ఆధారం తెస్తేనే స్థానికత
మంత్రివర్గ సమావేశంలో చర్చ.. త్వరలో మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చేవారు ఏదో ఒక ఆధారాన్ని సమర్పిస్తేనే స్థానికత ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. 2017 జూన్2లోగా ఏపీకి వచ్చిన వారికి స్థానికత ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ స్థానికతను ఎలా ఇవ్వాలో కేబినెట్‌లో చర్చించారు.
ఏపీకి వచ్చేవారు తాము తెలంగాణలో నివసించిన ప్రాంత చిరునామాతో ఉన్న ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, కరెంటు బిల్లు వంటి వాటిల్లో ఒకదాన్ని సమర్పించేలా మార్గదర్శకాలు త్వరలో జారీ చేయాలని సీఎం సూచించారు. ఇలా ఇప్పటివరకూ తెలంగాణలో నివసిస్తున్నవారు లేదా ఉద్యోగరీత్యా ఏపీకి కేటాయించిన, బదిలీలపై వచ్చినవారు ఆ డాక్యుమెంట్లను ఏపీలో అధికారులకు సమర్పిస్తే వారికి స్థానికత సర్టిఫికెట్ ఇస్తారు.