పోలవరం పనులు సబ్ కాంట్రాక్టర్‌కు..! | Polavaram works to Sub-contractor ..! | Sakshi
Sakshi News home page

పోలవరం పనులు సబ్ కాంట్రాక్టర్‌కు..!

Published Fri, Jul 24 2015 1:35 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

పోలవరం పనులు సబ్ కాంట్రాక్టర్‌కు..! - Sakshi

పోలవరం పనులు సబ్ కాంట్రాక్టర్‌కు..!

తొలుత ‘రాక్‌ఫిల్ డ్యాం’ నిర్మాణం..
దశల వారీగా మిగతా పనులు
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
భారీగా అంచనా పెంపు.. సీఎం ఆదేశం!
ముడుపుల కోసమేన్న సందేహాలు!

సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ‘ట్రాన్స్‌ట్రాయ్’ నుంచి తీసుకొని సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

పోలవరం నిర్మాణ పనులు చేస్తున్న ‘ట్రాన్స్‌ట్రాయ్’ వ్యవహారంపై బుధవారం రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ భేటీలో చర్చించారు. సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని, కాంట్రాక్టర్ ఎంపిక బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలనే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. సబ్ కాంట్రాక్టు వ్యవహారం అంతా సాఫీగా సాగాలని, ‘అవినీతి’ కనిపించని విధం గా ఉత్తర్వులను జాగ్రత్తగా రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించినట్లు తెలిసింది. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా చెప్పినట్లు అధికార వర్గాల సమాచారం.
 
రాక్‌ఫిల్ డ్యాంతో మొదలు..:తొలుత రాక్‌ఫిల్ డ్యాంతో సబ్ కాంట్రాక్టు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌ట్రాయ్, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ అంచనా వ్యయం రూ.700 కోట్లు. కాంట్రాక్టు దక్కించుకొని రెండేళ్లు కావస్తున్నా పనుల్లో పెద్దగా పురోగతి లేని విషయం విదితమే. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న రూ.250 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ మేరకూ పనులు జరగలేదు. ‘కాంట్రాక్టు కట్టబెట్టిన రెండేళ్ల తర్వాత.. ‘ట్రాన్స్‌ట్రాయ్’కి రాక్‌ఫిల్ డ్యాం నిర్మించిన అనుభవం లేదని ప్రభుత్వం గుర్తించింది. అనుభవం ఉన్న సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈమేరకు సబ్ కాంట్రాక్టు అప్పగిస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడతాయి’ అని పోలవరం పనులు పర్యవేక్షిస్తున్న సీనియర్ ఇంజనీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
 
చైనా కంపెనీకి భాగస్వామ్యం..
రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ పనులు అప్పగించడానికి వీలుగా సీఎం చైనా పర్యటనలో ఒక కంపెనీతో ‘అవగాహన’ కుదుర్చుకున్నారని సమాచారం. స్థానికంగా సీఎంకు ప్రీతిపాత్రమైన కంపెనీ, చైనా కంపెనీతో ‘జాయింట్ వెంచర్’ ఏర్పాటు చేయించడానికి తెర వెనక కసరత్తు పూర్తయిందని  అధికార వర్గాలు తెలిపాయి.
 
కాసులు దండుకోవడానికి..
అంచనా వ్యయాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించే సమయంలోనే భారీగా పెంచితే విమర్శలు వస్తాయని, తొలుత కొంతమేర అంచనా వ్యయం పెంచి, దశలవారీగా పెంచుకుంటూ పోతే బాగుంటుందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతోందని తెలుస్తోంది. సబ్ కాంట్రాక్టు ఇవ్వనున్న కంపెనీలకు లాభం రావాలని, అదే మేర ప్రభుత్వ పెద్దలకూ అనుకున్నట్లుగా కాసులు రాలాలని, అందుకు అనుగుణంగానే ఉత్తర్వులు ఉంటాయని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారులంతా గురువారం రాజమండ్రిలోనే ఉన్నారని, శుక్రవారం నుంచి కసరత్తు ప్రారంభమవుతుందని, వచ్చే వారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.
 
ఎన్నో సందేహాలు..: నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి   ఇప్పుడు ప్రాజెక్టు పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న నిర్ణయంతీసుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పనులను కేంద్రానికే అప్పగించాలి. అందుకు భిన్నంగా పనులను విభజించి సబ్ కాంట్రాక్టర్‌ను తెరమీదకు తేవడంలో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుతున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement