ministerial meeting
-
డబ్ల్యూటీవో అంతర్థానానికి నాంది?
అబూ ధాబీలో ఇటీవల ముగిసిన ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశం (ఎంసీ 13) పెద్దగా సాఫల్యతలు లేకుండానే ముగిసింది. భారత్ లాంటి దేశాలకు ముఖ్యమైన మత్య్స రాయితీల అంశంలో, ప్రభుత్వాలు నిల్వచేసే ఆహార ధాన్యాల అంశంలో ఏ విధమైన పరిష్కారాలనూ కనుగొనలేదు. పైగా వివాదాల పరిష్కారం కోసం ఉద్దేశించిన అప్పిలేట్ బాడీ పునరుద్ధరణకు అమెరికా ససేమిరా అంది. అదే జరిగితే మళ్లీ ‘గాట్’ రోజులకు తిరిగి మరలాల్సి ఉంటుంది. ఇక, డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఆ దేశం ఏకంగా డబ్ల్యూటీవో నుంచే నిష్క్రమించినా ఆశ్చర్యం లేదు. 166 సభ్య దేశాలున్న ఈ సంస్థ ఉనికి ఇప్పటికే ప్రశ్నార్థకంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తన ఒప్పందాల విషయంలో త్వరపడాలి. అబూ ధాబీలో (ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 2 వరకు) జరిగిన మరో డబ్ల్యూటీవో (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) మంత్రివర్గ సమావేశం ఎలాంటి ఆసక్తిని రేకెత్తించకుండానే ముగిసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన విధులు,అంటే చర్చల పనివిధానం, వివాద పరిష్కార పనితీరు గత కొంత కాలంగా స్తంభించిపోయాయి. ఇప్పటికే సమస్యల్లో ఉన్న ఈసంస్థకు చెందిన 166 సభ్యదేశాల్లో బలమైన విభజనలు పెంచేలా, ఈ రెండింటినీ పునరుద్ధరించే ప్రయత్నాలు ఫలించలేదు.అబూ ధాబీలో జరిగిన 13వ మంత్రివర్గ సమావేశం (ఎంసీ 13)లో డబ్ల్యూటీఓ సభ్యులకు నాలుగు ప్రధాన సవాళ్లు ఎదుర య్యాయి. ఒకటి, మత్స్య రాయితీలపై అంతుచిక్కని బహుపాక్షిక ఒప్పందాన్ని ఎలా ముగించాలి? రెండు, అప్పీలేట్ బాడీని ఎలా పున రుద్ధరించాలి? తద్వారా వివాద పరిష్కార యంత్రాంగంగా డబ్ల్యూ టీఓ కిరీటంలో ఆభరణంగా ఉన్న దాని ఖ్యాతిని తిరిగి ఎలా పున రుద్ధరించాలి? మూడు, భారతదేశంతోపాటు అనేక ఇతర దేశాలు డిమాండ్ చేస్తున్న ఆహార భద్రతకు సంబంధించిన పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్ (ఆహార భద్రత కోసం ధాన్యాన్ని ప్రభుత్వం నిల్వచేయడం) సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఎలా పొందాలి? చివరగా, పరిశ్రమ కోరుతున్న ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ లపై కస్టమ్స్ డ్యూటీకి సంబంధించిన మారటోరియం పొడిగింపును ఎలా నిర్ధారించాలి? ఇందులో ఉన్న ఆదాయ నష్టం కారణంగా కొన్ని ప్రభుత్వాలు (భారత్ వంటివి) దీన్ని ఇష్టపడలేదు. కొన్ని ఇతర సమస్యలు కూడా ఉన్నా, ఇవి ఎంసీ 13 కోసం ప్రధాన అజెండా అయ్యాయి. మత్స్యకారులకు సబ్సిడీలపై బహుపాక్షిక ఒప్పందం గత మంత్రి వర్గ సమావేశంలో పాక్షికంగా ముగిసింది. ఇది అమల్లోకి వచ్చేలా ఈ ఎంసీ 13లో పూర్తి చేయవలసి ఉంది. కానీ ఈ సందర్భంలో,సంధానకర్తలు ఏదీ సాధించలేకపోయారు. భారత్ సమానత్వంకోసం, న్యాయం కోసం పోరాడింది. దీనివల్లే యూరోపియన్ యూని యన్ సంధానకర్త ఒకే ఒక్క దేశం (భారత్) దీనికి తన సమ్మతిని నిలిపి వేసినట్లు చెప్పారు. ఇది నిజమే అయినప్పటికీ, భారత్ తన మత్స్య కారుల జీవనోపాధి కోసం మంజూరు చేస్తున్న సబ్సిడీలను యూరో పియన్ యూనియన్, జపాన్, చైనా, తైవాన్ లు ఇస్తున్న భారీ సబ్సి డీలతో సమానం చేయడం అసంబద్ధం. భారత్ 25 ఏళ్ల సమ యాన్ని కోరింది. ఇది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ మన లాంటి సమాఖ్య నిర్మాణంలో, మనం నెమ్మదిగా మాత్రమే త్వర పడగలము! ఎన్నికల సంవత్సరం కూడా అయినందువల్ల మత్స్య కారుల ప్రయో జనాలను గట్టిగా కాపాడటం తప్ప, ఇంకేదీ ప్రభుత్వం చేయలేక పోయింది. మన రైతులకు కూడా ఇదే వర్తిస్తుంది. పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని భారత్ లాంటి దేశాలకు ప్రకటించిన నిబద్ధతను ప్రపంచ వాణిజ్య సంస్థ నిలుపు కోలేదు. సమస్యంతా మార్కెట్ ప్రాప్యతతో దీన్ని లింక్ చేయాలని పట్టుబట్టిన అభివృద్ధి చెందిన దేశాలతోనూ, కెయిర్న్స్ గ్రూప్ తోనూ (19 వ్యవసాయ సంబంధ ఎగుమతి దేశాల గ్రూప్) ఉంది. పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ అనేది తీవ్రమైన పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించే స్థిరమైన అభివృద్ధి లక్ష్యంతో ముడిపడిన ఒక తీవ్రమైన అంశం. దీనిని మార్కెట్ యాక్సెస్‌కు తాకట్టు పెట్టడం అన్యాయం, అధర్మం కూడా. అంతిమ పరిణామం ఏమిటంటే, ఎంసీ 13 ఈ సమస్యపై పురోగతి సాధించడంలో విఫలమైంది. అప్పిలేట్ బాడీ పునరుద్ధరణ గురించిన కథ సైతం భిన్నంగా ఏమీ లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక్క సభ్యదేశం, అంటే అమెరికా మాత్రమే దానిపై అభ్యంతరం వ్యక్తం చేయడమే గాక, దానిమీదే భీష్మించుకుని కూర్చుంది. అమెరికన్ ఎన్నికల వల్ల దీనికి అదనపు అనిశ్చితి కూడా తోడైంది. డోనాల్డ్ ట్రంప్ గనక విజయం సాధిస్తే, అన్నీ ముగిసిపోతాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా అప్పీలేట్ బాడీ పునరుద్ధరణను అడ్డుకోవడమే కాకుండా ఏకంగా డబ్ల్యూటీఓ నుండే మొత్తంగా వైదొలిగినా ఆశ్చర్యం లేదు. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైన ఈ ఎంసీ 13 సమావేశం, ఎలక్ట్రానిక్ ప్రసారాలకు సంబంధించిన కస్టమ్స్ డ్యూటీ నిలుపుదలను కేవలం రెండేళ్లపాటు పొడిగించగలిగింది. అలా జరగకుండా అడ్డుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత్... యూఏఈ వాణిజ్య మంత్రి నుంచి వచ్చిన వ్యక్తిగత అభ్యర్థన మేరకు చివరి నిమిషంలో అంగీకరించినట్లు భారత వాణిజ్య మంత్రి ద్వారా స్పష్టం చేసింది.ఎంసీ 13 ఎదుర్కొన్న ఇతర ప్రధాన సమస్య ఏమిటంటే, బహుపాక్షిక చర్చల కార్యక్రమాలతో ఎలా వ్యవహరించాలి అనేదే. ఒక విషయం చాలా ముఖ్యమైనది: అదేమిటంటే, 100 దేశాల మద్దతుతో జరిగిన చైనా నేతృత్వంలోని పెట్టుబడి సులభ తర అభివృద్ధి ఒప్పందం. కానీ ప్రతి డబ్ల్యూటీవో సభ్యదేశ ఏకాభిప్రాయాన్ని పొందనందున, దీన్ని సూత్రప్రాయంగా భారత్, దక్షిణాఫ్రికా వ్యతిరేకించాయి. చైనా ఈ పరిణామాన్నిఊహించి ఉండాల్సింది. దీంతో బహుపాక్షిక వేదికలలో చైనా–భారత సన్నిహిత సహకార యుగం ముగింపు దశకు చేరుకుందని నిర్ధారించవచ్చు. ‘బ్రిక్స్’ సమూహానికి ఇది ఎలాంటి చిక్కులను కలిగిస్తుందో చూడాలి.కాబట్టి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఎంసీ 13లో వచ్చిన ఫలితాలు స్వల్పం. కొన్ని తాత్కాలిక నిర్ధారణలుగా వీటిని తీసుకోవచ్చు: ఒకటి, ప్రపంచ వాణిజ్య సంస్థకు నిజమైన బహుపాక్షిక(మల్టీలేటెరల్) సంస్థగా ఉజ్వల భవిష్యత్తు లేదు. కాబట్టి, అది బహుముఖంగా(ప్లూరీలేటెరల్) మారుతుందా? అలా అయితే, భారత్ దాన్ని ఎలా చూస్తుంది? రెండు, యథాతథ స్థితిని సూచించే అప్పీలేట్ బాడీ పునరుద్ధరణకు అమెరికా అంగీకరించే అవకాశం కని పించడం లేదు. బదులుగా మనం కేవలం ఒకే–దశ ప్యానెల్ విధానంతో సాగిన ‘గాట్’ (పన్నులు, సుంకాలపై సాధారణ ఒప్పందం) తరహా పాత చెడ్డ రోజులకు తిరిగి మరలవచ్చు. అదే జరిగితే, భారత్ దానిని ఎలా ఎదుర్కొంటుంది? చివరగా, ప్రపంచ వాణిజ్య సంస్థను పునరుజ్జీవింపజేసే స్వల్ప అవకాశాలను దృష్టిలో ఉంచుకుని,ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్, గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)తో తన కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల విష యంలో భారత్ త్వరపడాలి. ఈ విషయంలో సమయాన్ని వృథా చేసే ప్రసక్తే లేదు, మే నెలలో వచ్చే కొత్త ప్రభుత్వం దీన్నొక ప్రాధాన్యతగా దృష్టి సారించాల్సి ఉంది.భారత వ్యూహాత్మక/విదేశీ విధాన చర్చలకూ, దాని వాణిజ్య విధాన చర్చలకూ మధ్య కొంత వ్యత్యాసం కూడా ఉంది. మనం అనతి కాలంలోనే ఏడు లేదా పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారతాం అనే ఊహపై మన వ్యూహాత్మక చర్చలు ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రస్తుత వాణిజ్య విధాన ప్రక్రియ కేవలం రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకే సరిపోతుంది! ఈ అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది. మే నెలలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం వ్యవసాయం, భూమి, కార్మికులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో లోతైన, నిర్మాణాత్మకమైన సంస్కరణలను చేపట్టడం దీనికి ఒక మార్గం. ఇది భారత్‌ను పెద్ద ఆర్థిక కూటమిలోకి చేరేలా సాయపడుతుంది. - వ్యాసకర్త మాజీ రాయబారి, డబ్ల్యూటీవోలో భారత అనుసంధానకర్త (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) - మోహన్ కుమార్ -
G20 Ministerial Meet: భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల
న్యూఢిల్లీ/బెంగళూరు: భారతదేశం విభిన్న సమస్యల పరిష్కారాల కోసం ఆదర్శవంతమైన ఒక ప్రయోగశాల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాలను ప్రపంచంలో ఎక్కడైనా సులభంగా అన్వయించవచ్చని నొక్కి చెప్పారు. బెంగళూరులో శనివారం జరిగిన జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మంత్రుల సమావేశంలో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. భారత్‌లోని డిజిటల్ మౌలిక వసతులతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సురక్షితమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రపంచంతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘భారత్ ఎంతో వైవిధ్యం కలిగిన దేశం. మాకు డజన్ల కొద్దీ భాషలు, వందలాదిగా మాండలికాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మతానికి, అసంఖ్యాక సాంస్కృతిక వారసత్వాలకు భారత్ నిలయం. ప్రాచీన సంప్రదాయాల నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు, ప్రతి ఒక్కరికీ అవసరమైనవి భారత్‌లో ఉన్నాయి. అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాన్ని ప్రపంచంలో ఎక్కడైనా సులువుగా అన్వయించుకోవచ్చు’అని ప్రధాని చెప్పారు. డిజిటల్ సాంకేతికతలో అన్ని దేశాలను భాగస్వా ములను చేసేలా వర్చువల్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. డిజిటల్ ఎకానమీ విస్తరించే కొద్దీ భద్రతా పరమైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జీ20 దేశాల మధ్య ఏకాభిప్రాయంతో విశ్వసనీయమైన, సురక్షితమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షిత, సమ్మిళిత, శ్రేయస్కరమైన గ్లోబల్ డిజిటల్ భవిష్యత్తు కోసం జీ20 దేశాలకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆర్థికంగా, సాంకేతికతపరంగా భారత్ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. భాషల అనువాదం కోసం ‘భాషిణి’అనే కృత్రిమ మేధను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. జన్‌ధన్ ఖాతాలు 50 కోట్లు జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు 50 కోట్లు దాటిపోవడం కీలక మైలురాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో సగానికి పైగా ఖాతాలు మహిళలవేనని చెప్పారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కు దాటిందని, ఇందులో 56 శాతం మహిళలకు చెందినవేనని శుక్రవారం ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2014లో జన్‌ధన్ ఖాతాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
జెండర్ ఈక్వాలిటీ అంటే అది!'దటీజ్ జపాన్'
ఇటీవల జూన్ 24, 25 తేదీల్లో లింగ సమానత్వం, మహిళ సాధికారతపై జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జపాన్ ఆతిధ్య ఇచ్చింది. ఈ సదస్సులో ఏడుగురు మంత్రుల బృందం సమావేశమై ప్రతిజ్ఞ చేసింది. ఆ మంత్రులంతా మహిళా కార్యనిర్వాహకులకు మద్దతు ఇస్తామని, నిర్వాహక పాత్రలలో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆ మంత్రుల సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని తెగ ఆకర్షించింది. అసాధారణరీతిలో లింగ సమానత్వ మహిళా మంత్రులు సదస్సులో ఒకే ఒక్క మగ మంత్రి తన దేశం తరుపున ప్రాతినిధ్య వహించడం విశేషం. ఈ సమావేశానకి ఆతిధ్యమిచ్చిన జపాన్ దేశమే మహిళ సాధికారతపై జరగుతున్న సదస్సుకు తన దేశం తరుఫు నుంచి ఓ ఫురుషుడిని పంపి అందర్నీ ఆశ్చర్యపర్చింది. జెండర్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటో చెప్పకనే చెప్పింది. పైగా చెప్పడం కాదు చేసి చూపడం లేదా ఆచరించి చూపడం అని చాచిపెట్టి కొట్టినట్లు చెప్పింది. "దటీజీ జపాన్" అని సగర్వంగా ఎలుగెత్తి చెప్పింది. ఇక ఆ సమావేశంలో తన దేశం తరుఫున పాల్గొన్న జపాన్‌కు చెందిన రాజకీయ ప్రముఖుడు, కేబినేట్ మంత్రి మసనోబు ఒగురా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ సమావేశంలో ఏకైక పురుష డెలిగేట్ అయ్యినందుకు ఎలా భావిస్తున్నారని అడుగగా..లింగ సమానత్వం కోసం పురుషులు ఇంకాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ఇతర దేశాల సహకారంతో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా పని చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే లింగ సమానత్వమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా, టైమ్ మ్యాగ్జైన్ ప్రకారం..వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన తాజా వార్షిక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే జపాన్‌లో నిక్కోలో ఈ జీ7 శిఖారాగ్ర సమావేశం జరగడం గమనార్హం. కాగా, ఈ ఎకనామిక్ ఫోరం ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాసాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత తదితర కీలక కొలమానాల ఆధారంగా ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ని అంచనా వేస్తుంది. (చదవండి: ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్') -
ఖరారు కానున్న సెట్స్ తేదీలు
సాక్షి, హైదరాబాద్: వివిధ వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తాజా తేదీలు శుక్రవారం ఖరారు కానున్నాయి. కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన ప్రభుత్వం ఈనెల 1వ తేదీ నుంచి వరుసగా ఈసెట్, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా గతంలో షెడ్యూలు జారీ చేసింది. అయితే కరోనా ఉధృతి తగ్గని పరిస్థితుల్లో పరీక్షలను ఎలా నిర్వహిస్తారంటూ కోర్టులో కేసు వేయడంతో పరీక్షలను మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్‌ను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజా షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో అదే పద్ధతిలో రాష్ట్రంలోనూ సెట్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలోనూ దీనిపై చర్చించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేయడంతో తదుపరి కార్యాచరణపై ఉన్నత విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎంసెట్ నిర్వహణపైనా చర్చించనున్నారు. దాంతోపాటు ఇతర సెట్స్ నిర్వహించే తేదీలను కూడా ఖరారు చేయనున్నారు. -
తొలి కేబినెట్ ప్రధాన అజెండా రైతులు, మహిళలు, ఉద్యోగులే..
సాక్షి, అమరావతి : రైతులు, మహిళలు, ఉద్యోగులే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాకులోగల మంత్రివర్గ సమావేశం మందిరంలో సోమవారం ఉ.10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలతో పాటు, ఆశా వర్కర్ల (మహిళలు) వేతనాల పెంపునకు ఆమోదం, ఉద్యోగులకు మధ్యంతర భృతి 27 శాతం మంజూరుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. తిత్లీ, ఫోనీ తుపాను సందర్భంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఎంతవరకు అందిందీ, ఇంకా పరిహారం ఇవ్వాల్సి ఉందా అనే అంశంపై కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే, రాష్ట్ర ఎంత సాయం కోరితే కేంద్రం నుంచి ఎంత సాయం వచ్చిందనే అంశాలను ఇందులో చర్చిస్తారు. అలాగే, వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల లభ్యత, పంటకు మద్దతు ధర తదితర అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఆశా వర్కర్ల వేతనాలను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించడమే కాకుండా సంబంధిత ఫైలుపై శనివారం సచివాలయంలో తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. వీరు రాష్ట్రంలో 42వేల మంది ఉన్నారు. వేతనాలు పెంచడం ద్వారా వీరు ఏటా రూ.504 కోట్ల మేర ప్రయోజనం పొందనున్నారు. ఇందుకు కేబినెట్లో సోమవారం ఆమోదముద్ర వేయనున్నారు. 27శాతం ఐఆర్‌పై కూడా నిర్ణయం ఇక ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు మధ్యంతర భృతి 27 శాతం ఇచ్చేందుకు కేబినెట్లో ఆమోదం తెలపనున్నారు. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,415 కోట్ల మేర అదనపు భారం పడనుందని ఆర్థిక శాఖ లెక్కలు వేసింది. ►అలాగే, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును (సీపీఎస్) రద్దు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు తొలి కేబినెట్లో ఈ అంశంపై కూడా చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఎన్నికల ముందు జగన్మోహన్రెడ్డి సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించడంతో అప్పటి సీఎం చంద్రబాబు సీపీఎస్ రద్దు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి మాజీ సీఎస్ టక్కర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేశారు. ఆ కమిటీ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించింది. కేబినెట్ సమావేశంలో టక్కర్ కమిటీ నివేదికలో ఏ సిఫార్సులు చేసిందనే అంశాలపై చర్చించనున్నారు. ఏ రూపంలో సీపీఎస్‌ను రద్దుచేయాలి, ఇందుకు ఎవరి అనుమతైనా తీసుకోవాలనే అంశాలపై కేబినెట్లో చర్చించి ముందుకు సాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ►ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విధానంతోపాటు.. ►పెన్షన్లను రూ.2,250కు పెంపుదల.. కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెందిన సమస్యలపైన చర్చిస్తారు. ►అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హోంగార్డుల వేతానాల పెంపు దిశగా కేబినెట్లో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వీరికి తెలంగాణలో ఇస్తున్న వేతనాలు కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో 16,616 మంది హోంగార్డులున్నారు. వేతనాలు పెంపు ద్వారా వీరికి ప్రయోజనం కల్పించడానికి తొలి కేబినెట్లోనే సీఎం బీజం వేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ►ఇవేగాక.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు.. అక్టోబరు నుంచి రైతు భరోసా కింద అన్నదాతలకు చెల్లించనున్న రూ.12,500ల పైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. -
వైఎస్సార్ఎల్పీ సమావేశం నేడు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని ఈ నెల 8వ తేదీన విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో 7వ తేదీన ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష (వైఎస్సార్ఎల్పీ) సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ భేటీకి 151 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన రెండో శాసనసభలోకి అడుగు పెడుతున్న పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పునకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు ఎలా నడుచుకోవాలనే దానిపై ప్రధానంగా జగన్ మాట్లాడతారని తెలుస్తోంది. వాగ్దానాల అమలు... పార్టీ బలోపేతం మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు లభిస్తుందన్న ఊహాగానాలు ఎమ్మెల్యేల్లో సాగుతుండడంతో ఈ అంశంపై కూడా జగన్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు ప్రభుత్వ పరంగా కృషి చేయడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. మంత్రివర్గం కూర్పు విషయంలో ప్రాంతీయ, సామాజిక వర్గాల మధ్య పాటించాల్సిన సమతౌల్యం, పార్టీలో తీసుకురావాల్సిన మార్పుల గురించి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు వివరిస్తారని సమాచారం. 10న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు! శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన విధంగానే మంత్రివర్గాన్ని సైతం విడతల వారీగా కాకుండా ఒకేసారి విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నట్లు వైఎస్సార్సీపీలో చర్చ సాగుతోంది. 8వ తేదీన 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. మంత్రులతో పాటు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి పదవుల ఎంపికపైనా జగన్ పూర్తి స్పష్టతతో ఉన్నట్లు చెబుతున్నారు. సాధారణంగా అయితే కొత్త శాసనసభ ప్రారంభానికి ముందు విజయం సాధించిన పార్టీ తమ శాసనసభాపక్షం నేతను ఎన్నుకోవడానికే సమావేశం అవుతూ ఉంటుంది. ఆ తరువాత మళ్లీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తరువాతనే తదుపరి శాసనసభాపక్షం సమావేశమవుతుంది. కానీ, దీనికి భిన్నంగా జగన్ ప్రస్తుతం కొత్త సంప్రదాయానికి తెర తీశారు. తొలి శాసనసభా సమావేశాల ప్రారంభానికి ముందే మరోసారి తమ పార్టీ శాసనసభాపక్షాన్ని సమావేశపరుస్తున్నారు. ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఆ తరువాత రెండు రోజులకు జూన్ 10వ తేదీన నూతనంగా విస్తరించిన మంత్రివర్గం తొలి సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరుగుతుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన పలు సంకేతాలను జగన్ ఇచ్చారు. 14న ఉభయ సభల సంయుక్త సమావేశం రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో తొలి రోజున ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన 175 ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒకేరోజున ప్రమాణ స్వీకారం పూర్తయితే, మరుసటి రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారాలు రెండోరోజు కూడా కొనసాగితే.. అవి ముగిశాక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 14వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఆ తరువాత రోజున ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు సభల్లోనూ చర్చ, ముఖ్యమంత్రి సమాధానానికి ఆమోదం ఉంటాయి. -
అదే జరిగింది!
సాక్షి, అమరావతి: అత్యవసరంగా మంత్రివర్గ సమా వేశం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హడావుడి అంతా సొంత పార్టీ నేతలకు ఉపాధిహామీ బిల్లులు చెల్లించేం దుకేనని తేటతెల్లమైంది. ఎన్నికల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్న తరు ణంలో పట్టుబట్టి మరీ కేబినెట్ నిర్వహించిన మరుసటి రోజే ఉపాధిహామీ పెండింగ్ బకాయిల కింద రూ. 490 కోట్లు విడుదల చేస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ముందు టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో భారీగా పనులు మంజూరు చేసి వాటిని కనీసం పరిశీలన కూడా చేయకుండానే బిల్లులు చెల్లించడానికే మంత్రివర్గ సమావేశం పేరుతో చంద్రబాబు హడావుడి చేసినట్లు స్పష్టమవుతోంది. ‘సాక్షి’ ఇదే విషయాన్ని ఈనెల 9వ తేదీనే పాఠకులకు తెలియజేసింది. పెండింగ్ బకాయిల పేరుతో ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ. 1,920 కోట్లు టీడీపీ నేతలకు పంచి పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను ‘స్వాహానే అజెండా’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తేవడం విదితమే. నేడు డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు ఉపాధి హామీ పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు రూ.490.20 కోట్లు విడుదల చేస్తూ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి మంగళవారం జీవో నెంబరు 373 జారీ చేశారు. బుధవారమే ట్రెజరీలో పనులు పూర్తి చేసి గురువారం నాటికల్లా డబ్బు చెల్లింపు పూర్తి చేయాలని ఆదేశించడంతో గ్రామీణాభివృద్దిశాఖలోని ఉపాధి హామీ అధికారులు చకచకా పనులు చేస్తున్నారు. మిగతా డబ్బులు బ్యాంకు నుంచి అప్పు తేవాలని సీఎం ఆదేశం ఉపాధిహామీలో మెటీరియల్ పనుల కింద పరోక్షంగా కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తున్న పనులకు అయ్యే ఖర్చులో 75 శాతం నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. మే 8వ తేదీ నాటికి రూ. 1,920 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కేంద్రం రూ. 367 కోట్లను ఏప్రిల్ 9 తేదీనే రాష్ట్రానికి విడుదల చేసింది. ఆ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపినా కేవలం రూ. 490 కోట్లే అవుతుండడంతో మిగిలిన దాదాపు రూ. 1,430 కోట్లను కూడా ఏదో ఒక బ్యాంకు నుంచి అప్పు తెచ్చి బకాయిలు చెల్లించాలని మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కేంద్రం నిధులు విడుదల చేశాక ఆ నిధులను తిరిగి బ్యాంకులకు చెల్లించవచ్చని సీఎం చెప్పినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాక్షిలో ప్రచురితమైన ‘ఉపాధి’ బిల్లులపై కథనం ఈసీ షరతులకు విరుద్ధంగా సీఎం తీరు.. ఈనెల 14వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేసిన మంత్రివర్గ భేటీ అజెండాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. కరువు, ఫొని తుపాను సహాయ చర్యలు, మంచినీటి సరఫరా, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షకు అనుమతించాలని ఈసీకి నివేదించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నాలుగు అంశాలపై సమీక్షకు మాత్రమే అనుమతిస్తూ షరతులు కూడా విధించింది. మంత్రివర్గ భేటీలో కొత్త నిర్ణయాలు తీసుకోరాదని, రేట్లు మార్పులు చేయరాదని, బకాయిల చెల్లింపులపై నిర్ణయాలు తీసుకోరాదని, మీడియాకు వివరాలు వెల్లడించరాదని స్పష్టంగా షరతులు విధించింది. వీటికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాలని, తాము అనుమతించాకే వీటిని అమలు చేయాలని ఈసీ ఆదేశాల్లో స్పష్టం చేసింది. మంత్రివర్గ సమావేశం అజెండాలో కేవలం ఉపాధి హామీ పథకంలో పనుల కల్పనపై మాత్రమే సమీక్షించాలని ఉంది. అయితే అజెండాకు విరుద్ధంగా మెటీరియల్ కాంపొనెంట్ కింద పార్టీ నేతలకు బిల్లులను అప్పు చేసైనా చెల్లించాలని సీఎం ఆదేశించడం అంటే ఈసీ షరతులను ఉల్లంఘించడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కోడ్‌లోనూ జోరుగా పనులు.. బిల్లులూ రెడీ మంత్రి నారా లోకేష్ తన శాఖలో ఎన్నికల ముందు ఉపాధి హామీ పథకం కింద గత ఆగస్టు నుంచి గ్రామాల్లోని టీడీపీ నాయకులకు భారీ సంఖ్యలో పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. ఉపాధిహామీలో కాంట్రాక్టర్ల విధానమే ఉండకూడదు. గ్రామ పంచాయితీ పేరుతోనే పనులు జరగాలి. ప్రస్తుతం సర్పంచుల పాలన లేకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకొని ప్రత్యేకాధికారులపై ఒత్తిడి తెచ్చిన టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారమెత్తి పనులు దక్కించుకున్నారు. కేవలం కొత్త రోడ్ల నిర్మాణానికే నిధులు మంజూరు చేయాల్సి ఉండగా టీడీపీ నేతలు చాలా చోట్ల అప్పటికే ఉన్న మట్టి రోడ్లనే మళ్లీ కొత్తగా నిర్మించేందుకు అనుమతులు పొందారు. రూ.లక్షల్లో అంచనాలు రూపొందించి నామమాత్రపు పనులు చేసి అధికారులపై ఒత్తిడి తెచ్చి బిల్లులు సిద్ధం చేశారు. ఇప్పుడు బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్న రూ.1,920 కోట్లలో గ్రామీణ రోడ్ల బిల్లులే సగం ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మరోపక్క ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ మార్చిలో రూ. 244.12 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 232.26 కోట్లు, మే నెల 8వ తేదీ వరకు రూ. 72.33 కోట్ల మేరకు పనులు పూర్తి చేసినట్టు చూపిస్తూ బిల్లులు రెడీ చేశారు. మార్చి 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కేవలం వారం రోజులకే మరో రూ. 61 కోట్ల మేరకు పనులు చేసినట్టు టీడీపీ నేతలు బిల్లులు సిద్ధం చేయడం గమనార్హం. -
చంద్రబాబు చివరి షో!
సాక్షి, అమరావతి: ఎన్నికల కమిషన్‌తో ఘర్షణకు దిగి, ఉన్నతాధికారులను బెదిరిస్తూ పంతం కోసం సీఎం చంద్రబాబు మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశమే ఆయనకు చివరిదని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ భేటీకి హాజరైన మంత్రుల ముఖాల్లో కళాకాంతులు లేకపోగా మళ్లీ ఈ సచివాలయానికి మంత్రిగా వస్తామో లేదో, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే రీతిలో నర్మగర్భంగా మాట్లాడడం విశేషం. కొందరు మంత్రులు గెలుపుపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శించగా మరికొందరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు బహిరంగంగానే అంగీకరించారు. ఇక సమావేశానికి మంత్రుల వెంట వచ్చిన వారి అనుచరులు, సిబ్బందిలో ఏమాత్రం ఉత్సాహం కానరాలేదు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని వారంతా చర్చించుకోవడం కనిపించింది. మౌనంగా వెళ్లిపోయిన మంత్రులు.. సాధారణంగా మంత్రివర్గ సమావేశాలు జరిగినప్పుడు మీడియాతో మాట్లాడేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చే మంత్రులు కొందరు ఈసారి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిష్క్రమించారు. వారి భద్రతా సిబ్బంది సైతం ఏం జరుగుతుందోనని చర్చించుకోవడం కనిపించింది. కొందరు మంత్రులు మాత్రం మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ మీ అంచనా ఏమిటి? టీడీపీ గెలిచే అవకాశాలున్నాయా? పసుపు – కుంకుమ ప్రభావం పనిచేసిందా? అని ఆరా తీశారు. ఇదే ఆఖరు మంత్రివర్గ సమావేశమని, ఫలితాల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కలిసిన డీఎంకే నేత తమిళనాడుకు చెందిన డీఎంకే సీనియర్ నాయకుడు దొరై మురుగన్ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అరగంటపాటు సమావేశమైన వీరిద్దరూ తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. డీఎంకే అధినేత స్టాలిన్ ప్రతినిధిగా మురుగన్ చంద్రబాబును కలిశారని టీడీపీ వర్గాలు తెలిపాయి. నా ప్రత్యర్థి బలవంతుడు: నారాయణ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ మీడియాతో ముచ్చటిస్తూ తన ప్రత్యర్థి బలవంతుడని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటాడని, అయినా ఎదుర్కొన్నానని, ఏం జరుగుతుందో చూద్దామంటూ నైరాశ్యం వ్యక్తం చేశారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేదో ఆయన స్పష్టంగా చెప్పకపోగా నెల్లూరు జిల్లాలో పార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే దానికి స్పష్టంగా జవాబివ్వకుండా వెళ్లిపోయారు. అధికారులు, ఉద్యోగులంతా చంద్రబాబుకి ఇదే ఆఖరి మంత్రివర్గ సమావేశమని, ఆయన మళ్లీ సచివాలయానికి వచ్చి సమావేశం నిర్వహించే అవకాశం రాకపోవచ్చని సెటైర్లు వేసుకోవడం చర్చనీయాంశమైంది. మంత్రులతో వచ్చిన పార్టీ నాయకులు, అనుయాయులు సైతం తమ పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తం చేశారు. -
ఖజానా నుంచే కాజేద్దాం!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో(జలాశయం) సబ్ కాంట్రాక్టర్లకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ చెల్లించాల్సిన బకాయిలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అది ప్రైవేట్ వ్యవహారమని ఉన్నత స్థాయి కమిటీ తేల్చి చెప్పింది. సబ్ కాంట్రాక్టర్లకు ట్రాన్స్ట్రాయ్ చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించడం ద్వారా తన పార్టీ నేత రాయపాటి సాంబశివరావును సంతృప్తి పరచాలన్న ఎత్తుగడను ఉన్నత స్థాయి కమిటీ చిత్తు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిందులు తొక్కుతున్నారు. ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు తాజా ధరలను వర్తింపజేయడం ద్వారా అదనపు బిల్లులు చెల్లించి, వాటిని సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలకు సర్దుబాటు చేసేలా కేబినెట్‌కు ప్రతిపాదన పంపాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే మంగళవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ట్రాన్స్ట్రాయ్ వ్యవహారాన్ని టేబుల్ ఐటెంగా చేపట్టి, ఆమోదముద్ర వేయాలన్నదే చంద్రబాబు ప్రణాళిక. అధికారాంతమున ఖజానాను దోచేసేందుకు సాగుతున్న ఈ యత్నాలను అధికార వర్గాలు తప్పు పడుతున్నాయి. ట్రాన్స్ట్రాయ్ చెల్లించాల్సిన బకాయిలు రూ.418 కోట్లు రాష్ట్ర విభజన చట్టంలోని హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 2016 సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.4,054 కోట్ల నుంచి రూ.5,385.91 కోట్లకు పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు ఒప్పందం అమల్లో ఉండగా అంచనా వ్యయాన్ని పెంచడం నిబంధనలకు విరుద్ధం. ఆ తర్వాత ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి మట్టి పనులను త్రివేణి ఎర్త్ మూవర్స్‌కు.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్), పునాది(డయాఫ్రమ్ వాల్) పనులను ఎల్అండ్టీ–బావర్.. కాఫర్ డ్యామ్ పునాది(జెట్ గ్రౌటింగ్) పనులను కెల్లర్, కాంక్రీట్ పనులు ఫూట్జ్‌మీస్టర్, పెంటా, గేట్ల పనులను బీకెమ్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు కింద ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. 2016 అక్టోబర్ 7 నుంచి 2018 జనవరి వరకూ చేసిన పనులకు గాను ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.2,362.22 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించి.. ఎప్పటికప్పుడు కమీషన్లు వసూలు చేసుకున్నారు. కానీ, పనులు చేసిన సబ్ కాంట్రాక్టర్లకు ట్రాన్స్ట్రాయ్ బిల్లులు చెల్లించలేదు. సబ్ కాంట్రాక్టర్లతోపాటు కిరాణా సరుకులు సరఫరా చేసిన వ్యాపారులకు కూడా ట్రాన్స్ట్రాయ్ భారీ ఎత్తున బకాయిపడింది. ఈ బకాయిలు రూ.418 కోట్లకుపైగా పేరుకుపోయినట్లు పోలవరం హెడ్ వర్క్స్‌ను పర్యవేక్షించే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో 2018 జనవరి నాటికి సబ్ కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. దాంతో ట్రాన్స్ట్రాయ్పై 60సీ నిబంధన కింద వేటు వేసి.. పనులన్నీ నవయుగ సంస్థకు నామినేషన్‌పై అప్పగించారు. గేట్ల తయారీ పనులను బీకెమ్‌కు నామినేషన్ విధానంలో కట్టబెట్టారు. డీఆర్ఐ దర్యాప్తు నుంచి బయటపడేందుకే.. పోలవరం హెడ్ వర్క్స్‌లో చేసిన పనులకు గాను తమకు బిల్లులు చెల్లించడం లేదని విదేశీ సంస్థలు బావర్, కెల్లర్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని డీఆర్ఐకి జనవరిలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలవరం ప్రాజెక్టు అధికారులను డీఆర్ఐ ఆరా తీసింది. డీఆర్ఐ నేరుగా రంగంలోకి దిగితే తాను వసూలు చేసుకున్న కమీషన్ల బాగోతం బయటపడుతుందని చంద్రబాబు ఆందోళన చెందారు. డీఆర్ఐ విచారణ చేపట్టేలోగా బకాయిల పంచాయతీని తేల్చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న పోలవరం వర్చువల్ రివ్యూలో ట్రాన్స్ట్రాయ్.. సబ్ కాంట్రాక్టర్ల మధ్య బకాయిల పంచాయతీని తేల్చడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను ఆదేశించారు. దాంతో ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గా.. సీఈ శ్రీధర్ కన్వీనర్‌గా, రిటైర్డు సీఈ రోశయ్య, పోలవరం హెడ్‌వర్క్స్ ఎస్ఈ సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీని ఫిబ్రవరి 18న ఏర్పాటు చేస్తూ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ల మధ్య బకాయిల వ్యవహారంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, అది ప్రైవేట్ పంచాయతీ అని ఉన్నతస్థాయి కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. వాస్తవానికి ప్రభుత్వ ఖజానా నుంచే సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని చంద్రబాబు నిర్ణయానికొచ్చారు. ఉన్నత స్థాయి కమిటీ నివేదిక నేపథ్యంలో అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రాయపాటిని సంతృప్తిపరచేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) అనుమతి ఇస్తే మంగళవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు తాజా ధరలను వర్తింపజేయాలని, జీవో 22, జీవో 63ల ప్రకారం అదనపు బిల్లులు ఇవ్వాలని గతంలో కేబినెట్లో తీర్మానం చేశామని.. ఆ తీర్మానం ఆధారంగా ట్రాన్స్‌ట్రాయ్‌కి అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సూచనలను ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులు తోసిపుచ్చినట్లు సమాచారం. సీఈసీకి పంపిన కేబినెట్ ఏజెండాలో ఈ అంశం లేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. మంగళవారం నాటికి ఎలాగైనా ప్రతిపాదనలు తెప్పించుకుని.. దాన్ని కేబినెట్లో టేబుల్ ఐటెంగా చేపట్టి, ఆమోదముద్ర వేసి, ప్రభుత్వ ఖజానా నుంచే సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు మార్గం సుగమం చేయడం ద్వారా రాయపాటిని సంతృప్తి పర్చడానికి చంద్రబాబు చురుగ్గా పావులు కదుపుతున్నారు. -
రైతు భరోసాను కాపీకొట్టి.. రైతు రక్ష పథకం పేరుతో..!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పెన్షన్ల పథకాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు తాజాగా వైఎస్సార్ రైతు భరోసాను సైతం కాపీ కొట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించారు. విధివిధానాలు రూపొందించి త్వరలో దీన్ని ప్రకటించనున్నారు. ఈ పథకానికి రైతు రక్ష అని పేరు పెట్టాలని భావిస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ఇప్పుడున్న వెయ్యి రూపాయల వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేల రూపాయలకు పెంచుతామని జగన్మోహన్రెడ్డి ప్రకటించగా దాన్ని చంద్రబాబు కాపీ కొట్టి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మరో పథకం వైఎస్సార్ రైతు భరోసాను కూడా కాపీ కొట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ పథకం కింద రూ.50 వేలను నాలుగు విడతలుగా నాలుగేళ్లలో ఏటా మే నెలలో రైతులకు పెట్టుబడి కోసం రూ.12,500 చొప్పున ఇస్తామని జగన్ ప్రకటించారు. ఈ పథకాన్ని రైతు రక్ష పేరుతో ఈ ఖరీఫ్ నుంచే అమలు చేసి ఎకరానికి రూ.6 నుంచి రూ.10 వేలు వరకూ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎన్ని విడతలుగా ఇవ్వాలనే దానిపై విధివిధానాలు త్వరలో ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులను ఈ పథకం పరిధిలోకి తీసుకు రావాలని భావిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని కూడా కాపీ కొట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్ని విడతలుగా ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు వారికి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ రెండు పథకాలపై విధివిధానాలను రూపొందించి త్వరలో ప్రకటించాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే దానిపై చర్చించిన మంత్రివర్గం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన ఐదు శాతం ఇతర అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం సూచించింది. కేంద్ర మంత్రుల రాష్ట్ర పర్యటనల సందర్భంగా లేఖల ద్వారా జవాబిస్తామని చంద్రబాబు చెప్పారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పథకాలను కాపీ కొడుతున్నామనే విమర్శలపై ఎదురు దాడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. -
ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు
సాక్షి, అమరావతి: ఆటోలకు జీవిత కాలం, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయాలన్న ప్రతిపా దనలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. ముగ్గురి నుంచి ఏడుగురు ప్రయాణించే మూడు చక్రాల ఆటోలు, సరకు రవాణా చేసే మూడు చక్రాల ఆటోలు, 3 టన్నుల బరువు తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన తేలికపాటి వాహనాలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టరు ట్రయలర్లపై పన్ను మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మోటారు వెహికిల్ ట్యాక్స్ ఎరియర్స్ రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటోలు నడిపేవారికి ఈ ఏడాది రూ.60 కోట్లు , ప్రతి ఏటా రూ.55 కోట్లు లబ్ధి పొందుతారని చెప్పారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు వల్ల 9.79 లక్షల వాహన యజమానులకు లబ్ధి కలుగుతుందన్నారు. పాసింజర్ ఆటో రిక్షాలు 5.66 లక్షలు ఉన్నాయని, వీటిపై ఏడాదికి రూ.20 కోట్ల జీవిత కాల, త్రైమాసిక పన్ను మినహాయించారని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం రూ. వెయ్యి ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలు, రూ.1500 ఉన్న పెన్షన్‌ను రూ.3 వేలు చేశామన్నారు. మంత్రి వర్గం ఆమోదించిన మరిన్ని అంశాలు.. – ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు డీఏలలో ప్రస్తుతం ఒక డీఏ ఈ జీతం నుంచి సర్దుబాటు. ఒక డీఏ బకాయి మొత్తం రూ.513.13 కోట్లు వాయిదాల రూపంలో చెల్లించేలా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయం. – వివిధ శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రివైజ్డ్ పే స్కేలు 2015 ప్రకారం మినిమం టైమ్ స్కేలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు. – చుక్కల భూములు, ఇళ్ల పట్టాల విషయంలో జాయింట్ కలెక్టర్‌కు బదులుగా ఆర్డీవోలకే అధికారం. – 2014 జూన్ నుంచి మంజూరు కాకుండానే నిర్మించుకున్న లక్షా 26 వేల 97 ఇళ్లకు ప్రభుత్వ సాయం అందించాలని నిర్ణయం. ఒక్కో ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ.15 వేలతో కలిపి రూ.60 వేల చొప్పున లబ్దిదారునికి ఇవ్వనున్నారు. దీని కోసం రూ.756 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 1996–2004 మధ్య వివిధ పట్టణ ప్రాంతాలలో నిర్మించిన ఇళ్లకు సంబంధించిన మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం 20 వేల యూనిట్లకు రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. – అర్బన్ హౌసింగ్ కోసం భీమునిపట్నం మండలం కొత్తవలసలో 94.86 ఎకరాలు, పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురంలో 127.46 ఎకరాలు (మొత్తం 222.32 ఎకరాలు) చొప్పున ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఉడాకు అనుమతి. – రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జుడీషియల్ అఫీషియల్స్‌కు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కేటాయింపుపై నూతన విధానం. మార్గదర్శకాలు రూపొందించేందుకు ఆమోదం. ఆలిండియా సర్వీస్ అధికారులకు 500 గజాలు చొప్పున సొసైటీల ద్వారా స్థలాలు కేటాయిస్తారు. ఈ ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రెండేళ్లకు మించి రాష్ట్రంలో పని చేస్తున్న అందరికీ స్థలాలు కేటాయిస్తారు. సెక్రటేరియెట్, లెజిస్లేచర్లలో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు, హైకోర్టులో పనిచేసే సబార్డినేట్ సిబ్బందికి, రాష్ట్ర రాజధానిలోని హెచ్వోడీల్లో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు స్థలాలు కేటాయిస్తారు. అటానమస్ ఆర్గనైజేషన్లలో పని చేసే వారికి స్థలాలు కానీ, ఫ్లాట్లను కానీ భూమి లభ్యతను బట్టి నామినల్ మార్కెట్ రేటుకు కేటాయిస్తారు. రాష్ట్రంలో రీజినల్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ వారీగా పనిచేసే ఉద్యోగులకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి నివాసాలు కల్పిస్తారు. గ్రూపు, లేదా కోఆపరేటీవ్ సొసైటీ ద్వారానే ఈ కేటాయింపులు జరుగుతాయి. – ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు జనరల్ హౌసింగ్ పాలసీ, కేపిటల్ సిటీ హౌసింగ్ ఎంకరేజ్మెంట్ పాలసీలు తీసుకొచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదం. – అమరావతి అక్రిడేటెడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జర్నలిస్టులకు సంబంధించి)కు ఎకరం రూ.25 లక్షల చొప్పున 30 ఎకరాలు సీఆర్డీఏ పరిధిలో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నగర ప్రాంతంలో హౌస్ సైట్, ఇల్లు ఉన్నవాళ్లు అర్హులు కారు. గతంలో ప్రభుత్వ లబ్ధి పొందని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం. – రూ.10 కోట్ల బడ్జెట్‌తో చేనేత కార్మికుల వైద్య ఆరోగ్య బీమా పథకం. కుటుంబానికి రూ.20 వేల చొప్పున బీమా. – ఇప్పటికే ఉన్న రూ.50 కోట్ల డిపాజిట్లతో కలిపి అగ్రిగోల్డ్ బాధితులకు రూ.300 కోట్లు ముందస్తుగా చెల్లించేలా కోర్టును కోరాలని నిర్ణయం. – చిత్తూరు, నెల్లూరు జిల్లాలు.. పుంగనూరులోని కేబీడీ షుగర్స్, నిండ్రాలోని ప్రొడెన్షియల్ షుగర్స్, బీఎన్ కండ్రిగలోని సుదలగుంట షుగర్స్, పొదలకూరులోని సుదలగుంట షుగర్స్, నాయుడుపేటలోని ఎంపీ షుగర్స్ సంస్థలకు రూ.47.54 కోట్ల మేర పన్ను మినహాయింపు. కోఆపరేటీవ్, నిజాం షుగర్స్ (పబ్లిక్ సెక్టారు), ఖండసారి షుగర్ మిల్లులకు సంబంధించి కొనుగోలు పన్ను, వడ్డీలు, పెనాల్టీలకు సంబంధించి రూ.227,04,59,292 మినహాయింపు. – పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఏపీ అర్బన్ వాటర్ సప్లయ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు కింద రూ.2,685.58 కోట్లతో చేపట్టే పనులకు ఆమోదం. – బందరు డీప్ వాటర్ పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి అవసరమైన భూమి ఎకరం రూ.40 లక్షల చొప్పున 122.95 ఎకరాలను ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద మేకవానిపాలెం, పోతిపల్లి గ్రామాల్లో కొనుగోలు చేయాలన్న కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలకు ఆమోదం. – రాజధానిలోని ఐనవోలులో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) భవనాలను 45 మీటర్ల మేర ఎత్తుకు నిర్మించుకునేందుకు అనుమతి. – ఏపీ కో–ఆపరేటీవ్ సొసైటీల చట్టం–1964లో తగిన మార్పులు చేస్తారు. – గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన ల్యాండ్ పూలింగ్ రైతులకు రాజధానిలో కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్సే్ఛంజ్ డీడ్ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు. – రాజధానిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్ర నిర్మాణానికి సీఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాల భూమి సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్ పత్రాలపై స్టాంపులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ పన్ను రూ.1,00,20,600 మినహాయింపు. – విజయవాడ లబ్బీపేట బృందావన్ కాలనీలో 1052.86 చదరపు గజాల మునిసిపల్ ల్యాండ్‌ను మంత్రాలయం శ్రీరాఘవేంద్ర మఠం వారికి ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలో నాలుగో వంతు ధరకు కేటాయింపు. – ఆర్మ్డ్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా, హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్ఐలుగా పదోన్నతికి ఆమోదం. – హైకోర్టుకు కొత్తగా తొమ్మిది రిజిష్ట్రార్ పోస్టులు మంజూరు. – జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సూపరాన్యుయేషన్ వయసు కంటే తక్కువగా ఉంటే ఒక ఏడాది పదవీకాలం పొడిగింపు. – తూర్పుగోదావరి జిల్లా చింతూరు గ్రామంలోని నూతన డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమయ్యే 27 టీచింగ్, 14 నాన్ టీచింగ్ ఉద్యోగాలు మంజూరు. విశాఖ జోన్–1 కు జాయింట్ డెరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టు మంజూరు. ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం ఒక చీఫ్ ఇంజనీర్, రెండు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఆరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ల పోస్టులు మంజూరు. – శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల పార్కు నిర్మాణం కోసం 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. – శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరం గ్రామంలో పట్టణ ప్రాంత పేదల గృహ నిర్మాణం కోసం మునిసిపల్ కమిషనర్‌కు 23.36 ఎకరాల ప్రభుత్వ భూమి ముందస్తుగా స్వాధీనం. – కృష్ణా జిల్లా చల్లపల్లిలో శ్రీ విజయ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీకి ఐదు ఎకరాల భూమి 20 ఏళ్ల పాటు లీజు. – అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమిటికుంట గ్రామం వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం నెడ్‌క్యాప్‌కు 2.44 ఎకరాల భూమి కేటాయింపు. – వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం బూచుపల్లి, మల్లెల, తొండూరు ప్రాంతంలో విండ్ పవర్ ప్రాజెక్టు కోసం నెడ్‌క్యాప్‌కు 42.70 ఎకరాల భూమి కేటాయింపు. – బాబు జగ్జీవన్ రామ్ సమతా స్ఫూర్తివనం నిర్మాణానికి రూ.50 కోట్లు, 10 సెంట్ల భూమి కేటాయింపు. అమరావతిలో సీఆర్డీఏ నిర్మాణ స్థలాన్ని గుర్తించాక మరో రూ.50 కోట్లు చెల్లించాలని నిర్ణయం. -
వచ్చే నెల 1న మంత్రివర్గ సమావేశం
సాక్షి, అమరావతి: వచ్చే నెల 1న మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తొమ్మిది రోజుల విదేశీ పర్యటన వివరాలను సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు వివరించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. కాగా, దుబాయ్, అమెరికా, ఇంగ్లండ్ దేశాల పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల గవర్నర్ తల్లి మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సీఎం విజయవాడకు చేరుకుంటారు. -
టెక్నాలజీతోనే అభివృద్ధి సాధ్యం
సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వల్లే అభివృద్ధి, పారదర్శకత సాధ్యమని సీఎం ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. టెక్నాలజీ వినియోగానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. మంగళగిరి ఆటోనగర్‌లో పదెక రాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన పై డేటా సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా తాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో మమేకమయ్యానని చెప్పారు. ఆగస్టు 3న మంత్రివర్గ సమావేశం: రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 3న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన తాత్కాలిక సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. -
జీఎస్టీ సహా నాలుగు బిల్లులు
అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం సాక్షి, అమరావతి: ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ సహా మొత్తం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన చట్ట సవరణ బిల్లు, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు, ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతులిచ్చేందుకు చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆక్వా అనుమతులు, ఐటీ పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు కూడా సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ⇔ భూ విక్రయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లను నియంత్రించేందుకు ఇప్పుడున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ. రిజిష్ట్రేషన్ల చట్టం-1908లో మార్పులు తీసుకొచ్చే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం. దీనిప్రకారం ఒకే భూమిని ఇద్దరికి రిజిష్ట్రేషన్ చేయడానికి ఇకపై వీలు పడకుండా చర్యలు తీసుకుని సివిల్ తగాదాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం. ⇔ ఏపీ వ్యాట్ చట్టం 2005ని సవరించి పర్యాటక ప్రాంతాల్లోని త్రీ, ఫైవ్ స్టార్ హోటళ్లలో వ్యాట్ పన్ను 14.5 % నుంచి ఐదు శాతానికి తగ్గించేందుకు అనుమతి. మొబైల్ ఫోన్లపైనా పన్ను 5 శాతానికి తగ్గింపు. ఇందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయం. ⇔ బీసీ కమిషన్ సిఫారసుల మేరకు వెనుకబడిన తరగతుల జాబితాలోని సీరియల్ నెంబర్ 37 గ్రూపులో ఉన్న వడ్డె, వడ్డీలు, వడ్డి, వడ్డెలు అనే పదాలకు పర్యాయపదాలుగా వడ్డెర, వడ్డబోవి, వడ్డియరాజ్, వడ్డెర పదాలను చేర్చడానికి ఆమోదం. -
ఆధారం తెస్తేనే స్థానికత
మంత్రివర్గ సమావేశంలో చర్చ.. త్వరలో మార్గదర్శకాలు జారీ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చేవారు ఏదో ఒక ఆధారాన్ని సమర్పిస్తేనే స్థానికత ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. 2017 జూన్2లోగా ఏపీకి వచ్చిన వారికి స్థానికత ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ స్థానికతను ఎలా ఇవ్వాలో కేబినెట్లో చర్చించారు. ఏపీకి వచ్చేవారు తాము తెలంగాణలో నివసించిన ప్రాంత చిరునామాతో ఉన్న ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, కరెంటు బిల్లు వంటి వాటిల్లో ఒకదాన్ని సమర్పించేలా మార్గదర్శకాలు త్వరలో జారీ చేయాలని సీఎం సూచించారు. ఇలా ఇప్పటివరకూ తెలంగాణలో నివసిస్తున్నవారు లేదా ఉద్యోగరీత్యా ఏపీకి కేటాయించిన, బదిలీలపై వచ్చినవారు ఆ డాక్యుమెంట్లను ఏపీలో అధికారులకు సమర్పిస్తే వారికి స్థానికత సర్టిఫికెట్ ఇస్తారు. -
గ‘లీజు’
