సంసిద్ధమైన హైదరాబాద్‌లోని అంతరిక్ష రంగ సంస్థ
పీఎస్‌ఎల్‌వీ–ఎక్సెల్ నౌకలో నింగిలోకి దూసుకెళ్లనున్న ల్యాబొరేటరీ
ఏర్పాట్లు చేస్తున్న ఇస్రో
పలు విజయవంతమైన ప్రయోగాలతో అంతరిక్షరంగంలో తనదైన ముద్ర వేసిన భారత్ మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. ఈ సాహసోపేత కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్షరంగ సంస్థ కీలక భాగస్వామిగా ఉండటం విశేషం. భారత్‌లో తయారుచేసిన కృత్రిమమేధ పరిశోధనశాలను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టేక్‌మీటూస్పేస్ సంస్థ తయారుచేసిన ‘మై ఆర్టిటార్ ఇన్‌ఫ్రాస్టక్చర్– టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ (ఎంఓఐ–టీడీ)’ ల్యాబ్‌ను నింగిలోకి పంపనున్నారు. పీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారా ఈ కృత్రిమమేధ ల్యాబ్‌ను ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి ఇది ఉపగ్రహం అయినప్పటికీ పూర్తిస్థాయి పరిశోధనశాలలాగా పనిచేయగల సత్తా దీని సొంతం. అందుకే అంతరిక్షంలో పనిచేయనున్న భారత మొట్టమొదటి కృత్రిమమేధ ల్యాబ్‌గా ఇది చరిత్ర సృష్టించనుంది.
డిసెంబర్ నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న ప్రయోగకేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగిస్తారు. కక్ష్యలో తిరుగుతూ ఎప్పటికప్పుడు డేటాను ప్రాసెసింగ్ చేయడం ద్వారా అంతరిక్ష పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చే ఉద్దేశంతో ఏఐ ల్యాబ్‌ను పంపుతున్నారు. ప్రైవేట్, విదేశీ ఉపగ్రహాల ప్రయోగ బాధ్యతలను చూసుకునే భారత ప్రభుత్వ మరో విభాగమైన ‘ఇన్–స్పేస్’ వారి టెక్నాలజీ సెంటర్ నుంచి ఎంఓఐ–టీడీకి కీలకమైన సాయం అందింది.
అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఇన్–స్పేస్ సంస్థ ఎంఓఐ–టీడీ టెస్టింగ్ తదితర బాధ్యతలను చూసుకుంది. అత్యంత భారీ డేటాను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి భూమి మీదకు పంపడం ఉపగ్రహ కార్యక్రమాల్లో పెద్ద సవాల్‌తో కూడిన వ్యవహారం. ప్రస్తుతం ఏదైనా శాటిలైట్ గరిష్టంగా రోజుకు 1 పెటాబైట్ డేటాను మాత్రమే సంగ్రహించగలదు. ప్రస్తుతం ‘క్లౌడ్ కవర్’ దృగ్విషయం కారణంగా 40 శాతం ఉపగ్రహ సమాచారం నిరుపయోగం అవుతోంది. వచ్చిన డేటాను ప్రాసెస్ చేయడానికి వారాల తరబడి వేచి ఉండక తప్పని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏఐ ల్యాబ్‌ను రంగంలోకి దించారు. అత్యంత వేగంగా డేటా ప్రాసెసింగ్‌కు ఈ ఏఐ ల్యాబ్ సుసాధ్యం చేయనుంది.
అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుకు..
రియాక్షన్ వీల్స్, మ్యాగ్నటార్కర్స్, ఏఐ యాక్సిలిరేటర్లు, అత్యాధునిక కంట్రోల్ సిస్టమ్‌తో ఏఐ ల్యాబ్‌ను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు. ఏఐ ల్యాబ్ త్వరగా ‘కౌడ్ డేటా’ వంటి అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుకూ బాటలువేయనుంది. ఎర్త్ అబ్జర్వేషన్ సామర్థ్యాలను ద్విగుణీకృతం చేయడమేకాకుండా అంతరిక్ష ఆధారిత కంప్యూటింగ్ టెక్నాలజీల అభివృద్ధికి ఇదొక వేదికగా అక్కరకు రానుంది. ల్యాబ్‌కు అదనంగా సౌర ఫలకాలను అమర్చారు. ఇవి భవిష్యత్తులో దీనికి అనుసంధానంగా రాబోయే శాటిలైట్ల ఇంధన అవసరాలను తీర్చగలవు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా–3 మిషన్‌లో భాగంగా డిసెంబర్‌లో ప్రయోగించే పీఎస్‌ఎల్వీ–సీ60 రాకెట్‌లోనే ఏఐ ల్యాబ్‌నూ అమర్చుతున్నారు.
ఎన్నెన్నో ఉపయోగాలు
అక్కడి శాటిలైట్లు సేకరించే సమాచారాన్ని ఈ ఏఐ ల్యాబ్ వేగంగా ప్రాసెస్‌చేసి సంబంధిత యూజర్లకు అనువుగా అందిస్తుంది. దీంతో పర్యావరణంపై పర్యవేక్షణ తో పాటు అడవుల నరికివేత, హరితఉద్గారాల పరిమాణం తదితర ఎన్నో అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందొచ్చు. దీంతో భిన్న రంగాలకు సంబంధించిన పరిశోధకులు తమకు కావాల్సిన సమాచారాన్ని ఆర్బిట్‌ల్యాబ్ నుంచి నేరుగా సంప్రతింపులు జరిపి పొందొచ్చు. వేర్వేరు అప్లికేషన్లకు సంబంధించిన కృత్రిమమేధ మాడ్యూళ్లను అప్‌లోడ్ చేసి ఈ వెబ్ ఆధారిత కన్‌సోల్‌తో అనుసంధానం కావచ్చు. ఇప్పటికే మలేసియా విశ్వవిద్యాలయంతోపాటు భారతీయ విద్యార్థుల బృందమొకటి ఇందుకోసం తమ పేర్లను నమోదుచేసుకుంది. ఎక్కువ మంది యూజర్లు పెరిగేకొద్దీ ఆయా పరిశోధకులయ్యే ఖర్చు సైతం భారీగా తగ్గనుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment