న్యూఢిల్లీ/బెంగళూరు: భారతదేశం విభిన్న సమస్యల పరిష్కారాల కోసం ఆదర్శవంతమైన ఒక ప్రయోగశాల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాలను ప్రపంచంలో ఎక్కడైనా సులభంగా అన్వయించవచ్చని నొక్కి చెప్పారు. బెంగళూరులో శనివారం జరిగిన జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మంత్రుల సమావేశంలో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు.
భారత్‌లోని డిజిటల్ మౌలిక వసతులతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సురక్షితమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రపంచంతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘భారత్ ఎంతో వైవిధ్యం కలిగిన దేశం. మాకు డజన్ల కొద్దీ భాషలు, వందలాదిగా మాండలికాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మతానికి, అసంఖ్యాక సాంస్కృతిక వారసత్వాలకు భారత్ నిలయం. ప్రాచీన సంప్రదాయాల నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు, ప్రతి ఒక్కరికీ అవసరమైనవి భారత్‌లో ఉన్నాయి.
అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాన్ని ప్రపంచంలో ఎక్కడైనా సులువుగా అన్వయించుకోవచ్చు’అని ప్రధాని చెప్పారు. డిజిటల్ సాంకేతికతలో అన్ని దేశాలను భాగస్వా ములను చేసేలా వర్చువల్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
డిజిటల్ ఎకానమీ విస్తరించే కొద్దీ భద్రతా పరమైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జీ20 దేశాల మధ్య ఏకాభిప్రాయంతో విశ్వసనీయమైన, సురక్షితమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షిత, సమ్మిళిత, శ్రేయస్కరమైన గ్లోబల్ డిజిటల్ భవిష్యత్తు కోసం జీ20 దేశాలకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆర్థికంగా, సాంకేతికతపరంగా భారత్ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. భాషల అనువాదం కోసం ‘భాషిణి’అనే కృత్రిమ మేధను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
జన్‌ధన్ ఖాతాలు 50 కోట్లు
జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు 50 కోట్లు దాటిపోవడం కీలక మైలురాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో సగానికి పైగా ఖాతాలు మహిళలవేనని చెప్పారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కు దాటిందని, ఇందులో 56 శాతం మహిళలకు చెందినవేనని శుక్రవారం ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2014లో జన్‌ధన్ ఖాతాల కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment