చెన్నంపల్లి కోటపై బ్లాస్టింగ్ చేసిన ప్రాంతంలో అధికారులు
కర్నూలు, తుగ్గలి: తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట ఆగడం లేదు. నేరుగా అధికారులే రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లే అధికారులు పోలీసు బలగంతో వచ్చి.. గ్రామస్తుల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీ ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. బుధవారం తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తుల అనుమానాలను నివృత్తి చేస్తామంటూ అధికారులు గురువారం గ్రామసభ నిర్వహించారు. ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పత్తికొండ సీఐ విక్రమసింహ, తుగ్గలి, పత్తికొండ ఎస్‌ఐలు, భారీగా పోలీసులు వచ్చారు. ఈ సభ గందరగోళంగా మారింది. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ గ్రామసభలో ఆదోని ఆర్డీఓ ఓబులేసు మాట్లాడుతూ 607 సర్వే నంబరులో 102.54 ఎకరాలున్న చెన్నంపల్లి కోట విజయనగర రాజుల కాలం నాటిదని చెప్పారు.
ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని కొన్నేళ్లుగా సాగుతున్న ప్రచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం తవ్వకాలు ప్రారంభినట్లు తెలిపారు. అయితే రాత్రి గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారని, వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామసభ ఏర్పాటు చేశామని వివరించారు. ట్రెజరీ చట్టం 2–88 ప్రకారం భూమిలో ఉన్న సంపద ప్రభుత్వానికి చెందుతుందన్నారు. కోటలో సంపద ఉందని, దాన్ని వెలికి తీస్తామని ఓ ఏజెన్సీ ప్రభుత్వ అనుమతులు కోసం సీఎం పేషీని కోరిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తవ్వకాలు జరుపుతున్నామే తప్ప..మీరు అనుమానిస్తున్నట్లు ఇది ఎవరి కోసమో కాదన్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, మైనింగ్ అధికారులు, గ్రామస్తులతో కమిటీ ఏర్పాటు చేసి.. వారి సమక్షంలో తవ్వకాలు జరుపుతామని చెప్పారు. దీన్నంతటినీ వీడియో తీస్తామన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తెలపాలని కోరడంతో సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నబీరసూల్ గ్రామస్తుల తరఫున మాట్లాడారు. ప్రభుత్వ అనుమతులు ఉంటే గ్రామ ప్రజలకు, మీడియాకు చూపించకుండా దొంగ దారిలో తవ్వకాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఆర్డర్ చూపాలని కోరితే అలాంటి రూల్ లేదని ఆర్డీఓ చెప్పడం సరైందికాదన్నారు. చట్టాలు తమకూ తెలుసని, ప్రజలెవరూ అమాయకంగా లేరని అన్నారు. భూమిలో ఉన్న సంపదను తీయాల్సి వస్తే చట్టం ప్రకారం ఆ సంపదలో చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల అభివృద్ధికి 33 శాతం కేటాయించాలన్నారు. కోటలో సంపద ఉంటే దాంట్లో కొంత పంచాయతీ అభివృద్ధికి కూడా కేటాయించేలా అధికారులు గ్రామసభ తీర్మానం ద్వారా కలెక్టర్‌కు పంపాలన్నారు. అలా కుదరదని ఆర్డీఓ చెప్పడంతో తవ్వకాలు కూడా జరపనిచ్చే ప్రసక్తే లేదని నబీరసూల్ తేల్చి చెప్పారు. ఇదే విషయమై వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అధికారులతో వాదించారు. ప్రభుత్వ అనుమతులు చూపకుండా తవ్వకాలు ఎలా చేస్తారని నిలదీశారు.
ఆర్డర్ చూపుతానని ఆర్డీఓ చెప్పగానే.. టీడీపీ నాయకులు జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, ఎంపీపీ వెంకటేశ్వర్లు, సర్పంచ్ రంగమ్మ తనయుడు వెంకటపతి, వారి అనుచరులు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ఇది తమ గ్రామ సమస్య అని, మీకేం సంబంధం అంటూ గందరగోళం సృష్టించారు. ఇదే అదనుగా అధికారులు గ్రామసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగైదు గంటల తర్వాత మళ్లీ కొంత మంది గ్రామస్తులతో కమిటీ వేసినట్లు చెబుతూ తవ్వకాలు కొనసాగించారు. అధికారులే తవ్వకాలకు పూనుకోవడంతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోట పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎంత మంది ఉన్నారో తెలియడం లేదని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. తవ్వకాలు జరిపే వారిలో కొందరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం.
