస్తామంటూ దళారులు జిల్లాలో దందా కొనసాగిస్తున్నారు. తమకు మండల స్థాయి అధికారులు పరిచయమంటూ రూ.2 వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తూ దరఖాస్తులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. గతంలోనూ ఇలా ఆరోపణలు రావడంతో జిల్లా స్థాయి అధికారులు తీవ్రంగా హెచ్చరించినా పరిస్థితి మారలేదు. ఇప్పటి వరకు కూపన్లు అందని వారు ఈ రకంగా దళారులను నమ్మిమోసపోతున్నారు.