
సొంతంగా తయారీపై కంపెనీల ఆసక్తి...
డెలాయిట్ నివేదిక
న్యూఢిల్లీ: కృత్రిమ మేధకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ వినియోగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది. దేశీయంగా పలు వ్యాపార సంస్థలు దీనిపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దాదాపు 80 శాతం సంస్థలు తమ అవసరాల కోసం సొంతంగా ఏఐ ఏజెంట్లను తయారు చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. భారత్‌లో జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ వినియోగం తీరుతెన్నులపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం 80 శాతం భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లను తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ విషయంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 70 శాతం కంపెనీలు జెన్‌ఏఐని ఆటోమేషన్ కోసం ఉపయోగించుకోవడంపై ఆసక్తి కనపర్చగా, సగానికి పైగా కంపెనీలు దాదాపు పది జెన్‌ఏఐ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి.
మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, స్వతంత్రంగా నిర్దిష్ట పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏఐ సిస్టమ్‌లను అటానమస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. వివిధ పనులు, ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు వీటిని వినియోగించుకునే విధానాన్ని ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారు. ఈ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుండటమనేది .. కొత్త ఆవిష్కరణలు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఏఐని ఉపయోగించుకునే విధానంలో వస్తున్న మార్పులను సూచిస్తోందని నివేదిక పేర్కొంది.
సవాళ్లూ ఉన్నాయి..
ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ కొన్ని సవాళ్లూ ఉంటున్నాయి. తప్పిదాలు (36 శాతం), పక్షపాతం (30 శాతం), డేటా నాణ్యత (30 శాతం)లాంటివి భారీ స్థాయిలో వినియోగానికి సమస్యగా ఉంటున్నాయి. వెంటనే వినియోగించుకోవడానికి వీలుగా ఉండే రెడీమేడ్ ఏఐని ఎక్కువగా కంపెనీలు ఎంచుకుంటూ ఉండటంతో అవసరాలకు తగ్గట్లుగా వాటిలో పెద్దగా మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశాలు ఉండటం లేదు. పైపెచ్చు కొన్నాళ్లకు కొరగాకుండా పోయేలా ఉంటున్నాయి. తాము ప్రస్తుతం ఉపయోగిస్తున్న సొల్యూషన్స్ రెండేళ్లలోపే పనికి రాకుండా పోయే అవకాశం ఉందని 28 శాతం కంపెనీలు భావిస్తున్నాయి.
ఆశాభావంతో కంపెనీలు..
ఏఐని విస్తృతంగా వినియోగించుకోవడంపై సవాళ్లు నెలకొన్నప్పటికీ వచ్చే రెండేళ్లలో వాటిని అధిగమించగలమని దేశీ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న ఈ రంగంలో వృద్ధి చెందేందుకు, అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ మౌమితా సర్కార్ తెలిపారు.
కొన్ని దేశీ సంస్థలు సొంతంగా తయారు చేసుకోవడం కాకుండా ఏఐ సొల్యూషన్స్‌ను కొనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా మల్చుకోగలిగేలా వాటిని తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ పురోగమనంలో ముందంజలో ఉండేందుకు, దీర్ఘకాలంలో అధిక ప్రయోజనాలను పొందేందుకు, పరిస్థితులకు తగ్గట్లుగా మల్చుకోగలిగే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సర్కార్ చెప్పారు. ఇటు వినియోగం వేగవంతం కావడం అటు దీర్ఘకాలంలో నిలబడగలిగే వ్యూహాలను అమలు చేయడం మధ్య సమతూకం పాటించడమే ఏఐపై పెట్టుబడులకు కీలకమని వివరించారు.