కోట విశిష్టత..
చెన్నంపల్లి గ్రామం వెనుక ఉన్న కొండపై పురాతన కోట ఉంది. ఈ కోటలో ఇప్పటికీ చెక్కు చెదరని బురుజులు కనిపిస్తాయి. విజయనగర రాజులు, మౌర్యవంశీయులు, గుత్తి పాలకులకు ఈ కోటతో సంబంధం ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కొండపై గోడలు, ద్వారాలు, బురుజులు, కోనేర్లు, ఊరువాకిలి ఉన్నాయి. ప్రస్తుతం ఊరువాకిలి పూర్తిగా శిథిలావçస్థకు చేరుకుంది. ఈ కోట నుంచి గుత్తి కోటకు సొరంగ మార్గం ఉందని ప్రజలు చెబుతుంటారు. అంతేకాక కోట ప్రారంభంలో ఉన్న రాతి బండపై నిరంతరం నీళ్లు ఉండటం ఓ ప్రత్యేకత. కోటకు ఏడు కిలోమీటర్ల దూరంలోని జొన్నగిరి వద్ద అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి.
ఇలాంటి పురాతనమైన చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. పదేళ్ల క్రితం అనంతపురం జిల్లాకు చెందిన ఓ స్వామీజీ ఈ కోటలో విశేషంగా బంగారం ఉందని, దాన్ని బయటకు తీసేందుకు సహకరిస్తే ప్రతి ఇంటికీ పిడికెడు బంగారం ఇవ్వొచ్చని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. స్వామీజీ సూచనను అనుసరించి కోటపై ఉన్న ఓ రాతి బండ వద్ద నిధి ఉందంటూ రాత్రి సమయాల్లో తరచూ తవ్వకాలు చేసేవారు. చివరకు అప్పటి కలెక్టర్, ఎస్పీలకు సమాచారం అందడంతో తవ్వకాలు జరిపిన చోట పోలీసులు పెద్దబండరాయి వేయించారు. అయినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎలాగైనా గుప్త నిధులు తీయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు.
మాట్లాడుతున్న బీవైరామయ్య, చిత్రంలో పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి
దోచుకోవడమే చంద్రబాబు పని– వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య
దొరికినంత దోచుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు పని అని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని తెలుసుకున్న వారు గురువారం చెన్నంపల్లికి వచ్చి అధికారులను నిలదీశారు. అనంతరం సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నబీరసూల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాజుల కోటలో గుప్త నిధులున్నాయని, ఎవరికీ సమాధానం ఇవ్వకుండా అక్రమ తవ్వకాలు జరపడం అన్యాయమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచభూతాలను సైతం వదిలిపెట్టలేదన్నారు. మట్టి, నీరు ఇలా వేటినీ వదలడం లేదని విమర్శించారు. చెన్నంపల్లి కోటలో ప్రభుత్వ అనుమతులు చూపకుండా.. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అధికారులు తవ్వకాలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వ అనుమతులు ఉంటే వాటిని మీడియాకు, ప్రజలకు ఎందుకు చూపలేదని నిలదీశారు. అమాయక ప్రజలపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
గుప్త నిధులు కొల్లగొట్టేందుకే టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ఈ పన్నాగం పన్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సొంత నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండానే అధికారులు తవ్వకాలు జరుపుతారా అని అన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మాదిరిగా గుప్త నిధులను తీయాలని సూచించారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో ఆలయంలోని నిధులను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇక్కడ కూడా అలాగే చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం వచ్చినా ఇలాంటి ఆటలు సాగనివ్వబోమని వారు హెచ్చరించారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ నాగేష్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గోపాలరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు హనుమంతు, ఎంపీటీసీ సభ్యులు రామాంజినేయులు, రంగనాథరెడ్డి, మధుయాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment