
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఆరోగ్య సంరక్షణలోనూ కృత్రిమమేధ ఎంతగానో తోడ్పడుతుంది. అధునాతన అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, విస్తారమైన డేటాను ఉపయోగించడం ద్వారా ఏఐ రోగి సంరక్షణను మెరుగుపరుస్తుంది.. కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది.. వైద్య పరిశోధనను వేగవంతం చేస్తుంది. ప్రాథమికంగా వ్యాధి గుర్తింపు నుంచి అందుకు అవసరమైన చికిత్సల వరకు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో, ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కృత్రిమ మేధ ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది. (నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..)
ప్రాథమికంగా రోగ నిర్ధారణ..
ఆరోగ్య సంరక్షణకు ఏఐ సహకారం అందిస్తోంది. సాంప్రదాయ పద్ధతుల కంటే ముందుగానే మరింత కచ్చితంగా వ్యాధులను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ నమూనాలతో ఎక్స్-రే రిపోర్ట్‌లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు వంటి మెడికల్ ఇమేజింగ్ వ్యవస్థల ద్వారా మానవుల కంటే మెరుగ్గా వైద్య పరిస్థితులను విశ్లేషిస్తున్నాయి. ఉదాహరణకు, మామోగ్రామ్లలో రొమ్ము క్యాన్సర్ సంకేతాలను గుర్తించడానికి లేదా కంటి స్కాన్లలో డయాబెటిక్ రెటినోపతిని మరింత కచ్చితత్వంతో గుర్తించడానికి ఏఐ వ్యవస్థలు అభివృద్ధి చేశారు.
గుండె జబ్బులు, డయాబెటిస్ లేదా అల్జీమర్స్ వంటి పరిస్థితుల అవకాశాలను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (ఇహెచ్ఆర్), వేరబుల్స్, జన్యు ప్రొఫైల్స్ నుంచి డేటాను ప్రాసెస్ చేయగలదు. భవిష్యత్తులో తలెత్తె సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా కృత్రిమమేధ త్వరగా వైద్యులకు సమాచారం అందిస్తుంది. ఇది నిత్యం రోగులు వెచ్చించే చికిత్స ఖర్చులను తగ్గిస్తుంది.
వైద్య సిఫారసులు
ఏఐ రోగులకు అనుగుణంగా రిపోర్ట్‌లను విశ్లేషించి చికిత్సలను సూచిస్తుంది. ఇది జన్యు సమాచారాన్ని కూడా అందిస్తుంది. దాంతో జీవనశైలి, వైద్య చరిత్రలు వంటి లార్జ్ డేటాసెట్లను విశ్లేషించి ఏఐ మెరుగై చికిత్సలను అందించేందుకు సాయం చేస్తుంది. ఉదాహరణకు, ఏఐ అల్గారిథమ్స్ రోగి జన్యు డిజైన్ ఆధారంగా నిర్దిష్ట క్యాన్సర్ చికిత్సలను సిఫారసు చేయగలవు. కొత్త మందులకు రోగులు ఎలా స్పందిస్తారో అంచనా వేయడం ద్వారా కృత్రిమ మేధ ఆధారిత సాధనాలు ఔషధ అభివృద్ధికి సహాయపడతాయి. ఇది క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేయడనికి తోడ్పడుతుంది. ఇది నిర్దిష్ట జనాభాకు మరింత ప్రభావవంతమైన మందులను రూపొందించడానికి ఫార్మా కంపెనీలకు సహాయపడుతుంది.
పరిపాలనా విధుల్లో..
హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ తరచుగా షెడ్యూల్, బిల్లింగ్, రికార్డుల నిర్వహణ వంటి అడ్మినిస్ట్రేటివ్ విధులపై ఉంతో సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ఏఐ రంగంలోకి దిగుతోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్‌పీ) సాధనాలు డాక్టర్-రోగి సంభాషణలను విశ్లేషించగలవు. సంబంధిత వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రిపోర్ట్‌లను అప్‌డేట్ చేయగలవు. చాట్‌బాట్‌లు, వర్చువల్ అసిస్టెంట్లు రోగులకు డాక్టర్ అపాయింట్‌మెంట్ బుకింగ్స్‌ను నిర్వహిస్తాయి. సాధారణ రోగి ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తాయి. ఇది ఆసుపత్రులు, క్లినిక్‌లకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.
టెలిమెడిసిన్, రిమోట్ కేర్..
ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి వంటి సంఘటనల నేపథ్యంలో టెలిమెడిసిన్ వృద్ధిని కృత్రిమమేధ వేగవంతం చేసింది. ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు, వీడియో కాల్స్ ద్వారా రోగులు నివేదించిన లక్షణాలను విశ్లేషించడం వల్ల రిమోట్‌గానే సేవలందించింది. కృత్రిమ మేధ ఉపయోగించిన వేరబుల్ పరికరాలు హృదయ స్పందన రేటు లేదా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తాయి. రియల్ టైమ్‌లోనే అందుకు అనుగుణంగా రోగుల పరిస్థితులపట్ల వైద్యులను అప్రమత్తం చేస్తాయి.
పరిశోధనలు వేగవంతం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య ఆవిష్కరణల వేగాన్ని పెంచుతోంది. విస్తారమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విశ్లేషించడానికి పరిశోధకులు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. మానవులు కనుగొనడానికి సంవత్సరాలు పట్టే ఔషధ ఆవిష్కరణలో కృత్రిమ మేధ నమూనాలు సమ్మేళనాలు ఎంతో తోడ్పడుతున్నాయి. దీనివల్ల కొత్త మందులను మార్కెట్లోకి తీసుకువచ్చే సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. సంక్లిష్ట వ్యాధులను, వాటి పురోగతిని అర్థం చేసుకోవడానికి ఏఐ సహాయపడుతుంది. ఉదాహరణకు, పార్కిన్సన్ వంటి న్యూరోడిజెనరేటివ్ పరిస్థితులు ఎలా అభివృద్ధి చెందుతాయో ఇది అంచనా వేయగలదు.
మానసిక ఆరోగ్యానికి మద్దతుగా..
ఏఐ మానసిక ఆరోగ్య సంరక్షణలోనూ పురోగతి సాధిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనువర్తనాలు, చాట్‌బాట్‌లు వ్యక్తులకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)ని అందిస్తున్నాయి. ఈ సాధనాలు ఆందోళన, నిరాశ లేదా ఒత్తిడి సంకేతాలను విశ్లేషిస్తాయి. అవసరమైనప్పుడు చికిత్సకులను సూచిస్తాయి.
ఇదీ చదవండి: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
సవాళ్లు-పరిష్కారాలు
ఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధ ఉంతో తోడ్పాటు అందిస్తున్నప్పటికీ ఈ ఏఐ వ్యవస్థలు సున్నితమైన రోగి సమాచారంపై ఆధారపడతాయి. కాబట్టి డేటా గోప్యత ఒక ప్రధాన ఆందోళనగా ఉంది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం, ఈ విభాగంలో చట్టాలకు లోబడి నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. ఈ రంగంలో ఏఐ నమూనాల విశ్లేషణను జాగ్రత్తగా పర్యవేక్షించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. రోగులు ఏఐ సిఫార్సులపై విశ్వాసం కలిగి ఉండేలా విధానాలు పటిష్టంగా రూపొందించాల్సి ఉంటుంది. దీనికి ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే దానిపై పారదర్శకత చాలా అవసరం.