Laboratory
-
భారత్ ఒక ప్రయోగశాల
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ యథాలాపంగా చెప్పిన ఒక వాక్యం వివాదాస్పదమైంది. తరచూ భారత్‌ను పొగిడే బిల్‌గేట్స్ ఒక్కసారిగా భారత్‌ను ప్రయోగశాలతో పోల్చడమేంటని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రీడ్ హాఫ్మన్తో నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్ చర్చావేదికలో భారత ప్రస్థానాన్ని బిల్‌గేట్స్ ప్రస్తావించారు. ‘‘ జనాభాపరంగా అతిపెద్దదైన భారత్‌లోనూ ఆరోగ్యం, పోషకాహారం, విద్యారంగాలు అభివృద్ధిబాటలో పయనిస్తున్నాయి.భారతీయులు సుస్థిరాభివృద్ధిని మాత్రమేకాదు సుస్థిర ప్రభుత్వా దాయాలను సమకూర్చుకుంటున్నారు. వచ్చే 20 ఏళ్లలో అక్కడి ప్రజలు మరింత పురోభివృద్దిని సాధించగలరు. భారత్ వెలుపల కంటే భారత్‌లో తమను తాము నిరూపించుకునేందుకు ఆ దేశం నిజంగా ఒక ప్రయోగశాల. అమెరికా వెలుపల మా అతిపెద్ద కార్యాలయం భారత్‌లోనే ఉంది. ప్రపంచంలో మరెక్కడా పైలట్ ప్రాజెక్టులు మేం చేపట్టినా మా భాగస్వాములు మాత్రం ఇండియా నుంచే ఉంటున్నారు. మీరుగనక భారత్‌కు వెళ్లి అక్కడి వీధుల్లో గమనిస్తే ఆదాయంలో చాలా తారతమ్యాలు ఉన్న వ్యక్తులు కోకొల్లలుగా కనిపిస్తారు. అయినా సరే మీరు అక్కడి వైవిధ్యాన్ని ఆస్వాదించగలరు’’ అని అన్నారు. వెల్లువెత్తిన విమర్శలుభారత్ను ప్రయోగశాలగా పోల్చడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ‘‘ తమ ప్రయోగాత్మక ఔషధాలను ప్రయోగించడానికి భారత్‌ను ఒక ల్యాబ్‌లాగా వాడుకుంటున్నారు. అయినాసరే ఇలాంటి పెద్దమనుషులు మనల్ని గినీ పందుల్లా వాడుకునేందుకు మన ప్రభుత్వాలే అనుమ తిస్తున్నాయి. దిగ్భ్రాంతికరం. సిగ్గుపడాల్సిన విషయం’’ అని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మా దేశం మీకొక ప్రయో గశాల అనుకుంటున్నారా?. అయితే దేశం విడిచి వెళ్లిపొండి’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యా నించారు. ‘‘ బిల్‌గేట్స్ భారతీయ మీడియా మొదలు విపక్షం, అధికార పక్షం ద్వారా ప్రతి వ్యవస్థనూ తనకు అనుకూలంగా మార్చుకుందన్నారు. మనమెప్పుడు మేల్కొంటామో’’ అని ఇంకో నెటిజన్ ఆవేదన వ్యక్తంచేశారు. -
నింగిలోకి కృత్రిమమేధ ప్రయోగశాల
పలు విజయవంతమైన ప్రయోగాలతో అంతరిక్షరంగంలో తనదైన ముద్ర వేసిన భారత్ మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. ఈ సాహసోపేత కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్షరంగ సంస్థ కీలక భాగస్వామిగా ఉండటం విశేషం. భారత్‌లో తయారుచేసిన కృత్రిమమేధ పరిశోధనశాలను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టేక్మీటూస్పేస్ సంస్థ తయారుచేసిన ‘మై ఆర్టిటార్ ఇన్ఫ్రాస్టక్చర్– టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ (ఎంఓఐ–టీడీ)’ ల్యాబ్‌ను నింగిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ కృత్రిమమేధ ల్యాబ్‌ను ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి ఇది ఉపగ్రహం అయినప్పటికీ పూర్తిస్థాయి పరిశోధనశాలలాగా పనిచేయగల సత్తా దీని సొంతం. అందుకే అంతరిక్షంలో పనిచేయనున్న భారత మొట్టమొదటి కృత్రిమమేధ ల్యాబ్‌గా ఇది చరిత్ర సృష్టించనుంది. డిసెంబర్ నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న ప్రయోగకేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగిస్తారు. కక్ష్యలో తిరుగుతూ ఎప్పటికప్పుడు డేటాను ప్రాసెసింగ్ చేయడం ద్వారా అంతరిక్ష పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చే ఉద్దేశంతో ఏఐ ల్యాబ్‌ను పంపుతున్నారు. ప్రైవేట్, విదేశీ ఉపగ్రహాల ప్రయోగ బాధ్యతలను చూసుకునే భారత ప్రభుత్వ మరో విభాగమైన ‘ఇన్–స్పేస్’ వారి టెక్నాలజీ సెంటర్ నుంచి ఎంఓఐ–టీడీకి కీలకమైన సాయం అందింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఇన్–స్పేస్ సంస్థ ఎంఓఐ–టీడీ టెస్టింగ్ తదితర బాధ్యతలను చూసుకుంది. అత్యంత భారీ డేటాను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి భూమి మీదకు పంపడం ఉపగ్రహ కార్యక్రమాల్లో పెద్ద సవాల్‌తో కూడిన వ్యవహారం. ప్రస్తుతం ఏదైనా శాటిలైట్ గరిష్టంగా రోజుకు 1 పెటాబైట్ డేటాను మాత్రమే సంగ్రహించగలదు. ప్రస్తుతం ‘క్లౌడ్ కవర్’ దృగ్విషయం కారణంగా 40 శాతం ఉపగ్రహ సమాచారం నిరుపయోగం అవుతోంది. వచ్చిన డేటాను ప్రాసెస్ చేయడానికి వారాల తరబడి వేచి ఉండక తప్పని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏఐ ల్యాబ్‌ను రంగంలోకి దించారు. అత్యంత వేగంగా డేటా ప్రాసెసింగ్‌కు ఈ ఏఐ ల్యాబ్ సుసాధ్యం చేయనుంది. అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుకు..రియాక్షన్ వీల్స్, మ్యాగ్నటార్కర్స్, ఏఐ యాక్సిలిరేటర్లు, అత్యాధునిక కంట్రోల్ సిస్టమ్‌తో ఏఐ ల్యాబ్‌ను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు. ఏఐ ల్యాబ్ త్వరగా ‘కౌడ్ డేటా’ వంటి అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుకూ బాటలువేయనుంది. ఎర్త్ అబ్జర్వేషన్ సామర్థ్యాలను ద్విగుణీకృతం చేయడమేకాకుండా అంతరిక్ష ఆధారిత కంప్యూటింగ్ టెక్నాలజీల అభివృద్ధికి ఇదొక వేదికగా అక్కరకు రానుంది. ల్యాబ్‌కు అదనంగా సౌర ఫలకాలను అమర్చారు. ఇవి భవిష్యత్తులో దీనికి అనుసంధానంగా రాబోయే శాటిలైట్ల ఇంధన అవసరాలను తీర్చగలవు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా–3 మిషన్‌లో భాగంగా డిసెంబర్లో ప్రయోగించే పీఎస్ఎల్వీ–సీ60 రాకెట్‌లోనే ఏఐ ల్యాబ్‌నూ అమర్చుతున్నారు. ఎన్నెన్నో ఉపయోగాలుఅక్కడి శాటిలైట్లు సేకరించే సమాచారాన్ని ఈ ఏఐ ల్యాబ్ వేగంగా ప్రాసెస్‌చేసి సంబంధిత యూజర్లకు అనువుగా అందిస్తుంది. దీంతో పర్యావరణంపై పర్యవేక్షణ తో పాటు అడవుల నరికివేత, హరితఉద్గారాల పరిమాణం తదితర ఎన్నో అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందొచ్చు. దీంతో భిన్న రంగాలకు సంబంధించిన పరిశోధకులు తమకు కావాల్సిన సమాచారాన్ని ఆర్బిట్ల్యాబ్ నుంచి నేరుగా సంప్రతింపులు జరిపి పొందొచ్చు. వేర్వేరు అప్లికేషన్లకు సంబంధించిన కృత్రిమమేధ మాడ్యూళ్లను అప్లోడ్ చేసి ఈ వెబ్ ఆధారిత కన్సోల్‌తో అనుసంధానం కావచ్చు. ఇప్పటికే మలేసియా విశ్వవిద్యాలయంతోపాటు భారతీయ విద్యార్థుల బృందమొకటి ఇందుకోసం తమ పేర్లను నమోదుచేసుకుంది. ఎక్కువ మంది యూజర్లు పెరిగేకొద్దీ ఆయా పరిశోధకులయ్యే ఖర్చు సైతం భారీగా తగ్గనుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ప్రయోగశాల!
శాస్త్ర పరిశోధనలను లోతుగా సాగించడం సర్వసాధారణం. అలాగని వాటి కోసం ప్రయోగశాలలను లోతైన ప్రదేశాలలో భూగర్భంలో నిర్మించడం మాత్రం విడ్డూరమే! ఈ విడ్డూరం చైనాలోనిది. ప్రపంచంలోనే అత్యంత లోతైన లాబొరేటరీని చైనా నిర్మిస్తోంది. భూమికి ఏకంగా 2,400 మీటర్ల లోతైన చోట నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ప్రయోగశాలగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ‘డీప్ అండర్‌గ్రౌండ్ అండ్ అల్ట్రా లో రేడియేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఫెసిలిటీ’ పేరుతో సింఘువా యూనివర్సిటీ, యలాంగ్ రివర్ హైడ్రోపవర్ డెవలప్మెంట్ కంపెనీలు కలసి 2020 డిసెంబర్ నుంచి ఈ లాబొరేటరీ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాయి. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిన్‌పింగ్ పర్వతం దిగువన నిర్మానుష్య ప్రదేశంలో నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ గురించిన వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 120 ఒలింపిక్ స్విమింగ్ పూల్స్‌తో సమానమైన లోతులో నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ ఘన పరిమాణం 330,000 క్యూబిక్ మీటర్లు. చైనా నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ విస్తీర్ణం ఇటలీలోని గ్రాన్ సాసో నేషనల్ లాబొరేటరీ కంటే ఎక్కువే! ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ లాబొరేటరీగా గుర్తింపు పొందిన గ్రాన్ సాసో లాబొరేటరీ చైనా దెబ్బకు రెండో స్థానానికి చేరుకుంది. ఇంతకీ ఈ లోతైన భూగర్భ ప్రయోగశాలలో దేని గురించి అంత లోతైన పరిశోధనలు సాగిస్తారనుకుంటున్నారా? ఇక్కడ కృష్ణ పదార్థం (డార్క్ మేటర్) గురించి పరిశోధనలు సాగిస్తారట! అందువల్ల ఏమాత్రం సూర్యకిరణాలు సోకని రీతిలో, రేడియేషన్ ప్రభావం తాకని రీతిలో దీనిని నిర్మిస్తున్నారట!. -
డాక్టర్ రెడ్డీస్ చేతికి మెనో ల్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా అమెరికాకు చెందిన మహిళల ఆరోగ్య సంరక్షణ, సప్లిమెంట్స్ ఉత్పత్తుల సంస్థ మెనోల్యాబ్స్ను కొనుగోలు చేసింది. అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ అమిరిస్లో భాగమైన మెనోల్యాబ్స్ను దివాలా కోడ్ ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. మెనోల్యాబ్స్ పోర్ట్‌ఫోలియోలో ఏడు బ్రాండెడ్ ఉత్పత్తులు, యాప్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. మహిళల పౌష్టికాహార, వెల్నెస్ ఉత్పత్తుల మార్కెట్లో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు మెనోల్యాబ్స్ కొనుగోలు ఉపయోగపడగలదని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్తర అమెరికా విభాగం సీఈవో మార్క్ కికుచి తెలిపారు. మెనోల్యాబ్స్ అమెరికాలో తమ సొంత ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్‌తో పాటు అమెజాన్, వాల్‌మార్ట్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
ఇక కల్తీనీ ఇట్టే పసిగట్టొచ్చు
సాక్షి, అమరావతి: పాలు, పాల ఉత్పతుల్లో విషపూరిత రసాయనాలు, ఆహార పదార్థాలు, మంచినీరు, మాంసం, గుడ్లు, రొయ్యలు, ఎరువులు, మందుల్లో కల్తీని ఇక ఇట్టే పసిగట్టవచ్చు. ఇందుకోసం రూ.11 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన దేశంలోనే తొలి అతిపెద్ద స్టేట్ సెంట్రల్ లేబోరేటరీ అందుబాటులోకి వచ్చింది. పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్‌స్టాక్ (ఏపీ కార్ల) ప్రాంగణంలో ఈ అత్యాధునిక లేబరేటరీని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. దీంతో పాలల్లో నాణ్యతను అంచనా వేసేందుకు రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాల డెయిరీల్లో హై ఎండ్ ఎక్యూప్మెంట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసినట్లయింది. 100కు పైగా పరీక్షలు చేసే వెసులుబాటు రాష్ట్ర పరిధిలోని శాంపిల్స్‌ను పరీక్షించేందుకు ఇప్పటి వరకు కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు పంపేవారు. దూరాభారం కావడంతో ఒక్కో శాంపిల్‌కు రూ.2,500 నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యేది. కాగా రూ.3కోట్లతో నిర్మించిన పులివెందుల లే»ొరేటరీలో రూ.8 కోట్లతో ఇందుకు సంబంధించి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. వందకుపైగా పరీక్షలు నిర్వహించేలా ఈ ల్యాబ్‌ను తీర్చిదిద్దారు. సుమారు 15 మంది నిష్ణాతులైన సిబ్బందిని నియమించారు. వీరిలో 8 మంది శాస్త్రవేత్తలతో పాటు జూనియర్, సీనియర్ ఎనలిస్ట్‌లు ఉంటారు. కాగా, ఆర్నెల్ల తర్వాత నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్‌ఎబీఎల్) నుంచి ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేస్తారు. నిర్దేశిత గడువులోగా ఫలితాలు.. పాలు, పాల ఉత్పత్తులతో పాటు తేనె, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, ప్యాక్డ్ ఫుడ్, స్వీట్స్, జెల్లీ, కాన్పెక్టనరీస్, మాంసం, రొయ్యలు, గుడ్లు, గ్రాస్ సీడ్స్‌లలో కొవ్వు, ప్రొటీన్, ఎస్ఎన్ఎఫ్, నాన్ ప్రొటీన్ నైట్రోజెన్, పెస్టిసైడ్స్, యాంటిబయోటిక్స్, హెవీ మెటల్స్, కల్తీలు (అడాల్టరెంట్స్) ఇతర కలుషితాల (కంటామినెంట్ ఎలిమెంట్స్)ను 36–48 గంటల్లోపే పరీక్షిస్తారు. కాగా వీటిల్లో బ్యాక్టీరియల్ అవశేషాలను 4–5 గంటల్లో గుర్తిస్తారు. అదే మాంసం, రొయ్యలు, గుడ్లతో పాటు గ్రాస్ సీడ్స్, ఎరువులు, వేస్ట్ వాటర్‌లో ప్రొటీన్, నాన్ ప్రొటీన్ నైట్రోజెన్ అవశేషాలను 4–6 గంటల్లోనూ పసి గట్టవచ్చు. తాగునీరులో పోషక లోపాలు, కలుషితాలను 1–2 గంటల్లోనూ, ఫార్మా మందుల్లో 24గంటల్లో, ఇన్ప్యూరిటీ ఎనాలసిస్ (మలినాలు)ను 25 గంటల్లోనూ, ఖనిజాలు, పోషక లోపాలను 36 గంటల్లోనూ, ప్రీ క్లీనికల్, క్లినికల్ ఎనాలసిస్ను 15 రోజుల్లోనూ పరీక్షిస్తారు. తనిఖీల్లో గుర్తించిన శాంపిల్స్‌ను ఆయా డిపార్టుమెంట్లు ఈ లే»ొరేటరీకి పంపితే నిర్ధేశిత గడువులోగా విశ్లేషిoచి ఫలితాలతో కూడిన నివేదికలను అందజేస్తారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు సైతం ఈ లేబోరేటరీ సేవలను ఉపయోగించుకోవచ్చు. అవశేషాలను గుర్తించడం ఇక సులభం అత్యాధునిక స్టేట్ సెంట్రల్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, ఎరువులు,తాగునీరు, మందులు, మాంసం, గుడ్లు, రొయ్యల్లో పురుగు మందుల అవశేషాలు, యాంటీబయాటిక్, పశువైద్య అవశేషాలు, భారీలోహాలు, మైక్రో టాక్సిన్లు, వ్యాధి కారకాలను నిర్ధేశిత గడువులోగా గుర్తించొచ్చు. భౌతిక, రసాయన, జీవ నాణ్యతను విశ్లేషిoచి ద్రువీకరణ పత్రాలు పొందొచ్చు. కల్తీలకు ఇక పూర్తిగా చెక్ పెట్టొచ్చు. – అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
G20 Ministerial Meet: భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల
న్యూఢిల్లీ/బెంగళూరు: భారతదేశం విభిన్న సమస్యల పరిష్కారాల కోసం ఆదర్శవంతమైన ఒక ప్రయోగశాల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాలను ప్రపంచంలో ఎక్కడైనా సులభంగా అన్వయించవచ్చని నొక్కి చెప్పారు. బెంగళూరులో శనివారం జరిగిన జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మంత్రుల సమావేశంలో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. భారత్‌లోని డిజిటల్ మౌలిక వసతులతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సురక్షితమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రపంచంతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘భారత్ ఎంతో వైవిధ్యం కలిగిన దేశం. మాకు డజన్ల కొద్దీ భాషలు, వందలాదిగా మాండలికాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మతానికి, అసంఖ్యాక సాంస్కృతిక వారసత్వాలకు భారత్ నిలయం. ప్రాచీన సంప్రదాయాల నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు, ప్రతి ఒక్కరికీ అవసరమైనవి భారత్‌లో ఉన్నాయి. అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాన్ని ప్రపంచంలో ఎక్కడైనా సులువుగా అన్వయించుకోవచ్చు’అని ప్రధాని చెప్పారు. డిజిటల్ సాంకేతికతలో అన్ని దేశాలను భాగస్వా ములను చేసేలా వర్చువల్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. డిజిటల్ ఎకానమీ విస్తరించే కొద్దీ భద్రతా పరమైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జీ20 దేశాల మధ్య ఏకాభిప్రాయంతో విశ్వసనీయమైన, సురక్షితమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షిత, సమ్మిళిత, శ్రేయస్కరమైన గ్లోబల్ డిజిటల్ భవిష్యత్తు కోసం జీ20 దేశాలకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆర్థికంగా, సాంకేతికతపరంగా భారత్ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. భాషల అనువాదం కోసం ‘భాషిణి’అనే కృత్రిమ మేధను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. జన్‌ధన్ ఖాతాలు 50 కోట్లు జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు 50 కోట్లు దాటిపోవడం కీలక మైలురాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో సగానికి పైగా ఖాతాలు మహిళలవేనని చెప్పారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కు దాటిందని, ఇందులో 56 శాతం మహిళలకు చెందినవేనని శుక్రవారం ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2014లో జన్‌ధన్ ఖాతాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు!
కొందరు విదేశీయులు అద్దెకు ఇంటిని తీసుకున్న అందులో ల్యాబరేటరీని ఏర్పరుచుకుని డ్రగ్స్ తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ముఠా గుట్టు రట్టు చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. ఈ దాడిలో నిందితులతో పాటు కోట్ల విలువైన మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సమాచారం మేరకు గ్రేటర్ నోయిడాలోని ఓ భవనంపై పోలీసులు దాడి చేశారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేశామని, అంతర్జాతీయ మార్కెట్లో రూ.200 కోట్ల విలువైన 46 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. తొమ్మిది మంది విదేశీయులు గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ తీటా 2లో ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. పోలీసులుకు సమాచారం అందడంతో ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు సుమారు 100 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ముడిసరుకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ముడిసరుకులో మిథైల్ ఆల్కహాల్, హైపో ఫాస్ఫారిక్ యాసిడ్, హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్, అయోడిన్ క్రిస్టల్స్, అమ్మోనియా, ఎఫిడ్రిన్, అసిటోన్, సల్ఫర్, కాపర్ సాల్ట్ ఉన్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిని అనుదుమ్ ఇమ్మాన్యుయేల్, అజోకు ఉబాకా, డేనియల్ అజుహ్, లెవి ఉజోచుక్వ్, జాకబ్ ఎమెఫీలే, కోఫీ, చిడి ఇజియాగ్వా (ఎనిమిది మంది నైజీరియాకు చెందినవారు), డ్రామెమండ్ (సెనెగల్‌కు చెందినవారు)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రెండు మూడు రోజులకు ఒక పోలీసు మృతి.. ఐదేళ్లలో 821 మంది -
150ఏళ్ల నాటి మానవ అస్తిపంజరం అక్కడ చూడొచ్చు!
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): మారుతున్న జనరేషన్..నానాటికీ అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగానికి ప్రయోగం అనేది అత్యంత కీలకం. మనిషి పుట్టుక ఎలా? తల్లి గర్భంలో శిశువు.. వందల ఏళ్ల నాటి జంతు కలేబరాలు.. వివిధ రకాల జలచరాలు. శతాబ్దంన్నర నాటి మానవ అస్తిపంజిరం. ఇలా.. మానవ.. జంతు పుట్టుకలతో కూడుకున్న ప్రయోగశాల విశాఖ మహానగరంలో ఒకే ఒక కళా శాలలో ఉంది. అదే ఏళ్ల చరిత్ర గల ఏవీఎన్ కళాశాల. ఏవీఎన్ కళాశాలలో స్వాతంత్య్రం రాకముందు జువాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌తో పాటు మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగశాల/మ్యూజియంలో విశాఖలో మరెక్కడా దొరకని.. లభించని అనేక వస్తువులు పొందుపరిచారు. ఈ మ్యూజియంలో వేలాది స్పెసిమెన్స్, 100కు పైగా ఓస్టీయాలజీ స్పెసిమెన్స్, 75 రకాల మోడల్ స్పెసిమెన్స్తో పాటు 878 బాటిల్ స్పెసిమెన్స్, 700 పర్మినెంట్ స్లైడర్స్ ఉన్నాయి. మానవుని పూర్తి అస్తిపంజిరం (ఒరిజనల్), డాల్ఫిన్ అస్తిపంజిరం, ఏనుగు పుర్రె, హ్యూమన్ బ్రెయిన్, 6,7,8 నెలల మానవ పిండాలు, మానవుని గుండె, రెండు తలల బాతుపిల్ల, ఫైవ్ లెగ్డ్ ఫ్రాగ్, తొండం గల పంది పిండం..ఇలా ఎన్నెన్నో మానవుని..జంతువుల అవయవాలు సేకరించారు. అంతేగాక మైక్రోస్కోప్స్..మోనుక్యులర్ అండ్ బైనాక్యులర్, ఆటోక్లేవ్స్, సెంట్రిఫూగ్స్, ఎపిడయోస్కోప్, ఫొటోగ్రఫి ఎక్విప్మెంట్, రోటరీ మైక్రోటోమ్, డైనోసర్,హిమోగ్లోబిన్మీటర్స్, హిమోసైటోమీటర్స్, వాటర్ బాత్..సెవరల్ బయాలజికల్ చార్ట్స్ ఉన్నాయి. వీరంతా ఇక్కడి వారే.. ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్, మెరైన్ లివింగ్ రిసోర్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కేవీ రమణమూర్తి, ఏయూ జువాలజీ విభాగ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ లలితకుమారి, ఆంధ్రా మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ బి.దాలినాయిడుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేసిన కేవీ రావు, తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ కె.సత్యగోపాల్, న్యూఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పి.రమేష్‌నాయుడు, సినీ ప్రముఖుడు ఎస్వీ రంగారావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, మాజీ మేయర్ రాజాన రమణి, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, సైంటిస్ట్ డాక్టర్ శొంటి రమేష్‌తో పాటు ఎందరో ఇదే కళాశాలలో..ఇదే విభాగంలో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్లారు. కళాశాల జువాలజీ.. ఫిషరీస్ విభాగాధిపతులు వీరే.. 1940లో కళాశాలలో జువాలజీ విభాగం ఏర్పాటు చేశారు. అప్పట్లో ఎ.శ్రీనివాస్ విభాగాధిపతిగా సేవలందించారు. అనంతరం 1945 నుంచి 1975వరకు వీఎస్ వేంకటేశ్వర్లు, 1975 నుంచి 1990 వరకు బీహెచ్‌వీ సీతారామస్వామి, 1990 నుంచి 1993 వరకు డాక్టర్ బి.నాగేశ్వరరావు, 1993 నుంచి 2002 వరకు డాక్టర్ జి.శివరామకృష్ణ, 2002 నుంచి 2010 వరకు బి.విజయభాస్కరరావు విభాగాధిపతులుగా సేవలందించగా 2010 నుంచి ఇప్పటి వరకు డాక్టర్ కె.పుష్పరాజు విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు.. గ్రేటర్ విశాఖ పరిధిలోనే గాక ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరెక్కడా లేని ప్రయోగశాల/మ్యూజియం ఏవీఎన్లోనే ఉంది. ఎంతో మంది ఈ కళాశాల నుంచే ఉన్నత పదవులు అధిరోహించారు. మానవ పిండాలకు సంబంధించి ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థులు కూడా తరచూ ఇక్కడకే వస్తుంటారు. –ఆచార్య డి.విజయప్రకాష్, ప్రిన్సిపాల్, ఏవీఎన్ కాలేజ్ చాలా అరుదైనది ఏవీఎన్ కళాశాల జువాలజీ నుంచి సినీ నటుడు ఎస్వీ రంగారావు, ఐఏఎస్ అధికారి కేవీ రావు వంటి వారు ఎందరో ఇక్కడే విద్యనభ్యసించారు. ఏవీఎన్ కళాశాల జువాలజీ మ్యూజియంలో అరుదైన స్పెసిమెన్లలో సహజ మానవ అస్తిపంజిరం, డాల్ఫిన్ అస్తి పంజిరం, 6,7,8 నెలల మానవ పిండాలు, రెండు తలల బాతు పిల్ల, తొండం గల పంది పిండం వంటివి ఎన్నో సేకరించాం. –రాంకుమార్, జువాలజీ ఇన్చార్జి -
పశువీర్య ఉత్పత్తిలో నంద్యాలదే అగ్రస్థానం
సాక్షి, బొమ్మల సత్రం(కర్నూలు): పశుజాతి అంతరించిపోతున్న ఈ రోజుల్లో నాణ్యమైన వీర్యాన్ని అందించి పశువులను ఉత్పత్తి చేయడంలో నంద్యాల ఘనీకృత వీర్యకేంద్రం కీలకం పాత్ర పోషిస్తుంది. ఏడాదికి 10 లక్షల నుండి 20 లక్షల వరకు డోస్‌ల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ సంస్థలో 10 జాతుల పశువులను వీర్యాన్ని సేకరించి భద్రపరిచి అవసరమైన జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలో కూడా ఈ కేంద్రం నుండి వీర్యాన్ని సరఫరా చేస్తున్నారు. నంద్యాల పశుగణాభివృద్ధి సంస్థ, ఘనీకృత వీర్యకేంద్రంపై సాక్షి ప్రత్యేక కథనం. పట్టణంలోని కడప – కర్నూలు జాతీయ రహదారి పక్కన నూనెపల్లెలోని 15.27 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ పశుగణనాభివృద్ధి సంస్థ, ఘనీకృత వీర్యకేంద్రం ఉంది. ఈ కేంద్రం 1976 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన నంద్యాలలో ప్రారంభించారు. ఈ ఘనీకృత వీర్య కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, సిబ్బంది పని చేస్తున్నారు. 15.27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఘనీకృత వీర్య కేంద్రం 5 ఎకరాలలో భవనాలు ఉండగా 10.27 ఎకరాలలో ఆబోతులకు కావాల్సిన సూపర్ నేపియర్, కాకిజొన్న, గనిగడ్డి లాంటి నాణ్యమైన పశుగ్రాసాన్ని పండిస్తున్నారు. వీర్య నాశికలను సరైన సమయంలో ఉత్పత్తి చేసి సరఫరా చేయడం. నిరంతరం వీర్య నాణ్యతను పరిశీలిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచించిన మినిమం స్టాండెడ్స్ ప్రోటోకాల్‌ను పాటించడం ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం.1982లో ఘనీకృత పశువీర్యాన్ని నంద్యాలలోనే ఉత్పత్తి చేయడం ప్రారంభించి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరఫరా చేశారు. 2000 సంవత్సరంలో ఈ కేంద్రం అభివృద్ధి చెంది ఆంధప్రదేశ్ పశుగణనాభివృద్ధి సంస్థలో చేర్చారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రంలో పలుజాతుల పశువుల నుంచి వీర్యాన్ని సేకరించి భద్రపరుస్తారు. ఇక్కడ ఉన్న ఆబోతులను బయోసెక్యూలర్ జోన్లో ఉంచి వాటికి క్రమం తప్పకుండా టీకాలు వేసి ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ ఘనీకృత వీర్యకేంద్రంలో తయారు చేసిన వీర్యనాశికలు మన రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, తెలంగాణ, కేరళ, కలకత్తా, భోపాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. నాణ్యమైన వీర్య ఉత్పత్తి ఇలా.. ఒక్కొక్క వీర్యనాశికలో 0.25 ఎంఎల్ వీర్యం ఉంటుంది. అందులో దాదాపుగా 2 కోట్ల వీర్యకణాలు ఉంటాయి. వీర్యంను సేకరించిన తర్వాత దానిని పరీక్షించి భద్రపరుస్తారు. ఉత్పత్తి చేసిన వీర్యంతో పశువుకు గర్భదారణ చేసిన అనంతరం పశువు అనారోగ్యానికి గురి కాకుండా చూస్తారు. వీర్యంలో నిర్దేశించిన కణాల శాతం కచ్చితంగా ఉండేలా చూస్తారు. ఆబోతులు అనారోగ్యానికి గురి కాకుంగా పలుజాగ్రత్తలు తీసుకుంటారు. అనంతరం ఈ వీర్యాన్ని విశాఖపట్నంలోని ఆండ్రాలజీ ల్యాబోరేటరీకి పంపి నాణ్యతను పరీక్షించి అనంతరం ఇక్కడ నుండి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. సంస్థ సాధించిన విజయాలు.. ► 2007 సంవత్సరంలో మానిటరింగ్ యూనిట్‌చే నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేయడంలో ఏగ్రేడ్ సాధించింది. 2010లో బీగ్రేడ్ను సాధించింది. ► 2013సంవత్సరంలో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ వారు నంద్యాల ఘనీకృత వీర్యకేంద్రానికి ఏగ్రేడ్ రెండవ సారి ప్రధానం చేశారు. ఈ సంవత్సరంలోనే నంద్యాల నుండి జేకే ట్రస్టు ద్వారా అదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బాసరా, తమిళనాడు రాష్ట్రాలకు వీర్యనాశికులు సరఫరా చేసింది. ► 2016–17 సంవత్సరంలో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ వారిచే మూడవసారి నాణ్యమైన వీర్య ఉత్పత్తిలో ఏగ్రేడు సాధించింది. -
సీసీఎంబీ స్థాయిలో ల్యాబొరేటరీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటివరకూ క్లిష్టమైన నమూనాలను పూణె వైరాలజీ ల్యాబొరేటరీ లేదా సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ–హైదరాబాద్)కు పంపించేవారు. ఇకపై ఈ స్థాయి ల్యాబొరేటరీని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. తాజాగా ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) అధికారులు స్థల సేకరణకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి గన్నవరం విమానాశ్రయం వద్ద 3 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ఈ ల్యాబొరేటరీ నిర్మాణానికి రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ అవుతుందని అంచనా. దీన్ని రెండేళ్లలో అందుబాటులోకి తెస్తారు. పూర్తిస్థాయి నిర్మాణం తర్వాత ఇందులో 300 మందికి పైగా సిబ్బంది పనిచేయనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు అతి తక్కువ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉపయోగాలివే.. ► ఈ ల్యాబొరేటరీలో అన్ని రకాల వైరస్‌లే కాదు, బ్యాక్టీరియా నమూనాలు, కీటకాలు, ఎల్లో ఫీవర్.. తదితర ఎలాంటి నమూనాలనైనా పరిశీలించవచ్చు. ► ప్రస్తుతం మన వద్ద మన రాష్ట్రంలో జినోమిక్ సీక్వెన్సీ ల్యాబ్ (వైరస్ ఉనికిని కనుక్కునే ల్యాబ్) లేదు. ఇకపై ఇలాంటి టెస్టులు ఇక్కడే చేసుకోవచ్చు. ► గతంలో ఏలూరు పట్టణంలో వింత వ్యాధితో బాధితులు ఆస్పత్రికి వచ్చినప్పుడు నమూనాలు వివిధ రాష్ట్రాలకు పంపించాల్సి వచ్చింది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎలాంటి టెస్టులైనా ఇక్కడే చేసుకోవచ్చు. ► దీనికి సంబంధించిన నిర్మాణ వ్యయం, మానవ వనరులు కేంద్రం చూసుకుంటుంది. స్థలం మాత్రం ఏపీ సర్కారు ఇస్తుంది. త్వరలోనే అవగాహన ఒప్పందం అతిపెద్ద ల్యాబొరేటరీ నిర్మాణానికి గన్నవరంలో 3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం చూపించింది. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే అవగాహన ఒప్పందం చేసుకుంటాం. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపించే పరిస్థితి ఉండదు. రకరకాల జబ్బుల ఉనికిని వీలైనంత త్వరగా తెలుసుకునే వీలుంటుంది. – డా.ఎం.అనురాధ, సీనియర్ రీజనల్ డైరెక్టర్, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ -
డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో.. బ్లాక్ మెయిల్ చేసి
గురుగ్రామ్: ల్యాబోరేటరీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి డ్రెస్ మార్చుకుంటుండగా ఒకరు వీడియో తీశాడు. అనంతరం ఆమెను ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ బలత్కారానికి పాల్పడ్డాడు. అతడితో పాటు మరికొందరు ఆమెపై అత్యచారానికి పాల్పడడమే గాక ఆమె గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడు. దీంతో అతడి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హరియాణలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురుగ్రామ్ సెక్టార్ 52లో ఉన్న ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా ఓ యువతి (26) పని చేస్తోంది. అయితే ల్యాబ్‌లో పని చేసేప్పుడు డ్రెస్ వేరే (యూనిఫార్మ్) ఉంటుంది. ఉద్యోగానికి వచ్చేప్పుడు.. వెళ్లేప్పుడు డ్రెస్ మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒకరోజు యధావిధిగా ఆమె డ్రెస్ మార్చుకుంటోంది. ఆమెతో పాటు ఒకప్పుడు ల్యాబ్‌లో పని చేసిన యువకుడు సచిన్ సింగ్ తివారీ. ఒకరోజు ఆమె డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను యువతికి చూపించి వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమెను బ్లాక్ మెయిల్ చేసి అతడి వద్దకు పిలుపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా మంగళవారం ‘మాట్లాడుదాం రా’ అని అతడు తన స్వగ్రామం వాజిరబాకు పిలిపించుకున్నాడు. ఆమె రాగానే కారులోకి ఎక్కించుకుని బాద్షాపూర్కు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి బలాత్కారం చేయబోగా యువతి అడ్డగించింది. అయితే కత్తి చూపెట్టి భయపెట్టాడు. కారులోనే ఆమెను బలవంతంగా దాడి చేస్తుండడంతో యువతి అరిచింది. ఆమె కేకలు విన్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. పోలీసులకు ఆమె అతడి దారుణాలను వివరించింది. గతంలో అనేకసార్లు బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడని వాపోయింది. గర్భం దాలిస్తే తీయించి వేశాడని కన్నీటి పర్యంతమైంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
