నాలుగైదు రోజుల్లో నియామక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. దసరా వరకు కొన్ని పోస్టులనైనా భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని మార్కెట్ కమిటీల పాలకమండళ్ల నియామకాల కోసం చైర్మన్లు, డెరైక్టర్ల పేర్లతో జాబితాలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల జాబితాలు శుక్రవారం కేసీఆర్‌కు అందాయని సమాచారం. దీంతో మరో నాలుగైదు రోజుల్లో మార్కెట్ కమిటీల చైర్మన్లు, డెరైక్టర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల గుర్తింపునకు డిప్యూటీ సీఎం కడియం అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పాలకమండళ్లు ఏర్పాటైతే తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందో అన్న భావనతో పోస్టుల గుర్తింపు, వివరాలు సిద్ధంగా ఉంచడంలో ఆలస్యం చేశారని ఆయా శాఖల అధికారులను మందలించారని సమాచారం. మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థ పాలక మండళ్ల వివరాలు మాత్రమే స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. వీటి తయారీకి రెండు మూడురోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
సీఎంకు చేరిన ‘మార్కెట్’ జాబితాలు!
Published Sat, Oct 17 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM
Advertisement