అప్పుడు ఐదేళ్లు .. ఇప్పుడు 35 ఏళ్లు కనుమరుగుకానున్న జిల్లా ఆస్పత్రి టీచింగ్ ఆస్పత్రిగా మారనున్న వైనం ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటు వైద్య సంస్థలకు అప్పగిస్తూ గత ఏడాది వివాదాస్పద నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో తప్పటడుగేసింది. ఐదేళ్లు ఉన్న లీజు కాలాన్ని 35 ఏళ్లకు పొడిగిస్తూ సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనివెనుక ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులందాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు (అర్బన్): జిల్లా కేంద్రంలో పేద రోగుల ఆలనాపాలనా చూసే ప్రభుత్వాస్పత్రి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని పూర్తిస్థాయిలో ప్రయివేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ‘లీజు’ ఒప్పందానికి తెరతీయడం విమర్శలకు తావిస్తోంది. ఆ ఒప్పందం వెనుక మార్కెట్లో ఎంబీబీఎస్‌పై ఇప్పటికీ క్రేజ్ ఉంది. యాజమాన్య కోటా కింద పేరొందిన పలు ఆస్పత్రులు ఒక్కో సీటుకు రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు డొనేషన్లు కట్టించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అపోలో వైద్య సంస్థలు చిత్తూరులో పాగావేసేందుకు పావులు కదిపాయి. కానీ ఇక్కడ పక్కా ఆస్పత్రి భవనం లేకపోవడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రాక్టీస్ చేసుకునేందుకు సిద్ధపడ్డాయి. ఈ మేరకు ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాయి. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు బోధన, ప్రాక్టికల్స్ చేయడానికి అనుమతివ్వాలని విన్నవించా యి. దీనిపై సర్కారు సానుకూలంగా స్పందించింది. గ‘లీజు’ ఒప్పందం అపోలో వైద్య సంస్థల అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ మేరకు గత ఏడాది ఆస్పత్రి భవనాన్ని ఐదేళ్లకు లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఐదేళ్ల తర్వాత అపోలో సంస్థ చిత్తూరు ఆస్పత్రిని వదలి వెళ్లాలి. క్లీనికల్ అటాచ్మెంట్ సమయంలో ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన పరికరాలు, ఇతర సాంకేతిక వ్యవస్థను సైతం అలాగే వదిలేయాలి. ఇలాచేస్తే అపోలో వైద్య సంస్థకు భారీగా నష్టం వాటిల్లే పమాదం ఉంది. అలా జరగకుండా ఉండేందుకు ఐదేళ్ల కాలాన్ని 35 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం లీజు ఒప్పందం కుదుర్చుకుంది. దీనివెనుక కొందరు ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారికి భారీ మొత్తంలో ముడుపులందాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి స్థాయిలో పాగా ఇప్పటికే చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అపోలో వైద్యులు, సిబ్బంది వైద్యసేవలందిస్తున్నారు. ఇక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం చిత్తూరు ఆస్పత్రిని సందర్శించి అనుమతి ఇచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ఇక్కడ పాగా వేసేందకు పావులు కదుపుతోంది. అక్కడ అలా.. కర్ణాటక రాష్ట్రంలో ఇదే తరహాలో ప్రభుత్వాస్పత్రిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తొలుత ఐదేళ్లు లీజుకు ఇచ్చారు. లీజుకాలం పూర్తయింది. కానీ ప్రభుత్వాస్పత్రిని ఖాళీ చేయలేదు. చిత్తూరు ఆస్పత్రిలో కూడా అదే తరహాలో అపోలో వైద్య సంస్థలు శాశ్వతంగా పాగా వేయనున్నాయి. ఈ మే రకు రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
సంకల్ప రాజధాని: సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రాష్ట్రంలోని 16 వేల గ్రామాల నుంచి సంకల్ప పత్రాలు తెప్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అందరి సంకల్పబలంతో రాజధానిని నిర్మిస్తామన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ఆయన ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను రాజధాని నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు ‘మన మట్టి-మన నీరు’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 13న అన్ని గ్రామాలవారు మట్టి, జలాలను సేకరిస్తారని, పూజలు చేసి 14, 15 తేదీల్లో మండల కేంద్రాలకు, 17వ తేదీన నియోజకవర్గ కేంద్రాలకు తీసుకొస్తారని వెల్లడించారు. 19వ తేదీ సాయంత్రానికి నీరు, మట్టి, సంకల్ప పత్రాలను గుంటూరు సమీపంలోని నాగార్జున వర్సిటీకి ఎదురుగా ఉన్న ప్రాంతానికి చేరుస్తారని, 20వ తేదీన శంకుస్థాపన జరిగే ప్రదేశం వద్దకు చేరుస్తారని వివరించారు. అక్కడ ఈ మట్టి, నీరును కలిపి దాన్ని శంకుస్థాపనకు వినియోగిస్తామన్నారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఈ మట్టిని వాడతామన్నారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏం చెప్పారంటే... ►విజయవాడ కనకదుర్గమ్మ, అమరావతి అమరేశ్వరాలయం, ఒక చర్చి, ఒక మసీదు నుంచి సంకల్ప జ్యోతులను శంకుస్థాపనకు తీసుకొస్తారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీతోపాటు జపాన్ మంత్రి మితో ఇసుకి తొ, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వస్తున్నారు. దేశంలో ముఖ్య నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు, అన్ని దేశాల రాయబారులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులను ఆహ్వానిస్తున్నాం. ►అనవసర ఖర్చులు లేకుండా.. పూర్తిస్థాయిలో మార్కెటింగ్ జరిగేలా జాగ్రత్తగా వ్యవహారించాలని అధికారులకు సూచించాం. శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానిస్తా. వీలైనంతవరకూ వారితో వివాదాలు లేకుండా సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. వివాదాల వల్ల వనరులు, సమయం వృథా అవుతున్నాయి. ►పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 కల్లా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం నిర్మాణ సంస్థకు సవరించిన అంచనాల ప్రకారం సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ►{పాజెక్టు మానిటరింగ్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసి గడువులోగా స్పిల్‌వే, ఎర్త్‌వర్క్ చేయిస్తాం. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోతే సెక్షన్ 16సీ ప్రకారం వేరే వాళ్లకు అప్పగిస్తాం. కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు కడతానన్నా మాకు అభ్యంతరం లేదు. రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చాలని నిర్ణయించాం. త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి కేంద్రానికి తెలియజేస్తాం. అన్ని రికార్డుల్లో ఈ మార్పు జరిగేలా చూస్తాం. నెల్లూరు జిల్లా ఎస్.కోట మండలంలో 52 ఎకరాలను పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి ఇవ్వాలని నిర్ణయించాం. కృష్ణపట్నం పోర్టుకు రైల్వే లైను నిర్మాణం కోసం రైల్వే శాఖకు తొమ్మిది ఎకరాలు ఇస్తున్నాం. ►రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సి ఉంది. ►{పత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలైపోతున్నాయని చెబుతున్నారు, ఇలా ఏ రాష్ట్రం కూడా స్వర్గంగా మారలేదు. -
మంత్రులకు సీఎం క్లాస్!
♦ విపక్షాల ఆరోపణలపై సరిగా స్పందించడం లేదని ఆగ్రహం ♦ అసెంబ్లీ సమావేశాల్లో సమర్థంగా వ్యవహరించాలని సూచన సాక్షి, హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలు సహా అనేక అంశాల్లో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సందర్భంలో మంత్రులు స్పందిస్తున్న తీరు ఏమాత్రం బాగా లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు దీటుగా స్పందించాలని సూచించినట్లు సమాచారం. శనివారం 5గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతుల ఆత్మహత్యలతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న అనేక ఆరోపణలపై చర్చ జరిగింది. నూతన పారిశ్రామిక విధానానికి అంతటా ప్రశంసలు వస్తున్నాయని, తన చైనా పర్యటన సందర్భంగా పారిశ్రామికవేత్తలు దీనిని గుర్తుచేశారని చెప్పిన సీఎం, ఇక్కడ కొందరు మంత్రులు మాత్రం ప్రతిపక్షాల ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏదో చెప్పబోతుండగా, ఆయన తీరు తాను ఆశించిన రీతిలో లేదని సీఎం ఒకింత ఆగ్రహంతో అన్నట్లు తెలిసింది. ఇదే అంశంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిపైనా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని, దీన్నీ ప్రతిపక్షాలు రాజకీయం చేసే ప్రయత్నం చేయడం దారుణమన్నట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ఎన్కౌంటర్ ప్రభుత్వానికి అపప్రథ తెచ్చిపెట్టిందన్న భావన వ్యక్తమైంది. అయితే హోం మంత్రి నాయిని వివరణతో కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కడిగి పారేస్తా..! వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపైనా క్షుణ్నంగా సమాధానాలు చెప్పాలని మంత్రులను సీఎం ఆదేశించారు. రైతుల ఆత్మహత్యలపై తాను సభలో వివరణ ఇస్తానని, కాంగ్రెస్ రాజకీయాన్ని కడిగి పారేస్తానని చెప్పినట్లు తెలిసింది. దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెప్పినప్పుడు మంత్రులంతా హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
పోలవరం పనులు సబ్ కాంట్రాక్టర్‌కు..!
తొలుత ‘రాక్‌ఫిల్ డ్యాం’ నిర్మాణం.. ♦ దశల వారీగా మిగతా పనులు ♦ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ♦ భారీగా అంచనా పెంపు.. సీఎం ఆదేశం! ♦ ముడుపుల కోసమేన్న సందేహాలు! సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ‘ట్రాన్స్ట్రాయ్’ నుంచి తీసుకొని సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పోలవరం నిర్మాణ పనులు చేస్తున్న ‘ట్రాన్స్ట్రాయ్’ వ్యవహారంపై బుధవారం రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ భేటీలో చర్చించారు. సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని, కాంట్రాక్టర్ ఎంపిక బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలనే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. సబ్ కాంట్రాక్టు వ్యవహారం అంతా సాఫీగా సాగాలని, ‘అవినీతి’ కనిపించని విధం గా ఉత్తర్వులను జాగ్రత్తగా రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించినట్లు తెలిసింది. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా చెప్పినట్లు అధికార వర్గాల సమాచారం. రాక్‌ఫిల్ డ్యాంతో మొదలు..:తొలుత రాక్‌ఫిల్ డ్యాంతో సబ్ కాంట్రాక్టు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ట్రాయ్, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ అంచనా వ్యయం రూ.700 కోట్లు. కాంట్రాక్టు దక్కించుకొని రెండేళ్లు కావస్తున్నా పనుల్లో పెద్దగా పురోగతి లేని విషయం విదితమే. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న రూ.250 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ మేరకూ పనులు జరగలేదు. ‘కాంట్రాక్టు కట్టబెట్టిన రెండేళ్ల తర్వాత.. ‘ట్రాన్స్ట్రాయ్’కి రాక్‌ఫిల్ డ్యాం నిర్మించిన అనుభవం లేదని ప్రభుత్వం గుర్తించింది. అనుభవం ఉన్న సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈమేరకు సబ్ కాంట్రాక్టు అప్పగిస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడతాయి’ అని పోలవరం పనులు పర్యవేక్షిస్తున్న సీనియర్ ఇంజనీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. చైనా కంపెనీకి భాగస్వామ్యం.. రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ పనులు అప్పగించడానికి వీలుగా సీఎం చైనా పర్యటనలో ఒక కంపెనీతో ‘అవగాహన’ కుదుర్చుకున్నారని సమాచారం. స్థానికంగా సీఎంకు ప్రీతిపాత్రమైన కంపెనీ, చైనా కంపెనీతో ‘జాయింట్ వెంచర్’ ఏర్పాటు చేయించడానికి తెర వెనక కసరత్తు పూర్తయిందని అధికార వర్గాలు తెలిపాయి. కాసులు దండుకోవడానికి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించే సమయంలోనే భారీగా పెంచితే విమర్శలు వస్తాయని, తొలుత కొంతమేర అంచనా వ్యయం పెంచి, దశలవారీగా పెంచుకుంటూ పోతే బాగుంటుందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతోందని తెలుస్తోంది. సబ్ కాంట్రాక్టు ఇవ్వనున్న కంపెనీలకు లాభం రావాలని, అదే మేర ప్రభుత్వ పెద్దలకూ అనుకున్నట్లుగా కాసులు రాలాలని, అందుకు అనుగుణంగానే ఉత్తర్వులు ఉంటాయని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారులంతా గురువారం రాజమండ్రిలోనే ఉన్నారని, శుక్రవారం నుంచి కసరత్తు ప్రారంభమవుతుందని, వచ్చే వారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఎన్నో సందేహాలు..: నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రాజెక్టు పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న నిర్ణయంతీసుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పనులను కేంద్రానికే అప్పగించాలి. అందుకు భిన్నంగా పనులను విభజించి సబ్ కాంట్రాక్టర్‌ను తెరమీదకు తేవడంలో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుతున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
సమ్మెపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: మున్సిపల్ కార్మికుల సమ్మెపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆందోళన విరమించి విధులకు హాజరైతేనే చర్చలకు సిద్ధమని, లేకుంటే కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించింది. రాజమండ్రి ఆర్అండ్బీ అతిథిగృహంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ జరిగింది.రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట మృతులకు ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డజడ్జితో న్యాయవిచారణ జరిపించాలని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్య తీసుకోవాలని నిర్ణయించారని సమాచారం. అలాగే ‘అప్పన్నకు ఐటీ నామం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కేబినెట్లో చర్చకు వచ్చిందని తెలిసింది. సింహాద్రి అప్పన్నకు విశాఖ మధురవాడలో ఉన్న రూ.250 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు 99 ఏళ్ల లీజుకు ఈ-సెంట్రిక్ సొల్యూషన్ అనే ఐటీ కంపెనీకి కట్టబెట్టేందుకే మొగ్గు చూపారని తెలిసింది. నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారని సమాచారం. కాగా, భేటీ అనంతరం సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. * కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బాలకొలను, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ పరిధిలోని సర్వే నంబర్ 433లో 2,297.13 ఎకరాలను డీఆర్డీఓ పరిధిలోని డిఫెన్స్ మిసైల్ టెస్టింగ్ సెంటర్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎకరాకు రూ.2 లక్షల చొప్పున చెల్లిస్తారు. రూ.500 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేస్తారు. * విశాఖ జిల్లా ఆరిలోవ, భానోజినగర్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 80 గజాల్లోపు ఇళ్లను క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరాల్లేని ఆక్రమణల్లో ఉన్న పేదలకు చెందిన ఇళ్లను క్రమబద్ధీకరిస్తారు. * అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను పరిరక్షించాలని నిర్ణయించారు. ఇందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. * భూ ఆక్రమణలు, భూకబ్జాలను తీవ్రంగా పరిగణించాలి. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను జీఓ 80 ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలపై జిల్లాల వారీగా సమగ్ర విచారణకు ఆదేశించారు.వాటి జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తారు. * అమరావతిలో రాష్ర్ట రాజధానిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో అరిహంత్, ఇండో ఆఫ్రికన్ ఇన్‌ఫ్రాడెవలపర్స్ అండ్ బిల్డర్స్ వద్ద 22.72 ఎకరాలను మంగళగిరి మండలం నవలూరులో ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి సమానమైన స్థలాన్ని కేపిటల్ రీజియన్ వెలుపల ఇస్తారు. * విశాఖపట్నంలోని అల్ఫ్రాటెక్ ఆధీనంలో ఉన్న 1,400 ఎకరాల్లో ప్రభుత్వం ఇచ్చిన సమయంలోగా నిర్మాణం చేపట్టనందున వాటిని స్వాధీనం చేసుకుని ఐటీ, పరిశ్రమలకు ఇవ్వాలని నిర్ణయించారు. * అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలని, ప్రధాని మోదీ సూచన మేరకు కజకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ వంటి దేశాల్లో పర్యటిస్తారు.తొలి దశలో మం త్రులు, రెండో దశలో సీఎం పర్యటించి తుది నిర్ణయం తీసుకుంటారు. * సీడ్ కేపిటల్, కేపిటల్ సిటీ. కేపిటల్ రీజియన్ రోడ్ మ్యాప్‌లను మంత్రివర్గం ఆమోదించింది. సీడ్ కేపిటల్‌కు అక్టోబర్ 22న 3వేల ఎకరాల్లో ప్రధానిచే శంకుస్థాపన చేయిస్తారు. సీఆర్డీఏ రెగ్యులేషన్ అథారిటీగాను, సీసీడీఏ ఆపరేషన్ అథారిటీగాను ఉంటాయి. అమరావతి అభివృద్ధికి సింగపూర్, జపాన్ ప్రభుత్వాలను ఆహ్వానిస్తారు. ప్రపంచ పారిశ్రామిక రాజధానిగా ఉన్న షాంఘై మాదిరిగా ఆసియా దేశాలకు అమరావతి కేపిటల్ సిటీ నిర్మించాలని నిర్ణయించారు. * పట్టిసీమకు ఆగస్ట్ 15లోగా మొదటి దశలో నీటిని విడుదల చేయాలని, పోలవరం సకాలంలో పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పట్టిసీమకు 266 ఎస్కులేటర్లు ఏర్పాటు చేస్తారు. * 25న పుష్కరాల ముగింపు రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఇంటిలో పుష్కర దీపారాధన చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. అదే రోజు గోదావరికి హారతి, లేజర్‌షో నిర్వహిస్తారు. సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ నుంచి మంత్రులు, అధికారుల కార్యాలయాలను మంగళగిరికి తరలించాలని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తీర్మానించారు. -
పీఆర్సీపై కేబినెట్ గప్‌చుప్!
ఒక్కమాటైనా మాట్లాడని సీఎం తీవ్ర నిరాశలో ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ అమలు విషయంపై సోమవారం నాటి రాష్ట్ర మంత్రివర్గ భేటీలో ‘ఏ దో జరిగిపోతుంది’ అని వెయ్యికళ్లతో ఎదురుచూసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మంత్రి వర్గం మొత్తం పీఆర్సీ విషయంపై ఒక్కమాటైనా మాట్లాడకుండా మౌనం దాల్చింది. దీంతో తమ సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంతమాత్రమూ చిత్తశుద్ధి లేదని ఉద్యోగులు వాపోతున్నారు. అదేసమయంలో హెల్త్‌కార్డులు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఉద్యమ బాటపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఉద్యోగులు తమ జేఏసీ వైఖరిని తప్పుబట్టారు. సకాలంలో ఉద్యోగ సంఘాల జేఏసీ స్పందించలేదని మెజారిటీ ఉద్యోగులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో.. మంగళవారం నిర్వహించనున్న ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యవర్గ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఉద్యమబాట పడుతూ కార్యాచరణను సిద్ధం చేసే అవకాశముంది. రేపు ఉపసంఘం తొలి భేటీ: పీఆర్సీ అమలుపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి బుధవారం భేటీ కానుంది.