హైదరాబాద్ ఎన్ఐఏబీ ఇక సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ)ని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా అప్‌గ్రేడ్ చేసి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం ఈమేరకు హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏబీతో పాటు, పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ సంస్థను కూడా అప్‌గ్రేడ్ చేసి సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా నోటిఫై చేసినట్లు శనివారం వెల్లడించింది. కోవిడ్–19 వ్యాక్సిన్లను త్వరితగతిన పరీక్షించి ధ్రువీకరణ ఇచ్చి కోవిడ్ మహమ్మారి నివారణ, చికిత్సను వేగవంతం చేసేందుకు ఈ చర్య దోహదపడుతుందని తెలిపింది. ప్రతి నెలా 60 బ్యాచ్‌ల వ్యాక్సిన్లను పరీక్షించే సామర్థ్యం ఈ ల్యాబ్‌లకు ఉన్నట్టు తెలిపింది. -
వ్యాక్సిన్ పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్
న్యూఢిల్లీ: దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లను పరీక్షించి, అనుమతులు జారీ చేసేందుకు కేంద్రం మరో సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ (సీడీఎల్) ఏర్పాటు చేసినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)ని సీడీఎల్‌గా ఎంపిక చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సీడీఎల్‌గా మార్చగల సాంకేతిక ఉన్న ల్యాబొరేటరీని ఎంపిక చేయాలని గతేడాది నవంబర్‌లో కేబినెట్ సెక్రటరీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రెండు ల్యాబొరేటరీలను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) కేంద్రానికి సూచించింది. అందులో పుణేకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ (ఎన్‌సీసీఎస్), హైదరాబాద్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)లు ఉన్నాయి. ఇందులో ఎన్‌సీసీఎస్‌ను ఈ ఏడాది జూన్ 28న సీడీఎల్‌గా ప్రకటించగా, తాజాగా ఎన్‌ఐఏబీని కూడా సీడీఎల్‌గా ప్రకటించారు. వీటికి పీఎం కేర్స్ నుంచి నిధులు అందుతాయి. తయారైన ప్రతీ బ్యాచ్ వ్యాక్సిన్‌ను ఈ కేంద్రాల్లో పరీక్షించి, ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తగినన్ని పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో వ్యాక్సిన్ బ్యాచ్‌లను విడుదల చేయడంలో ఆలస్యమవుతోంది. -
రాష్ట్రంలో బలీయంగా లేబొరేటరీ వ్యవస్థ
సాక్షి, అమరావతి: వ్యాధులు రావడానికి మూల కారణాలు గుర్తించాలంటే వైరాలజీ ల్యాబ్‌లు ఉండాల్సిందే. మార్చికి ముందు వరకు తిరుపతిలో మాత్రమే వైరాలజీ ల్యాబ్ ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 14కు చేరింది. జిల్లాకు ఒకటి చొప్పున, చిత్తూరు జిల్లాలో రెండు చొప్పున ల్యాబ్‌లు ఉన్నాయి. కరోనా నియంత్రణ దిశగా వైఎస్ జగన్ సర్కార్ పటిష్ట చర్యలు తీసుకోవడంతో మిలియన్ జనాభా ప్రాతిపదికన అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఇప్పటికే రికార్డులకెక్కింది. ఈ విషయంలో పెద్ద రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనాను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజాగా డ్రగ్ టెస్టింగ్ లేబొరేటరీలపైన దృష్టి సారించింది. మందుల నాణ్యత పరిశీలనకు వీటిని యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దేశంలో 10.40 శాతం టెస్టులు ఇక్కడే.. ► దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల్లో 10.40 శాతం మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ► దేశంలో ప్రతి 100 టెస్టుల్లో 10కి పైగా రాష్ట్రంలోనే చేస్తున్నారు. ► ఇప్పటివరకు దేశంలో 2 కోట్లకు పైగా టెస్టులు చేయగా.. అందులో 22 లక్షల పరీక్షలు ఏపీలోనే జరిగాయి. ► రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 16 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు ► వీటితో పెరగనున్న ఎంబీబీబీస్ సీట్లు, ల్యాబ్‌లు ► అవసరాన్ని బట్టి మరో ఏడెనిమిది కొత్త లేబొరేటరీలు వస్తాయంటున్న అధికారులు ► ల్యాబ్లతోవ్యాధుల నిర్ధారణలో జాప్యం నివారించవచ్చు. ► తద్వారా రోగికి సత్వరమే వైద్యం ► కర్నూలు, విశాఖపట్నంలలో డ్రగ్ టెస్టింగ్ లేబొరేటరీలు ► ప్రస్తుతం విజయవాడలో మందుల నాణ్యతను పరిశీలించే ల్యాబ్ ఉంది. ► దీనికి ఏడాదికి 3 వేల నుంచి 4 వేల లోపు మందుల నాణ్యతను పరిశీలించే సామర్థ్యం ఉంది. ► ఇప్పుడా సామర్థ్యాన్ని 10 వేల నమూనాలను పరిశీలించేలా పెంచుతున్నారు. ► కర్నూలు, విశాఖపట్నంలలో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ► దీనివల్ల మందుల నాణ్యత నిర్ధారణలో జాప్యం జరగదు. ► నాసిరకం మందులకు చెక్ పెట్టొచ్చు. -
నకిలీలకు అడ్డుకట్ట
వ్యవసాయంలో నవశకం ఆవిష్కరించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతులకు నాణ్యమైనవిత్తనం, పురుగుమందులు, ఎరువులు అందించడం.. భూసార పరీక్షల కోసం వైఎస్సార్ సమగ్ర వ్యవసాయపరీక్షా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోనిప్రతి నియోజక వర్గంలో వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ పరీక్ష ప్రయోగశాలలనుఅందుబాటులోకి తీసుకొచ్చి రైతులనుఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు అన్ని విధాలా ఆలోచనలు చేస్తోంది. మరో రెండు నెలల్లో వారి కలలు సాకారం చేసేందుకు ముమ్మర చర్యలు తీసుకుంది. సాక్షి, కడప: గత ప్రభుత్వ హయాంలో రైతన్నలు స్వేదం ఎంత చిందించినా అందుకు తగ్గ ఫలితం ఉండేదికాదు. ఏ పంట సాగు చేసినా పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేకుండా పోయేది. విత్తనాల విషయంలో వరి, సజ్జ, కొర్ర, జొన్న, కంది, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలు సాగు చేసినప్పుడు ఆ పంట కంకి తీసేవరకు ఎలాంటి లోపాలు కనిపించవు. కంకులు తీసే సమయంలో కంకి సైజు రాకపోవడం, అసలే కంకులు తీయకపోవడంతోనే నకిలీలు అని తెలిసేదని రైతులు చెబుతున్నారు. అలాగే పురుగు మందులు పిచికారీ చేసిన తరువాత పురుగులు ఏ మాత్రం చావకపోతే అప్పుడు ఆ మందుల్లో కల్తీ జరిగిందని తెలుసుకునేవారు. ఎరువులు కూడా నీటిలో కరిగినప్పుడు మాత్రమే అసలా? నకిలీవా? అని తేలేది. రైతులు విత్తనాలు, పురుగు మందులు నకలీవని తెలుసుకునేందుకు ఇప్పటి వరకు సరైన పరీక్షలు లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికో వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం జిల్లాలో ఏ ప్రాంతాల్లో ప్రయోగశాలలకు అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి జూలై నెలలో వ్యవసాయశాఖ రాష్ట్ర అడినల్ డైరక్టర్ ప్రమీల పలు ప్రాంతాలను పరిశీలించారు. నివేదికలు సమరి్పంచారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగశాలల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసింది. జిల్లాలో 9 వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ పరీక్ష ప్రయోగశాలల కోసం రూ.7.29 కోట్ల నిధులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వాడకం....: జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో 3.67 లక్షల హెక్టార్లలో ఏటా పంటలను సాగు చేస్తున్నారు. ఇందుకుగాను1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు, 80 వేల క్వింటాళ్ల విత్తనాలను, మరో రూ.2.56 కోట్ల విలువ జేసే పురుగు మందులను వాడుతున్నారు. వీటిలో ఏది నకిలీనో? ఏది అసలైనవో? తెలుసుకునే పరిస్థితులు ఉండేవికావు. హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించి ఫలితాలను తెలుసుకోవాల్సి వచ్చేది. ఇందులో ఏది నకిలీ అయినా రైతు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ పరీక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని సంకలి్పంచింది. 9 ప్రయోగశాలల ఏర్పాటుకు సన్నాహాలు...: వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలల ఏర్పాటుకు సంబంధించి స్థలాలను రాష్ట్ర అడినషల్ డైరెక్టర్ ప్రమీల ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారులు పరిశీలించారు. ఎంపిక చేసిన ప్రయోగశాలలకు నీరు, విస్తరణ, విద్యుత్ సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక çసమరి్పంచారు. 2,112 చదరపు అడుగుల స్థలంలో ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ ప్రకారం రాజంపేటకు సంబంధించి ప్రయోగశాల నందలూరులోని మండల వ్యవసాయాధికారి కార్యాలయ ఆవరణలోను, రైల్వేకోడూరులోని పాత మండల వ్యవసాయాధికారి కార్యాలయ ఆవరణలో ఉన్న పాత ఎంపీడీఓ సమావేశ మందిరంలో, రాయచోటి, కమలాపురం, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల మార్కెట్‌యార్డులోను, మైదుకూరులో పశువుల దాణాకర్మాగారంలో ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. కడపలోని ఊటుకూరు పాత జేడీ కార్యాలయ ఆవరణలో ఎరువుల ప్రయోగశాలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రయోగశాలల్లో మట్టిపరీక్షలు చేయించుకోవడంతోపాటు విత్తనాల నాణ్యతను పరీక్షించుకోవచ్చు. నకిలీల ఆటకట్టించవచ్చు...: ఇప్పుడు ఏర్పాటు చేయబోయే ప్రయోగశాలల వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతులు పరీక్షించుకోవడానికి మంచి అవకాశం. ఏ కంపెనీ నకిలీలు కట్టబెట్టినా వాటి ఆట కట్టించవచ్చారు. ఈ ప్రయోగశాలలు రైతులకు ఎంతగనో ఉపయోగపడతాయి. –పి.కృష్ణమూర్తి, రైతు, మావిళ్లపల్లె, మైదుకూరు మండలం. శుభ పరిణామం...: ఇప్పటి వరకు పంటల సాగు కోసం విత్తనాలను తీసుకొచ్చి విత్తుకునే వాళ్లం. అవి మొలకలు వచ్చి పూత, పిందె పడేవరకు నకిలీ విత్తనాలు అనే విషయం అర్థం అయ్యేదికాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక రైతుల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్లో నకిలీలు లేకుండా చేయాలనే ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తుండడం శుభ పరిణామం. –చెన్నయ్య, రైతు, పాలెంపల్లె, కడప నగరం -
తనంతటివాడు
అతను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. సైన్స్ అంటే ఇష్టం. ఒక రోజున ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ హెమ్ప్రీ డేవీ ఉపన్యాసం వినేందుకు వెళ్లాడు. డేవీని కలిశాడు. ‘మీ ప్రయోగశాలలో ఏదయినా ఉద్యోగం ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’ అన్నాడు. డేవీ అతని ఉబలాటాన్ని గమనించి, తన ప్రయోగశాలలో చేర్చుకున్నాడు. ఒకరోజు రాత్రి డేవీ తన ల్యాబ్‌లో ఏదో ద్రావణాన్ని తయారు చేస్తున్నాడు. ఇంతలో ఆయనకు అత్యవసరంగా బయటకు వెళ్లవలసిన పని పడింది. దాంతో ఆయన ‘నేను ఈ ద్రావణంతో కొత్త ప్రయోగం చేయబోతున్నాను. అందుకు దీన్ని చేతితో కదుపుతూ ఉండాలి. నీవు దీనిని నేను వచ్చేంతవరకూ కదుపుతూ ఉండు. నేను త్వరగానే వస్తా’ అని చెప్పి బయటికి వెళ్లాడు. ఆ కుర్రాడు ఆ ద్రావణాన్ని కదిపే పని ప్రారంభించాడు. అలా గంటలు గడిచిపోతున్నా, విసుగూ విరామం లేకుండా అతను ఆ ద్రావణాన్ని కదుపుతూనే ఉన్నాడు. తెల్లవారుతుండగా వచ్చాడు డేవీ. ఏకాగ్రతతో తన పనిలో ఏమాత్రం లోటు రానివ్వకుండా ఆ ద్రావణాన్ని కదుపుతూనే ఉన్న తన యువ శిష్యుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. ఆజ్ఞాపాలన, ఉత్సాహం గల ఈ కుర్రాడు పెద్దయ్యాక ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని గ్రహించి, మరింత వాత్సల్యంతో అతనికి పాఠాలు చెబుతూ, తనంతటివాడిగా తయారు చేశాడు. డేవీ అంచనా వమ్ము కాలేదు. ఆ కుర్రాడు అనతికాలంలోనే డైనమో ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేయగలిగాడు. రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి, చిరస్మరణీయుడయ్యాడు. అతనే మైఖేల్ ఫారడే. – డి.వి.ఆర్. -
అండం లేదు.. శుక్ర కణమూ లేదు.. పిండం మాత్రం రెడీ!
కౌరవులు పుట్టిందెలా? మట్టికుండలో అని మహాభారతం చెబుతోంది. అండం.. శుక్రకణం లేకుండా బిడ్డలెలా పుడతారు? అంతా పుక్కిటి పురాణం.. ట్రాష్..! ఇప్పటివరకూ అందరూ ఇలాగే అనుకున్నారు. కానీ.. తమ ప్రయోగశాలలో అచ్చంగా ఇదే చేసి చూపారు శాస్త్రవేత్తలు. కొందరికి గర్భం ఎందుకు నిలవదన్న అంశం మొదలుకొని.. ఏకరీతిలో ఉండే వందలాది మంది బిడ్డలను అభివృద్ధి చేయడం వరకూ.. అనేక సమస్యలను ఈ పరిశోధన పరిష్కరిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వినేందుకు కొంత ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఈ విషయం. మహాభారతంలో ఏముంది? దాని వాస్తవికతలపై చర్చ కూడా అవసరం లేదు. అయితే బెల్జియంలోని మాస్ట్రిచ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కేవలం మూలకణాలను ఉపయోగించి ప్రయోగశాలలో పిండాల్ని (పైచిత్రంలో) అభివృద్ధి చేశారు. పరిశోధనల కోసం ఒకే రకమైన పిండాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అంచనా. కొంతమందిలో గర్భం ఎందుకు నిలవడం లేదన్న అంశాన్ని అర్థం చేసుకునేందుకు తద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు కూడా ఈ పరిశోధన పనికొస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ టెక్నిక్‌ను దుర్వినియోగం చేసి క్లోనింగ్ కోసం వాడుకోవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మూలకణాలతో పిండా న్ని అభివృద్ధి చేసే ప్రక్రియ చాలా ప్రాథమిక దశలోనే ఉందని.. పిండాన్ని అభివృద్ధి చేయగలిగామేగానీ.. దాన్ని గర్భసంచిలో స్థిరంగా ఉంచలేకపోయామని.. దీన్ని సాధించేందుకు దశాబ్దాల సమయం పడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు అంటున్నారు. క్లోనింగ్‌కు అవకాశం.. అండం, శుక్రకణాల అవసరం లేకుండా జీవా న్ని సృష్టించడం ఆషామాషీ కాదు. ప్రస్తుతానికి పిండం పూర్తిస్థాయిలో అభివృద్ధి కానప్పటికీ ఇంకో మూడేళ్లలోనే తాము ఈ పద్ధతి ద్వారా ఎలుకలను పుట్టించగలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మానవ క్లోనింగ్‌కు దారి తీయవచ్చని.. ఇంకో 20 ఏళ్లలోనే ఒకే రకమైన రూపురేఖలు, లక్షణాలున్న మానవులను తయారు చేసే వీలు ఏర్పడుతుందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కావాల్సినన్ని ఎలుకలను తయారు చేసుకుంటే కొత్త మందులను పరీక్షించడం సులువు అవుతుందని, సంతానలేమి సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ నికొలస్ రివ్రాన్ అంటున్నారు. పిండాలపై పరిశోధనలకు అనేక ఆంక్షలు ఉన్నాయని, పైగా తగిన సంఖ్యలో పిండాలను పొందడం కూడా సాధ్యం కాదని.. కొత్త టెక్నాలజీతో సమస్యలను అధిగమించవచ్చని రివ్రాన్ వివరించారు. బ్లాస్టోసిస్ట్ స్థాయికి ఎదిగిన పిండం ఆ తర్వాత గర్భాశయానికి ఎందుకు అతుక్కోలేదన్నది తమకు తెలియదని, తాము అభివృద్ధి చేసిన పిండం..సాధారణ పిండాన్ని పోలి ఉందని వివరించారు. బహుశా కృత్రిమ పిండంలో కణాల అమరిక సక్రమంగా ఉండకపోవడమే కారణం కావచ్చన్నారు. మూలకణాలతో బ్లాస్టోసిస్ట్ను తయారు చేయడం ఇదే మొదలు కాబట్టి.. మరిన్ని పరిశోధనలు ఏం జరుగుతోందన్న విషయంపై స్పష్టత ఇవ్వవచ్చని చెప్పారు. పిండం అభివృద్ధి ఇలా.. మూలకణాల గురించి మీకు తెలిసే ఉంటుంది. శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల సత్తా వీటి సొంతం. ఫలదీకరణమైన నాలుగైదు రోజులకు పిండంలో ఏర్పడతాయి ఇవి. పిండం ఎదిగే క్రమంలో వీటిల్లో కొన్ని గుండె కణాలుగా మారితే.. ఇంకొన్ని నాడీ కణాలుగా.. మరికొన్ని రక్తకణాలుగా మారిపోతాయి. మాస్ట్రిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలకు సంబంధించిన రెండు రకాల మూలకణాలను ప్రయోగశాలలోని గాజు పాత్రలో కలిపారు. అంతే.. ఆశ్చర్యకరంగా అవి నాలుగైదు రోజుల పిండం స్థాయికి ఎదిగాయి. దీన్ని గర్భాశయంలోకి జొప్పించినప్పుడు గర్భధారణ జరిగే సమయంలో జరిగే మార్పులకు గురైనా కొంత సమయం తర్వాత నిర్వీర్యమైపోయింది. గర్భాశయానికి అతుక్కోలేకపోయింది. – సాక్షి, హైదరాబాద్ -
ప్రయోగమేదీ
► జిల్లాలో మొత్తం హైస్కూల్స్ 456.. ల్యాబ్స్ లేని స్కూళ్లు 250కి పైనే ► మిగిలిన పాఠశాలల్లోనూ అరకొర పరికరాలు ► అవీ బూజుపట్టి పనికిరాని దుస్థితి ► పరికరాల కొనుగోలుకు నిధులివ్వని సర్కారు ► చాలని నిర్వహణ నిధులు ఏలూరు సిటీ : పాఠశాల విద్యలో వినూత్న మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. విద్యావ్యవస్థ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. పాఠ్యాంశాలను సైతం అభివృద్ధి చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షా విధానంలోనూ మార్పులు తెస్తున్నారు. కృత్యాధార బోధనా పద్ధతికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. కానీ.. కృత్యాధార బోధనకు అవసరమైన సౌకర్యాలు కల్పించటంలో మాత్రం సర్కారు విఫలమవుతోంది. రూపాయి కూడా విదల్చకుండానే ఫలితాలు వచ్చేయాలనే తరహాలో వ్యవహరిస్తోంది. ఉన్నత పాఠశాలల్లో ఆధునిక సైన్స ల్యాబ్స్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినా.. వాటికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. పరీక్షల్లో 20 మార్కులు కృత్యాధార బోధనకే కేటాయించారు. సైన్స ల్యాబ్స్ ఏర్పాటు చేయకుండా విద్యార్థుల నుంచి ఫలి తాలు ఎలా రాబడతామని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. టెన్త్ విద్యార్థులకు కీలకం పదో తరగతిలో మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా భౌతిక శాస్త్రం, జీవశాస్త్రానికి సంబంధించి పరీక్షలు రాయాలంటే సైన్స ల్యాబ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. సీసీఈ విధానంలో ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు బోధించాలంటే ప్రయోగశాలలు తప్పనిసరి. హైస్కూళ్లలో 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం వీటిని విధిగా ఏర్పాటు చేయటంతోపాటు, ప్రత్యేకంగా పీరియడ్స్ కేటాయించాల్సి ఉంది. టెన్త్ విద్యార్థులు ఫిజికల్ సైన్సలో 10 మార్కులు, బయాలాజికల్ సైన్సలో 10 మార్కులు సాధించాలంటే ల్యాబ్స్ ఉండాలి. జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో మొత్తం 456 హైస్కూల్స్ ఉండగా.. వాటిలో 250కి పైగా స్కూళ్లలో సైన్స ల్యాబ్‌లు లేవు. మిగిలిన పాఠశాలల్లోనూ అరకొర పరికరాలున్నా బూజుపట్టి పనికిరాని దుస్థితికి చేరాయి. దీంతో తూతూమంత్రంగానే తరగతులు చెబుతున్నారు. అరకొర నిధులు ఇవ్వటంతో పూర్తిస్థాయిలో సైన్స ల్యాబ్స్ ఏర్పాటు చేయలేకపోతున్నారు. టెస్ట్ట్యూబ్స్, బీకర్లు, రసాయనాలు, కుంభాకార కటకాలు, పుటాకార కటకాలు, మైక్రోస్కోప్, నీటి సౌకర్యం, రసాయనాలు మండించేందుకు గ్యాస్, గాలి వెలుతురు ఉండే తరగతి గదులు ఇలా ప్రత్యేకంగా ఉండాలి. సైన్స ల్యాబ్స్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలంటే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష వరకూ వెచ్చించాల్సి ఉంది. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు దేనికి ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా కొంతమేర నిధులు మంజూరు చేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.50 వేలను నిర్వహణ గ్రాంట్‌గా విదుదల చేస్తున్నారు. ఇందులోనూ సైన్స ల్యాబ్‌కు ఇచ్చేది అతి స్వల్పమే. లైబ్రరీ, ల్యాబ్ నిర్వహణకు రూ.10వేలు, తాగునీరు, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యానికి రూ.10 వేలు, పాఠశాలలో ఏవైనా మరమ్మతులు చేసేందుకు రూ.10వేలు, పారిశుధ్యం, కంప్యూటర్స్ రూ.15వేలు, ఇతర ఖర్చులకు రూ.5 వేల చొప్పున మంజూరు చేస్తున్నారు. -
కల్తీ మద్యం విక్రయిస్తున్న షాప్ సీజ్
- పక్కనే బ్లాక్‌లో అమ్మకాలు - పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ కారేపల్లి: కల్తీ మద్యం విక్రయిస్తున్న కారేపల్లిలోని శ్రీ కనకదుర్గా వైన్‌షాపును మంగళవారం రాత్రి కారేపల్లి ఎక్సైజ్ సీఐ రమ్యారెడ్డి, సిబ్బందితో వచ్చి సీజ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె ఈ విషయాన్ని తెలిపారు. కారేపల్లి వైన్ దుకాణంలోని మద్యం బాటిల్స్‌ను వరంగల్‌లోని లేబోరేటరీలో పరీక్షించామన్నారు. మద్యంలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఖమ్మం ఎక్సైజ్ డీసీ మహేశ్‌బాబు ఆదేశాల మేరకు శ్రీ కనకదుర్గా వైన్‌షాప్‌ను సీజ్ చేశామన్నారు. బ్లాక్‌లో ఎంచక్కా.. కారేపల్లిలోని శ్రీ కనకదుర్గా వైన్‌షాప్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినా ఎంచక్కా ఆ దుకాణం పక్కనే ఓ బడ్డీ కొట్టులో బ్లాక్‌లో మద్యం విక్రయూలు జరుపుతున్నారు. ఎక్కువ ధరలు వెచ్చించి మద్యం ప్రియులు ఇక్కడి మందును బ్లాక్‌లో కొంటున్నారు. ఈ చర్యతో ఎక్సైజ్ అధికారుల ప్రయత్నం వృథా ప్రయూసగానే మిగిలిందని పలువురంటున్నారు. -
స్వైన్ ఫ్లూ నిర్ధారణకు ఏపీలో ల్యాబ్‌లు లేవు
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడి హైదరాబాద్: ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1)లాంటి వైరస్లు సోకితే నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ల్యాబొరేటరీలు లేవని ఆరోగ్య సంచాలకులు డా. అరుణకుమారి చెప్పారు. రక్తనమూనాలను హైదరాబాద్‌కు పంపాల్సిందేనని తెలిపారు. గురువారం ఆమె వైద్యవిద్య సంచాలకులు డా. శాంతారావు, ఆరోగ్యశాఖ అదనపు సంచాలకులు డా. గీతాప్రసాదినిలతో కలసి స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకుంటున్న చర్యలపై విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైతే ఆ నమూనాలను హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో నిర్ధారణ చేస్తున్నామన్నారు. ఏపీలో స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రమాదం లేదని తెలిపారు. అయినా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెలలో 19 మంది రక్త నమూనాలను సేకరించగా 12 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు తేలిందని చెప్పారు. వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారని అరుణకుమారి పేర్కొన్నారు. -
జూనియర్ కళాశాలల్లో అటకెక్కిన ప్రయోగాలు
సాక్షి, అనంతపురం : గుడిబండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఫస్టియర్‌లో 63 మంది, సెకండియర్‌లో 44 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలలో ప్రయోగశాల (ల్యాబ్) లేదు. దీంతో సెకండియర్ విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లి ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. రామగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ బైపీసీ ఫస్టియర్‌లో 15 మంది, సెకండియర్‌లో 16, ఎంపీసీ ఫస్టియర్‌లో 15, సెకండియర్‌లో 19 మంది చదువుతున్నారు. వీరు ప్రయోగాల కోసం ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ రెండు కళాశాలల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల ఇలాంటి పరిస్థితే ఉండడంతో సైన్స్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలే సీబీఎస్ఈ తరహాలో ఇంటర్లో ప్రవేశపెట్టిన కొత్త సిలబస్‌తో సైన్స్ విద్యార్థులు భయపడుతున్నారు. దీనికితోడు కొన్ని కళాశాలల్లో ప్రయోగశాలలు కరువవడం, ఉన్నచోట కూడా అరకొర పరికరాలు, రసాయనాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రయోగశాలల అభివృద్ధి, నిర్వహణకు రెండేళ్లుగా నిధులు విడుదల కాలేదు. మారిన సిలబస్‌కు అనుగుణంగా నూతన పరికరాలు లేకపోవడంతో అధ్యాపకులు సైతం చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు (రెండు వొకేషనల్ కళాశాలలతో కలుపుకుని) ఉన్నాయి. వీటిలో ఫస్టియర్ విద్యార్థులు (అన్ని గ్రూపులు కలుపుకుని) 10,333, సెకండియర్ 11,124 మంది ఉన్నారు. ఫస్టియర్, సెకండియర్ కలుపుకుని సైన్స్ (ఎంపీసీ, బైపీసీ) గ్రూపుల విద్యార్థులు 4,876 మంది చదువుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. రెండున్నర నెలలు మాత్రమే గడువు ఉండడంతో ఇప్పుడు అన్ని కళాశాలల్లోనూ విద్యార్థులతో ప్రయోగాలు చేయించాల్సి ఉంది. గుత్తి, ముదిగుబ్బ, రొద్దం, రామగిరి, గుడిబండ కళాశాలల్లో అసలు ప్రయోగశాలలే లేవు. మిగిలిన చోట్ల ఉన్నా.. పరికరాలు, రసాయనాల కొరత వేధిస్తోంది. జిల్లాలోని 39 కళాశాలలకు గానూ (రెండు వొకేషనల్ మినహాయించి) 17 కళాశాలలకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు కమిషన్ నిధులు మంజూరు చేసింది. చిలమత్తూరు, గుంతకల్లు, కదిరి (బాలురు), హిందూపురం (బాలికలు), కళ్యాణదుర్గం, కుందుర్పి, మడకశిర, పామిడి, పెనుకొండ, రాయదుర్గం, ఉరవకొండ (బాలురు) కళాశాలలకు రూ.2 లక్షల చొప్పున, తాడిమర్రిలో రూ.1.81 లక్షలు, అమరాపురం, కంబదూరు, కణేకల్లు, లేపాక్షి, ఉరవకొండ (బాలికలు) కళాశాలలకు రూ.1.25 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. అయితే.. ట్రెజరీలలో ఇంకా బిల్లులు పాస్ కాలేదు. దీనివల్ల పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఇబ్బందిగా మారింది. ఇక మిగిలిన కళాశాలలకు నిధులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కనిపించని నూతన పరికరాలు ‘నీట్’ పరీక్ష తెరపైకి రావడంతో గత ఏడాది ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌ను సీబీఎస్ఈ స్థాయిలో మార్పు చేశారు. మారిన సిలబస్‌కు అనుగుణంగా ప్రయోగశాలల్లోనూ మార్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా రసాయనశాస్త్రం సిలబస్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డిగ్రీ స్థాయిలోనూ లేని, అధ్యాపకులు సైతం నేర్చుకోవాల్సిన స్థాయిలో ప్రయోగాలు వచ్చి చేరాయి. దీంతో నూతన పరికరాల అవసరం ఏర్పడింది. క్రొమొటోగ్రఫీ, కొలాయిడల్ వంటి ద్రావణాల తయారీకి పదార్థాలు, సామగ్రిని కొత్తగా కొనాల్సి వుంది. విద్యార్థుల రెగ్యులర్ ప్రాక్టికల్స్ వల్ల రసాయనాలు అయిపోతుంటాయి. వీటిని ఏటా కొనాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్క రసాయశాస్త్ర ప్రయోగశాలకే రూ.20 వేలకు పైగా ఖర్చు వస్తుంది. బ్యారెట్లు, పిపెట్స్, పరీక్ష నాళికలు.. ఇలా గాజు వస్తువులు పగిలిపోతుంటాయి. వాటినీ కొనకతప్పదు. భౌతిక శాస్త్రం విషయానికొస్తే... సిలబస్‌కు అనుగుణంగా ప్రయోగాలూ మారాయి. ట్రాన్సిస్టర్, స్ప్రింగ్ బలస్థిరాంకం.. ఇలా కొత్త పరికరాలను కొనాల్సి ఉంది. బాటనీ, జువాలజీ ల్యాబుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. నిధులు మంజూరైన కళాశాలలకు బిల్లులు పాస్ చేయడానికి ట్రెజరీల్లో కొర్రీలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంజూరు కానీ వాటిలో విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన సొమ్ములో కొంత మొత్తం వెచ్చించి పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసుకోవాలంటూ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నుంచి ఆదేశాలందాయి. అయితే ఆ నిధులు ఏమాత్రం సరిపోవు. మారిన సిలబస్‌కు అనుగుణంగా నూతన పరికరాలు, రసాయనాలు కొనాలంటే ఒక్కో కళాశాలకు రూ.50 -60 వేల వరకు అవసరం అవుతోంది. -
వంటగదిలో రక్షణ కవచం...
ఏప్రాన్ అంటే కెమికల్ లాబొరేటరీలో రీసెర్చ్ చేసే పరిశోధకులు కళ్ల ముందు మెదులుతారు. ఇంగ్లిష్ చానెల్స్‌లో వంటలు చేసే చెఫ్‌లు గుర్తొస్తారు. ఏప్రాన్ అంటే వంట చేసేటప్పుడు దుస్తుల మీద నూనె చుక్కలు, కూరముక్కలు వంటివి పడకుండా కాపాడే వస్త్రంగానే గుర్తిస్తాం. కానీ ఇది అగ్ని ప్రమాదాల నుంచి కాపాడే రక్షణ కవచం కూడ. పొరపాటున నూనె ఒలికి మంట అంటుకుంటే వెంటనే ఏప్రాన్కు వెనుక ఉన్న జారుముడిని లాగేసి అక్కడిక్కడే కిందపడేసి నీళ్లు చల్లేయవచ్చు. ఒంటి మీదకు దుస్తులతోపాటు వీటికోసమూ డబ్బు ఖర్చు చేయాలా అని విసుగు రావడమూ సహజమే. రెడీమేడ్ ఏప్రాన్‌ను కొనడం తప్పనిసరి కాదు. పాతవైపోయిన కుర్తాలను ఏప్రాన్లుగా మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్తను పాటించాలి. ఏప్రాన్లకు నైలాన్, ఉలెన్ వంటి మంటను ఆకర్షించే మెటీరియల్ వాడకూడదు. కాటన్ డ్రస్లనే వాడాలి. అలాగే జీన్స్ ప్యాంటు కాళ్లను ఓపెన్ చేసి ఏప్రాన్లా కుట్టుకోవచ్చు. ప్యాంటు జేబులు ముందుకు వచ్చేటట్లు కుడితే ఏప్రాన్ చూడడానికి ఇంకా బావుంటుంది. స్పూన్ల కోసం ఓ అర రెడీగా ఉన్నట్లే.